కన్నడ సాహిత్య కాల్పనిక రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య
కన్నడ సాహిత్య కాల్పనిక రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య
ఇంగ్లీష్ లో ఎ.ఎన్.మూర్తి రావు రాసిన దానికి తెలుగు అనువాదం చేసిన శ్రీ పోరంకి దక్షిణా మూర్తి గారి పుస్తకం బి.ఎం.శ్రీ కంఠయ్య ను కేంద్ర సాహిత్య అకాడెమి 1978లో ప్రచురించింది .వెల-2-50రూపాయలు .
జీవితం
3-1-1884న కర్ణాటక రాష్ట్రం ‘’సి౦పెగి ‘’గ్రామం లో బి.ఎం.శ్రీ కంఠయ్యఅయిదుగురు సంతానం లో పెద్దవాడుగా జన్మించాడు .తల్లి భగీరధమ్మ .తండ్రి బెల్లూరు మైలారయ్య .సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబం..తండ్రి గొప్ప వకీలు .శ్రీరంగపట్టణం లో ప్రాక్టీస్ చేసేవాడు.ప్రాధమిక విద్య అక్కడే చదివి ,సెకండరి ఉన్నతవిద్యలకోసం మైసూరు వెళ్ళాడు .ఆర్ట్స్ లో ఎఫ్ ఎ పాసై ,బెంగుళూరు సెంట్రల్ కాలేజిలో చదివి 1903లో బిఎపాసయ్యాడు .పై చదువుకోసం మద్రాస్ వెళ్లి చదివి,1907లో ఎం .ఎ .పట్టా పొందాడు .1906లోనే లా పాసైనా ,ప్రాక్టీస్ చేయాలనిపించ లేదు .మైసూర్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉన్నత శ్రేణి దక్కలేదు .అదికన్నడ సాహిత్యానికి గొప్ప అదృష్టాన్ని కలగజేసింది .
1911లో ధార్వాడ లో ఆయన చేసిన ప్రసంగం లో కన్నడ సాహిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను భావ స్ఫోరకంగా వివరించటం ,నూతన సాహిత్య సృష్టికి మార్గాన్ని సుగమం చేసింది .1909 లో మైసూర్ లో మహారాజా కాలేజిలో ఆంగ్ల-కన్నడ లెక్చరర్ గా నియమించటం జరిగింది .1914కు ప్రొఫెసర్ అయ్యాడు .’’ఎ హాండ్ బుక్ ఆఫ్ రెటారిక్ ‘’అనే మొదటి రచన చేశాడు .అప్పుడే ఆంగ్ల భావ గీతాల అనువాదం ప్రారంభించాడు .అందులో మొదటి మూడు 1919లో వెలువడినాయి .ఇంగ్లీష్ లెక్చరర్ గా గొప్ప పేరు పొందాడు .పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు .కండ్లకలకతో బాధపడే ఆయన కొడుకు సరైన వైద్యం లేక గుడ్డివాడయ్యాడు .తర్వాత భార్య పురిటి జ్వరం తో చనిపోయింది .ఈ బాధలను దిగమింగు కోవటానికి ఎంతో ఆత్మ స్థైర్యాన్ని కూడ దీసుకొన్నారు .తర్వాత తల్లీ ,అల్లుడూ కూడా చనిపోయి విధి ఆయనపై క్రూరంగా విరుచుకు పడింది .ఈ దుర్ఘటనలు ఆయన్ను కొంచెం కఠినుడిగా మార్చి ఉంటాయి .ఆయన ఒకసారి తన సోదరితో ‘’దేవుడు మనుషులకు మంచి చేయదలచినా, చెడు చేయదలచినా ముందు నేనే కనిపిస్తానేమో .దేవుడికి ఇష్టమైన వాడిని నేను ‘’అని పరిహాసంగా ఆన్నాడు .
