ప్రపంచ దేశాల సారస్వత౦
12-ధాయ్ సాహిత్యం
ధాయ్ భాష
ధాయ్ భాషనే సయమీస్ భాష అని అంటారు .చీనో –టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన భాష .ఆ కుటుంబంలోని మిగాతాభాషల లాగానే విశ్లేషిత పదరూపం లో ఉంటుంది .ఇందులో పదాలన్నీ ఏకాక్షరాలే .చైనా పదాల్లాగా వాక్యం లో పదాలు తమకున్న స్థానాన్ని బట్టి ,ఏ భాషా విభాగం గా నైనా మారుతాయి .కొత్త అర్ధం ఇచ్చే పదాన్ని నిర్మించాలంటే,అందులో భావం వివరించే పదాలను కలిపి సంయుక్తపదం లేక సమాసంగా నిర్మిస్తారు .వాక్యం లో కర్త ,క్రియ ,కర్మ అనే వరుసలో ఉంటుంది .ఆర్యభాషా వ్యాకరణం లాంటిది ఈభాషకు లేదు .
చైనీయ భాషలాగా ఇందులో కొన్ని పదాలకు స్వరాన్ని బట్టి అర్ధం మారుతుంది .స్వరం తో సంబంధం లేకుండా నానార్ధాలు కలిగిన పదాలు కొన్ని ఉన్నాయి .నామవాచకానికి లింగ వచన భేదం లేదు .అవసరాన్ని బట్టి కొన్ని ప్రత్యేకపదాలు చేర్చి ఆ అర్ధం వచ్చేట్లు చేస్తారు .కాలాన్ని బట్టి క్రియ మారదు .భూత, భవిష్యత్తులను సూచించే నిన్న ,రేపు వంటి పదాలను క్రియతో చేర్చి ఆ అర్ధాన్ని స్పురి౦ప జేస్తారు .సంస్కృత ,పాళీ భాషాపదాలు యెక్కువగా ఈ భాషలో చేరాయి .వైజ్ఞానిక ,తాత్విక పారిభాషా పదాలు సంస్కృతాన్ని ఆశ్రయించే ఉంటాయి .
బ్రాతదేశ బ్రాహ్మీ లిపి ని బట్టి ధాయ్ లిపి 13వ శతాబ్దం లో ఏర్పడింది .భారతీయ లిపులలో లేని ,రోమన్ లిపిలో మాత్రమె కనిపించే ఒక ప్రత్యేక విశిష్టత ఈ లిపికి ఉంది .రోమన్ లిపిలోలాగా హల్లులు,అచ్చులు వేరువేరుగా రాస్తారు .ఈ లిపి సృష్టికర్త ధాయ్ ప్రభువు రామ కం హాంగ్ ..అయినా అచ్చులతో కలిపి హల్లులను రాసే విధానం కూడా కొన్ని ప్రాంతాలలో ఉన్నది .స్వరాలను సూచించటానికి అక్షరాలపై ప్రత్యేక సంజ్ఞలు ఉపయోగిస్తారు.
ధాయ్ సాహిత్య౦
సంస్కృత ,పాళీ సాహిత్యాలపైననే ఆధారపడి ధాయ్ సాహిత్యం పెరిగింది .పూర్వ యుగాల కావ్య సంపద కొంతవరకు లభించింది .కానీ వారికాలాదులు పేర్లు లేవు .1914లో ప్రభుత్వం ఈ సాహిత్యంలో అత్యుత్తమ మైన రచనలను నిర్ణయించటానికి 1914లో ఒక సంస్థను ఏర్పరచింది .దీని సూచనలప్రకారం 1-ఫ్రలా2-ఫ్రసమత్థ, ఖేత్ ,3-మహా చాత్ ఖంథట్ 4-ఖన్ ఛంగ్ ఖన్ ఫెన్ 5-ఇనావ్ 6-హ్వా చాయ్ నాక్ రోవ్ 7-సామో౦క 8-ఫ్ర రాజ విధి శింగ్ సంగ్ ద్వాన్ లు ఉత్తమోత్తమాలుగా నిర్ణయించింది .
