కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -4
గదా యుద్ధ నాటకం
అయిదు అంకాల ఈ నాటకాన్ని 1925లోప్రదర్శింఛి 1926లో ముద్రించారు .కన్నడం లో ‘’రన్న కవి ‘’రాసిన సాహస భీమ విజయ కావ్యం ఆధారంగా శ్రీ కంఠయ్య రాశాడు .గొప్ప నాటకీయత తో రన్న పండించాడు .ఈనాటకం కావ్య౦చదివిన అనుభూతికి భిన్న౦గా ఉంటుంది .కౌరవ కుమారులంతా చనిపోగా దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు .ధర్మరాజు భీముడిని శాంత పరచి వాణ్ని చంపకుండా వదిలేయమంటాడేమో అనే సందేహంతో నాటకం ప్రారంభమౌతుంది .వాడు తొడమీద గుదడ్డతీసి తనను అవమాని౦చాడు అన్న విషయం ద్రౌపది మర్చిపోలేదు.వాడి తొడ విరుస్తానని ప్రతిజ్ఞ చేసిన భీముడు ఆరోజు సాయంత్రం లోపు వాడిని చంపక పొతే వాడు అజేయుడుఅవుతాడన్న విషయం గుర్తు చేశాడు .రెండవ అంకం లో ద్రోణ ఆశ్వత్దామలు తన్ను మోసం చేశారని దుర్యోధనుడు వారిని నిందిస్తాడు .సంజయుడు పాండవులను పొగడటం వాడికి ఇంకా కారం రాసినట్లయింది .తాను పాండవులకు చేసిన అవమానాలన్నీ మరోసారి ఏకరువు పెడతాడు .వాళ్ళు గతిలేక భరించారని గోప్పగాచెబుతాడు. అయితే ఏదైనా చేయబోయేముందు భీష్ముడిని సంప్రదిస్తాను అంటాడు . మూడవ అంకం లో అంపశయ్యపై ఉన్న పితామహుడి దగ్గరకు దుర్యోధనుడు వెడుతుంటే ,పీనుగులతో పొట్టని౦పు కొనే మూడు పిశాచాలు కనిపిస్తాయి .అవి వాడి పాపపు పనులు గుర్తు చేస్తూ వాడు బతికేది సూర్యాస్తమయం వరకే అని చెబుతాయి .కర్ణ దుశ్శాసన పీనుగుల్ని చూసి వాడు చలించిపోతాడు .అభిమన్య శరీరం చూసి ఉదారంగా శ్లాఘిస్తాడు .భీష్ముడు సంధి చేసుకోవటం మంచిది అని సలహా ఇస్తాడు వాడికి .వాడుఅలాచేయడని తెలిసి ఉపశమనంగా వైశంపాయన సరోవరంలో దాక్కొమని చెబుతాడు .
నాల్గవ ,అయిదవ అంకా లలో కృష్ణ భీమ ధర్మరాజులు శత్రువుజాడ కనిపెట్టటానికి సరోవరం దగ్గరకు వస్తారు .భీముడి దేప్పిపోడుపులు ,కవ్వింపులు భరించలేకనీటి లోనుంచి బయటికి వస్తాడు .భీముడితో గదా యుద్ధం చేస్తాడు .ఒకసారి భీముడు పడిపోతే యుద్ధం ఆపేసి గదతో విసిరి సేద తీరుస్తాడు .చేసిన ప్రతిజ్ఞను కన్నయ్య భీమయ్యకు గుర్తు చేస్తాడు .గదతోదుర్యోధనుడి తొడపై కొడతాడు .వాడు కింద పడిపోగా కాలితో తంతాడు .దానితో భీమునిపై ప్రతీకారశక్తులు పగబట్టగా ,శివుడిని ధ్యానించటానికి పాండవులు నీలాద్రి చేరతారు
రాజుదగ్గరకు అశ్వత్ధామ వచ్చి రారాజు దైన్య స్థితి చూసి చలించి పాండవుల తలలు కోసి తెస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోతాడు .కానీ వాడు తెచ్చింది ద్రౌపది కొడుకుల శిరస్సులు .నువ్వు పాపం చేశావంటాడు రాజు .దైవ శక్తిముందు మానవ శక్తి ఎందుకూ పనికిరాదని గ్రహించి ప్రాణం వదుల్తాడు దుర్యోధనుడు .పొద్దు గుంకిపోతుంది .
