మహా భక్త శిఖామణులు
26-భూత దయాళు తూమాటి రామ భొట్లు
19వ శతాబ్దం లో గుంటూరు జిల్లా మద్దిరాల పాడు కమ్మవారి కులం లో జన్మించిన తూమాటి రామ భొట్లు తండ్రి నరసింహ చౌదరి తల్లి చిలకమా౦బ .భార్య పేరమ్మ .గురువు అద్దంకి తాతాచార్యులు .ఒకరోజు గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి జీవితం తరించే ఉపాయం చెప్పమని కోరితే రామ తారక మంత్రం ఉపదేశించి దీక్షగా జపించమని ‘’నేను మీ వంశానికి గురు పీఠాదిపతిని .నీకు తారకం ఇచ్చి గురువు కూడా అయ్యాను .గురు దక్షిణ ఏమిస్తావు ?’’అని అడుగగా ‘’నా సర్వస్వం మీకు సమర్పించి మీ ఉచ్చిష్టం మాత్రమే తిని జీవిస్తాను ‘’అని సభక్తికంగా అంటే గురువు సంతోషించి ‘’నాకు అదేమీ వద్దు నిత్యం భూత దయతో ప్రవర్తించు చాలు ‘’అని హితవు చెప్పగా అలాగే ప్రవర్తిస్తానని ప్రమాణం చేశాడు రాం భొట్లు.
తక్కెళ్ళ పాడు చేరిన రామ భొట్లు ను చూసి సంతోషించి మర్నాడు ఉదయం కొడుకును పిల్చి’’నాకు వయసు మీద పడు తోంది .నా చదలవాడ గ్రామాదికార పదవి తీసుకొని నాకు విశ్రాంతి ఇవ్వు ‘’అని కోరగా సరే అని ,పూజాద్రవ్యాలతో ఆ ఊరిలోని శ్రీసీతారామాలాయానికి వెళ్లి స్వామిని అర్చించి, తీర్ధ ప్రసాదాలు తీసుకొని శివాలయానికీ వెళ్లి పార్వతీ పరమేశ్వరారాధన చేసి ఇంటికి చేరి ఒక నిర్జన ప్రాంతం లో ఒక వస్త్రం పరచి దానిపై పక్షులకు ఆహారంగా వారి బియ్యం పోసి ,దాని చుట్టూ నీటి పాత్రలు పెట్టి ,దానికి కాపలా మనిషిని ఏర్పాటు చేసి రోజూ అలా చేశాడు .ఊర్లో అన్నం లేని బీద జనాలకు అన్నవస్త్రాలు ఇస్తూ భాగవత కాలక్షేపం చేస్తూ కాలం గడుపుతూ గొప్ప కీర్తి పొందాడు .
శిధిల మైన చదలవాడ శివాలయం ప్రహరీ ధ్వజ స్తంభ ప్రతిష్టలు చేశాడు .చదలవాడ –పోతవరం దారిలో మద్దిరాలపాడు లో రెండు మంచి నీటి చెరువులను త్రవ్వించి ,తర్వాత పానకాల చెరువు ,రావలగుంట ,చిత్రచిత్ర గుంట,రామన చెరవు లింగాయ చెరువు అర్వగుంట చెరువులను బాగు చేయించి ఉపయోగం లోకి తెచ్చాడు .యాత్రికులకు కులమత విచక్షణ లేకుండా భోజన వసతి సౌకర్యాలు కల్పించాడు..చీర్వాన్ ఉప్పలపాటి నివాసి కుమ్మర వెంకటాద్రి మద్దిరాల గుడ్డి వీరడు అనే ఇద్దరు దొంగలు చౌదరిగారింట్లో సొత్తు దొంగిలించే ప్లాన్ వేశారు .చౌదరి గారి పెంకుటింటి కి పెంకు నేయిస్తుండగా ఈ దొంగలు కూలీలుగా పని చేస్తూ ,సాయంకాలం మండువాలో దాగి ,అర్ధరాత్రి అందరు నిద్రించే సమయంలో లోపలి ధనాగారం లోని నగా నట్రా దొంగిలించి ,ఎలాబయటపడాలో దారి తెలీక వెన్ను గాడి పై చేరగా ‘’గజ సింహ గమనుల ఖడ్గ తూణీ ధనుర్ధారుల శార్దూల విక్రమముల రాజ సింహుల –గుణరూప చేష్టితంబుల పరస్పర సమానుల ,చారు చంద్ర ముఖుల ,రమణీయ మూర్తుల గమల పత్ర విశాల నయనుల సురభవ నంబు విడిచి –దరణికి వచ్చిన సురలకైవడి గ్రాలు వారి వీరుల భంగి వరలు వారి –రాజ భానులక్రియ దివ్య తేజము నహ –ర్నికాయ ము వెలిగి౦చు చున్నవారి –గ్రమతర కాక పక్ష ముల్ గలుగు వారి –మహిత కీర్తుల రామ లక్ష్మణుల జూచి ‘’ చౌదరి గారి సేవకులే వచ్చారేమో నని భావించి భయపడి వారి చేతుల్లో చావు తప్పదని నిర్ణయించుకొని ఇక జన్మలో దొంగతనం చేయమని శపథం చేసి కిందకి దిగి తప్పించుకొనే ప్రయత్నం చేస్తే అక్కడా ఇద్దరు మహా వీరులు కాపలా కాస్తూ ఉండటం చూసి ,ఇంటి సేవకులు దొంగలు దొంగలు అని కేకవేస్తే పట్టు బడ్డారు .చౌదరిగారు వారిద్దర్నీ ఏమీ అనకుండాఇచ్చి రెండు రోజులకు సరిపడా గ్రాసం ఇచ్చి సత్కరించి పంపించారు .దొంగలకు రామ లక్ష్మణులు కనిపించటం అబ్బురంగా భావింఛి రామునితో ‘’ఎందరో ఇంద్రజాలకుల్ని చూశాను .కానీ నీలాంటి వారిని చూడలేదు –‘’గారడీ పెద్ద వీవు రాఘవా ‘’అని స్తుతించారు .వీరడి కూతురు మద్దిరాలలో ఇప్పటికీ ఉంది .వెంకటాద్రి భొట్లు గారు చనిపోయాక ఊరు వదిలి వెళ్లి పోయాడు
గురువుగారికిచ్చిన మాట ప్రకారం భూత దయ పాటిస్తూ తూమాటి రామ భొట్లు చౌదరిగారు సార్ధక జీవితం గడిపి 70వ ఏట శ్రీరామ సన్నిధి చేరారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-21-ఉయ్యూరు .

