చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు -2(చివరి భాగం )

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు -2(చివరి భాగం )
లక్ష్మీ నారాయణ రెడ్డి ధూర్జటి రచనలలో సమకాలీనతను పసిబిడ్డలస్నానం ,బాలింతతాంబూల సేవనం మొదలైన వాటిలో దర్శించి –‘’తలబంకించిన నూనె- పుక్కిట సదా తామ్బూలమున్ ,నేత్ర క –జ్జలమున్ గంధరకట్టుకొన్న వసపూవుల్ గబ్బి పాలుబ్బు –‘’అంటూ ధూర్జటి దృష్టి ‘’ఎప్పుడూ అక్కడే ఉండే’’ విషయం కూడా గుర్తు చేశారు .బిడ్డ పుట్టాక వాడికి దంతాలువచ్చేదాకా సంయోగం నిషేధం .అలాగే దిష్టి అనే దృష్టి దోషం అప్పటినుంచి వెంటబడుతూనే ఉంది .పంటలకు దిష్టి తగలకుండా ధూర్జటి దిష్టి కుండలు పెట్టించాడు . ఎలిజబెత్ ‘’రఘునాధ రాయలు ‘’పై సమగ్రంగా రాస్తూఆయన కున్న లక్ష్మీ విలాస ,రామ సౌద సభాభవనాలగురించి చెప్పి ,అతడు చాలా రచనలు చేసినట్లు తెలుస్తోందని ,కృష్ణాధ్వరి, వెంకట ముఖి ,దీక్షితుడు,క్షేత్రయ్య చౌడప్ప వంటి కవి రాజ పోషకుడని ,అతని సంగీత సుధ ఆయన సంగీత నిధి అని తెలుపుతోంది ,జయన్తసేన ,రామానంద రాగ సృష్టికర్త మాత్రమేకాక ‘రఘనాథమేళ ను కూడా సృష్టించిన సృజనశీలి .దక్షిణాంధ్ర స్వర్ణ యుగ సృష్టికర్త .అతనికొలువు లో’’ శారదా ధ్వజం ‘’నిరంతరం ఎగురు తు౦దనిచెప్పటం మర్చిపోయినట్లున్నారు .శ్రీ చంద్రావళి త్యాగయ్య కీర్తనల భక్తి తత్పరత లో ‘’నీ పద చి౦తనమే జీవనము ‘,నిష్కామ శ్రవణ స్మరణ విశిష్టత ,నవ విధ భక్తులు ఆయన కీర్తనల ద్వారా వివరించారు .’’దుడుకుగల నిన్నే ‘’లో తనలోని దుర్గుణాలగురించి చింతించి ,’జగదానంద కారక ‘’లో శ్రీరాముని అష్టోత్తర శతనామావళి ని అర్చన రూప కృతిగా రచించి ముక్తికి భక్తి అత్యన్తముఖ్యమని చాటి చెప్పాడు .సనత్కుమార్ విశ్వనాథ లఘు కావ్యాలను వివరిస్తూ ఆయనలోని కవి నిత్యజాగారితుడు,భ్రష్టయోగి అని కీర్తించారు.
కిట్టన్న సినారె గేయకావ్యాలపై సమాలోచనం చేసి ,ఆయన విశ్వ గీతి విశిష్టత చెప్పి కర్పూర వసంతరాయలులో నాటకోచిత సంభాషణలతో రక్తికట్టిన్చారని ,లకుమలోని సహృదయత సౌన్దర్యానికిసరి సాటి అన్నారు .రాజేశ్వరి కర్నాటక తెలుగు సాహిత్య కృషినితవ్వి తలకెత్తారు .