మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -411
411- ఎన్టి రామా రావు కు సాటి ,పోటీ అయిన అలనాటి అందాల నటుడు –మంత్ర వాది శ్రీరామ మూర్తి
12-11-1920 న మంత్ర వాది శ్రీరామ మూర్తి గుంటూరు జిల్లాలో జన్మించాడు .తండ్రి చిన శేషయ్య లాయర్ .గుంటూరు ఏ.సి కాలేజిలో బిఏ చదివి పాసయ్యాడు .చిత్రకళా మీద మంచి అభి రుచి ఉండేది .ఎన్నో పెయింటింగ్స్ వేశాడు .1951లో వచ్చిన ‘’ఆకాశ రాజు ‘’చలన చిత్రంలో మొట్ట మొదటిసారిగా తెరంగేట్రం చేశాడు .తర్వాత వరుసగా టింగు రంగా ,పేద రైతు ,రాజేశ్వరి ,మరదలు పెళ్ళి సినిమాలో 1952లో నటించాడు .పెంపుడుకొడుకు లో 1953లో ,జ్యోతి సినిమాలో1954లో నటించాడు .అంతే మూడేమూడేళ్ళు 7 సినిమాలలో నటించాడు .వ్యక్తి గతంగానే సినీ నటనపై ఆసక్తిలేక మానేశాడు .గుంటూరులో మెహర్ బాబా ఫోటో స్టుడియో పెట్టి విజయవంతంగా నడిపాడు .సినీ రంగంలో ఆనాటి నందమూరి తారక రామారో కు అన్నిటా సాటి ,మేటి అని పించుకొన్న నటుడు మంత్రవాది .91సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా సంతృప్తిగా జీవించాడు .కారులో కరీం నగర్ వెళ్లి తిరిగి వస్తు౦డగా దారిలోఅడ్డం వచ్చిన గేదె ను డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేయగా ప్రక్కన ఉన్నకాలువ లో కారుపడి పోయింది ఆ షాక్ కు ఆయన ప్రాణ జ్యోతి ఆరిపోయింది ఒక నటజ్యోతిఅనంతాకాశం లో కలిసింది .
మంచి రూపం మహా గొప్ప నటన ,బాగా డబ్బు సంపాదన ఉన్నకాలం లో ఇక సినిమాలు చాలు అని సంతృప్తి పడిన అరుదైన నటుడు మంత్రవాది శ్రీరామ మూర్తి .గొప్ప ఫాలోయింగ్ ఉండేది ఆనాడే ఆయనకు .దర్శక నిర్మాతలు ఎంత వత్తిడి చేసినా అంగీకరించలేదు నటించటానికి .చిన్నతనంలో నాటకానుభవం లేదు కానీ హై స్కూల్ రోజుల్లో అందరి బలవంతం పై ‘’నందలాల్ ‘’అనే నాటకం లో శివుడువేష౦ వేశారు .గుంటూరు కాలేజిలో ముక్కామల కృష్ణమూర్తి సీనియర్ .ముక్కామలతోచాలా నాటకాలలో వివిధ పాత్రలు ధరించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాడు మంత్రవాది .అప్పుడే నందమూరి తోఅక్కడే పరిచయం ఏర్పడింది .ఆజానుబాహువు, మహా అందగాడు స్ఫురద్రూపి శ్రీరామ మూర్తి. అందుకే మరో ఎన్టి.ఆర్. అనిపించేవాడు ఆరోజుల్లో .ఇంతటి అందగాడు సినిమా లో బాగా రాణిస్తాడు అనే అభిప్రాయం ఆనాటి నాటక సినీ సీనియర్ నటుడు,నాగయ్యగారి పోతనలో శ్రీనాథుడు ,పెద్దమనుషులు లో చైర్మన్ అయిన జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి కి అనిపించింది .స్వయంగా సినిమా తియ్యాలనుకొన్న శాస్స్త్రి ‘’మహారధి కర్ణ’’ సినిమా లో తానుకర్ణ పాత్రవేసి ,మంత్రవాదిని కృష్ణుడి పాత్ర లో పరిచయం చేయాలనుకొని మధురలో షూటింగ్ అనీ అన్నిఖర్చులు పెట్టుకొని వెయ్యి నూట పదహార్లు ఇస్తామని చెప్పాడు .రెండు నెలల్లో షూటింగ్ అన్నాడు .కానీ ఆకబురు రాలేదు సినిమా ఆగిపోయింది .ఇలా తోలి సినిమా పౌరాణిక కృష్ణ వేషం చెయ్యి జారిపోయింది మంత్ర వాదికి .రామారావు తో శాస్త్రి అదే సినిమా తీద్దామనుకొన్నా అదీ కుదరలేదు .
