సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ-2

    సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ-2

శ్రీ రావెల సాంబశివరావు గారు ,శ్రీ పాపినేని శివ శంకరరావు గారు ,రోజూ అయిదు నిమిషాలు కూడా ఖాళీ ఉండని బిజీ డాక్టర్  అయినా వందకు పైగా ఉద్గ్రంధాలు రచించి సాహిత్య సేవలోనూ డాక్టర్ అనిపించిన డా శ్రీ లంకా శివరామ్ ప్రసాద్ గారు ఈ ఆవిష్కరణ సభకు రావటం సభ స్థాయి ని విపరీతంగా పెంచి చాలా గొప్ప సాహిత్య గౌరవం లభించింది .వీరితో పాటు శ్రీ వేదాల వారు, శ్రీ వృషాద్రిపతి గారు , శ్రీ పాలపర్తి వారు, శ్రీ గబ్బిట వారు, శ్రీ ఇనగంటివారు, డా సవరం గారు వేదికను అలంకరించటం, వారందరి సమక్షం లో గంథ ద్వయం ఆవిష్కరింప బడటం, కవి సమ్మేళనం లో గుంటూరు –కృష్ణా జిల్లాలకు ‘’సాహితీ బంధాన్ని’’కూర్చిన లబ్ధ ప్రతిస్టు  లైన కవి మిత్రులు ,హైదరాబాద్ కవులూ సభలో ఉండటం   సరస్వతీ దేవి కొలువు కూటం లో జరిగిన సాహితీ సమ్మేళనం అని పించింది .కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది .ఒక గొప్పమదురానుభూతిగా నిలిచింది .

   శ్రీ వృషాద్రిపతి గారి కవిత్వపు తేనే సోనలు మధు మధురంగా ఉన్నాయి .శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి తెలుగు ఎం ఏ లో ప్రధములుగా వచ్చారు .శ్రీ ప్రసాదరాయ కులపతిగారికి అర్ధశతబ్దంగా ఆత్మీయులు .సాహితీ సరి జోడు .గొప్పకవి గాయక  నటులు కూడా .మహా ఉపన్యాసకులు .వేల సభలలో ప్రసంగించిన సామర్ధ్యం వారిది .తిరుపతి దేవస్థాన కార్యక్రమాలకు లెక్కలేనన్ని సార్లు ప్రత్యక్ష వ్యాఖ్యాత .చాలా  భువన విజయ సభలలో రాణించిన కవి శ్రేస్టులు .శ్రీ కులపతిగారితోను ,ఐ ఏ ఎస్ ఆఫీసర్  శ్రీ కనుపుల శివయ్యగారితో కలిసి ‘’భారతం పై తుది తీర్పు ‘’  లో పోటాపోటీగా నటించారు .నేను గంద్రాయిలో సైన్స్ మేస్టారు గా ఉన్నప్పుడు 1986 లో జగ్గయ్యపేట గెంటేల శకు౦తలమ్మ కాలేజి లో ఈ త్రయం వారి ‘’తీర్పు ‘’చూశాను .అద్భుతం అనిపి౦చి౦ది .చిన్నకాగితం పై  పై వారికి ‘’ఎప్పుడూ భువన విజయాలేనా ?ఇంకో సబ్జెక్ట్ దొరకలేదా ?బందరులో శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి దర్బారు ను ప్రదర్శించవచ్చు కదా ‘’అని రాసి ఇచ్చి వెళ్ళిపోయాను .ఆతర్వాత సుమారు అయిదేళ్లకు అనుకుంటా నా కోరిక నెరవేరి ‘ముట్నూరి వారి దర్బారు ‘’ప్రదర్శి౦చి నట్లు వార్తాపత్రికలో చదివి పరమానందం పొందాను .నా ఆలోచన నచ్చి,వారు చేశారో లేక వారికే ఆలోచన వచ్చిందో తెలియదు .మొవ్వ వారు ‘’శ్రీ కృష్ణ రాయ విజయ యాత్ర ‘’గా ప్రబంధం రాశారు .’’సాహితీ వాచస్పతి ,’’ఉపన్యాస చతురాననన ‘’బిరుదాంకితులు .

