— మనిషిలో మనిషి
‘’ కాంగ్రెస్ ను ‘’ మోదీ ‘’చావుదెబ్బలతో మోది మోది
బిజెపి ని గుజరాత్ లో గెలిపించాడు
పటేల్ కుంపటి పెట్టినా ,దానికి కాంగీ అంటకాగినా
ఓట్ల నిప్పు కమలానికే రాజుకొని హస్తాన్ని ఆర్పేసింది
‘’యువ రాజు ‘’పట్టాభి షేకమైన రెండో రోజే
గుజరాత్ ఎన్నిక చావు కబురు చల్లగా తెలిసింది
నాడు తమిళ నాట’’ బయటి ఎన్నికలు’’(ఎక్సిట్ పోల్స్ )
జయ ఓడిపోతుందని కోళ్లై కూసినా ,
రెండాకులు విస్తరించి జయ గెలిచింది కదా
అన్న ఆశ పెట్టుకున్న ‘’కాంగిరేసు ‘’
ఈ ఎన్నిక రేసులో ఆశ’’ నీఱై’’ ఆరిపోయింది
‘’మోడీ సింహ బలుని’’ముందు చిట్టెలుకల ఆట సాగునా ?
19 రాష్ట్రాల బలసంపన్నం తో కమల వికాసం’’ మోడీ చందమామ’’ వల్లనే
ఎదురు లేదు ఎవరూ ఆపలేరు ,
మోడీజగన్నాధ రధ చక్రాలను
అడ్డుకుంటే చక్రోపహతులే ‘’ అని పొంగి పోతూ ఒక మనిషి .
‘’ఇరవై ఏళ్ళు పాలించి ,’’పైన ప్రభుత్వం’’ లో ఉంటే
ఈ మాత్రం గెలుపు కే విర్ర వీగక్కర్లేదు
‘’చావుతప్పి కన్ను లోట్టై’’ గెలిచిన దానికి వీరంగం అక్కర్లేదు
చెమటలు పట్టించి ,’’కారేట్లు ‘’చేశాడు యువ కిశోరం
పోటాపోటీ గా డీ అంటే డీ గా ఎదురు నిల్చి
అనుక్షణం గుండెల్లో నిద్రపోయాడు
నిద్ర పట్టకుండా చేశాడు కదా
‘’మెషీన్లనూ’’మాయ చేసినా
బొటాబొటి మెజారిటి –ఇదో గోప్పేంటి?
కల్లబొల్లి కబుర్లు ,’’సరిహద్దు ‘’దాటిన ఆరోపణలు
‘’గోబెల్ ప్రచారాలు’’ ,ప్రసారాలు తో
ఓటర్లను మభ్య పెట్టి, సాధించిన
అత్తెసరు మార్కులివి.
నగరాల గెలుపు నాగారాలే కానీ
పల్లెసీమల్లో ఓట్ల మతాబాలేవి ?
‘’మా వంశ పాలన’’ కు
వచ్చిన సరికొత్త మారాజు
రారాజు ఇక దులుపుతాడు
రోజూ మీ బూజు .’’అంటూ
ఆ మనిషిలోమరో మనిషి గోల .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-17- ఉయ్యూరు

