మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18

18,19-‘’ఇహీ బాగు బాగు ‘’ అంటూ నవ్వించే నల్లరామ్మూర్తి,ఆయన జంట సీతారాం

కోటపల్లి (నల్ల) రామమూర్తి ప్రముఖ తెలుగు చలనచిత్ర, రంగస్థల నటుడు. హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని చింతపర్రు ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించారు. సుమారు రెండు వేల నాటకాలలో, 112 సినిమాలలో నటించారు

విశేషాలు
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయనకు చదువు అంతగా అబ్బలేదు. చక్కని గాత్రం ఉండడంతో నాటకరంగాన్ని తేలికగా ఆకర్షించగలిగారు. తన 15వ యేటనే శ్రీకృష్ణతులాభారం నాటకంలో వసంతకుని వేషం వేసి అందర్నీ మెప్పించారు. ఇంగ్లీషు చదువు అబ్బకపోయినా తెలుగులో అనేక వచన గ్రంథాలను చదవడం వల్ల, నాటకాలలోని పద్యాలు కంఠస్తం చేయడం వల్ల అచిర కాలంలోనే రచయితగా మారారు. “తూర్పు సావిత్రి”, “సీతమ్మోరి వనవాసం”, “పండగ అల్లుళ్లు” మొదలైన హాస్యనాటికలను స్వయంగా రచించి తన బృందంతో ఆంధ్రదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చారు. గాత్రం కూడా ఉండడంతో అద్దంకి శ్రీరామమూర్తి, ఈలపాట రఘురామయ్య, పువ్వుల సూరిబాబు, కొచ్చర్లకోట సత్యనారాయణ, జొన్నవిత్తుల శేషగిరిరావు, స్థానం నరసింహారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు మొదలైన రంగస్థల నటులతో కలిసి అనేక పౌరాణిక నాటకాలలో హాస్యభూమికలు ధరించారు.

తన 65వ యేట తన స్వగ్రామమైన చింతపఱ్ఱు గ్రామంలో 1978, మార్చి 20వ తేదీన మరణించారు ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కొన్నేళ్ళ క్రితం సినిమాలలో నవ్వుల పంట పండించటానికి ఒక హాస్య జంట ఉండేది .అదే తొలి జంట ,చివరి జంటా.ఒకరు నల్ల రామమూర్తి రెండవవారు సీతారాం .ఇద్దరు ఒక ఊరివారు ఒకే సారి సినీ ప్రవేశం చేసిన వారూ కాకపోయినా ,సినిమా ఊరిలో కలుసుకొని ,కూడ బలుక్కుని మిత్రులయ్యారు .వీరిలో సీతారాం ముందు రంగు పూసుకొన్నారు అంటే సీనియర్ .అందరూ సీతారామయ్యా అని పిలిచేవారు .అంత పెద్దపేరు ఉంటె పెద్ద వాడు అనుకొంటారని హెచ్ ఎం రెడ్డిగారు’’ సీతారాం’’ గా మార్చారు .

