”అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం
తెలుగులోసినీ హాస్యనటులు చాలా మంది ఉన్నా కొందరే ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచి వెలిగారు .తర్వాత తరం లో వచ్చిన వారిలో శ్రీ గుండు హనుమంతరావు అమాయక హాస్య పాత్రలను బాగా పోషించి తనదైన బాణీ నెలకొల్పాడు . ముందుతరం హాస్య నటులలో బుల్లి తెర కు వెలుగులిచ్చినవారు బహుకొద్దిమంది . కానీ ”అమృతం ”సీరియల్ లో అంజనేయులు అనే అంజిగాడి పాత్రను అత్యద్భుతంగా పోషించి మూడువందలకు పైబడిన ఎపిసోడ్ లలో తనదైన ముద్ర వేశాడు .అందులోని మిగిలిన పాత్రధారులు మారుతూ వచ్చినా చివరిదాకా నిలిచింది హనుమంతరావు అప్పాజీ వేషధారి నారి పెద్ది మాత్రమే . పోటా పోటీగా నటించారు ”. సమస్య ఎదురైతే తనదైన శైలిలో . ”మై హూనా”అంటూ అందరికంటే ఆరిందాగా తెలివైనవాడినని చెప్పుకుంటూ అసామాన్యమైన ఆలోచనలు చేసి ,చివరికి బొక్క బోర్లా పడి ఇల్లూ ఒళ్ళూ గుల్లచేసుకున్న కేరక్టర్ అంజి ది .ఎక్కడా సహజత్వానికి భిన్నంగా నటించలేదు . అందులోని ప్రతి ఎపిసోడ్ లోనూ జీవించాడు .డైలాగ్ డెలివరీ అత్యద్భుతం .సహజ హాస్య నటుడు .ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాడు మిగిలిన వారికి భిన్నంగా .అతని హాస్యం ”అమృతం ”అందుకే అమృత హాస్యం పండించాడని అంటాను .ఆ సీరియల్ చూస్తున్నంత సేపూ మనల్ని మనం మర్చిపోతాము .ఆఅందం వచ్చినా దుఃఖమొచ్చినా అతని హావభావాలు హద్దులు దాటవు .అందులోనూ ఒక మెరుపు కనిపిస్తుంది .హాయి అనిపిస్తుంది .బహుశా ఆయనమనసు అమృతోపమానం అవటం వలననే అది సాధ్యమైనదని అను కొంటాను. .మిఠాయి వ్యాపారం బిస్కట్ల వ్యాపారమూకూడా ఆయన మనసుని అమృత తుల్యమే ఆరోగ్య ప్రదాయమే చేశాయని అనిపిస్తుంది .మన మనసుకు ఆరోగ్య ఆనంద అమృతాలిచ్చిఅతని శరీరాన్ని అవి దెబ్బతీసి షుగర్ వ్యాధికి కారణమవటం బాధించింది .ఎందరెందరు సహనటులకో సహ్యా సహకారాలందించి నాటకరంగం లోనూ ఓ వెలుగు వెలిగినాడు 20 16 సరసభారతి సభకు ఆహ్వానిస్తే వస్తామని చెబితే ఆహ్వాన పత్రికలో పేరు వేసి ,,రెండు రోజులముందు ఫోన్ చేస్తే తీవ్ర అనారోగ్యం వలన రాలేక పోతున్నానని తెలియజేశాడు .అనారోగ్యం తో ఉన్న కన్నతండ్రిని దగ్గరుండి చూసుకోవటానికి అమెరికాఉద్యోగం మానేసి రెండేళ్లకు పైగా తండ్రిని కంటికి రెప్పలాగా కాపాడుకున్న అతని కుమారుడుఅందరికి ఆదర్శమే అయ్యాడు ..డయాలిసిస్ కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తే ,తగినంత డబ్బు రాగానే ఇక డబ్బు పంపవద్దు అని వినయంగా చెప్పిన సంస్కారి హనుమంతరావు
సినిమాలలోనూ అతని హాస్యం శృతి మించలేదు అన్నమయ్య లో బ్రహ్మానందం తో కలిసి ”ఆహుమ్ ”అంటూ మంత్రం లాగా అనటం భలే నవ్వు తెప్పిస్తుంది .రాజేంద్రుడు గజేంద్రుడు ,అతనికి గొప్ప బ్రేక్ ఇచ్చింది .పుట్ట చెవిటి కేరక్టర్ లో ”వినబళ్లా ”అని నెమ్మదిగా చెబితే నాకు చెవుడా అంటూ దబాయించే పాత్ర మారవా లేము మరణించి వారమే అయింది . ఆరోగ్యాత్మక అమృత హాస్యాన్ని చిందించి పండించిన గుండు హనుమంతరావు మరణించి వారమే అయింది .తెలుగు తెర హాస్యనటులు ఒక్కొక్కరుగా కనుమరుగై పోతున్నారు
ఇప్పుడు ఇవాళ మరో అందాలరాశి అతిలోక సుందరి ముగ్ధ మోహన మూర్తి తెలుగు తెర అందాలకే అందం తెచ్చిన శ్రీ దేవి మరణించింది .తెలుగు తమిళ ,మళయాళ హిందీ సినిమాలలో నటించి తన అతిలోక సౌందర్యాన్ని అంద ఛందా లను హద్దు మీరకుండా నటించి పద్మశ్రీ అయింది .బాలనటిగా బడిపంతులు ,కన్నెపిల్లగా ,పదారేళ్ళ వయసు అందా లను ఆరబోసిన అందాలరాశిగా ,అడవి రాముడు వంటి వాటిలో యవ్వనం విరబూసి అందాలను పూరి విప్పి నాట్యం చేయించి ,దా0పత్య సౌఖ్యాన్ని పొందిన ఇల్లాలుగా ,బిడ్డకోసం తాపత్రయ పడిన తల్లిగా ,”క్షణక్షణ0” భయాందోళనలతో”దేవుడా దేవుడా ”అంటూ తాను భయపడుతూ మనల్ని భయపెట్టిన అమాయక అమ్మాయిగా తెలుగులో ఆమె నటన శిఖరోరోహణమే చేసింది .అతి లోక సుందరిగా అప్సరసగా ,ముద్దుముద్దుమాటలతో హృదయాలనే గిలి గింతలు పెట్టించింది .మిస్టర్ ఇండియా హిందీ సినిమాలో ఆమె నటన కు జనం హారతులు పట్టారు .వందేళ్ళసినీ చరిత్రలో గ్రేటెస్ట్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందింది . సభ్య శృంగారాన్ని తన అంద చందాలకు జోడించి నటించి ఎదిగిన మహోన్నత అందాలనాటి శ్రీదేవి అమరలోకానికి చేరుకొని సినిమా రంగానికి తీవ్ర లోటు కలిగించింది .
అమృత హాస్యనటుడు గుండు హనుమంతరావు అందాలరాశి ,అతిలోక సుందరి సహజ నటి శ్రీ దేవి మరణాలకు విచారం వ్యక్తం చేస్తూ వారి ఆత్మ లకు శాంతికలగజేయమని భగవంతుని కోరుతున్నాను -దుర్గాప్రసాద్
—