కర్నాటక తెలుగు సాహిత్య విభజన చేసి ,చిన్నయసూరికి వీరేశలింగం గారికి మంచి స్నేహం ఉండేదని ,నంజన గూడు ,పాతవల్లి కవులు ప్రసిద్ధులని ,బళ్ళారి తెలుగు పంట ను వర్ణించి ,గుత్తి చంద్ర శేఖరరెడ్డి ముకుందరామారావు గారి ‘వలసపోయిన మందహాసం ‘ను కన్నడీకరించారని చెప్పారు ఆయనను ‘’గుత్తి జోలద రాసి చంద్ర శేఖర రెడ్డి ‘’అనే ఆయనకిష్టమైన పేరు చెప్పటం మరచినట్లున్నారు .నాకు మంచి మిత్రులుకూడా వారు .చిలకల సుబ్బారెడ్డి వేమన కాల నిర్ణయం చేశారని ,వేటూరి ఆనందమూర్తి ,తుమ్మపూడి కోటేశ్వరరావు లబ్దా ప్రతిష్టులు .ప్రాచార్య రాళ్ళపల్లి సుందరం తమ తల్లి పేర నెలకొల్పిన ‘సౌశీల్య’’పురస్కారం బెజవాడలో రజనీ కాంతారావు గారికి అందించారని మనం మర్చిపోయిన విషయం గుర్తు చేశారు .బెంగళూరు యూని వర్సిటి తెలుగు శాఖాధ్యక్షులు త౦గరా సుబ్బారావు గారు ‘’తెలుగు వీరగాథా కవిత్వం ‘బృహద్గంథ రచయిత .శ్రీరస స్థాపించి తెలుగు సాహిత్య రసాన్ని బహు సంపన్నంగా ప్రవహిమ్పజేశారు .కర్నాటక తెలుగింటి ఆడపడుచులు అత్తిమబ్బే బెలగరే జానకమ్మ తిరుమల రాజమ్మ ,దివాకర్ల రాజేశ్వరీ ,భార్గవీరావు సేవ నిరుపమానం .తెలుగు దినపత్రికల కార్యాలయాలు కర్నాటక లో ఉండి మంచి సేవ చేస్తున్నాయి .బెంగుళూరు ఆకాశవాణి ,స్నేహభారతి లలో తెలుగు సాహిత్యం అగ్రస్థాయిలో ఉందని తెలియజేశారు .2012లో మేము బెగులూరు మా అబ్బాయి శర్మ ఇన్తికివెల్లిఅనప్పుదు మైనేని గారు ఆయన ఫోన్ నంబర్ ఇస్తే మాట్లాడాను ఎంతో సహృదయత చూపారు .ఆతర్వాత వారిపుస్తాలు నాకు పంపితే మన పుస్తాకాలు వారికి పంపాను
ఉత్కళ దేశం లో ఉంటూ తెలుగు సాహిత్యాన్ని మూడు పూలు ఆరు కాయలుగా వికసి౦ప జేసిన తుర్లపాటి రాజేశ్వరి గారు ‘పలుకు తల్లికి పుట్టినిల్లు బరంపురం లో జయంతి కామేశ్వర రావు తెలుగు సాహితీ సౌరభాలు వ్యాపింపజేశారని ,దేశిరాజు వెంకటక్రిష్ణారావు తొలి తెలుగు అపరాధ పరిశోధక నవలా రచయిత అనీ .మామడమ్మ సుభద్ర ఆధ్యాత్మిక రామాయణం ద్విపద కావ్యంగా రాసిందనీ ,సాహిత్య సామ్రాట్ విక్రమ దేవ వర్మ ,మంత్రి ప్రగడ సూర్య ప్రకాశ కవి ఎనలేని సాహితీసేవ చేశారనీ ,గిడుగు సీతాపతి ,భట్టిప్రోలు కృష్ణమూర్తి సేవ ప్రస్తుతించారు ,తుర్లపాటి రాజ రాజేశ్వరి వివిధ ప్రక్రియలలో డజనున్నర పుస్తకాలు రాశారు. ‘’ఒరిస్సాలో తెలుగు వారి మూలాలు’’ గ్రంథం ఆమె బహుముఖీన ప్రతిభకు నిదర్శనం మాగ్నం ఓపస్ .ఉపద్రష్ట అనూరాధ ,విజయ చంద్ర ,సింగి శెట్టి అనంద రావు పట్నాయక్ అన్ని ప్రక్రియలలో రాస్తూ తెలుగును పోషిస్తున్నారు అని ‘’ఉత్కలాంధ్ర సాహిత్యం ‘’లో వివరించారు .