  ఇవాళ సాయంత్రం వారు ఫోన్ చేసి ఆవిష్కరణ గ్రంథాలపై మనసులోని మాట చెప్పి అభినందించారు .తాము శ్రీ ఆంజనేయ స్వామి భక్తులమని ‘’కసాపురం ఆంజనేయ చరిత్ర ‘’కావ్యాన్ని వెయ్యి పద్యాలతో రచించానని తెలిపి తమ గ్రంథాలను నాకు పంపుతామన్నారు .నేను ధన్యవాదాలు తెలియ జేసి సరసభారతి గ్రంధాలు వారికి పపుతామని చెప్పాను .మొదటి సారిగా వారితో ప్రత్యక్ష పరిచయం ఆదివారం నాడే జరిగింది .అదొక చారిత్రాత్మక సంఘటన అని పించింది . శ్రీ రావెల వారిని సుమారు పాతికేళ్ళ క్రితం మచిలీ పట్నం లో వివేకానంద మందిరం లో శ్రీ రావి రంగారావు గారి  సాహితీ  మిత్రులు కృష్ణశాస్త్రి గారి పై ఏర్పాటు చేసిన సభలో చూశాను . వారి ప్రసంగం ఆసాంతం విని ‘’ఫిదా ‘’అయిపోయాను .వారి అడ్రస్ తీసుకొని మర్నాడే అభినందిస్తూ కార్డ్ రాశాను .వారు వెంటనే  స్పందించి  జవాబు రాశారు .అప్పటి నుంచి సుమారు రెండేళ్ళు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి వారి రేడియో ప్రసంగాలను విని స్పందించి రాసేవాడిని .వేల లేని వాక్కు రావెల వారిది .అందరూ విని తీరాల్సినదే.

 శ్రీ పాపినేని శివ శంకర్ కృష్ణా జిల్లా రచయితల సంఘానికి సుపరిచితులు .చాలా సభలలో చూశాను .వారికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ వచ్చినప్పుడు’’ సంఘం ‘’వారికి సాహితీ నగదు పురస్కారం అందజేసిన  సభలో నేనూ ఉన్నాను .లంకా వారు సుమారు పదేళ్లుగా సాహితీ మిత్రులు .నేను రాసిన ‘’పూర్వా౦గ్ల కవుల ముచ్చట్లు ‘’కు వారం రోజుల్లోనే స్వదస్తూరితో అద్భుతమైన ఆలోచనాత్మకమైన ప్రేరణాత్మక మైన సాహితీ విలువలు కల ముందుమాటలు రాశారు .అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడటమే కాని ప్రత్యక్షంగా చూసింది ఈ వేదిక మీదనే.  పాలపర్తి వారిగురించి గీర్వాణం -2 లో రాశాను .వారు పంపిన పుస్తక౦’’సంహూతిః’’ ఆధారంగాకృష్ణాజిల్లా ,రాష్ట్రం లోని మిగిలిన జిల్లాల లోని  చాలామంది గీర్వాణ కవుల గురించి రాయగలిగాను .అనేక సభలో వారితో ఉన్నాను .గీర్వాణం -2 ను మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు 4-12- 16 న ఆవిష్కరించినపుడు ‘’గీర్వాణ భాషా వైభవం ‘’పై జరిపిన పద్య కవి సమ్మేళనాన్ని వారు నా కోరికపై నిర్వహించిన సహృదయులు .సవరం వారు మా సభలకు తరచూ వస్తారు . నేనంటే అమితమైన ఆప్యాయత .అనారోగ్యం లో ఉండి కూడా నెట్ లో ఈ బృహద్గ్రంధం చదివి చక్కని ముందుమాటలు రాశారు .పుస్తక ముద్రణకు రెండు నెలలు ముందు వారు ఫోన్ లో దొరకలేదు  భయమేసింది .శ్రీమతి గుడిపూడి రాధికా రాణికి ఆ బాధ్యత అప్పగించగా ఆమె అలుపు లేని ప్రయత్నం చేసి సమయానికి వారి ముందు మాటలు సేకరించి పంపింది .ఆమెను ‘’పట్టు వదలని విక్రమార్కి ‘’అన్నాను .

  దాదాపు నాలుగు లక్షలు ఈ రెండు గ్రందాల ముద్రణ ,ఈ సభా వేదిక ,మా రవాణా ,అందరికివస్త్రాలు , శాలువలు జ్ఞాపికలు,ఆహ్వానాల  ప్రింటింగ్  వగైరాలకు ఖర్చు చేసిన సరసభారతి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ఔదార్యం మాటలతో చెప్పలేనిది .గీర్వాణం -3 స్పాన్సర్ ప్రొఫెసర్ యల్లాప్రగడ రామమోహనరావు గారు ఈ సభకోసం అమెరికా నుంచి వచ్చారు .కాని అకస్మాత్తుగా వారి అన్నగారు చెన్నైలో మరణించటం వలన సభకు రాలేక పోయారు .వారి ఔదార్యమూ గొప్పదే . మైనేని వారి బావమరది శ్రీ పరుచూరి శ్రీనాద్ గారు అమెరికానుంచి ఈ సభకోసమే వచ్చారు .’’గోపాల రాముడు ‘’బావగారికి రామ భక్త హనుమాన్ లాగా శ్రీనాద్ ఈ కార్యక్రమ విజయానికి  అత్యంత శ్రద్ధా శక్తులతో  కృషి చేశారు .సభా కార్యక్రమ౦ వరకు నాది బాధ్యతా .అంటే ఇండోర్ వర్క్ నాది .అవుట్ డోర్ వర్క్ అంటే ఆహ్వాన డిజైన్ , బానర్ ,జ్ఞాపికలు , మైనేని గారితో ,శ్రీనాద్ గారితో కొ ఆర్డినేషన్ అడపాదడపా నేను వేసే ‘’అక్షింతలు ‘’అన్నీ మౌనంగా భరిస్తూ మైనేని వారి గౌరవానికి ఏ మాత్రం భంగం రాకూడదని భావిస్తూ కార్య క్రమ విజయానికి నా తర్వాత ముఖ్యకారకుడు మాఅబ్బాయి ,సరసభారతి కోశాధికారి గబ్బిట వెంకట రమణ ది .

