అవధూత నిట్టల ప్రకాశం గారు -2(చివరిభాగం )
‘’నిట్టల ప్రకాశంగారు భజన కత్తుగా పాడుకోదగిన వారే కానీ అంతకు మించిన పాటకులు కారు ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు .ఆయన భామ వేషం కట్టేవారనీ ,దానిలోనుంచి వచ్చిన పదకవితలే ఇవి అని చెప్పగా విన్నారట .ఆ వేషానికీ ఆకవిత్వానికి సంబంధం ఉండదు .పూర్వ జన్మ లో ఏదో పుణ్యం చేసి ,దానివలన ఏదో కళ అబ్బి ,ఆ కల్మషాన్ని అల్లరి చిల్లర నడకలద్వారా ,ఈవిధంగా ,వరప్రసాదిగా జన్మించారని ఊహించుకోవచ్చు అన్నారు చెళ్ళపిళ్ళ.నూట నాట గాయకులలో ఆయన పేరులేకపోవటం న్యాయమే అంటారు .కొద్దిగా ఛందస్సు తెలిస్తే తేలిగ్గా కట్టెయ్యవచ్చు .జన్మతః కవులే అయినా ప్రకాశం గారు వాజ్మాదుర్యం ఉన్నవారుకనుక భజన లలొఆయన కీర్తనలు ప్రసిద్ధి చెందాయి .శబ్ద ,అన్వయ కాఠిన్యం వీరిలో లేదు ,రేగుప్తిరాగం లో ఆట తాళం లో వారి మరోకీర్తన –
‘’సీతా మనోహర రారా –సేవకుడ నను బ్రోవ వేరా ‘’
అనుపల్లవి –రాతి నాతిని జేసే నీ పద రాజమటంచును
ఖ్యాతిగా విని , ప్రీతితో నిను నమ్మితిని
నాపాతకము లెడబాపుమిక –దేవా దేవా దివ్యప్రభావ దిక్కు నీవే గావ
అని చెప్పి మిగిలిన చరణాలు గుర్తులో లేవన్నారు శాస్త్రీజీ .పదకవిత్వం లో ఒక చరణం తెలిస్తే ,మిగిలిన చరణాలన్నీ తాడు దబ్బనం తో గుచ్చినట్లు అదే రీతిలో నడుస్తాయన్నారు .తానూ చామర్లకోటలో చదువుకొనే సమయానికి ప్రకాశం గారు జీవించే ఉన్నారట .కాకినాడ జగన్నాధపురం దేవాలయం గోపురం వద్ద మకాం గా ఉండేవారట .వార్ధక్యం పెరిగినా తానూ ఫలానా రోజున ,ఫలానా ఘడియలో చనిపోతానని చెప్పారట .అదే ప్రకారం సిద్ధిపొందారట .చామర్ల కోటనుంచి అప్పటి తమనివాసమైన యానాం వెడుతూ,ప్రకాశం గారి సద్గతికి సంబంధించిన సంగతులన్నీ చూసినట్లేజ్ఞాపకం ఉందన్నారు వెంకట శాస్త్రిజీ .జగన్నాధపురం పడమటిదిక్కులో నిట్టల వారి సమాధి ఉందట .అక్కడా భజనాదికాలు జరుగుతూ ఉండచ్చు అన్నారు.
నిట్టల వారి చివరి రోజులలో వచ్చిన భక్తుడే యడ్ల రామదాసు .సత్ శూద్ర కులస్తుడు ఆజానుబాహువు .గొప్ప తేజశ్శాలి డబ్బపండు వంటి శరీర ఛాయ .కవిత్వం ప్రకాశం గారి కవిత్వం లాగానే ఉంటుంది .
ప్రకాశం గారి తత్వాలు కొన్ని -1-గూటి చిలకేదిరా అన్నా 2-గాలిపటమురా జీవా గాలి నిలిచినంతనే కూలిపోవురా జీవా
ఈయన తత్వాలు కొన్ని సంకీర్తనాత్మకంగా ,కొన్ని భక్తకవి మనో ధర్మాన్ని ప్రకటించేవిగా ఉంటాయి
3-శంకరాభరణం ఆది తాళం లో –
‘’నారాయణ నీ నామము నిరతమునమ్మి స్మరియి౦చుట నా వంతు – ఘోరదురితములు పారద్రోలి నను గారవి౦చుటది నీ వంతు ‘’
4-ఎరుకల కాంభోజి లో –
రాములవారిమాట నవ –రత్నములుంచిన మూట –జయ రాములవారిమాట మాకు –దోసెడు వరహాల మూట
ఇవి రామదాసు కీర్తనల ధోరణిలో సాగాయి
4-ఆనంద భైరవి లో తన మనో భావాన్ని ప్రకటిస్తూ –
‘’దైవ సహాయ్యమెన్నటికో నా –చిత్తము హరిపై చేర్చే దెన్నటికో
ఉత్తములతో పొత్తేన్నటికో వర –విత్తముపై భ్రమ విడిచే దెన్నటికో
ఆశను రోసే దెన్నటికో భవ –పాశములను కోసి వేసే దెన్నటికో
దాసుల గూడే దెన్నటికో,నిష్ఠల ప్ర –కాశూడానని గంతు వేసే దెన్నటికో ‘’
ప్రకాశం గారు కాకినాడచుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తోందనీ ,ఆయన చివరి తత్త్వం పిఠాపురం వాస్తవ్యురాలుఅప్పటికే 90ఏళ్లనట్టువరాలు పెండ్యాల సత్యభామ ద్వారా ,ఆమె అమ్మమ్మగారు స్వయంగా ప్రకాశంగారి దగ్గర నేర్చుకొన్న ది తమకు అందింది అని వెంకట శాస్త్రి గారువాచ .
ఆధారం –29-12-1948 ఆంధ్రపత్రిక వారపత్రికలో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు రాసిన వ్యాసం.నిట్టల వారినీ యడ్ల రామదాసుగారినీ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు తమ ‘’ఆంద్ర వాగ్గేయకారుల చరిత్ర ‘’లో చేర్చారు .