ఇక సినిమాలపై ఆశ వదిలి లా చదవటం ప్రారంభించాడు .1946ప్రభుత్వోద్యోగి అయ్యాడు మంత్రవాది .కొన్నేళ్ళ తర్వాత గౌరీనాధ శాస్త్రి తాను ‘ఆకాశరాజు ‘’సినిమా తీస్తున్నాననీ ‘’నువ్వే హీరో’’ అని వెంటనే రమ్మని టెలిగ్రాం ఇచ్చాడు .ఈ సినిమాకు విశ్వనాథ సత్యనారాయణ కధతో పాటు మాటలు ,పాటలు రాశారు .ఇక్కడకూడా ఒక తమాషా జరిగింది .ఈ సినిమాకు శాస్త్రి మొదట ఎన్తి. ఆర్ .నే బుక్ చేశాడు కానీ రెండు రోజుల్లో షూటింగ్ ఉందనగా విజయావారు ఆయన్ను పర్మినెంట్ ఆర్టిస్ట్ గా నెలజీతంపై బుక్ చేసుకొన్నారు .కనుక తప్పుకోవాల్సి వస్తే, జాక్ పాట్ మంత్ర వాదికి దక్కింది .వెంటనే మద్రాస్ వెళ్లి తనకు పరిచయమున్న ముక్కామల ఉంటున్న పాండీ బజార్లోని నారాయణ హోటల్ లోనే ఉన్నాడు .కానీ ఆకాశ రాజు సినిమా అట్టర్ ఫ్లాప్ అయి రెండో రోజే డబ్బాలు లేపేశారు . సాంకేతిక లోపాలతో స్క్రీన్ పై బొమ్మ బాగా కనపడక పోవటం మాట వినిపించకపోవటం ముఖ్య కారణం .భరించలేని ప్రేక్షకులు కుర్చీలు బల్లలు పగలగోట్టేశారు .తెర చింపేశారు .నిరాశపడ్డాడు మన హీరో .తర్వాత టింగ్ టింగ్ మంటూ టింగు రంగాలో అవకాశం వచ్చింది.ఇందులో ‘’రాజా మహారాజా ‘’అనే ఒక శాస్త్రీయ గీతం ఉంది.’’తాపీ తాత’’ పాటరాస్తే టివి రాజు సంగీతం కూరిస్తే ఘంటసాల మొదటిసారిగా పాడారు .ఘంటసాలకు ఇదే మొట్టమొదటి శాస్స్త్రీయ గీతం .రాజుకు కూడా ఇదే మొదటి సినెమా .పాట రాయటానికి ట్యూన్ కట్టటానికి రెండు నెలలు పట్టింది .ఘంటసాల పదిహేను రోజులు ప్రాక్టీస్ చేశారు .హీరో మంత్రవాది కూడా తీవ్ర సాధన చేశాడు .చివరికి 7నిమిషాలున్న ఈ పాటను సింగిల్ టేక్ లో రికార్డ్ చేసి రికార్డ్ సృష్టించారు ముగ్గురూ .తమజీవితంలో ఒక మంచి శాస్త్రీయ గీతం వచ్చినందుకు మాష్టారు ,రాజు ,శ్రీరామ మూర్తి పరమానందం పొందారు .ఒకరినొకరు బాగా అభినంది౦చు కొన్నారు.
రక్షరేఖ సిని దర్శకుడు పద్మనాభన్ తమిళ తెలుగు భాషల్లో నిర్మించే’’ రాజేశ్వరి’’ చిత్రంలో మంత్రవాది ని హీరోగా ఎంపిక చేశాడు.తమిళ హీరో ఎ౦ .జి . రామ చంద్రన్ .’’ఎందుకు ఈ ఫ్లాప్ నటుడు?’’ అని అసిస్టెంట్ డైరెక్టర్ లంక సత్యం గోల చేసినా డైరెక్టర్ వినిపించు కోలేదు .కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది .ఎమ్జీఆర్ సరిగ్గా నటించలేక పోతున్నాడని ,ఆయన్ను తీసేసి మన శ్రీరామ మూర్తికే తమిళ హీరో చాన్స్ ఇచ్చాడు డైరెక్టర్ .దీనికి ఓగిరాల రామ చంద్ర రావు సంగీత దర్శకుడు .అప్పుడు మన మామ మహాదేవన్ ఆయనకు సహాయ సంగీత దర్శకుడు .పాటలన్నీ ఘంటసాలతో పాడించాలనుకొన్నా, ఆయనకు ఖాళీ లేకపోవటంతో ఆ ఛాన్స్ పి.బి .శ్రీనివాస్ ను వరించింది .కానీ ఆయన డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉండటంతో పిఠాపురం నాగేశ్వర రావు కు ఆ అదృష్టం దక్కి అన్ని పాటలు పాడి హిట్ చేశాడు .అప్పటినున్చిఆయన్ను ఆంధ్రా రఫీ అనే వారు .ఇందులోంజలి దేవి హీరోయిన్ .