— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం
2-దైవ స్తోత్ర ధురీణ –అప్పాల విశ్వ నాథ శర్మ (1927 -2000)-2 (చివరి భాగం )
అప్పాల వారు ‘’శ్రీ క్రష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతి శేఖరం –భావనా బలసంపన్నం భావానంద గురుం భజే ‘’అనే శ్లోకం తో తండ్రిగారైన భావానంద భారతీ స్వామిపై స్తోత్రం రాశారు .ఈశ్లోకం ఒక మహా మంత్రం లాంటిది. ఆశ్రమం లో ప్రతి రోజూ ఏకార్యక్రమం జరిగినా ఈ శ్లోకం తోనే ప్రారంభిస్తారు .శివ,కృష్ణ,ఆంజనేయ ,రాజరాజేశ్వరి లపై స్తోత్రాలు అష్టకాలు రాశారు .’’భావ నవనీతం ‘’,’’ప్రపన్న శతకం ‘’’’నమామి మురళీధరం సంస్కృత శ్లోకాలు రచించారు భావనవనీతాన్ని ప్రశంసిస్తూ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ‘’అక్షరాంజలి ‘’పేరుతో తమ అభిప్రాయం తెలిపారు ‘’అత్యంత గహనమై ,దివ్య మాధుర్య సంభరితమైన రాదా కృష్ణ తత్వాన్ని అనుభూత మొనర్చుకున్న మహాత్ములు అప్పాలవారు .ప్రతి రచనలో మృదు మధుర పదజాలం భక్తియుత గాంభీర్యం ,భావానుగణమైన నాద లయ త్రివేణులై ప్రవహిస్తాయి .దర్శించిన అనుభవానికి భక్త్యావేశం తో పెల్లుబికిన అక్షరాకృతి .ఈ స్తోత్రాలన్నీ మంత్రం స్వరూపాలే. వీటి పఠనం దేవతా తాదాత్మ్యాన్ని ప్రసాదించే అనుభూతి ప్రధాన గీతాలు ‘’అన్నారు .ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మగారు ‘’భావనవనీత మిద మాస్వాదమానామ వశ్యమేవ భక్తానాం హృదయం హరి ప్రియం నవనీతం జాయతే ఇత్యత్ర న సందేహ లేశః –తేన తేషా మపి జీవనం భావనవనీత తాదాత్మ్య మనుభవతి –జడమపి సచేతన మనేన భావతీత్యాశానే ‘’అని అమూల్యాభిప్రాయం తెలిపారు
‘’శ్రీ రుక్మిణీ విమల చారు ముఖాబ్జ భ్రుంగ-శ్రీ రాధికా రసిక శేఖర మంగళా౦గ’’అంటూ శ్రీ పాండురంగ సుప్రభాతం రాశారు –‘’స్వామిన్ దయానిధే –భవ సింధు మధ్యే మగ్నం విహాయ కధమద్య సుఖేన శేషే ?మా ముద్ధరస్వ సమయో న హి దీనబంధో –శ్రీ పాండురంగ భగవం స్తవ సుప్రభాతం ‘’.తండ్రి భావానంద స్వామి పై సుప్రభాతం రాస్తూ ‘’భావానంద యతీంద్ర జాగృహి గురో –భక్తౌఘ చింతామణే’’అని నిద్ర లేపారు .జగద్గురు శ్రీ శంకరాచార్యులవారి శివ పంచాయతనం గురించి స్తోత్రం రాసి –‘’గౌరీ పతే !భవతు తే శివ –సుప్రభాతం ‘’మకుటం తోశివుని ‘’ఉత్తిష్ట హే౦బ లలితే తవ సుప్రభాతం ‘’అని లలితమ్మ వారినీ ,’’లక్ష్మీ పతే భవతు తే శుభ సుప్రభాతం ‘’అంటూ నారాయణమూర్తినీ ,’’శ్రీ విఘ్నవారక –విభో తవ సుప్రభాతం ‘’అని గణపతి ని ,’’చాయా పతే –భవతు తే సుప్రభాతం ‘’అని సూర్యుడిని అలాగే కాలభైరవుడినీ ,వీరభద్రుడినీ చేర్చి శివ పంచాయతన సుప్రభాతం రాశారు .’’భావయామి నిరంతరం మామ మానసే మురళీధరం’’అంటూ మురళీ సప్త వింశతి స్తోత్రం రాశారు .’’ఘనశ్యామః కృష్ణో వసతు మమహృద్ధామ్నిసతతం ‘’అంటూ శ్రీ కృష్ణ ప్రేమాస్టకం’’’’భజే సర్వదా చిన్మయం రుద్ర దేవం ‘’అని రుద్ర దేవాస్టకం మహా భక్తి యుతంగా రచించారు .ఆశ్రమ క్షేత్ర పాలకుడైన ‘’బాలవీర ప్రతాప మారుతి ‘’పై స్తోత్రం మొదలైనవి నిత్య పఠనీయం గా రచించి మధుర భక్తి ప్రవాహాన్ని పారించారు . శ్రీ ఆంజనేయ స్వామికి బెల్లం తో చేసిన ‘’అప్పాలు ‘’నైవేద్యం మహా ఇష్టం . వాటిరుచి దేనికీ రాదు .అప్పాల ఇంటిపేరున్నశర్మగారు తాము రచించిన స్తోత్ర, సుప్రభాతాదులలో ఆ ‘’అప్పాల మాధుర్య రుచి’’చూపించి ఇంటిపేరు సార్ధకం చేసుకున్నారు . పాండు రంగాశ్రమ నినాదం శ్రీ క్రష్ణాద్వైత సిద్ధాంతం ,–‘’నాదం సాధం ‘’అంటే భగవన్నామాన్ని నాదయుత౦ గా జపించటం ,సాధం అంటే వచ్చినవారికి ఆప్యాయంగా భోజనం పెట్టటం . దీనిని అప్పాల విశ్వనాధ శర్మగారి తండ్రిగారు ,కుమారుడు కూడా శ్రద్ధగా అమలు పరచి నామ గానాన్ని తెలంగాణా ప్రాంతమంతా విస్తరింప జేశారు .పాండురంగ ఆశ్రమం లో భోజనం అంటే ఎంతో పవిత్రమైనదిగా భావించి భక్తజనం వచ్చి ప్రసాదంగా భావించి భుజించి వెళ్ళేవారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-17 –ఉయ్యూరు