నాటకం అంతా యుద్ధరంగం మీదనే జరుగుతుంది .ఆరంభం అంతమూఅక్కడే పాండవులకు ఒక్క అంగుళం నేలకూడా ఇవ్వను అన్న ప్రతిజ్ఞ ఒక్కటే దక్కించుకొన్నాడు రారాజు .రన్న కవికి వీడిపై సానుభూతి మిన్న వాడిచివరిమాటలలో ప్రశాంత గాంభీర్యం ఉంది శత్రువైన భీముడిపై ఔదార్యం చూపాడు .దుర్యోధనుడి సర్వ అవలక్షణాలు నాటకం లో చూపాడు శ్రీ కంఠయ్య .
1929లో ‘’ఆశ్వత్దామన్ ‘’నాటకం రాశాడు .మహారాజా కాలేజిసంఘం వారు ప్రదర్శించారు .గ్రీకునాటకం మొట్టమొదటిసారిగా కన్నడ రంగస్థలం పై ప్రదర్శింప బడి నట్లయింది .గ్రీకులోని ‘’ఆయాస్ ‘’నాటకం స్పూర్తితో ఈనాటకం రాశాడు .గ్రీకు నాటకం లో అడిషియాస్ కవచాన్నిఅయాన్ కు కాకుండా ఓడిన్యాస్ కు బహూకరిస్తాడు , దీన్ని అవమానంగా భావించి సేనానాయకుల౦దర్నీ చంపాలను కొంటాడు .కానీ ఎథినీ దేవత శాపం వలన పిచ్చెక్కుతుంది .పశువులమందల్ని చూసిసేనానాయకులని భ్రమపడి ఊచకోతకోసేస్తాడు .భ్రా౦తి తొలగి జరిగింది తెలిసి పశ్చాత్తాపం పొంది దేవతకు ఆగ్రహం కలిగించినందుకు చిన్న బుచ్చుకొంటాడు .ఆదేవత కోపం ఒక్క రోజే ఉంటుంది . ఈసంగతి తెలిసిన అయాన్ సవతి తమ్ముడు ట్యూసర్ తానూ తిరిగి వచ్చేదాకా అయాస్ ను జాగ్రత్తగా చూసుకోమని అయాస్ పెళ్లి చేసుకోబోయే బానిసపిల్ల టెక్ మేసాకు చెప్పి ,నావికులకు కబురుచేస్తాడు. ఈలోగానే అయాస్ అందరికళ్ళు కప్పి ఆత్మహత్య చేసుకొంటాడు .గ్రీకు సేనానులకు వాడు దేశ ద్రోహి .అతడి కళేబరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు వెయ్యాలంటారు .కానీ ట్యూసర్ ,ఉదారుడైన ఓడిన్యాస్ లు దాన్ని కాదని అమరవీరుడికి జరిగినట్లుగా అంత్యక్రియలు నిర్వహిస్తారు .
ఈ గ్రీకు కథ ఆధారంగా మహాభారతం సౌప్తిక పర్వంలో కౌరవ యోధుల్లో మిగిలిన అశ్వత్ధామ తనరాజు రక్తం మడుగులోకొనూపిరితో ఉన్నట్లు ,పిశాచాలు లు ఆయన రక్తమాంసాలు నంజుకొని జుర్రుకొని తినటానికి సిద్ధంగా ఉన్నట్లు చూసి విచలితుడు అవుతాడు .తనతండ్రి ద్రోణుడు లాగా దుర్యోధనుడుకూడా అధర్మ యుద్ధంలో పాండవుల చేతిలో చచ్చాడని భావించి ,ఆరోజునే పాండవులందర్నీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేయాగా సేనాపతిగా నియమించగా ,కృపాచార్య కృతతవర్మలతో దృష్టద్యుమ్నుని శిబిరానికి వెళ్లి ,పాంచాల ఉపపా౦ డవుల్ని చంపేస్తాడు .పాండవులకు తెలిసి వీడిని పట్టుకోటానికి బయల్దేరతారు .అశ్వత్ధామ ప్రయోగించిన భయంకర అస్త్రం నుండి కృష్ణుడు వారినికాపాడి వాడిని’’మానవులకు ఎవరికీ కనిపించకుండా వారితో మాటా మంతీ లేకుండా మూడు వేల ఏళ్ళు అడవులలో ఎడారులలో తిరుగు ‘’అని శపిస్తాడు .వాడి తలలో ఉన్న మణిని ఊడ బెరికి ద్రౌపదికి బహూకరిస్తారు .వాడు గబ్బుకంపు కొడుతూ దేశాలపాలయ్యాడు .
