రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -13
మోర్లె కి గోఖలే ఎలాగో మాంటేగు కు శ్రీనివాస శాస్త్రి అలా ..గోఖలే మోర్లేతో కలిసి సంస్కరణలలో విషయం పెంచాడు .ప్రభుత్వ ఇబ్బందులు గమనించి సానుభూతి కొంత చూపాడు .శాస్త్రి కూడా మాంటేగ్ సంస్కరణలకు అలానే చేశాడు .బిల్లును తయారు చేసే టప్పుడు మాంటేగు ని స్పెక్తెటర్ పత్రికా సంపాదకుడు ‘’బ్రిటన్ తో పూర్తీ సహకారం తో మీతో పని చేసిన ముఖ్యమైన ఇండియా నాయకుడు ఎవరు ?’’అని అడిగితె ‘’శాస్త్రి ‘’అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పాడు మాంటేగ్ .సంస్కరణల సమీక్ష సందర్భంలో శాస్త్రి అందులోని ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి , దోషాలు చెప్పి ,వాటిని మార్పి౦చటం లో కృతకృత్యుడయ్యాడు .1919 రిఫారంస్ యాక్ట్ ప్రకారం కేంద్రీయ శాసన సభ ను1- కౌన్సిల్ ఆఫ్ స్టేట్ గా ,2-లెజిస్లేటివ్ అసెంబ్లీ గా రెండుభాగాలుగా విడగొట్టారు .వీటిలో ఎన్నికైన మెజార్టి సభ్యులు ఉంటారు అధికార ప్రతినిదులు కూడా ఉంటారు .ప్రతి చట్టాన్ని వైస్రాయ్ ఆమోదించాలి .సభ్యులు ఒప్పుకోకపోయినా ఆయన ఆమోదించే అధికారం ఉంది.కేంద్ర ప్రభుత్వ నిరంకుశాదికారం ఉన్నప్పటికీ ,శాసన సభ్యులు ఎలాంటి అధిక్షేపణలైనా చేయచ్చు,ప్రభుత్వం పై ప్రభావం చూపించవచ్చు .రాష్ట్రాలు వాటి లెజిస్లేటివ్ కౌన్సిల్లను విస్తృతమైన ఓటర్ల చేత ఎన్నుకోబడుతారు .ఎక్సిక్యూటివ్ లు రెండు గ్రూపులుగా విభజింప బడ్డారు .దీన్నే శాస్త్రి మొట్టమొదటిసారిగా –డయార్కి అంటే ద్వంద్వ పాలన అని తిరస్కరించాడు .కానీ జాయింట్ కమిటీ రిపోర్ట్ వచ్చాక ఇష్టం లేకుండానే ఆమోదించాడు .ఫైనాన్స్ ,లా అండ్ ఆర్డర్ అయిన రిజర్వేడ్ సబ్జెక్ట్ లు గవర్నర్ ,అతడి సలహాదారుల చేతుల్లో ఉన్నా ,ట్రాన్స్ ఫర్డ్ సబ్జెక్ట్ లు మాత్రం లెజిస్లేచర్ కు బాధ్యత వహించే మంత్రుల చేతుల్లో ఉన్నాయి .ఇది గుడ్డిలో మెల్ల .
మాంటేగ్ సంస్కరణలకు కొన్ని పరిమితులున్నా ,భారతీయ రాజకీయ నాయకులు మంచి ఆలోచనా విధానంతో ప్రవర్తిస్తే ముందుముందు మంచి ఎక్కువగా జరగవచ్చు,ప్రజానీకానికి మేళ్ళు బాగా జరగవచ్చు అని శాస్త్రి భావించాడు .ఆ ఏడాది డిసెంబర్ చివర్లో ఆబిల్లు ఆచరణలోకి వచ్చింది .చక్రవర్తి ప్రకటన వెలువడింది .ఈ సందర్భంగా రాజకీయ ఖైదీలకు క్షమా భిక్ష లభించింది .నాయకులు ,ప్రజలు చాలా సంతోషించారు స్పెషల్ ట్రెయిన్ లో ప్రతినిధులతో బొంబాయి నుంచి అమృతసర్ లో జరిగే కాంగ్రెస్ సభలకు వెడుతూ తిలక్ ,చక్రవర్తికి హోమ్ రూల్లీగ్ కు కేబుల్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు .అమృతసర్ సభలో గాంధీ ఆ సంస్కరణలను బలపరచి ,మాంటేగ్ కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఆమోదిచాలనికోరాడు .జిన్నా దాన్ని బలపరచాడు .బిపిన్ చంద్రపాల్ చిత్తరంజన్ దాస్ లు కొన్ని సవరణలు ప్రతిపాదించినా ,తిలక్ మొదలైన వారంతా ఆసంస్కరణలు ప్రజల అభి వృద్ధికి బాగా ఉపయోగ పడతాయని ‘’బాధ్యతాయుత ప్రభుత్వాలుత్వరలోనే ఏర్పదేట్లు చూడాలాని కోరుతూ బలపరచారు . అమృత సర్ కాంగ్రెస్ లో ఈ తీర్మానం ఆమోదించిన ఒక ఏడాదిలోపే సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవటం ఊహించని పరిణామం .
సహాయ నిరాకరణ పై శాస్త్రి వైఖరి
1909లో లాహోర్ కాంగ్రెస్ లో ఒక బహిరంగ సభలో తిలక్ ,గాంధీని పొగుడుతూ’’..మనుషుల్లో మగాడు ,నాయకులకే నాయకుడు ,,దేశభక్తులకే దేశభక్తుడు గాంధీ .ఆయనలో భారతీయ మానవత్వం ఉన్నత శిఖరాలను అధిరోహించింది ‘’అని మెచ్చాడు ..అదో జగత్ సహోదరుల సర్వతోముఖాభి వృద్ధికి ఆయన చేసిన సేవ అపూర్వం అనిర్వచనీయం ఉత్కృష్టం .చా౦పరాన్ ,ఖేడాలలో ఆయన చేసిన సత్యాగ్రహాలు బాదితులపట్ల ఆయనకున్న ఆదరణ ప్రేమను వ్యక్తీకరించి మహోన్నతుని చేశాయి .రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన దేశవ్యాప్త హర్తాళ్ ఉద్యమం అపూర్వమైన విజయం .అమృతసర్ కాంగ్రెస్ లో మాంటేగ్ కు అభినందనలు తెలిపాడు .హంటర్ కమిటీ రిపోర్ట్ ను యూరోపియన్లు కిరాతక డయ్యర్ చర్యలను మన్నించి ,అభిన౦దిస్తే దేశం సిగ్గుతో తలదించుకొని పుండుపై కారం చల్లినట్లుగా భావించింది .ప్రశాంత మనస్కుడైన గాంధీ కోపం పరాకాష్ట కు చేరింది .అదేసమయంలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీ కిచ్చిన హామీ, ప్రతిజ్ఞ లను బ్రిటీష ప్రధాని మర్చిపోయి టర్కీ విచ్చేదనం చేయటం,ఖలీఫ్ గా టర్కీ సుల్తాన్ ను ఆరాధించే భారతీయ ముస్లిం లు అవమాన భారంతో ,కోప ఆవేశ క్రోధాలతో నిరసన వ్యక్తం చేశారు .గాంధీ సహాయ నిరాకరణ ప్రారంభించినప్పుడు ,ఆలి సోదరుల ఆధ్వర్యం లోని ఖిలాఫత్ కమిటి మద్దతు తెలిపింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-6-23-ఉయ్యూరు