 నగదు బహుమతులు ,జ్ఞాపికలు నూతన  వస్త్రాలు , శాలువాలు వగైరా బాధ్యత అంతా మా అబ్బాయికి శర్మకు అప్పగించాను.  వాడు మా అన్నయ్య గారబ్బాయి రామనాద్ సహకారం తో సమర్ధంగా నిర్వహించాడు .గ్రంధ ద్వయ పంపిణీ బాధ్యత శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ గారు ఎప్పటిలాగానే తమ బాధ్యత సంతృప్తి గా చేశారు .  చేతి లో కర్ర లేనిదే నడవ లేని నా శ్రీమతి ప్రభావతి  వేదికపై అతిధులను సత్కరించటానికి అత్యంత ఉత్సాహం గా నాకు సహకరించింది .అతిధి సత్కారం అంటే ఆమెకు ఎనలేని అభిమానం.  అందుకే ఇలాంటి కార్యక్రమాలు జయప్రదంగా చేయగలుగుతున్నాం .వేదికపై ఉన్న పెద్దలను సత్కరించటానికి నాకు తోడ్పడిన కుమారి బిందు ,మామనవరాలు రమ్య మొదలైనవారి సహకారం మరువ లేనిది .

  ఫలద్వయంగా అతిధులకు అందజేసిన కమలాఫలాలు పెద్దగా నాణ్యంగా ఉన్నాయి .అతిధుల సత్కారానికి ఏర్పాటు చేసిన తెల్ల చేమంతి దండలు బహు అందంగా చిక్కగా సువాసన భరితంగా శోభాయమానంగా ఉన్నాయి .వాడకుండా  మిగిలిపోయిన దండలను ఉయ్యూరు కు తెచ్చి మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు నిన్నా ఇవాళా అలంకరించి శోభ చేకూర్చాం .

   వేదిక ను అలంకరించాలని ఆహ్వానించిన శ్రీ వెంపటి వారు, శ్రీ రేమెళ్ళవారు ,శ్రీ తూములూరు వారు ,శ్రీ నిష్ఠలవారు ,శ్రీ పరాశరం వారు ,శ్రీ రామడుగువారు రాక పోవటం చాలా నిరుత్సాహం కలిగించింది . వెంపటి వారు పూర్తి  అనారోగ్యం వలన రాలేక పోయానని ఆ రోజే ఫోన్ చేసి చెప్పారు .తర్వాత కూడా మెయిల్స్ రాస్తూనే ఉన్నారు  సభా విషయాలన్నీ వారికి తెలియ జేస్తూనే ఉన్నాను . తూములూరు వారికి నాపై అత్యంత ఆత్మీయత ఉన్నది .తిరుపతి వెళ్ళటం వలన రాలేక పోతున్నానని  ,వారం క్రితమే నాకు చెప్పి ,ఇవాళ ఫోన్ చేసి సభ ఎలా  జరిగిందో వివరంగా అడిగి తెలుసుకున్న సౌజన్యం వారిది .వేదాల వారిని ఆహ్వానించమని చెప్పిన సహృదయ శ్రీ దక్షిణా మూర్తి గారిది

 అంతా బాగానే ఉంది కాని రాత్రి డిన్నర్ లో మంచి రుచికరమైన పదార్ధాలు చేయించమని ముందే చెప్పాం .కాని చాలా తక్కువ విలువగల పదార్ధాలు చేయించటం బాధ కలిగించింది . రుచి కూడా దారుణం .నోట్లో పెట్టుకుంటే ఒట్టు .పోనీ ఏదో సర్దుకు పోదాం అంటే  సాహిత్య సభలో ‘’ముక్కా –చెక్కా ‘’భోజనం పెట్టటం అత్యంత గర్హణీయ విషయం .ఇది క్లబ్బు సమావేశం కాదు .పవిత్ర సాహితీ కార్యక్రమం .మూడు ప్రపంచ సభలు సరిపినా, వేలాది మందికి అందరికీ శాకాహార భోజనమే పెట్టారు .నాన్ వెజ్ భోజనం అంటూ వేరే ఎవరికీ పెట్టలేదు .నాకు, మైనేని గారికీ ఈ ‘’నీచు ‘’సంగతి తెలిస్తే ముందే  చీదరించుకొని వారించే వారమేమో  .ఇది జరగటం దురదృష్టం .మన్నించమని అందరినీ కోరుతున్నాను .

  కవి సమ్మేళనం కవితలు ఇంకా నా చేతికి రాలేదు .మూడవభాగం లో వాటిని రాస్తాను .

   సశేషం

   మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-17- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.