‘’యమా’’(హా)నటుడు కైకాల -2(చివరిభాగం )
కైకాల నట విశ్వరూపం –దాసరి నారాయణ రావు దర్శకత్వం లో ‘’మనుషులంతా ఒకటే ‘’సినిమాలో కైకాలను రామారావు కు తాత గా నటించమని దాసరి చెబితే తాను చేయలేనని అలా తాతగా నటించి మెప్పించటం అసాధ్యం అనీ కైకాల చెప్పాడు .దాసరి ఒప్పుకోలేదు చివరికి కైకాల రామారావు కు చెబితే ‘’నిన్ను పైకి తీసుకు వచ్చిన దర్శకుడు అంతగా నమ్మకం తో నిన్ను చేయ్యమంటే కాదనటం భావ్యం కాదు ‘’అని నచ్చచెప్పాక నటించి బాగా నటించి దాసరితో సహా అందర్నీ మెప్పించాడు .సైడ్ విలన్ గగా కనకదుర్గ పూజామహిమ లో నటించి ,మోహినీ రుక్మాంగద లో గెస్ట్ గా విష్ణుమూర్తిగా నటించి ,మొదటి సాంఘిక చిత్రం పరువు –ప్రతిష్ట లో నటించి ,శ్రీ కృష్ణార్జున యుద్ధం లో అక్కినేని ,రామారావు లతో కర్ణుడు గా గెస్ట్ రోల్ పోషించి ,నందమూరి తో తొలి విలన్ ‘’శ్రీతిరుపతమ్మ కధ ‘’లోనూ,అక్కినేనితో మొదటి విలన్ గా ‘’జమీందార్ ‘’లో,తోలి హీరోగా సిపాయి కూతురు లో హీరోయిన్ జమునతో నటించాడు .
కైకాల నాటక నటుడు గా ‘’ప్రేమ లీల ‘’లో విలన్ వేషం ప్రభాకర నాట్య మండలి ఆధ్వర్యం లో 1950మే లో వేసి ప్రదర్శించాడు .యమ గోల సినిమాలో హీరో రామారావుతో పోటాపోటీ గా యముడుగా నటించాడు .దుర్యోధనుడుగా పనికి రాడు అన్నప్పుడు అన్నగారి సూచన తో వేసి న్యాయం చేశాడు .ఇలా ఎన్నో యమ పాత్రలు వేసి యమహా అనిపించాడు. అన్ని పాత్రలూ సక్సెస్ అయ్యాయి .వైవిధ్యం కూడా చూపాడు నటనలో .అందుకే అవి పండాయి .రాముడు కృష్ణుడు తప్ప రామారావు వేసిన అన్ని పాత్రలూ తానూ వేశానని గర్వంగా చెప్పాడు కైకాల .అచ్చంగా రామారావు లాగా ఉంటాడుకనుక డూప్ గా కూడా వాడుకొన్నారు కైకాలను ఒక సారి రామారావు గారి కృష్ణ పాత్రకు డూప్ గా వేశాడు .యమ దొంగ లో కూడా యముడి వేషం ఆఫర్ వచ్చినా ,డబ్బు విషయం లో తేడా వచ్చి వేయలేదని ,మోహన్ బాబు చేశాడని చెప్పాడు .కొన్నిసినిమాలలో మోహన్ బాబు తో పేచీలు కూడా వచ్చాయని చెప్పాడు .
బెజావాడలో ఇంటర్ చదువు తు నాటకాలు వేస్తుంటే అందరూ ‘’రామారావు బ్రదర్ ‘’అను కొనేవారు. ఒక సారి పోటీ నాటకం లో నటిస్తున్నప్పుడు న్యాయమూర్తులలో ఒకరైన గరికపాటి రాజారావు స్వయంగా కైకాలకు సినిమాలలో వేషం ఇస్తానని ఆఫర్ చేసి ము౦దు డిగ్రీ పాసవు అని చెప్పాడు .బి.ఏ పాసయ్యాక మద్రాస్ రమ్మని అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ కే ఎల్ ధర్ ఉత్తరం రాస్తే వెళ్ళగా ,డైరెక్టర్ బిఏ సుబ్బారావు నుకలిస్తేచక్రపాణి దగ్గరకుపంపిస్తే ,ఆయన కె.వి. రెడ్డికి పరిచయం చేయాగా ,15రోజులతర్వాత రమ్మని చెప్పి ,రాగానే వాయిస్ టెస్ట్ చేయించి సెలెక్ట్ చేశాడు .సంక్రాంతి సెలవలకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి అపాత్ర ఆర్ నాగేశ్వర రావు కు ఇచ్చేశారు .ఇంకో సినిమాలో ఇస్తాను అని రెడ్డి అనగా నిర్మాత డి ఎల్ నారాయణ ను కలవగా ‘’సిపాయికూతురు ‘లో హీరో చేశాడు.ఇక చాన్సులు రావు అనుకోని నిరాశ పడి కనీసం మద్రాస్ అయినా పూర్తిగా చూద్దాం అనుకోని తిరుగుతుంటే విఠాలాచార్య అపూర్వ సహస్ర శిర చ్చెద చింతామణి లో విలన్ వేషం వేయించి మొదటి పారితోషికంగా 25వేలు ఇచ్చాడు .రామారావు తో కాంబినేషన్ జరిగిఆతర్వాత ‘’అగ్గిపిడుగు ‘’నుంచి చాలా సినిమాలలో ఆయన హీరో ఈయన విలన్ గా నటించారు పోటాపోటీ గా .
