కిరాతార్జునీయం-6
ద్రౌపది పలికినపలుకులు ములుకుల్లా తాకినా నిబ్బరంగా తన సహజశాంత స్వభావంతో యుధిష్టిరుడు ఇలా బదులు పలికాడు –‘’ద్రౌపదీ !నువ్వు ఇంతగా విచారి౦చటానికి కారణం కనబడటం లేదు .నాకు ఏ ఆపదా లేదు .వ్యర్ధంగా విచారిస్తే నీకొచ్చే ఆపద ఏమిటో చెబుతావిను .నువ్వు ఇదివరకు అంతః పురం లో హంసతూలికాతల్పం పై శయనించి ఉంటె వైతాళికులు స్తుతి గీతాలు పాడుతూ ,మంగళధ్వనులు వినిపిస్తుంటే మహా రాజ ఠీవి తో నిద్ర లేచే నువ్వు ,ఘోరారణ్య౦ లో కటిక నేలలపైనిద్రిస్తూ ,అమంగళకారకాలైన నక్కకూతలే మేలుకోలుపులుగా నిద్రలేస్తున్నావు .ఇంతకంటే ఆపద వేరేదైనా ఉందా .ఆలోచించు .’’అనగా ఆమె ‘’పూర్వం వేలాది బ్రాహ్మణులకు ఇష్టమృస్టాన్నాలు పెడుతూ దానధర్మాలు చేస్తూ ,నీకంటే నిరతాన్నప్రదాత వేరొకరు లేరన్నఖ్యాతిపొందిన నీవు అడవుల్లో ఆకులు అలములు తింటున్నావు ,పూర్వం బ్రాహ్మణ భుక్త అవశిస్టాన్నం భుజించి శరీరం వన్నెలతో ఉండేది .ఇప్పుడు నీ కీర్తిలాగానే శరీరం శుష్కింఛి పోయింది .కనుక నీ శరీరం నీ యశస్సులపై అభిమానంతో మళ్ళీ ఆ వైభవం పొందే ప్రయత్నం చేయి.లేకపోతే రెండూ క్షీణిస్తాయి .అపకీర్తి మరణం కంటే ఎక్కువ కాబట్టి కోపం తెచ్చుకొని శత్రు సంహారం చేసి పూర్వపు ఔన్నత్యం పొందు .పూర్వం ఎందరో రాజులు అనేక కానుకలు తెచ్చి నీ అనుగ్రహం పొందటానికి పాదాలపై వ్రాలినప్పుడు వారిహారలలోని పుష్పఆపరాగం చేత రంజి౦పబడే నీపాదాలు ఇప్పుడు ఘోరాటవుల్లో బ్రాహ్మణులు మృగాలు తెంపిన దర్భల కర్కశ చివళ్ళపై ఉంచాల్సి వస్తోంది .ఇంతకంటే గొప్ప ఆపద ఎవరికైనా వచ్చిందా . మనుషులకు ఇలా౦టిఆపదలు సహజం .దైవికంగా ఏదో ఆపద వస్తుంది దానికి బాధ పడకూడదు .ఈ ఆపదలలో శత్రు పరాభవం ఉండడుకనుక సంతోషంగానే ఉంటాయి. కాని మనకొచ్చిన ఆపద మానభ్నగమై శత్రువులవలన కలిగాయి .యుద్ధం లో ఓడితే వచ్చినవికావు .పౌరుష ప్రసక్తి లేకుండానే వచ్చాయి కనుక దుస్సహంగా ఉన్నాయి మానహాని దుస్సహం కాని ఆపదలుకాదు .కనుక ఊరుకోకుండా ప్రతిక్రియ చేయాల్సిందే .నాదా!నువ్వు చెప్పింది నిజమేకాని ఏమి చేయాలో చెబుతావిను .పౌరుషమున్నమహారాజులు శాంతిమార్గం వదిలి ,ఉత్తేజకర మైన క్షాత్ర తేజస్సుతో శత్రు సంహార ప్రయత్నం చేయి. బ్రతిమాలుతున్నాను మా యందు దయతో మా కోరిక నెరవేర్చు .శాంతంగా సాదిస్తానంటే కుదరదు మహర్షుల మోక్షమార్గానికి శాంతికాని రాజకార్య సాధనకు కాదు .క్షత్రియోచిన పౌరుషంతో ప్రతిక్రియ చేయి .-