అశ్వత్ధామకు రాజుపట్ల వీర విధేయత స్పష్టంగా నాటకం లో చూపాడు రచయిత .కపట నాటక సూత్రధారిగా కృష్ణుడిని చిత్రించాడు .అక్కడి గ్రీకుకథను ఇక్కడి మహాభారత కథతో అనుసంధానం చేసి అద్భుతంగా రాశాడు. చివరలో చచ్చిన రారాజు రెప్పలు మూసి ,గౌరవంగా నమస్కరించి ,విల్లు విసిరిపారేసి ఒరలోంచి రెండు వైపులా పదునున్న కత్తి దూసి పళ్ళు పటపట లాడిస్తూ పాండవ శిబిరంలోకి ప్రతీకారం కోసం ప్రవేశిస్తాడు .అసలు ఏమి జరిగిందో చెప్పమని కృష్ణుడు రుద్రుడిని అదుగు తాడు ‘’రుద్రుడు – ‘’సూర్యుడు అస్తమించాడు కౌరవనాథుడుకూడా .అర్ధరాత్రి మీ శిబిరం లో ప్రవేశిస్తుంటే చూశాను నేను .ఎక్కడికి,ఏ యుద్ధానికి ,ఏ వరం కావాలి యోధుడా ‘’అని అడిగా .’’పాండవ వంశాన్ని నాశనం చెయ్యాలి ‘’అన్నాడు .’’కొందర్ని తప్పించి ‘’అన్నాను నేను .వాడు ‘’చూడు రుద్రా .మనిషి బలం ఎలాంటిదో చూడు ‘’అని పొగరుగా నవ్వాడు .నేనూ అలానే నవ్వాను నర్మగర్భంగా .వాడికి మాయ కమ్మేట్లు చేశాను ..అది వాడి మనసును కమ్మేసింది .కళ్ళకు వాడికేమీకనిపించలేదు ,వాడిని నీ శిబిరంనుంచి లాక్కేళ్లి బయట శిబిరం వాళ్ళదగ్గర పడేశాను .అప్పుడు చూడు కృష్ణా వాడి ప్రలాపాలు ప్రగల్భాలు ,సంహారగర్వం .పశువుల్ని నరికాడు ఆడవాళ్ళను చంపేశాడు ,దాదుల చేతుల్లోనూఉన్న పసిపిల్లల్ని కత్తిమొనకు గుచ్చి ముక్కలు ముక్కలు చేశాడు .శిబిరాలు నేలకూల్చాడు .నేను ఇంకా దగ్గరగా ఉంటూ వాడి పిచ్చిని మరింత ప్రకోపి౦పజేశాను .తుఫాను రేగిన సముద్ర కెరటాలుగా మారాడు వాడు .ఒక గుర్రాన్ని మెడనరికి ‘’ఒరరే దృష్టద్యుమ్నా !నువ్వు నీ గురువు గొంతు కోసింది ఇట్లాగేగా ‘’అన్నాడు .ఒక ఏనుగును ‘’ఒరేభీమా !కౌరవనాథుడిని తలదన్నిన పాదం ఏదిరా ‘’అ౦టూ పిచ్చిపట్టినవాడిలా ఊగుతూ అరిచాడు .దానికాలు నరికి కళేబరాన్ని తన్నాడు .అందర్నీ చంపేశాను అనుకోని ఒక గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని ‘’ఒరే జిత్తులమారి నక్కా కృష్ణా రారా .నువ్వు విత్తు వేసిన మొక్కపళ్ళు తి౦దువు గాని రారా .ప్రత్యెక గౌరవం పొందే అతిథివికదా తినుతిను ‘’అన్నాడు అని రుద్రుడు శ్రీ కృష్ణుడికి ఆశ్వత్ధామ ఉన్మాద వీర విహారం కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పినట్లు శ్రీ క౦ఠయ్య తన నాటకం లోరాసి , ప్రేక్షకజనం ఉర్రూతలూగేట్లు చేశాడు ‘
ఈనాటకం లో పగా ,దయా రెండూఉన్నాయి .’’నవ్వు మధురమైనది .పగవాడిని చూసి నవ్వే నవ్వు ఇంకా మధురమైనది ‘’అంటాడు రుద్రుడు .ఇక్కడి రుద్రపాత్ర గ్రీకు నాటకం లోని ఎధినీ పాత్ర వంటిది.ఆశ్వత్దామన్ కు గుడి కట్టించాలి అనే ప్రతిపాదన సెంటిమెంట్ కు విరుద్ధం .’’ఓదుష్ట యుద్ధమా ఎప్పుడు నువ్వు నశించేది?ఓ శాన్తిమాతాఎప్పుదు నువ్వు వర్ధిల్లేది ‘’అనే బృందగానం తో నాటకం ముగుస్తుంది .ధర్మ సంరక్షణకే నాటకం నడుం కట్టింది .ఛందో నైపుణ్యం శైలి నాటకానికి విజయం చేకూర్చాయి .భారతీయ ,పాశ్చాత్య సంస్కృతీ మేళవింపు నాటకం లో బాగా నే పండింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-28-11-22-ఉయ్యూరు