అమరేంద్ర ఢిల్లీ సాహిత్యాన్నిస్తాలీ పులాకంగా స్పృశించారు .ముఖ్యంగా అక్కడ జరిగిన తెలుగు సభలు సమావేశాలపైన బాగా రాశారు .ఉప్పలధడియం వెంకటేశ్వర ‘’చెన్నై లో పాతి కేళ్ళ తెలుగు ప్రస్థానం ‘’లో 19శతాబ్ది నుంచి ఇక్కడ తెలుగు పండితకవులకు నిలయం .ఆలూరి అప్పకవితంజావూర్ తులజెంద్రుని ఆస్థానం లో ఉంటూ ‘’పార్ధ సారధి విజయం ‘యక్షగానం రాసి మద్రాస్ లోని పార్ధ సారధి స్వామికి అంకితమిచ్చాడు .పానకాల రాయకవి పార్ధ సారధి శతకం ,మతుకుమిల్లి నరసింహ శాస్త్రి చెన్నపురీ విలాసం రాశారు.ఆతర్వాత చిన్నయసూరి ఆరుద్రశ్రీశ్రీ పఠాభి కృష్ణ శాస్త్రి ,పిలకా మొదలైన తెలుగు సత్కవులంతా అక్కడి నుంచే కవితా పరిమళాలు వ్యాపింపజేశారు .కొక్కొండ ,రావూరి దొరస్వామి ,అష్టభాషా ప్రవీణ పిబి శ్రీనివాస్ ,అవధాని పప్పు వారు సాహిత్యాన్ని డోలికలలో ఊపారు.పాతికేళ్లలో కావ్యాలు తక్కువే వచ్చాయి .చెన్నైలో సభలు బాగానే జరుగుతాయికాని ‘’సభలకేమి కొరత సభ్యులకేగాని ‘’అని బాధ పడ్డారు .పళని వేలు సూరి సారస్వత సేవ లో తరించారు అత్య౦త విస్తృతంగా రాసి .సిమ్మన్న గారు ‘’గిడుగు భాషా సేవ ‘కు నీరాజనాలెత్తారు .’చిలుకూరి నారాయణ రావు సాహితీ వరివస్య ‘’ జీస్ మోహన్ చక్కగా వివరించారు .రాళ్ళపల్లి వారి గురించి ‘’రాళ్ళపల్లి లోన రాళ్ళేన్ని పుట్టెనో-రాళ్ళ లోపల వజ్జరాలు పుట్టే –వజ్జరాలలోన వలపెట్లు పుట్టెరా –కీర్త నీయచరిత కృష్ణ శర్మ ‘’అని ఆచార్యులవారిబహుముఖీన ప్రతిభకు దర్పణం పట్టారు .అనంతపురం బుక్కరాయ సముద్రం చెరువుకు సంబంధించిన ..ముసలమ్మ’’పదం చిలుకూరి వారి అపూర్వ సృష్టి .గురజాడ పూర్ణమ్మను పోలి ఉన్న విషాద గీతం .’’ఓరిమి ,పరిశ్రమ పేరిమి-ప్తతిభా వ్యుత్పత్తుల నేరిమి కలిసి చిలుకూరి నారాయణ రావు ‘’అన్న మధునాపంతుల వారి మాటలు అక్షర సత్యాలు .
అనంత పద్మనాభరావు గారు కుందూరి ఈశ్వరదత్తు లోని చారిత్రిక పరిశోధకుడిని ఆవిష్కరించారు .ఆయన రాసిన ‘’శాసన శబ్ద కోసం ‘’అనర్ఘ మణిరత్నం .జీర్ణ విజయనగర చరిత్ర బహు ప్రామాణిక గ్రంథం . తిరుమలవారి పుత్రికలు నీరజ ,ఆముక్తమాల్యద తమ తండ్రి రామ చంద్రగారి వాజ్మయ తపస్సును ఆయన శైలిలోనే కమ్మగా ఆవిష్కరించారు .జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారిపై చలపాక వ్యాసం వివరణాత్మకంగా ఉంది ‘’నేను చనిపోతే జాతీయ పతాకాన్ని కప్పి స్మశానానికి తీసుకు వెళ్ళండి ‘అని ఆయన చెప్పిన మాట కలకాలం గుర్తు ఉంటుది .తెలుగు పత్రికార౦గ సమీక్షలో సునీత ‘’ఫోర్ట్ సెంట్ జార్జి గెజెట్ ప్రకటనల పత్రికే .తెలుగు పత్రికకాదు.1883లో వృత్తాంత్రి ,తో తెలుగు పత్రిక ఆవిర్భావం జరిగింది .పువ్వాడ వెంకటరావు వర్తమాన తరంగిణి వచ్చింది .చిల్లర భవానీదేవిగారు ‘’తెలుగు రచనలకు హిందీ అనువాదాలు ‘’అనే వ్యాసం లో పోతనగారి భాగవతం లోని నాలుగు అంశాలను ‘’భాగావత పరిమళ ‘’గా పి.ఆదెశ్వర రావు అనువదించారని ,త్యాగరాజకీర్తనలను ఇలపావులూరి వారు అన్నమయ్య పదాలను సి .