ఇక్కుర్తి శ్రీ హరిహర పశుపతీశ్వర శతకం
శ్రీ మైనముపాటి శివ నారాయణ మూర్తి ఇక్కుర్తి శ్రీ హరిహర పశుపతీశ్వర శతకం రచించి ,నరసరావుపేట రామ కృష్ణ ముద్రాక్షర శాలలో 1940లో ముద్రించారు .విజ్ఞప్తి లో కవిగారు –‘’ప్రమాది నామ సంవత్సర మార్గశిర త్రయోదశి 7-1-1940 న తమ గురుఆశ్రమాన్ని సందర్శించే ఉత్సాహంతో ఇక్కుర్తి గిరికి వెళ్లి శ్రీ రామ లింగేశ్వరస్వామిని సేవించి ,,ఆ రాత్రి అక్కడే ఉండిమర్నాడు సోమవారం ఉదయం స్వామి దర్శనం చేయటానికి వెడితే మనసులో ఈశతకం రాయాలనే సంకల్పం కలిగి,శక్తికొలది రాశారు .తర్వాత నరసరావు పేటలో గురువుగారు శ్రీ ముప్పాళ్ళ శ్రీనివాసరావు ,,గడ్డం కోటయ్య గార్లు ఏదో రాస్తున్నట్లున్నావు అని ప్రశ్నిస్తే చదివి వినిపించగా బాగుంది అని ముద్రి౦చమని చెప్పగగా అచ్చువేయించారు .శతకరచనలో తోడ్పడిన శ్రీ సోమరాజు రామ చంద్రయ్య గారికి కృతజ్ఞతలు చెప్పారు .ఇది సీస పద్య శతకం.’’భవ వినాశక హరి హర పశుపతీశ ‘’అనేది శతక మకుటం . మకుటం తమాషాగా ఉంది.పుస్తకం వెల ఎంతో తెలుపలేదు .
ప్రారంభ పద్యం –‘’శ్రీ గణనాధుని స్థిరభక్తి సేవించి ,,భారతీ దేవిని ప్రస్తుతించి –వ్యాస పరాశర వాల్మీకి శుక భారద్వాజుడాదిగా రుషి వరుల గొల్చి – భాస్కరు నన్నయభట్టు పోతన కాళిదాసాది కవుల ప్రార్ధన మొనర్చి – వసుదాస్తలంబునవరలు సత్కవులకు వందన శతములు వాంఛ చేసి
గీ.-నాదు గురుడైన నిమ్మరాట్ నరసయోగి –పాదములు గొల్చి భక్తిని ప్రణతి జేసి –చిత్తు సత్తుల నిన్నెంచి చెప్పువాడ –భవ వినాశక హరిహర పశుపతీశ ‘’ అంటూ’’ ఆల్ ఇన్ వన్ ‘’ గా అందరికి కైమోడ్పు లర్పించారు .తర్వాత అందరుకవులు లాగానే తనకేమీ రాదనీ పశుపతి దయతో శతకం రాస్తున్నానని తప్పులు మన్నించి ఆదరించమని కోరారు .జాతి మత్సరంతోకులాలు వచ్చాయి ,ధర్మాలు చెప్పటమేకాని అనుసరించే వారే లేరు .చందాలుడని దూరం చేస్తే వాళ్లకు పుట్టగతులు ఉండవు .జనని బ్రాహ్మణ జాతి ,జనకుడు ఎలాంటి వాడో ,కొడుకు కులమేదో తెలీదు .తల్లీ తండ్రి ధర్మాన్ని తప్పితే జాతి మనుగడ ఉండదు .బ్రాహ్మణ కులంలో పుడితే మాత్రం మంచి బుద్ధులు వస్తాయా .విధి విధాన కర్మలు చేస్తేనే సద్గతి .’’మౌనంతో మనసు ఇంద్రియ ప్రాణ మారుతంబుల లో మగ్నం చేసి ,జిహ్వాగ్రాన్ని తిప్పి ,చిన్ననాలుకను గూటి లో చేర్చి ,చిన్ముద్రతో నిమీలిత నేత్రాలతో తనను మరచిపోయి నిన్ను దర్శించినవాడికి మళ్ళీ జన్మ ఉండదు .ద్వంద్వాలకుఅతీతుడవైన నీ రూపు ఎన్నతరమే కాదు .నాదబిందు కాలాతీత ,భేదరహిత వైరాగ్య గుణ రహితుడవు .అంటూ తనకు ఏమీ తెలీదని అంటూనే అన్నీతెలిసిన జ్ఞానవేత్తగా చక్కగా వర్ణించారు .