30ఏళ్లకే భార్య చనిపోయినా ,మళ్ళీ పెళ్లి చేసుకోలేదు .సాహిత్య కృషికే అంకితమయ్యాడు .అప్పటి వరకు ఇంగ్లీష్ ఆక్రమించిన అగ్రస్థానాన్ని కన్నడానికి కట్టబెట్టాలని నిశ్చయించి ఆ మార్గం లో తీవ్ర కృషి చేశాడు .సంప్రదాయ బంధాలలో నుంచి కన్నడ భాషను విముక్తి చేసి ,పునరుజ్జీవనం కల్పించి ,కన్నడ భాషా ప్రాంతాలన్నిటిని ,ఒకే ప్రభుత్వం కిందకు తెచ్చి కర్నాటక రాష్ట్ర స్థాపనకు కృషి చేయటం ఆయన ధ్యేయం .ఆంగ్ల భాషా నిష్ణాతుడైన ఆయన గ్రీకు భాషనూ అధ్యయనం చేసి అందులోని సాహిత్యాన్ని మధించాడు .ఇదంతా తన కన్నడం కోసం చేసిన కృషి .’’కన్నడం ఎడారి పాలుకాకుండా కాపాడింది శ్రీ క౦ఠయ్య గారు’’అని ఈపుస్తకరచయిత ఆయనతో అంటే ‘’కన్నడం కూడా ఆయన్ను కాపాడి ,ఆత్మ దైన్యం పాలుకాకుండా చేసింది ‘’అన్నాడు .1919 ఆయన్ను కన్నడం లో సీనియర్ ప్రోఫెసర్షిప్ కావాలా ,ఇంగ్లీష్ లో జూనియర్ ప్రొఫెసర్ షిప్ కావాలో తేల్చుకోమంటే ,ఆంగ్లం లో జూనియర్ ప్రొఫెసర్ షిప్ నే ఎంచుకొన్నాడు .ఇంగ్లాండ్ లోని ఏదో ఒక యూని వర్సిటి నుంచి డిగ్రీతీసుకోకపోతే డిపార్ట్ మెంట్ లో భవిష్యత్తు ఉండదు అని అని పై అధికారులు అంటే దాన్ని సవాలుగా తీసుకొని ‘’ఇంగ్లాండ్ వెళ్లి వచ్చిన వాడితోనే కాదు ,అసలు ఇంగ్లీష్ వాడితోనే తలపడుతా ‘’అన్న ధీరోదాత్తుడు .కొన్ని కన్నడ సభలలో కూడా ఆయన్ను ఇంగ్లీష్ లోనే మాట్లాడమంటే అత్యద్భుతంగా ప్రసంగించి సుభాష్ అనిపించాడు .ఇంగ్లీష్ లెక్చరర్స్ లో ఆయనకు వచ్చిన౦త పేరు ఎవ్వరికీ రాలేదు .ఆయన డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ఆక్స్ ఫర్డ్ మనిషి, ఆయనకు సీనియర్ ‘’’శ్రీ క౦ఠయ్య ఇంగ్లాండ్ వెడితే అక్కడి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి ఆయన్ను చటుక్కున లాగేసుకొంటు౦ది ‘’అని ఆయన ప్రతిభకు నీరాజనం పట్టాడు .1926లో రిజిష్ట్రార్ అయ్యాడు ప్రొఫెసర్ ,రిజిష్ట్రార్ పదవులు తీసుకోవటానికి కారణం కేవలం కన్నడ సాహిత్యాభి వృద్ధికి మాత్రమె .
‘’మైసూర్ యూని వర్సిటి పబ్లికేషన్స్ సిరీస్’’ పేరిట వరుసగా కొన్ని పుస్తకాలు ప్రచురించటానికి ఆయన డబ్బు గ్రాంట్ చేయించాడు .ఆ ప్రచురణలకు తానె సంపాదకత్వం వహించాడు .మరుగునపడ్డ మాణిక్యాలను బయట పడేశాడు. సాహిత్య విమర్శ ,ప్రాచీన కన్నడ గ్రంథాలకూర్పులు , పాశ్చాత్య సాహిత్య అనువాద గ్రంథాలు ,రిసెర్చ్ గ్రంథాలు సాహిత్యేతరమైన తత్వశాస్త్ర సాంఘిక శాస్త్రాలను ప్రధాన గ్రంథాలుగా సీరియల్ గా ప్రచురించి మహోన్నతసాహితీ సేవ చేశాడు .యువ కవులను ప్రోత్సహించటానికి ప్రతి ఏడూ ఉత్తమకవిత రాసిన యువకవికి బంగారు పతకం బహూకరించాడు .తత్వ శాస్స్త్రం లో ఉన్న ఆయన శిష్యుడు జి హనుమంతరావు ‘’యూనివర్సిటి టీచర్స్ అసోసియేషన్ ‘’స్థాపించాడు .ఈ అసోసియేషన్ సభ్యులు ఏడాదికి మూడుసార్లు గ్రామాలకు వెళ్లి వారం రోజులు మకాం చేసి అక్కడ కన్నడం లో చెప్పబడని విషయాలన్నీ ఉపన్యాసాలుగా గ్రామ ప్రజలకు తెలియ జేసేవారు .ఆఉపన్యాసాలను పుస్తకాలుగా ప్రచురించి రూపాయికి 8పుస్తకాలు అతి చవకగా అందించేవారు .ఇది హనుమంత రావు పూనికే అయినా వెనకున్నది మన శ్రీ కంఠయ్యే .
1930లో సీనియర్ ప్రొఫెసర్ ను చేసి బెంగుళూరు సెంట్రల్ కాలేజి కి బదిలీ చేశారు అక్కడే 1942లో పదవీ విరమణ వరకు పని చేశాడు .బెంగుళూరు వెళ్ళగానే ‘’ది ఇంగ్లీష్ సెమినార్ ‘’ను నిర్వహించి సాంస్కృతిక అభిరుచి కల్గించాడు .సైన్స్ డిపార్ట్ మెంట్ తో సహా ఎందఱో విద్యార్ధులు అధ్యాపకులు ఆకర్షితులయ్యారు .బెంగుళూరు వాతావరణం ఆయనకు ఎందుకో అంతగా నచ్చినట్లు లేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-22-ఉయ్యూరు