1940లో బెజవాడకు చెందిన పోతిన శ్రీనివాసరావు గారు ఈయన్ను ‘’కాళిదాసు ‘’సినిమాలో వేషం వేయించటానికి మద్రాస్ పంపారు .ఆ కంపెనీ వాళ్ళు తిండి బస ఏర్పాటు చేసి నాలుగు నెలలు జీతం ఇస్తే హాయిగా తిరిగారు కానీ వేషం ఇవ్వలేదు .వేషం వేయించి డబ్బులు ఎగగొట్టే వాళ్ళే ఎక్కువగాఉన్న రోజుల్లో వేషం ఇవ్వకుండా నాలుగు నెలలు పోషించటం అపూర్వమే అంటారు సీతారాం .ఇంకో ప్రొడ్యూసర్ వేషం వేయించి డబ్బు ఎగ గొట్టగా ఈయన అడిగితే ‘’వేషం వెయ్యకుండా అప్పుడు హాయిగా అనుభావి౦చావుగా ఇప్పుడు నా సినిమాతో సరి బెట్టుకో ‘’అని ఝలక్ ఇచ్చాడు .’’ఇదీ హాస్యం అంటే ‘’అనిపించింది గురూగారికి .1941లో వచ్చిన తెనాలి రామకృష్ణ సినిమా లో మొదటి వేషం వేశారు .ఒక సారి అవుట్ డోర్ షూటింగ్ లో ఎండలో కూర్చోలేక చెట్టుకింద కూర్చుని ఏదో సరదాగా మన పురాణాలగురించి ముస్లిం భాయ్ పాడినట్లుగా పాడిన తానే రాసిన పాట పాడారు –అందులో ‘’ధర్మారాజుకీ తంబ్డు కుంభా కర్నూడు,దమయంతీనీ తీస్కుని ఎల్లి లంకామే పెట్టేతల్కి ,అనుమంతుడికి కోపం వచ్చీ ,పాతాళలోకం ఎగ్రి ,బెమ్మా ముక్కూ పట్కోని లాగే తల్కిబెమ్మకి మూడు ముకాలే అయినాయ్ బాబూ అల్లాతూహీ ‘’.దీన్ని రెడ్డిగారు విని ఆపాటను కాగితం మీదరాసి మ్యూజిక్ డైరెక్టర్ కిస్తే ట్యూన్ కడతాడని చెప్పగా ఆ పాటను ‘’సత్యమే జయం’’ సినిమాలో పెట్టారు ,వేషం ఇచ్చి ఆపాట పాడించారు కూడా

నల్ల రామమూర్తి తో స్నేహం కలియక ముందూ అడపా దడపా వేషాలు వేశారు ,ఇద్దరూకలిసి మొదటి సారిగా అగ్ని పరీక్ష సినిమాలో ‘’ఓ భాగవతం’’ఆడారు .సీతారాం నరసింహసామి, రామమూర్తి చెంచులక్ష్మి వేశారు .వాళ్ళ పాట వాళ్ళే పాడుకొన్నారు .పల్లెటూరు పిల్ల సినిమా నుంచి ఇద్దరూ జంటగా స్థిరపడ్డారు .అందులో ‘’చిటపట చినుకుల దుప్పటి తడిసెను తలుపు తీయవే భామా ‘’అని వాళ్ళు పాడిన పాట సూపర్ డూపర్ హిట్ అయింది .జంటగానే కాకుండా విడివిడిగా కూదాసినిమాలలో నటించారు .బాలరాజు సినిమాలో ‘’సూడ సక్కని సిన్నది ఆ మేడ గదిలో ఉన్నది ‘’అనే పాట ను సీతారాం పాడారు .ముగ్గురు మరాటీలు రత్నమాల,లైలా మజ్ను సినిమాలో పెద్ద వేషాలే వేశారు సీతారాం .ఎన్ని సినిమాలో వేశారో తెలీదు ఇచ్చింది జేబులో కుక్కుకోవటమే అని చెప్పేవారు .

ఈ జంట సైకిళ్ళ మీద తిరిగేవారు వాహినీ స్టూడియో దగ్గరే ఇల్లు కనుక షూటింగ్ లకూ సైకిళ్ళ మీదే .’’మాతోనే సైకిళ్ళు .ఏం తప్పా ?’’అనేవారు .

