కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం
మహా వ్యక్తుల మహా ప్రస్థానం వారం రోజులుగా సాగుతూ ఉండటం, మరీ బాధాకరంగా ,జీర్ణించుకోవటానికి వీలులేనిదిగా ఉంది.కాలప్రవాహం ఎవరికోసమూ ఆగదు అన్న నిజం ఎప్పుడూ నిజమౌతూనే ఉన్నది . .ఇప్పుడుకూడా అంతే.హాస్య నటుడు గుండు హనుమతరావు ,మహానటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం మహా కధకులు మునిపల్లె రాజు గారి నిర్యాణం నుంచి తేరుకోకముందే ఇవాళ కంచి మహాస్వామి శ్రీశ్రీ జయేంద్ర సరస్వతుల మహానిర్యాణ వార్త ఆస్తిక జన హృదయాలను కల్లోల పరచింది .82ఏళ్ళ వృద్ధాప్యం లో వారు సిద్ధిపొందారు .అందులో 64సంవత్సరాలు పీఠాది పత్యం వహించి ఆస్తిక జన జాగృతం చేశారు .శ్రీ పరమాచార్యులకు వారసులై 69వ పీఠాధిపతి గా తమ సమర్ధతను లోకానికి చాటిన ఆదర్శ మూర్తి .
తమిళనాడు తంజావూర్ జిల్లా ఇరుల్ నీకి లో బాల సుబ్రహ్మణ్య అయ్యర్ గా 1935 జనవరి 18 జన్మించారు .సుబ్రహ్మణ్య మహాదేవ గా పిలువబడ్డారు .పదమూడవ ఏటనే ఋగ్వేద సంహిత పూర్తి చేసి కంచి జగద్గురు విద్యాస్థాన్ లో చేరారు .కంచి పీఠ ఆస్థాన విద్వాంసుడు కృష్ణ శాస్త్రి గారి దృష్టిలో పడి పీఠానికి ఉత్తరాదికారానికి యోగ్యుడని గుర్తింపు పొందారు .సమైక్య వాదిగా పేరుపొందిన జయేంద్ర సరస్వతీ స్వామి పరమాచార్య, నడిచే దైవం అయిన శ్రీశ్రీ చంద్ర శేఖర యతీ౦ద్రులవారితో పాటు మూడు సార్లు భారత దేశమంతా కాలినడకన పర్యటించారు .1954మార్చి 22నపీఠాదిపత్యం వహించారు .మరొకమారు సపరివారంగా భారత దేశం నాలుగు మూలలా పాదచారియై పర్యటించి ఆధ్యాత్మిక భావ దీప్తి కలిగించారు .మృదు స్వభావి మధురవాక్కు ఉన్న స్వామి భక్తుల హృదయాలను చిరునవ్వు తో ఆకర్షించారు. వారి జ్ఞానబోధ పరమ ప్రసన్నంగా ఉండేది .
మానససరోవరం చేరి అక్కడ ఆది శంకరా చార్యుల శిలకు పూజాదికాలు నిర్వహించి ప్రతిస్టిం చటం అపూర్వ విషయం .ఇతర దేశాలైన బంగ్లాదేశ్ వంటి వాటిలో కూడా పర్యటించి కొత్త వరవడి సృష్టించారు .పశ్చిమ బెంగాల్ లోని శ్రీ రామకృష్ణ పరమహంస ఆవాసమైన కాళికా దేవాలయం లో ‘’శంకరాచార్య గేటు ‘’నెలకొల్పారు .చాతుర్మాస్య దీక్షులు క్రమబద్ధంగా నిర్వహించి ఆయా ప్రాంతలలో వైదిక ధర్మ వ్యాపి కలిగించిన మనీషి .చంద్ర శేఖరస్వామి వేదపాఠ శాలలు స్థాపించి శాస్త్రాధ్యయనానికి కృషి చేస్తే జయే౦ద్రులు ప్రజోపకార కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత నిచ్చారు .మానవ సేవే మాధవ సేవగా భావించి శంకర నేత్రాలయ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులను నెలకొల్పి సేవలందించారు . మత మార్పిడులను నిరోధించటానికి పీఠాదిపతుల,ధార్మిక సంస్థ ల సహకారం తీసుకున్నారు . దళిత వాడలలో హిందూ ధర్మ ప్రచారం చేశారు. వారినీ జనజీవన స్రవంతి లో కలిసేట్లు చేశారు .వారిలో సనాతన హైందవ ధర్మం పట్ల అభిరుచిని కలిగించి చైతన్యం తెచ్చారు .
సనాతన భారతీయ హిందూ ధర్మ పై అపార జ్ఞాన సంపన్ను లైన జయేంద్ర స్వామి అందరిచేతా ఆరాధింప బడిన మహోన్నత వ్యక్తి .కంచి పీఠం బలమైన సంస్థగా ఎదగటానికి వారు చేసిన కృషి అనితర సాధ్యం .అనేక పాఠశాలలు నేత్రాలయాలు నిర్మించి ప్రజలకు మఠాన్ని చాలా దగ్గరకు చేర్చారు .అస్సాం లో గౌహతి వద్ద శంకర నేత్రాలయం స్థాపించి ఈశాన్య రాష్ట్రాలలోనూ సేవా కార్యక్రమాలు చేబట్టారు .ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బాలల ఆస్పత్రులు ,హిందూ మిషన్ హాస్పిటల్ ,తమిళనాడు హాస్పిటల్ వంటివి నిర్మించి ప్రజా సంక్షేమమే భగవత్సేవ గా నిర్వహించారు .
1987ఆగస్ట్ 22 అకస్మాత్తుగా అదృశ్యమై చివరికి తలకావేరి లో ప్రత్యక్షమై మొదటి సారిగా వివాదం లో పడ్డారు పెద్దస్వామి వాత్సల్యం సంపూర్ణం గా ఉండటం చేత ఆహ్వాని౦పబడి మళ్ళీ పీఠం ఎక్కారు .తర్వాత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత అనేక ఆరోపణలతో జైలు పాలు చేసిందీ .ఏ ఒక్కటీ కోర్టులో రుజువు కాలేదు .ధర్మం కోసం వేద విజ్ఞాన వ్యాప్తికోసం ,మానవ సేవ కోసం పరితపించి కృషి చేసిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి మా ఉయ్యూరుకు దగ్గరలో ఉన్న గురజాడ గ్రామానికి మూడు నాలుగు సార్లు వచ్చారు . పరమాచార్యులవారితో ఉయ్యూరుకూడా వచ్చారు .వచ్చిన ప్రతిసారీ వారిని దర్శించుకున్న ప్రసంగాలు విన్న అదృష్టవంతులం అయ్యాం వీరిద్దరి గురు శిష్య బంధం దృఢమై ఆదర్శప్రాయమై నిలిచింది .
శ్రీ జయేంద్ర సరస్వతి ఇవాళ 28- ఫిబ్రవరి 2018 న శివైక్యం చెందారు .వారి ప్రేరణ స్పూర్తి మనలను కలకాలం తీర్చి దిద్దాలని ఆశిద్దాం .
మీ—గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-18 –ఉయ్యూరు