‘’విహాయ శాంతిం నృప ధామ తత్పునః –ప్రసీద సందేహి వధాయ విద్విషాం
వ్రజంతి శత్రూ నవదూయ నిః స్పృహా-శ్శమేన సిద్ధిం మునయో న భూ భ్రుతః’’
‘’క్షత్రియోచిత తేజం మాకు లేదని అనటానికి వీల్లేదు .మీరు మహా తేజ శ్శాలురలో అగ్రేసరులు.యశోధనులైన మీ బోంట్లు క్షత్రియ పౌరుషం చూపాలేకాని శాంతంకాదు.శత్రుసంహారం తో సర్వాదిపత్యం సాధించు .ఉదాశీనత వదిలేయి .నేను చెప్పింది ఇష్టం లేక నీ శాంతిమార్గమే మేలు అనుకొంటే ,రాజచిహ్నాలైన ధనుర్బాణాలు వదిలేసి జటా వల్కల ధారివై ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసుకొంటూ ఉండు.ఉభయభ్రస్టుత్వం ఉపరి సన్యాసం ఎందుకు .12ఏళ్ళు వనవాసం ఒక ఏడుఅజ్ఞాతవాసమ్ చేస్తామని ప్రతిజ్ఞచేశాం ప్రతిజ్ఞా భంగం అవుతు౦దే మో అనే సందేహం వదిలేయి .ఇప్పటికే మన శత్రువులు సమయభంగం చేసి అపకారం చేయటానికి పూనుకొన్నారు .కనుక సమయభంగ భయం అక్కర్లేదు .పౌరుషశాలి, వివేకి ,విజిగీషుడు ఏదైనా ఒకనెపం తో సంధిని భగ్నం చేసి శత్రువును ఉపెక్షించడు .మా ఆపదలు పోగొట్టి కీర్తి పొందు .
‘’విధి సమయ నియోగా ద్దీప్తి సంహార జిహ్మం –శిధిల వాసు మగాదే మాగన మావత్పయోదౌ-
రిపు తిమిర ముదస్యోదీయ మానం దినాదౌ –దినకృత మివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః ‘’
ఇతి శ్రీ భారవి కృతౌ కిరాతార్జునీయే మహాకావ్యే లక్ష్మీ పద లాంఛనే ప్రథమ సర్గః
కాలవశంలో ఆపదలు కలిగి ప్రతాపం లేక ,ధనం లేక నామరూపాలు లేకున్నా ఉన్నావు .చీకటి అనే శత్రువును సంహరించి ఉదయాభి ముఖంగా ,సముద్రం లో అస్తమించి కిరణ ప్రసారం లేకుండా ఉన్న సూర్యుడు ప్రభాత సమయంలో చీకట్లను చీల్చుకొని ప్రకాశించే విధంగా నిన్ను లక్ష్మీ దేవి వరిస్తుంది .ఇప్పుడు దైవం, కాలం అను కూలమై బలపౌరుష దనాలతో శత్రువులను చీల్చి చెండాడే బలప్రతాపాలు చూపించే సమయం వచ్చింది .కనుక శత్రు సంహారంతో దినదినాభి వృద్ధి పొంది మా అందరికీ ఆన౦దం, శాంతి, సుఖాలు కలిగించు ధర్మరాజా “’అని విన్నవించింది ద్రౌపది .
సశేషం
శ్రీపంచమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-20-ఉయ్యూరు

