— మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -14
అద్వితీయ అమోఘ మహోన్నత వ్యక్తిత్వం
వెంకటేశ్వర్లు గారి గురించి ఎంత చెప్పినా ,ఆయన అమోఘ అద్వితీయ వ్యక్తిత్వం గురించి ఆవిష్కరించకపోతే అది సమగ్రం,పరిపూర్ణం కానేరదు . స్థిరచిత్తం,పట్టిన పట్టు విడవని సామర్ధ్యం ,పని పూర్తయ్యేదాకా అలసట ఎరుగని మహోన్నత వ్యక్తిత్వం వెంకటేశ్వర్లు గారిది .కాని అత్యంత దయార్ద్ర హృదయులు .ఎవరిపై నా కోపం,ద్వేషం లేని జితేంద్రియత్వం ఆయన్ను అందరి వాడిని చేశాయి .ఆయన భావాలను వ్యతిరేకించే వారైనా ,విభేధించేవారైనా ఆయనకు ద్వేషం ఉండేదికాదు .దీనికి ఉదాహరణ-తనబృందం లో చేరటానికి ఆసక్తి కన బరచిన వారెవరైనా ,వారు అంతకు పూర్వం స్వతంత్రంగా ప్రతిభ చూపి రాణించిన వారైనా ఆయన సహృదయత తో ఆహ్వానించేవారు .తాను కష్టపడి పని చేస్తూ మిగిలిన వారికీ స్పూర్తినిచ్చి పని చేసేట్లు చేయించటం ఆయన నైజం .ప్రేరణకలిగించి ,వారిలో ఆత్మ విశ్వాసం కలిగించి ,వారినుండి తనకు కావలసిన అద్భుత ఫలితాలను రాబట్ట గలిగే నేర్పున్నవారు .దీనికి సాక్ష్యమే ఆయన వద్ద పి.హెచ్. డి .చేసిన 51మంది విద్యార్దులలో సగం మంది ఇండియా, యు.ఎస్. ఏ. ,కెనడాల లో ప్రొఫెసర్ లు అయ్యారు .మిగిలిన వారిలో చాలామంది జాతీయ లాబ్ ,లేక ఇండస్ట్రి లలో గ్రూప్ మేనేజర్లు అయ్యారు .ఆయనలో ఉన్నఅరుదైన గొప్ప సుగుణం తన శిష్యులను తన కుటుంబ సభ్యులుగా భావించి గౌరవించటం. అంతే కాదు వారి కుటుంబాలతోనూ సన్నిహత సంబంధాలు కలిగిఉండి,వారి సంక్షేమకోసం కృషి చేయటం .తన స్వగ్రామం అన్నా అక్కడ తన వ్యవసాయ క్షేత్రం అన్నా ఆయనకు మిక్కిలి మక్కువే కాదు వేసవి సెలవులలో తన విద్యార్ధులను అక్కడికి తనతోపాటు తీసుకువెళ్ళి చూపిస్తూ అక్కడే వారి థిసీస్ కు సాయం చేసేవారు . చనిపోయే ము౦దుదాకా ,ఈ జన్మభూమి మమకారం ఆయనను వదలలేదు .ఆయన మనసులో ఎప్పుడూ తాను అమెరికా లో రిటైరయ్యాక తన స్వగ్రామం వచ్చి స్థిరపడాలన్నదే ధ్యేయంగా ఉండేది .అందుకోసమే ఆయన తన భారతీయ పౌరసత్వాన్ని నిలబెట్టు కున్నారు .
వెంకటేశ్వర్లుగారే తనకు మార్గ దర్శి అని ,కడదాకా తనను ఆయనతోపాటు రిసెర్చ్ వర్క్ లో నడిపించారని ,తమ మధ్య అనుబంధం రెండున్నర దశాబ్దాలకాలం అని, అది చిరస్మరణీయమైనదని అత్యంత కృతజ్ఞతా భావంతో జార్జి హారిజాన్ స్పెక్ట్రో స్కోపి లాబ్ ఇంచార్జ్(మాసాచూట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –కేంబ్రిడ్జ్ –యు .ఎస్. ఏ. ) శ్రీ రామ చంద్ర రావు దాసరి రాశారు .తామిద్దరం వేరు వేరు చోట్ల పని చేస్తున్నా వెంకటేశ్వర్లుగారి స్నేహం ,మార్గదర్శకం తనకు ఎప్పుడూ లభించేవని ,అంతేకాక తనను వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా భావించి ఆతిధ్యమిచ్చిన వారి అర్ధాంగి శ్రీమతి సరస్వతిగారికి కూడా జీవితాంతం రుణ పడి ఉన్నానని శ్రీ దాసరి తెలియ జేశారు .తానుఆవిష్కరించిన శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లుగారి జీవితం ,పరిశోధనా విశేషాలకు రచనా సహకారం అందజేసిన వివిధ రచయితలకు ,ముఖ్యంగా ఇందులో ఒక ప్రత్యేక వ్యాసం రాసి , వ్యాస పరంపరలను ఎడిట్ చేసిన డా.అరవింద్ పరాస్నిస్ కు శ్రీ దాసరి రామ చంద్ర రావు కృతజ్ఞతలు తెలుపు కున్నారు .
మనవి- మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు ధారా వాహిక కు ఆధారం –ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నాకు అభిమానం తో పంపిన – శ్రీ దాసరి రామ చంద్ర రావు గారి ఆంగ్ల రచన -‘’PUTCHA VENKATESWARLU(1921-1997) Elected Fellow 1970’’.
ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న సైన్స్ ,టెక్నాలజీ మేటి శ్రీ పుచ్చావారిపై ఇలా ధారావాహికం రాయటం నాకు దొరికిన అదృష్టం . నిజంగా చెప్పాలంటే ఆ టెర్మినాలజి , ఆ సైంటిఫిక్ భావాలు నాకు చాలా కొత్త .ఏదో పూర్వం ఫిజికల్ సైన్స్ ‘’మిణికాను’’కనుక నెట్టుకు రాగలిగాను . అదీకాక ఇంతటి మహనీయ మూర్తి అయిన తెలుగు తేజాన్ని తెలుగు వారికి పరిచయం చేస్తున్నానన్న గొప్ప సంతృప్తి నన్ను ముందుకు నడిపిచింది .ఇందులో ఒప్పులన్నీ శ్రీ దాసరి గారివి ,తప్పులన్నీ నావి అని వినమ్రంగా మనవి చేస్తున్నాను . ఈ పుస్తకాన్ని నాకు పంపి నన్ను రాసేట్లు ప్రేరణ కలిగించిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారికి మరిన్ని కృతజ్ఞతలు .
శ్రీ మైనేనిగారు శ్రీ పుచ్చావారిపై మరి రెండు ఇంగ్లిష్ ఆర్టికల్స్ నాకు పంపారు .వాటినీ తెనిగించి తెలియ జేస్తాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-17 –ఉయ్యూరు