శుద్ధ సత్వ ప్రధానమై సూక్షం ఉంటుంది వెలుగు వెలుగుల వెలిగిస్తుంది .అన్నిటా వెలసి ఉంటావు .విను వీధిలో వేయిదళాల మండపం లో అష్టదళ పద్మం మధ్య సూర్యచంద్రులపైన ,మంచి మాణిక్య వర్ణంతో ,మణిగణ దీప్తంగా శుద్ధాంత తేజం తో ,వెయ్యి హంసలతో వేదాన్తవేద్యమై మిరుమిట్లు గొలుపుతూ దర్శనమిస్తావు .దీనినే శివుడు పార్వతికి ,రాముడు సీతకు చెప్పారు .రాముడు శివుడిని పూజిస్తాడు శివుడు రాముడే ఆదిమూలం అని అర్చిస్తాడు .కోరికలు లేని మనసు సాధించాలి .మనసు మహిమ తెలిసిన మనిషి లేనే లేడు..తర్వాత రుక్మాంగద అంబరీష ధ్రువ ప్రహ్లాద భక్తులకు దర్శనమిచ్చి ఇప్పుడు నాలాంటి వారు ప్రార్దిస్తూనే కనిపించనే కనిపించవు అప్పుడు ఉండి,ఇప్పుడు లేవా ?అంటారు .మేము పాపాలు చేసి ఉండవచ్చు మమ్మల్ని దారికి తేవటం నీపని కాదా అలా వదిలేస్తావా /అని సూటి గా ప్రశ్నించారు .కాళ్ళ బేరానికి వచ్చి ‘’కాపాడ వేమిరా కళ్యాణ విగ్రహా ,పాపల లో నున్న పరమ పురుష –మనసు నిలిపి మర్మం విప్పు అని ‘’ధూపం’’ వేశారు .విద్యలో అవిద్యలో ఉంటావు .సాక్షిగా ద్వంద్వరహితుడుగా ఉంటావు .సావయవ నిరవయుడవు .నిన్ను తెలుసుకోవటం ఆబ్రహ్మకు కూడా అసాధ్యం .తర్వాత సృష్టియేర్పడిన విధానం వివరించారు . అగ్ని,భూమికలిసి అహంకారమయ్యాయి .అగ్నిజాలాలు కలిసి చిత్తం పుట్టింది ,శిఖి ఆత్మకలిసి బుద్ధి పుట్టింది .ఆత్మ వాయువుకలిసి మనసు అయింది .ఆత్మ అంతరిక్షాలు ఏకమై జ్ఞాత అయ్యాడు అంటూ గహన వేదాంత విషయాలను అరటిపండు ఒలిచినట్లు చెప్పారు .తర్వాత నాద బిందు రహస్యం వివరించారు .ఓంకారమే రామ తారకం .లక్ష్మణుడు ఆకారం .శత్రుఘ్నుడు ఉకారం ,భరతుడు మకారం సీత బిందువు అర్ధమాత్రుడు రామ భద్రుడు అని రహస్యం విప్పారు .చివరలో ‘’నువ్వు గుణ హితుడవు నేను గుణ రహితుడను .నువ్వు దేవుడు నేను దేహి .నువ్వు సకలాత్ముడు నేను వికలాత్ముడను సత్తు చిత్తూ నువ్వు నేను చచ్చేవాడిని .నువ్వు మాయాతీతుడవు నేను మాయకు లొంగినవాడిని .నీకు చావు పుట్టుకలు లేవు నేను పుడుతూ చస్తూంటాను .నీకన్నీ తెలుసు .నాకు నేనే తెలియని అజ్ఞానిని .ధీరమతి నువ్వు. నేను దీనుడిని .సేవలు అ౦దు కొంటావు నేను సేవిస్తాను .నువ్వు ముక్తి ఇస్తే నేను యుక్తితో బతుకుతా .’’అయితే పశుపతీ! నీదయ ఉంటే నేనే నువ్వు అవుతా .’’అని అద్వైత బోధ చేశారు .
తర్వాత మంగళం చెప్పారుకవి .109వ చివరి సీసపద్యం లో –‘’వంగోలు సీమలో మైనం పాటి పురస్తుడను .బ్రహ్మజాతివాడిని .మైనం పాటి వంశం వాడిని .తండ్రి మాల కొంద్రాయుడు .తల్లి సీతమ్మ .అన్న రామ మూర్తి .అసలు యేకులం వాడినో నాకు తెలీదు . ‘’సీసములతోడ నోకమాల జేసి –మెడనువైచితి ,దాల్చి యిది మేటి యనగ-నిల్పు జగతిని,నీ యందె నిల్పు నన్ను-భవ వినాశ హరి హర పశుపతీశ’’అని ముగించారు .
ఈశతకం భక్తీ జ్ఞాన వైరాగ్య శతకం .కవి ప్రతిభ జ్ఞాన విజ్ఞానాలు ,పాండిత్యం తత్వ చింతన ప్రతి పద్యంలో ద్యోతకమైంది .అరుదైన అద్భుతమైన తరచుగా ఉదాహరించాల్సిన శతకం .రచన గంగా ప్రవాహం అందులో మునిగి,ముంచి తేలుస్తారు కవి .అన్నీ మూసుకొని ఆయన వెంట పడటమే ముక్తికి సోపానం .తానూ తరించి మనల్ని తరి౦ప జేశారు .మహా మంచి శతకాన్ని, సాకల గుణ స్వరూపుడైన కవి గారిని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .శతకం చదివితే భక్తీ ముక్తీ .ఇది ఇక్కుర్తి శతకం కక్కుర్తి శతకం కాదు .ఇష్టపూర్తిగా మనస్పూర్తిగా కూర్చిన శతకం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ – 21-6-23-ఉయ్యూరు

