దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6

 

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6

30-కాశీ భట్ల లక్ష్మణ శాస్త్రి –గరికపర్తి కోటయ్య దేవర శిష్యుడు .కస్తూరివారి సావరం నివాసి .చిన్నప్పుడే ఫిడేలు, గాత్రం నేర్చి తోడి ,శుద్ధ సావేరి రాగాలలో వర్ణాలు రచించి చాలామందికి నేర్పాడు .1944లో చనిపోయాడు .కొడుకులు కామేశ్వరావు గణపతి కాశీపతి తబలా హర్మని నిపుణులు .

31-చంద్రాభట్ల కనకయ్య –మార్టేరుదగ్గర తామరాడ అగ్రహార  వాసి .కల్యాణి ఖమాచి ,బిలహరి వసంత శంకరాభరణం ,భైరవి రాగాలలో స్వరజతులు రాశాడు .

32-పారు పల్లి రామకృష్ణయ్య పంతులు (1883-1951)-1883 స్వభాను సంవత్సర౦లో కృష్ణాజిల్లా శ్రీకాకుళం లో జన్మించారు .శేషాచలం ,మంగమాంబ తలిదండ్రులు .శ్రీ వత్స గోత్రం .1902లో తెలుగురాయలపాలెం కు కరణీక౦  చేసి ,నాలుగేళ్ళకే రిజైన్ చేశారు .గానకళ హృదయం లో మెరుపులాగా మెరిసింది .ఆ తళుకులో సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రిగారి పాదపద్మాలు మనోహరాలై కనిపించి స్పూర్తి నిచ్చి ,ఆ చరణకమల దాసులు ,సన్నిహితులై జ్ఞానదీప్తి పొందారు .శాస్త్రిగారి వద్ద పెదకళ్ళేపల్లి లో 12ఏళ్ళు గురుకులవాసం చేసి నమ్రత సూక్ష్మబుద్ధి తో గురుమనసు రంజింపజేసి ,గురువే దైవంగా భావించి ,గురూపదేశం పొంది చరితార్ధులయ్యారు .

కాకినాడ గాన సభలో తన సత్తా చాటి ,అనేక సార్లు దక్షిణ యాత్రలు చేసి గాన కళారహస్యాలు ఆమూలాగ్రం నేర్చారు .తిరువయ్యారు శ్రీ త్యాగారజారాధనోత్సవాలు చూసి ,బూదలూరి కృష్ణమూర్తి శాస్త్రి గారి గోటు వాద్యకచేరీలో ఫిడేలు నైపుణ్యం చూపి మామ్గుడి చిదంబర భాగవతార్ ,పంచాపకేశన్ మున్నగు విద్వత్ ప్రముఖులమన్ననలు పొందారు .పంతులుగారి గాన కళా వైభవాన్ని వార౦తా ఎంతగానో మెచ్చుకొన్నారు .వాయులీన నిపుణత సున్నిత గాత్రం తో అందరినీ ఆకర్షించేవారు .శాంత దమాది సద్గుణ గరిస్టులు.శుద్ధవాణి ,శుద్ధముద్ర పారుపల్లివారి ప్రత్యేకత .శాస్త్రిగారి శిష్యులలోమేటి .40ఏళ్ళు ఆంద్ర దేశాన్ని గానంతో ఉర్రూతలూగించి దాక్షిణాత్య గానాన్ని బంగారుపల్లకీలో ఊరేగించారు .1916లో గురువుగారితో బరోడా పరిషత్తుకు వెళ్లి ,ఆంద్ర సమాజం చేత సన్మానం .

1931లో నరసరావు పేటలో పిరాట్ల శంకర శాస్త్రి అధ్యక్షత న జరిగిన సారస్వత పరిషత్తులో ‘’గాయక సార్వ భౌమ ‘’బిరుదప్రదానం చేసి ఘన సత్కారం చేశారు .1933లో మద్రాస్ సంగీత పరిషత్ విద్యాప్రవీణ సలహా సభ్యులయ్యారు .1943లో పంతులుగారి షష్టిపూర్తి మహోత్సవం నభూతో గా జరిగింది .1917లో విజయవాడలో త్యాగరాజ శత వార్షికోత్సవం  ఘనంగా చేశారు .విజయవాడలో ‘’త్యాగరాజ సంగీత పరిషత్ ‘’ను స్థాపించి ,ప్రతియేటా పండిత సభలు వాగ్గేయకారులవార్షికోత్సవాలు  జరుపుతూ సత్కరిస్తూ ప్రోత్సహించారు .’’రాగ తాళ భావ ప్రవృత్తులు ప్రజ్ఞాన సమన్వితాలు ‘’అని చెప్పేవారు .చాలా గాయక సభలకు అధ్యక్షులు తిరువయ్యార్ ,పూనా ,మద్రాస్ మొదలైన పట్టణాలలో కచేరీలు చేసి మహాసత్కారాలు పొందారు .పంతులుగారి శిష్యులు ప్రస్తుతం ‘’రామకృష్ణ గాంధర్వ విద్యా పీఠం’’స్థాపించి బెజవాడలో నిర్వహిస్తున్నారు .సహపాఠులు-వెంపటి వెంకట కృష్ణయ్య,చల్లపల్లి పంచానదేశ్వరం ,ద్వివేదుల లక్ష్మన్న ,దుడ్డు సీతారామయ్య ,చల్లపల్లి సుబ్బయ్య  ,దాలిపర్తి రామస్వామి .

