కిరాతార్జునీయం-4

కిరాతార్జునీయం-4

ధర్మరాజుకు వనచరుడుఇంకా ఇలా చెప్పాడు ‘’రాజా !దుర్యోధనుని ఆజ్ఞను రాజులంతా పూలదండ లాగా శిరసావహిస్తూ ,అతడు ధనుస్సు ఎక్కు పెట్టటంకాని  ,కోపం తో ముఖం  చిట్లించటం కానీ చేయకుండా ప్రశాంతత కలిగిస్తున్నారు .రాజు మనసులో అనుకొన్న పని అతిశీఘ్రంగా నెరవేరుస్తున్నారు .

‘’స యౌవ రాజయ్ నవ యవ్వనోద్ధతం –నిధాయ దుశ్శాసన  మిద్ద శాసనం

మఖేష్వఖిన్నోనుమతః పురోధసా –ధినోతి హవ్యేన హిరణ్య రేతసం ‘’

నవయవ్వన గర్వితుడైన తమ్ముడు దుశ్శాసననుడినకి యౌవ రాజ్యపట్టాభి షేకం చేసి , ,రాజకీయాలన్నీ అప్పగించి తనకు ఎలాంటి తొందరలు లేకుండా  పురోహితుని అనుమతితో అగ్నిని, దేవతలను సంతృప్తి పరుస్తూ ,బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం , సమృద్ధిగా దక్షిణలతో  మానసిక సంతృప్తి కలిగిస్తూ ,ఉభయ తారకంగా చాలా క్రతువులు నిర్వహిస్తూ బ్రాహ్మణ, పురోహిత,పండితులనూ తనవైపుకు త్రిప్పుకొని పూజి౦ప బడుతున్నాడు .’’అని చెప్పి ఇవన్నీ ధర్మరాజు మనసుకు సందేహం కలిగిస్తాయేమోనని భావించి దాన్ని పోగొట్టే ప్రయత్నంలో మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు –‘’ప్రభూ !హాయిగా  రాజ్యం చేస్తున్నా  అనుక్షణం  కలవరపడుతూ ,ఎప్పుడు మీరు వచ్చి మీదపడుతారో అనే భయంతో  గుండెమీదచేయ్యేసుకొని నిద్రపోకుండా ఉంటున్నాడు దుర్యోధనుడు .బలవద్విరోధం ఎంతటివాడికైనా దుఃఖ హేతువే కదా మారాజా !కనుక మీరు ఏమాత్రం సందేహించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయాలి .

   ‘’కధా ప్రసంగేనజనై రుదాహృతా-దనుస్మృతాఖండల సూను విక్రమః

   తవాభిదానా ద్వ్యథతే  నతానన- సుదుస్సహాన్మంత్రపదాదివోరగః’’

సభలో ఉన్నా ఇస్టాగోస్టిలో ఉన్నా మీపేరు వినిపించినా ,మహా పరాక్రమశాలి అర్జునుని పరాక్రమం గుర్తుకు వచ్చినా ,విష వైద్యుడు గారుడ మంత్రోచ్చాటనం చేసినప్పుడు నాగుపాము తలవంచి కదలక మెదలక కట్టు బడి ఉన్నట్లు ,పాల్పోయిన ముఖంతో గజగజలాడుతూ తలవంచుకొని దుఖపడటం ప్రత్యక్షంగా చాలా సార్లు చూశాను .కనుక మీ ప్రయత్నం మీది .మరో ముఖ్యవిషయం మారాజా !మీవిషయం లో అనేక  దుస్తంత్రాలు పన్నే కపట డుర్యోధనుడి విషయం లో మీ ప్రతిక్రియ అత్యంత శీఘ్రంగా జరగాలి .జనం నోటిమాటలు విని మీకు చెప్పటమే మా పని .ప్రతిక్రియతీరు తెన్నులు మీరు ఆలోచించాలి ‘’అని చెప్పగా యుదిస్టిరుడు తగిన పారితోషికమిచ్చి పంపించి ,ఇంటికి చేరి తనకోసం  ఎదురు చూస్తున్న భీమాదుల పక్షాన వనచరుడు చెప్పిన సమస్త విషయాలు ద్రౌపదికి వివరించి చెప్పాడు –

‘’ఇతీరయిత్వా గిరమాత్తసత్క్రియే – గథే దపత్యౌ వనసన్ని వాసినం

ప్రవిశ్య ‘’కృష్ణా ‘’సదనం  మహీభుజౌ –తడాచ చక్షే నుజసన్నిదౌ వచః ‘’

  ధర్మరాజు చెప్పిన విషయాలు విన్న ద్రౌపదికి జుట్టు ముడి  వేసుకో కుండా ఉండటం మొదలైన విషయాలు జ్ఞప్తికి రాగా ,అణచుకోలేక  ,ధర్మజుడికి కోపం తెప్పిస్తే కాని శత్రు సంహార కార్యక్రమం మొదలు పెట్టడు అని  భావించి,దానికి తగినవిధంగా పలకటం ప్రారంభించింది .

‘’భావాదృశేషు ప్రమాదా జనోదితం –భావత్య్దిక్షేపఇవాను శాసనం

తథాపి వక్తుం  వ్యవసాయయ౦తీమాం-నిరస్త నారీ సమయా దురాధయః ‘’

‘’మీలాంటి పండితులను వినియోగించటానికి స్త్రీలు తగరు.ఒకవేళ వినియోగిస్తే అది తిరస్కరి౦పబడుతుంది. వ్యవహారాలలో స్త్రీలు జోక్యం చేసుకోవటం ధర్మ విరుద్ధమే అయినా ,స్త్రీల ఆచారాలను ఉల్లంఘింప జేసే దుష్ట మనోవ్యధలు నన్ను ఊరుకోనీ కుండా నాకు తోచినమాటలు చెప్పమని ప్రేరేపిస్తున్నాయి .కనుక నే చెప్పేది సావధానంగా వినమని మనవి .దుఃఖంలో ఉన్నవారికి ఉచితానుచితాలు కనిపించవు .కనుక నేను చెప్పేమాటలు దోషాలైనా శాంతంగా ,సావధాన చిత్తం తో ఆలకించండి ‘’అని చెప్పటం ప్రారంభించింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-20 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.