గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం

3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )

6-12-19 02 జన్మించిన తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రిగారికి 12 వ ఏట ఉపనయనం జరిగింది .వీరిది తెలంగాణా మహబూబ్ నగర్ గోపాల్ పేట .పానుగంటి ప్రభువుల చేత ఈ కుటుంబానికి మడులు మాన్యాలు లభించాయి తలిదండ్రులు శేషమ్మ ,సుబ్బయ్య దంపతులు .ముగ్గురు సంతానం లో శాస్త్రి గారు రెండవ వారు .సాహిత్యం లో గొప్ప కృషి చేసి అభినవ కాళిదాసుగా ప్రసిద్ధి చెందారు .తొలి గురువు పల్లా యజ్ఞనారాయణ శర్మ గారు వనపర్తి చుట్టుప్రక్కల గ్రామాలకు యజ్ఞనారాయణ శర్మగారి విద్యా పీఠమే విద్యా కేంద్రం .వనపర్తి దగ్గరలో రాణిగారు భర్త పేర రాజానగరం స్థాపించి ఏటా కార్తీక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు .శాస్త్రిగారి అక్కగారిని రాజానగరం ఇచ్చారు .నగరం లోని విక్రాల వెంకటాచార్యులు ,నరసింహా చార్యులు అనే పండిత సోదరులతో మన శాస్త్రి గారికి పరిచయం కలిగింది .వెంకటాచార్యులవారు శాస్త్రిగారికి దక్షిణామూర్తి మంత్రోప దేశం చేశారు .వనపర్తి లో’’ పంచ దశలు ‘’ చెప్పుకుని ,వేదం పై మమకారం కలిగి కర్నూలు వెళ్లి ఇంద్రగంటి శేషావదానుల గారి వేద పాఠ శాలలో చేరి యజుర్వేద౦ లో ఒక  అష్టకం పూర్తి  చేశారు .అక్కడ పని చేస్తున్న కాళహస్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ కారణాంతరాలవల్ల కాశీ వెళ్ళిపోతే ,అక్కడే పని చేస్తున్న సాహిత్య పండితుడు వెల్లాల శంకర శాస్త్రి గారి వద్ద విజయ దశమినాడు అపరాజితా దేవి ఉత్సవాల సమయం లో శబ్ద మంజరి ప్రారంభించారు .వెల్లాల వారి బోధనా విధానం ప్రత్యేకం .శ్లోక వివరణలో శబ్దాలు కారకాలు ,ధాతువులు ,లకారాది సంధి ,సమాసం విగ్రహం వాటి సూత్రాలు వివరించి ,ఖండాన్వయ ,దండాన్వయాలు చెప్పేవారు .గురు శిక్షణ లో రాటు దేరి ఒక్క ఏడాదిలోనే కొత్త శ్లోకాన్ని ఆన్వయించుకునే శక్తి కలిగింది .

  సంస్కృతానికి అప్పుడు కోనసీమ’’ ఆంధ్రా కాశ్మీర్’’ గా ఉండేది .మోడెకుర్రు చేరి శ్రీపాద సుబ్బరాయ శాస్త్రి గారి వద్ద విద్య నేరుస్తూ భారవి నాలుగు ,మాఘం రెండు సర్గలు ,భోజుని రామాయణ చంపువు ఆరు కండలు పూర్తి  చేశారు .అక్కడ’’అనధ్యయన  కాలం’’ త్రయోదశి నుండి విదియ వరకే. పాఠాలు లేని ఆ  నాలుగు రోజులలో  లో  గృహస్తులు  వచ్చి విద్యార్ధులను తమ ఇళ్ళకు భోజనాలకు పిలిచేవారు . శిష్యులు కర్రా ,చెంబు పట్టుకుని ఆతిధ్యానికి వెళ్ళేవారు వారి ఆతిధ్యానికి ఏ లోటూ ఉండేదికాదు .దక్షిణా లభించేది .ఇలా కోనసీమలో ఏడాది గడిపారు .మళ్ళీ కర్నూలు వెళ్లి కాశీ వఝల సత్యనారాయణ శాస్త్రిగారివద్ద కౌముది అభ్యసింఛి నాటుకోటు శెట్టి అన్నామలై శెట్టి స్థాపించిన కాళహస్తి సంస్కృత పాఠ శాలలో చేరి చదివారు .సకల సదుపాయాలతో పాఠశాలలో  ఉన్నా అక్కడి నీరు పడక ,ఉండలేక కృష్ణాజిల్లా ‘’ఆకిరిపల్లి ‘’చేరి ,విద్వత్ పరీక్షలో జానకీ పరిణయం , ,భాగవతం బహుమతులుగా అందుకున్నారు వీరికి అక్కడ సూరి మార్కండేయ శాస్త్రి,సంగమేశ్వర శాస్త్రి గార్లు సహాధ్యాయులు .గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపుకు స్పందించి తన దుస్తులు కాల్చేసి ఖద్దరు ధారణ ప్రారంభించారు .ఇక్కడ వీరిని ‘’నైజాం శాస్త్రి ‘’అని పిలిచేవారు పాఠశాల లోని పెద్ద గ్రంధాలయాన్ని శాస్త్రి గారే నిర్వహించేవారు .తర్వాత బందరు దగ్గర చిట్టి గూడూరులో వరదాచార్యులవారి సంస్కృత పాఠ శాలలో చేరి,గొడవర్తి యతి రాజాచార్యులవద్ద వ్యాకరణం ,గరికపాటి సుబ్బయ్యగారి వద్ద కావ్య పాఠం నేర్చారు .ఆచార్యులగారి ఇంటికి వెళ్లి అలంకార శాస్త్రం చెప్పించుకున్నారు పాఠశాలలో కౌముది ,ఇంటి వద్ద చంద్రా లోక, కువలయానండాలు ,సాహిత్య దర్పణ ,ప్రతాప రుద్రీయాలు పూర్తి చేసి హర్ష చరిత్ర ,దశకుమార చరిత్ర చదివారు .అంతా బాగానే ఉన్నా చిట్టి గూడూరు నీరు వీరికి పడలేదు .