ఫ్రలా ఒక గద్యకావ్యం .ధాయ్ దేశ రాజకుమారుని ప్రేమ ,పర్యవసానంగా మరణం లలిత శైలిలో వర్ణింపబడింది .సముత్థఖేత్ అంటే సముద్ర ఘోష .ఇది ఒక ధర్మ వీరుని గాథ.సంస్కృత ఛందో వృత్త రీతి లో రాయబడింది .బౌద్ధ జాతక కథలలోని ‘’అన్నప జాతక గాథ’’దీనికి ఆధారం .ధాయ్ రాజు నారయ్ ఆస్థానకవి దీన్ని రచించినట్లు భావిస్తారు .అసంపూర్ణ రచన .19శతాబ్ది కవి దీన్ని పూర్తి చేశాడు .శబ్దాలంకారాల సౌందర్యం ఎక్కువ .మహా చాత్ ఖందేట్ అనేది ధాయ్ మహాజాతి గురించి వివరించే రచన .ఆ దేశ సాహిత్యం లో దీనికి విశిష్ట స్థానం ఉన్నది .’’వెన్సంతర జాతకం ‘’లో ఉన్న గౌతమబుద్ధుని పూర్వ జన్మ చరిత్ర కథా వస్తువు .13కాండల కావ్యం .చాలామంది కవులు అనేక కాలాలవారు ఈ రచనలో భాగస్వాములయ్యారు .ఒక్కొక్కరు రాసిన దానిలో అత్యుత్తమ భాగాలను ఎంపిక చేసి తయారు చేయబడింది .ఇది వృత్త గ్రంది అనే పద్యకావ్యం .తరతమ భేదాలు లేకుండా ధాయ్ ప్రజలు దీన్ని ఆరాధించారు .ఇందులోని కథలు -చిత్రాలు గీయటానికి చిత్రకారులకు గొప్ప విషయాలయ్యాయి .
ఖన్ చంగ్,ఖాన్ ఫేన్ అనే ఇద్దరు యువకులు వాన్ థాంగ్ అనే యువతిని ప్రేమించిన కథ కల మహా కావ్యమే ‘’ఖన్ చంగ్ ఖన్ ఫేన్’’.వాన్ చాంగ్ విషాద గాథను కరుణ రసస్పోరకంగా రాయబడింది. తాళగతికి బాగా కుదిరి ఇద్దరు చెరొక పదం పాడటానికిఅనువుగా ఉంటుంది .జావా దేశ వీరుడు ఫంజి గురించి వ్యాప్తిలో ఉన్న కథను తీసుకొని రాయబదిందే ‘’ఇవాన్’’.అయోధ్యరాజకుమారికి చెలికత్తేలిద్దరు ఇలాంటి రెండుకథలు చెప్పి,గ్రంథస్తం చేశారని ప్రతీతి .ఇందులో ఒకటి ఖిలంకాగా రెండవదాన్ని 1809-24కాలం లో పాలించిన ధాయ్ రాజు రెండవ రామరాజు నాటకానికి అనుగుణంగా మార్చి రాసిన దే ఇప్పటి ఇవాన్ అని నమ్మకం .
ధాయ్ ప్రభువు వజ్ర వ్యూఢ(1910-25)రాసినదే ‘’హ్వా చాయ్ నాక్ రోవ్ ‘’అనే నాటక౦ .వీరాత్మ అని దీని అర్ధం .ఆ రాజు బహు భాషా కోవిదుడు . ఫ్రెంచ్, ఇంగ్లీష్ నాటకాలను అనుసరించి చాలా ధాయ్ నాటకాలు రాశాడు .వీటిలో పైనాటకమే ఉత్తమోత్తమం .దేశం కోసం సర్వస్వాన్నీ ఒడ్డిన ఒక వీరుని ఊహా చిత్ర మైన రచన మధుర మనోహరంగా సాగుతుంది .