‘’భానుమతి మరొకరిద్దరూ తప్ప అందర్నీ సినిమాలలో రేప్’’ చేశాను .నన్ను రరేపుల నారాయణ అనే వారు .కే ఆర్ విజయ నన్ను పక్కకి పిల్చి ‘’నేనేమీ అనుకోను మీ ఇష్టం వచ్చి నట్లు చేసుకోండి ‘’అని చెప్పి బాగా కోఆపరేట్ చేసింది ‘’అని నవ్వుతూ ఈమధ్య ఇంటర్వ్యు లో చెప్పాడు .అక్కినేనిని ‘’మీరు డాన్సులు స్టెప్పులూ వేసి ఇండష్ట్రీ ని చెడగొట్టారు ‘’అని నిర్మొహమాటంగా చెప్పానని చెప్పాడు. కైకాల రామారావు కు రంగారావు కు మధ్య ‘’ప్రొఫెషనల్ జలసి ‘’ఎక్కువగా ఉండేది .రంగారావు డైలాగ్ లను అలవోకగాచెబుతారు. రామారావు పట్టి పట్టి అంటాడు .ఒకసారి ఒకసినిమాలో రంగారావు ‘’బానిసలు ‘’అనే మాటను చాలా అర్ధ వంతంగా పలికితే రామారావు ‘’వన్స్ మోర్ ‘’అనగా రంగారావు ‘’నో మోర్ ‘’అన్నాడని గుర్తు చేశాడు కైకాల .రామారావు ఒక సారి పూర్తిగా పాత్రలో లీనమై కైకాలను నిజంగానే కత్తి తో పొడిచాడు .యాక్షన్ లో ఏ మాత్రం తేడా వచ్చినా నందమూరి సహించే వాడు కాదు అని చెప్పాడు .
అన్ని సినిమాలో అన్ని రకాల వేషాలు వేసి మెప్పించినా పద్మ అవార్డ్ ఎందుకు రాలేదని అడిగితె ‘’నువ్వు తెలుగు దేశం ఎం. పి.వి కనుక రాలలేదు ‘’అని శివరాజ్ పాటిల్ చెప్పాడని చెప్పాడు కైకాల .తన మొదటి సినీ కధను కైకాలకే చెప్పానని డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ అన్నాడు .రామారావుదానవీర కర్ణ షూటింగ్ హైదరాబాద్ లో కృష్ణ కురుక్షేత్రం మద్రాస్ లో షూటింగ్ జరుగుతోంది .కురు క్షేత్రం షూటింగ్ అయ్యాకకైకాల హైదరాబాద్ వెళ్ళాలి .అనుకోకుండా కైకాలకు కామెర్లు అయ్యాయి .కృష్ణం రాజు జాండిస్ కు మందు ఇచ్చేవాడు .రాజు మందు ఇచ్చాడు కాని పెద్దగా పనిచేయలేదు .కామెర్లు తగ్గకపోయినాహైదరాబాద్ వెళ్లి అన్నగారి షూటింగ్ లో పాల్గొనాలి అంటే కృష్ణం రాజు హైదరాబాద్ వెడితెఅక్కడ తనబావమరది రోజూ వచ్చి మందు ఇస్తాడు అని చెప్పి పంపాడు .హైదరాబాద్ వెళ్ళగా కామెర్లు మరింత పెరిగి చివరికి బట్టలు కూడా పచ్చగా మారిపోయాయి .ఏదీ తిన బుద్ధి అయ్యేదికాదు .కానీ షూటింగ్ మానలేదు .ఒక రోజు డాక్టర్ వచ్చి చూసి వెంటనే ఆస్పత్రిలో చేరకపోతే ప్రాణానికిప్రమాదమని చెబితే రామారావు మద్రాస్ వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోమని సలహా ఇస్తే ,షూటింగ్ కు ఇబ్బంది అవుతుందని రెండు రోజులుఉండి మద్రాస్ వెళ్ళాడు .అక్కడ చెన్నైలో గాసిప్ లు షికారు చేశాయి అన్నగారు వద్దన్నారుకనుక కైకాల మద్రాస్ రాలేదు అని ప్రచారం చేశారు .ఒకరోజు కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు కైకాల ఇంటికి వెళ్లిపరిస్థితి తెలుసుకొని ‘’హాయిగా రెస్ట్ తీసుకో మందులు వాడు ఆరోగ్యం కుదుటపడ్డాకే షూటింగ్ కు రా .కంగారు పడకు. కానీ కురుక్షేత్రం లో నటించటం లేదని ఎవరికీ చెప్పద్దు.మునిగిపోతాం ‘’అన్నాడు .అలాగే అన్నమాట ప్రకారం ఆరోగ్యం బాగుపడగానే కురుక్షేత్రం షూటింగ్ పూర్తీ చేసి ఇచ్చినన మాట నిలబెట్టుకొన్నాడు కైకాల .కృష్ణ సినిమాలలో నటించే వారందర్నీ ముందే హైదరాబాద్ కు తరలించి కాంప్ లో ఉంచి కురుక్షేత్రం షూటింగ్ జరిపించాడు అప్పుడు హైదరాబాద్ లో నటులుఎవరూ లేరు.అందుకే రామారావు మూడుపాత్రలు చలపతిరావు అయిదుపాత్రలు దావీజు కర్ణలో చేయాల్సి వచ్చింది