భానుమతి మూడు భాషల్లో తీస్తున్న ‘’చండీ రాణి ‘’సినిమాలో హీరో రామారావు కు తండ్రి వేషం వేయమని మంత్రవాది ని కోరి మొదట యువకుడుగా ఉండి,తర్వాత ముసలి వాడు అయ్యే పాత్ర అనీ మూడు భాషల్లోనూ అతనినే నటించమని అడిగింది .పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా ‘’అప్పుడే ముసలి పాత్ర ఏమిటి అందులో రామారావు కు .నేను నటించను అని కరాఖండి గా చెప్పేశాడు శ్రీరామ మూర్తి .భానుమతిఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు .’’రామారావు హీరోఇజం ఆయనదే, ‘’నా హీరోఇజం నాదే .నేను చేయను.అందులో ఆకాశ రాజు ఫెయిల్యూర్ నన్ను వెంటాడుతోంది అదీకాక హిందీలో కూడా నేనే చేయాలంటున్నారు .నేను చేయను ‘’ ‘’అని గట్టిగా చెప్పిన వ్యక్తిత్వం మంత్రవాది ది , ఈపాత్ర చివరికి హాస్యనటి శ్రీలక్ష్మి తండ్రి అమరనాథ్ కు దక్కింది .
చిత్రకళపై అభిరుచి ఉన్న శ్రీరామ మూర్తి మద్రాస్ లోని మిత్రుడు టి. ఎన్. శాస్త్రి వద్ద ఆ కళ నేర్చి నిష్ణాతుడయ్యాడు .దేశనాయకుల చిత్రాలు పరమాద్భుతంగా వేసేవాడు .ఎగ్మూర్లో ‘’స్కూల్ ఆఫ్టర్ ఆర్ట్స్అండ్ వుడ్ క్రాఫ్ట్స్ ‘’ కాలేజి లో హెచ్ వి రామ గోపాలం అక్కాడ ఫైనలియర్ విద్యార్ధి .మంచి చిత్రకారుడు .శ్రీరామమూర్తి వేసిన నెహ్రు చిత్రాన్ని చూసి అభినందించాడు .అప్పుడు స్వర్గసీమ సినిమా నిర్మాణం జరుగుతోంది .ఆర్ట్ డైరెక్టర్ గా ఆకాలేజి లెక్చరర్ నారాయణ రావు ను తీసుకోగా ,రామ గోపాల౦ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా వెళ్ళాలి కానీ ,అతడు మిత్రుడిలో ఉన్న కళా ప్రతిభ తెలిసినవాడుకనుక శ్రీరామ మూర్తికి అవకాశం కల్పించాడు .కానీ వాహినీ వారినుంచి ఎన్ని నెలలైనా పిలుపు రాలేదు .హీరో కావాల్సిన వాడుకనుక ఈ అవకాశం మిస్ అయి ఉండవచ్చు .విధి చేసే వింత పని ఎవరికి తెలుసు ?కానీ మొదటి రెండు సినిమాలలో మంత్రవాది పెయింటర్ పాత్రలే పోషించటం యాదృచ్చికమే అయినా ,మనకు తమాషాగా ఉంటుంది .టింగ్ రంగా లో ఆయన చిత్రం వేస్తూ ‘’కవి కలముకు ,కళ కుంచె కు’’అని పాడిన పాట ఆ రోజుల్లో సూపర్ హిట్ అయింది .అందరి నాలుకలపై నర్తించింది .పెంపుడుకొడుకు అతడి ఆఖరి సినిమా .ఇక సినిమాలు వద్దు అనుకొన్నాడు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలనుకొన్నాడు .
గుంటూరు చేరి మెహర్ బాబా ఫోటో స్టుడియో పెట్టి ,బాగా సంపాదిస్తూ పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనీ హాయిగా గృహస్థ జీవిత మాధుర్యం అనుభవించాడు మంత్ర నగరాన్ని వదిలిన మంత్రవాది .అమెరికాలో ఉన్న కూతురు వద్ద ఆ దంపతులు చాలాకాలం ఉన్నారు .1-2-2011 న మంత్రవాది కరీం నగర్ నుంచి కారులో హైదరాబాద్ వస్తుంటే ,ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి డ్రైవర్ ,కారు పక్కకు తిప్పగానే అది కాలువలోకి జారిపోగా ,ఆ షాక్ కు గుండెపోటు వచ్చి అందాల నటుడు మంత్రవాది శ్రీరామమూర్తి 91వ ఏట అక్కడికక్కడే మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-23-ఉయ్యూరు