హెచ్ రాములు ,సుమతీ శతకపద్యాలను సుంకర చెంగయ్య దోహాలుగా ,,మధునాపంతులవారి ఆంద్ర పురాణాన్ని చేబోలు శేషగిరిరావు ,కుందుర్తి కవితలను నిర్మలానంద వగైరా ,ఆరుద్ర సినీ వాలీని బాదరవాడ నరెంద్రవర్మ శ్రీ శ్రీ మహాప్రస్థానం ను గుర్రం సుబ్బారావు ,బాపిరాజు నారాయణరావు ని ఆరికపూడి రమేష్, భరద్వాజ కౌముదిని బాలశౌరి రెడ్డి మొదలైన వారుఏయే పేర్లతో అనువదిన్చారో విస్తృత పట్టిక లో తెలిపారు .జానపద సాహిత్యం ఎందుకు చావాలి అని దామోదర్ రా స్తూ వివిధ కోణాలలో పరిశోధించాలన్నారు .నీలిమ ‘’కూచిపూడి నాట్యకళ ‘’పై అరంగేట్రం చేసి సమసమాజ పోకడలను గమనించి ,ప్రోత్సాహిక అంశాలతో ముందుకు సాగితేనే కూచిపూడి కళ మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లు తుంది అని హితవు చెప్పారు .నాటక రంగం ‘’అజరామారం ‘’అన్నారు మునిరత్నం తనకున్న విశేష ప్రజ్ఞా పాటవాలతో .ఎవరినా అందుంకు నడుం బిగించి పోషిస్తే నాటక కళ చిగురిస్తుందని ఆశాభావం వ్యక్త పరచారు .ఆంద్ర సాహిత్య పరిషత్ లో మణిబాబు విద్వాన్ పీసపాటి విశ్వేశ్వర శాస్త్రి రజతోత్సవ సందర్భంగా చేసిన ‘’శ్రీ జయంతి కులాబ్ధి శీతభానుడు ‘’పద్యం గుర్తు చేసి సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణం ,శ్రీపాద ,కాశీ భట్ట బ్రహ్మయ్య బండారు తమ్మయ్య ,దంటు భాస్కరరావు గార్ల అశేష విశేష సాహితీ సేవలను మన కళ్ళముందుంచారు .దాని పునర్వైభవానికి ,సృజనకు ప్రచారం అవసరం అన్న సత్యం ఎరుకపరచారు .
ఇలా విస్తృత కేన్వాస్ పై తెలుగు సాహిత్యాన్ని దిగ్మాత్రంగా పరిచయం చేసి మన ముందుంచారు చెన్నై జనని లో .అందరినీ పేరుపేరునా అభినదిస్తూ ,ఇంతటి ఉత్కృష్ట గ్రంధాన్ని ప్రచురించే సాహసం చేసి కృతకృత్యులైన గుడిమెట్ల చెన్నయ్యగారిని మరీ మరీ ప్రశంసిస్తూ ,ఆశవత్దామ సంగీతంగా పరమ రామణీయకంగా ఆస్వాదనీయంగా ఉందని తెలియజేస్తున్నాను .ఇలాంటి రచన పై నన్ను అభిప్రాయం రాయమని కోరిన చెన్నయ్యగారి సహృదయత.నాకు దక్కిన విశిష్ట గౌరవం అంటూ నమోవాకాలర్పిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

1 Response to చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు -2(చివరి భాగం )

  1. gdurgaprasad's avatar gdurgaprasad says:

    ధన్యుడనైతినయ్యా.ఇంతటి సుదీర్ఘమైన మీ అభిప్రాయము చదివిన పిదప ఇది కలయా నిజమా అనిపించింది. ఏమా అంకితభావము! ఏమా సహనము.ఏమా పాండితీ ప్రకర్ష.అభిప్రాయమడిగినంతమాత్రాన ఒక్కొక్క వ్యాసాన్ని విశ్లేషిస్తూనే మరెన్నో అదనపు సమాచారాన్నీ అందించారు మీరు.ఏదో అడిగారు కదా నాలుగు మాటలు రాస్తే పోలే అని ప్రవర్తించే ఈ రోజుల్లో వయోభారాన్ని కూడా లెక్క చేయక యింతటి చక్కటి ఆణిముత్యాలందించిన మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో బోధపడటం లేదు
    25 ఏండ్లు మేము పడిన శ్రమంతా మరచి పోయాము.
    మిమ్ముల కళ్ళార చూచిన నేను నా కనులు మూసేంతవరకు మరువను,మరువబోను.మాలాంటి వాళ్ళకొరకై మీరు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తూ నమస్కారములతో సెలవు తీసుకొను, మీ అభిమాన పాత్రుడు –
    గుడిమెట్ల చెన్నయ్య,ప్రధాన కార్యదర్శి,జనని.చెన్నై,తమిళనాడు.జైతెలుగు తల్లి!!!!!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.