ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-3
‘’కొప్పరపు కొప్పరమ్మిది’’అనే కొప్పరపుకవుల వ్యాసంలో ‘’వేగంగా చందోసహితపద్యాన్ని చెప్పేవాడు పద్యకర్తవుతాడు కానీ తనకు కావలసిన భావానికి అనువుగా పదాలనుఎంచుకొని పద్యం చెప్పేవాడు కవి అవుతాడు ‘’అన్న శ్రీ శ్రీని కోట్ చేసి ,సోదరకవులన్న ప్రఖ్యాతి పొందినవారు కొప్పరపు కవులే అనీ ,22ఏళ్ళపాటు అవధాన దిగ్విజయ యాత్ర చేసి ,ప్రసిద్ధ నగరాలలో ,పల్లెల్లో రాజాస్థానాలలో అవధాన సరస్వతిని ఊరేగించిన మహానుభావులని ,అన్నగారు వెంకట సుబ్బారాయ శర్మ ఎనిమిదవ ఏటనే ‘’హనుమత్ కవచ రూప నక్షత్ర మాల ‘’గా27పద్యాలు చెప్పి పండితలోకాన్ని ఆశ్చర్యపరిచారని ,నరసరావు పేట లో తండ్రితో పంచదారకోసం దుకాణానికి వెడితే యజమాని అడిగితె పదేళ్ళ వయసులో ఆశువుగా అక్కడే ఒకశతకంచెప్పారనీ ,ఒకే రోజు రెండు శతావధానాలు నిర్వహించిన ఘనత ఈ జంటకవులదనీ మద్రాస్ లో అరగంటలో ‘’కనకాంగి చరిత్ర ‘’,కాకినాడ గంజాం వెంకటరత్నం గారింట్లో సీతాకల్యాణం ,పిఠాపురం రాజావారి కళాశాలలో భీష్మజ్ఞానం ,మార్టూరులో అరగంటలో 360పద్యలాతో మనుచరిత్ర ,చిలకమర్తి వారి సమక్షంలో 400పద్యాలతో శాకు౦తల కథ చెప్పి రికార్డులు సృష్టించారని చెబితే నాకు ఒకప్పుడు క్రికెట్ వీరుడు సచిన్ ,ఈనాటి విరాట్ కోహ్లీ రికార్డ్లు గుర్తుకొస్తున్నాయి .ఈ జంట ఆశుకవిత్వం ఎలాఉంటుందో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు ‘’మీ ఆశువున మేరుమీరి శబ్దశ్లేశ ,లర్ద చిత్రంబులు నతిశయిల్లు –దుష్కర ప్రాసముల్ దొడరించి ధారగా –బ్రవహించు మీ యాశుకవిత –గడియకు మూడువందలుగా గవిత్వ –మమలమతి గూర్చు శక్తి నే నరసినాడ –నది ప్రబంధంము రీతిగా నమరె భళిరే –సుగుణ నిధులార ,కొప్పర సుకవులార’’అని నిండుమనసుతో మెచ్చారని ,అసాధారణంగా పృచ్చకులమధ్య కలయ తిరుగుతూ ,వారిపేరు ,కేటాయించిన సంఖ్య,అడిగిన అంశం ,అన్నీ చెబుతూ పద్య ధారణ చేయటం అపూర్వమనీ ,క్రమం పాటిచనినిపద్ధతిలో పద్యాలు అప్పజెప్పి ,తర్వాత వరుసక్రమంలో అన్నిపద్యాలను ధారణ చేయటం అనన్యసామాన్య విషయం అది వారికే చెల్లిందనీ ,,అవధాన వేదికలపై పద్యాలలోనే మాట్లాడటం తప్ప ,వచనంలో మాట్లాడని నియమం పాటించారనీ ,అది చూస్తె సినిమాలు చూసేవారికి దేవతలు ఋషులు ఇలాగే మాట్లాడేవారేమో అన్న భావన కలుగుతుందనీ ,సమస్యాపూరణ, దత్తపది, ,వర్ణన నిర్వహణలో వీరి ధోరణి అనితరసాధ్యమనీ ,ప్రతిపద్యం రసోచితమేననీ పొంగిపోతూ చెప్పారు ఓలేటి .సంస్కృతమైనా తెలుగైనా పద్యం నల్లేరుమీద బండి లాసాగిపోయేదని ,1916కే వారి కవిత్వ ప్రదర్శన 150దాటిందనీ ఆపద్య సౌరభం కప్పుర పరిమళ భరితమనీ అన్నారు పార్వతీశం .
ఆలపాటి రవీంద్ర నాథ్ ‘’వేసినవి ‘’పాదముద్రలేకాదు పద ముద్రలు ‘’అంటూ జ్యోతి, రేరాణి పత్రికలు నిర్వహించి ‘’మిసిమి ‘’ని పసిడి మెరుగులతో తీర్చి రేపటి కాలానికి స్మరణీయ ధన్యత సంపాదించుకొన్న చిరస్మరణీయుడు అన్నారు .
‘’ఆయన కవితల్లజుడు ‘’లో కందుకూరి రామభద్రరావు గారి జీవితం రుషి తుల్యజీవితం,అయన భార్య కలిసి పల్లెల్లో రాట్నాలు వదడికిస్తూ ,గాంధీ ఇజానికి మార్గదర్శి గా నిలిచారు .లేమొగ్గ వారి తోలి రచన .ఆయనకవిత్వంలో గోదారి పరవళ్ళు తొక్కుతుంది .అక్షరాన్ని ఆత్మనివేదనగా పూజించిన మహా భక్తుడు .యాభై అరవై దశకాలలో ఆకాశవాణిలో డజన్లకొద్దీ ఆయన పాటలు ప్రసారమయ్యాయి .’’ఎంత చక్కనిదొయఈ తెలుగుతోట –ఎంతపరిమళ మోయి ఈ తోట పూలు –ఈతోట ఏపులో ని౦త నవకము విరియు ‘’అని పరవసించి రాసిన గీతం ఆ నాడు ఇంటింటా మారుమోగేది .తెలుగు సరస్వతి కంఠ సీమలో గమకాలుపలికించిన రసవీణ ఆయన అని అనితరసాధ్యమైన అభినందన తెలిపారు వోలేటి .ఈ రస హృదయుని చూసి పులకించి వేదులవారు –‘’నీ కవితా తరంగిణి జయించిన కల్పనాంధ్ర వాజ్మయ –శ్రీ కబరీ భరమ్ము కయి సేసిన కావ్య కళా కలాప సా౦-దా కుశలు౦ దావౌ కవివసంత త్వదున్నత కీర్తి సధ పున్ –వాకిట వ్రేలుబో తెలుగువారిడు మంగలతోరణాలికిన్’’ .అని మురిశారన్నారు
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.