నల్ల రామమూర్తి ఇంటిపేరు నల్లకాదు.వాళ్ళ ఊర్లో ఇద్దరు రామ్మూర్తులు వేషాలు వేస్తూ ఉండేవారు ఈయన నల్లగా ఉంటాడు కనుక ఐ డేన్టి టి కోసం నల్ల రామమూర్తి అనే వారు .పాటలు పద్యాలుపాడటం కామిక్ రికార్డులు ఇవ్వటం ఆయనపని .తూర్పు యాసతో ‘’తూర్పు సావిత్రి ‘’,తూర్పు రామాయణం రాసి,పాడి , నటించి బాగా పాప్యులర్ చేసి అవార్డ్ లు పొందారు .ఈ సావిత్రిని రంగస్థలం మీద కూడా బాగా పాడేవారు.ఈ ప్రదర్శన చివరి సారి మద్రాస్ లో జరిగితే నటి వాణిశ్రీ అందులో సావిత్రిగా నటించారు .ఏదో చిన్నా చితకా వేషాలు వేసినా పల్లెటూరి పిల్లసినిమాతో గుర్తింపు వచ్చింది .నల్ల రామమూర్తి బ్రాండ్ హాస్యం ఏమిటంటే ‘’సీరియస్ గా మొహం పెట్టి నవ్వించటం సన్నని గొంతుతో నవ్వించటం .కస్తూరి శివరావు తీసిన పరమానందయ్య సినిమాలో కడుపుబ్బా నవ్వించారు రామమూర్తి .ఇక మాయాబజార్ సంగతి చెప్పక్కర్లేదు .మంచి మనసుకు మంచిరోజులు సినిమాలో ‘’ఇహీ బాగుబాగు ‘’ అని తరచుగా అంటూ గొప్ప హాస్యం పుట్టించారు.రాజ్యం పిక్చర్స్ కృష్ణ లీలలు లో బాలకృష్ణుని సఖులుగా వీల్లుసృష్టించిన హాస్యం ‘’కిత్త మూతి మామయ్యా ‘’అనటం మర్చిపోలేము .

సినిమాలలోసపోర్తింగ్ కేరక్టర్ లు వచ్చినా ,తరచూ నాటకాలకు వెళ్ళాల్సి వచ్చేదికనుక కమెడియన్ గానే ఉండిపోయారు .వేషాలు లేకపోతె వాళ్ళ వూరికి వెళ్ళిపోయేవారు .అందుకే పైకి రాలేక పోయానేమో అనేవారు ‘’ఉంటే మాత్రం పైకి వచ్చే వాన్ణా?చాల్లెండి సారూ ‘’అని నవ్వేస్తారు .తెల్ల పైజమా సిల్కు జుబ్బా ,కళ్ళ జోడు తోఆయన ప్రత్యేకంగా కనిపించేవారు .ఆంధ్రా క్లబ్ లో చెట్టుకింద కూర్చుని కబుర్లు చెబుతూ నవ్వించటం హాబీ .ఒక సారి సీతారాం ,రామ్మూర్తితో ‘’నాకు డైరెక్షన్ ఆఫర్ వచ్చింది .నువ్వు మంచి వేషం వెయ్యాలి ‘’అంటే ‘’సంతోషం నిర్మాత ఎవరు “’?అని అడిగితె ‘’వెతుకుదాంపద సైకిల్లెక్కి ‘’అని జోక్చేశారట .’’నాకు డైరెక్షన్ చాన్స్ వస్తే నువ్వు అసూయ పడతావా లేదా అని తెలుసుకోవతానికే అలా చెప్పాను నువ్వు అసూయ పడలేదు ‘’అన్నారటసీతారామయ్య ‘’నువ్వేం ఆస్య నటుడి వయ్యా బాబూ ‘’అన్నారట నల్ల .

విజయ చిత్ర సినిమా పత్రిక వారు డి.రామానాయుడుగారిని ఇంటర్వ్యు చేస్తూ ‘’మీ అభిమాన నటుడు ఎవరు ?’’అని అడిగితె క్షణం కూడా ఆలోచించకుండా ‘’నల్ల రామమూర్తి ‘’అని చెప్పారట .నాయుడుగారిచ్చిన ఈ గౌరవం చాలదూ అబ్బో కడుపు నిండి పోయింది అన్నారట రామమూర్తి .సినిమాల సంఖ్య,సంపాదించిన డబ్బు గురించి ఈ జంటను అడిగితె ‘’మనకో రేటు లేదండి .అభిమానంగా ఎవరు ఎంతిస్తే అంత తీసుకోవటమే .’’అనేవారు వీరికి ‘’లారెల్ అండ్ హార్డీ జంట’’ హాస్యం చాలా ఇష్టం .సిగరెట్టో,బీడీయో ఏది ఉంటె దాన్ని కాలుస్తూ,పీలుస్తూ సైకిళ్ళమీద తిరుగుతూ తృప్తిగా కని పించేది ఈ’’ ఆస్యపు సీతా నల్ల రామ్మూర్తుల జంట .’’వారిద్దరూ కనుమరుగైనా వారు పండించిన హాస్యం మాత్రం చిరంజీవే .

సశేషం

ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.