కైకాల కూతుళ్ళు ,కొడుకులు వెల్ సెటిల్డ్ .తమ్ముడిని చదివించి నిర్మాతను చేశాడు .తనపిల్లలు నిర్మాణ రంగం లో ఉన్నారు తప్ప నటనలోకి రాలేదని ,తన మనవలు తన వారసులుగా నటనలోకి రావాలని కైకాల సత్య నారాయణ కోరుకొన్నాడు .కరుడుగట్టిన విలన్ వేషాలు వేసిన కైకాల సినిమాలలో మెలోడీ పాటలు అంటే మహా ఇష్టం ‘’అనురాగం విరిసేనా ‘’,చుట్టూ చెంగావి చీర ‘’,ఎంతహాయి ఈరేయి నిండెనో ‘’,నిలువవే వాలుకనులదానా ‘’,వంటి పాటలు వింటూ మై మరచిపోతాడు .సువర్ణ సుందరి మాయాబజార్ ,పాతాళభైరవి దేవదాస్ సినీ గీతాలు వింటూ హాయిపొందుతాడు .ప్రాణం ఖరీదులోని జాలాది పాట ‘’యాతమేసి తోడినా ‘’నిప్పులాంటి మనిషిలోని ‘’స్నేహమేరా జీవితం ,డబ్బుకు లోకం దాసోహం లో ‘’తాగుతా నీ యబ్బ తాగుతా ‘’ఘటోత్కచుడు లో ‘’అపరంజి బొమ్మవంటి మెలోడీ సాంగ్స్ కు పరవశం చెందేవాడు .
లవకుశ సినిమాలో భరతుడు ,పాండవవనవాసం ,పరమానందయ్య శిష్యుడులో –గజదొంగ ,ప్రేమ నగర్ లో కేశవ వర్మ ,తాతామనవడులో రంగారావు కొడుకు ,రాజబాబు తండ్రి ,నిప్పులాంటి మనిషిలోషేర్ ఖాన్ ,జీవన జ్యోతి లో శోభన్ బాబు అన్నగా ,సిరిసిరి మువ్వ లో జయప్రద కు పక్షవాతం వచ్చిన తండ్రిగా ,చక్రధారి లో ,దావీ శు లో కర్ణుడు గా ,యమగోలలో యముడుగా ,శుభలేఖలో అంకెల ఆది శేషయ్యగా నటించాడు ,శృతి లయలు లో వాసిరెడ్డి నాయుడుగా సంగీత త్రయానికి గుడి కట్టే ప్రయత్నం లో సంగీత అభిమానిగా జీవించాడు .రుద్రవీణ లోనూ ,నారీనారీ నడుమమురారిలో జానకి భర్త జానకిరామయ్య గా ,సూత్రధారులు లో విలనీ షేడ్ ఉన్న నీలకంఠయ్య గా ,గాంగ్ లీడర్ లో జైలర్ గా ,భైరవద్వీపం లో బ్రహ్మాండ భూపతిగా ,ముద్దులప్రియుడు లో మేజర్ నారాయణ మూర్తిగా ,యమలీల లో యముడుగా ,ఘటోత్కచుడు లో ఘటోత్కచుడు గా గొప్ప హావభావాలు ప్రేమ కారుణ్యం ప్రదర్శించాడు ,సాహస వీరుడు –సాగర కన్య లో బంగారు రాజుగా ,సూర్య వంశం లో మీనాకు తండ్రిగా ,చేసినమేలు మరువని మహోన్నత వ్యక్తిగా ,శుభా కాంక్షలు లో సీతారామయ్య గా ,మురారిలో సత్తిపండుగా ,అరుంధతి లో భూపతి రాజుగా ,తాయారమ్మ బంగారయ్య లో జానకి భర్త గా,దేవుడు లో బాలకృష్ణ యజమానిగా ,’’ఓం సచ్చిదా నందా ఈ సర్వం గోవిందా ‘’పాటపాడే దొంగ బాబా గా , కైకాల నటించి తన నట విశ్వ రూపం ప్రదర్శించాడు .మరో నట దిగ్గజాన్ని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది .ఈ భర్తీ తీరేదికాదు .ఆయన ఆత్మకు శాంతికలగాలని, ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-22-ఉయ్యూరు