  బందరులో కోపల్లె హనుమంతరావు గారు ఏర్పరచిన జాతీయ కళాశాలలోవ్యాకరణ పండితుడు కంభం పాటి రామమూర్తి గారి సిఫారసుతో  చేరి,’’వారాల  భోజనం ‘’చేస్తూ చదివారు . వారాలిచ్చినవారిలో డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారూ   ఉన్నారు .వేదాల రంగాచార్యులు తెలుగు ,సుసర్ల సుబ్బారావు గారు (సంస్కృతం బి ఏ ఆనర్స్)  శాస్త్రి గారి తో తెలుగు నాటకాలు చదివి౦చుకునేవారు విశ్వనాధ వారు శాస్త్రిగారి ఇంటికి వచ్చి గీత గోవిందం చెప్పించుకునేవారు.  శాస్త్రి గారి క్లాస్ మేట్స్ బెజవాడ గోపాల రెడ్డి ,మరుపూరు కోదండ రామి రెడ్డి  బాలకృష్ణా రెడ్డి ,కౌతా ఆనందమొహన్ , కౌతా రామ్మోహన్ గార్లు .ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు తన కుమారుడు అర్జునరావు ను శాస్త్రి గారింటి వద్ద సంస్కృతం నేర్చుకునే ఏర్పాటు చేసి కళా శాలలో చేర్పించారు .అప్పుడు బందరు తుఫాను  వచ్చి అతలాకుతలం చేసింది. శాస్త్రిగారు ఆశువుగా తుఫాను భీభత్సాన్ని శ్లోకంలో బంధించారు –

‘’హా కష్టం పర దేశ దూర గమనం తత్రాన్య గేహే స్థితిః –కష్టాత్ కష్టతరాత్య నాదరమయే ,వారాన్న భుక్తి ర్విధే

కష్టం తత్రహి భుక్తి వర్ణిత దినం తత్రాప్య పాఠం దినం –నైవం కష్టయుతే జనే  తవ కథం కించిత్ గయా నాస్తి భో ‘’

  బందరులో ఉన్నప్పుడే గాంధీ 1922 -23 లో బెజవాడ వస్తే వెళ్లి దర్శించుకున్నారు .ఆ ఏడాదే శాస్త్రి  గారి స్వప్నం లో వీణాపాణి సరస్వతి దర్శనమిచ్చింది ఆ క్షణం నుంచే శాస్త్రి గారికి కవితా ధార అలవడింది .వెంటనే ‘’భారతీ తారామాల ‘’27 వృత్తాలలో రచించి గురువుగారికి చూపి మెప్పుపొంది స్నేహితుడు దుర్గా మల్లికార్జునం అయిదు వందల రూపాయలు ఖర్చు చేసి అచ్చు వేయించి అందజేశాడు .కాకినాడ  కాంగ్రెస్ సభలకు వెళ్లి ఆ పుస్తకాలన్నీ ఉచితంగా పంచేశారు .

     సశేషం

20 18 నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-17 –ఉయ్యూరు

 Inline image 1


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.