చూలాలం కర్ణ (1868-1910) అనే రాజు రచించిన’’ ప్రరాజవిధి సిప్సంగ్ ద్వాన్(రాజాస్థాన విధి )ఏడాది పొడవునా రాజాస్థానం లో జరిగే ఉత్సవకార్యక్రమాల వివరణ .గ్రంథకర్త అకాలమరణం వలన అసమగ్రంగా ఉంది .సామాన్యులకుకూడా తేలిగ అర్ధమయేట్లు రాజు రాయటం హర్షించదగిన విషయం .ఈ రచనలతోపాటు ఫ్ర అభయమణి,స్వస్తి రక్షా ,రామకియన్ కూడా చెప్పుకోదగినవే .సుందరన్ భూ అనే కవి రచించినదే ఫ్ర అభయమణి.ప్రేమ,సాహాసం ,కుటిలతంత్రం లతో రాయబడిన కల్పిత కథ.సుందరాన్ భూ రాసిందే స్వస్తి రక్షా .మానవ శ్రేయస్సుకోసం అవలంబించాల్సిన నీతి విధానాలను బోధించే లఘు కావ్యం .ఇద్దరు రాజులకు ధర్మోప దేశం చేయటానికి రాసింది .
రామకియన్ అనేది ధాయ్ భాషలో రామాయణం .వాల్మీకానికి దీనికి పోలిక చాలా తక్కువ .తమిళ ,కాశ్మీరీ ,బెంగాలీ ,మలయ్,జాపనీస్ భాషలరామాయణాలతో పోలికలు ఎక్కువ . ఆధునిక కాలం లో అక్కడి సాహిత్యం రాజులవలన విస్తృతంగా అభి వృద్ధి చెందింది .విజ్ఞానశాస్త్ర రచనకూడా జోరుగా వచ్చింది .ప్రపంచ సాహిత్యం లోని ఉత్తమరచనలన్నీ ధాయ్ భాషలోకి అనువాదం అయ్యాయి .
అయుద్ధాయ (అనిరుద్ధ )కాలం లో -1653-1688 ఫ్రా మహారాజ కృ,ప్రిన్స్ తమ్మత్తిబేట్ శ్రీపత్ లు ‘’అనిరుద్ధ ఖం చాన్ అంటే అనిరుద్ధ చరిత్రం కావ్యం అనే అత్యుత్తమ రచనచేశారు .
ఆధునిక కాలం లో కుక్రిత్ ప్రమోజ్ ,కులాప్ సాయ్ ప్రదీప్ ,సువిర్తీయ శ్రీ సింగ్ ,చార్ట్ కొర్ బిజిటి,ప్రబ్దా యూన్ , పిచ్చయ సుద్బందా లు లైట్ ఫిక్షన్ రాయగా అవన్నీ ఆంగ్ల అనువాదం పొందాయి .20వ శతాబ్దిలో కూడా మహాగొప్పరచయితలున్నారు .’’బాంగ్ కాక్ రైటర్స్ గ్రూప్’’ భారతీయ రచయిత జి. వై .గోపీనాథ్ రాసిన ఫిక్షన్ ను ప్రింట్ చేసింది .ధాయ్ సాహిత్యం బర్మా ,కంబోడియా సాహిత్యాలపై బాగా ప్రభావం చూపింది .ఖ్మేర్ సాహిత్యం పై పెద్దప్రభావం ఉంది .ఆదేశ కథలన్నీ ఖ్మెర్ లోకి అనువాదం పొందాయి .కంబోడియా రామాయణం ధాయ్ రామాయణానికి మక్కీకి మక్కీ యే.
సశేషం
రేపు 30-1-20 గురువారం సరసవతీ దేవి జన్మదినం శ్రీ పంచమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-20-ఉయ్యూరు