శిష్యులు –చిలకలపూడి  వెంకటేశ్వర శర్మ ,మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ,వంకదారి వెంకట సుబ్బయ్య ,దాలిపర్తి పిచ్చిహరి , ధూళిపాల  సోదరీమణులు ,వంగల వాణీ బాయమ్మ ,యశోదమ్మ ,లక్ష్మీ నరసింహ శాస్త్రి ,శిష్ట్లా రాజశేఖర శాస్త్రి మొదలైనవారు .

33-దుడ్డు సీతారామయ్య –(1853-1951)-తండ్రి దుడ్డు కామశాస్త్రి అధ్యాత్మరామాయణ ,అష్టపదులు ,తరంగ ప్రవీణుడు .తల్లి సుబ్బమ్మ .తండ్రివద్ద సంగీతం నేర్చి ,స్వయంగా తనూ కొంత నేర్చి తృప్తిపడక దేశాటనం చేసి ,అనేక గురువులవద్ద విద్య అభ్యసించి గానరహస్యాలు నేర్చిన ఏక సంద గ్రాహి .చివరకు సుసర్లవారి ని చేరి 4నెలలలో సకల గాన రహస్యాలు అవగతం చేసుకొన్నాడు .మద్రాస్ లో తిరువత్తూర్ త్యాగయ్యవద్ద కొత్తగాన విషయాలు నేర్చి జంత్ర గాత్రాలలో అసమాన ప్రజ్ఞా ధురీణుడయ్యాడు .’’మూడు సంగీత అవధానాలు’’ చేసిన మహాగాయక మణి.వేదమూల అష్టావధానం ,గణితావధానం ,సంగీత అవధానం చేసిన ఘనుడు .సంగీత అవధానం అంటే –రాగ తాళ,కాల  జాగా గతి జాతి భేదాలు చేసి గాత్రం తోపాడుతూ ఫిడేలుపై వాయి౦చటం. గణితావధానం అంటే –కోరిన జాగాలలో షట్కాలాలలో రెండు చేతులతో తాళాలు వేస్తూ ,కాలాలు మార్చి వ్యస్తాక్షరీ ఘంటనాదాలతో కలిసి అవధానం చేయటం .పద్యకవిత్వం లో పూర ణాలు అసాధారణంగా చేసేవాడు .

పిఠాపురం సంస్థానం లో గణిత అష్టావధానం చేస్తుంటే ,మద్రాస్ గవర్నర్ 24అక్షరాల న్యస్తాక్షరి నివ్వగా సునాయాసంగా చేసి మెప్పు పొంది రాజాగారు తమ ఆస్థాన విద్వాంసులుగా ఉండమని కోరారు .అప్పటికే 10ఆస్థానాలనుండి  గౌరవ వార్షి కాలు పొండుతు౦డటంతో సున్నితంగా తిరస్కరించాడు ,కాకినాడలో చల్లా సుబ్బారావు సింహతలాట మురుగులు ,పత్రి రామచంద్ర రావు స్వర్ణ మాల  చేయించి  గౌరవించారు  .అక్కడి పామర్రులో సంగీత పోటీలో వెయ్యినూటపదహారు రూపాయలు పందెం గెలిచాడు .జంగారెడ్డి గూడెం లో మాడుగుల సుబ్బారావు అరఎకరం పొలం రాసిచ్చాడు .గోడే వారి ఎస్టేట్ లో ఆహిరి, రీతి గౌళ రాగాలు అద్భుతంగా పాడగా  ఓలేటి కామరాజు పంతులు గారు 200ఎకరాల భూమిని శాశ్వత దానపత్రంగా రాసిచ్చాడు .నూజివీడులో మీర్జాపురం రాజా కల్యాణం సందర్భంగా అష్టావధానం లో హుసేని రాగాలాపన చేసి మెప్పించి ‘’మహామహోపాధ్యాయ ‘’బిరుదు పొందాడు .ప్రాచీన గీతాల లక్షణ ప్రబంధాలు ఇతనివద్ద చాలాఉన్నాయి .నిశిత ప్రజ్ఞా దురంధరుడు,ప్రజ్ఞా శీలి  దుడ్డు మహాదొడ్డ గాయకుడు  కూతుళ్ళుకూడా మాహా గాయనీమణులే .ముఖ్యశిష్యుడు  వింజరం గ్రామానికి చెందిన మహేంద్రవాడ బాపన్న శాస్త్రి .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 


 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.