స్త్రీ శక్తిపై కవితలు -1

  ‘’స్త్రీ శక్తి ‘’పై

సరసభారతి 31-3-19శ్రీ వికారి ఉగాది వేడుకలలో

నిర్వాహించిన కవిసమ్మేళన కవితలు -1

విన్నపం –వచనకవిటలలో ఎక్కడైనా కవిత పలచబడిందని ,పునరుక్తమైనదని నేను భావించిన చోట్ల మార్పులు చేసి ,ధారకొనసాగి ,చిక్కబడేట్లు చేశాను .నా సాహసాన్ని మన్నించండి –దుర్గాప్రసాద్

1-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375

             వర్ణించ తరమా !

అమోఘం ,అద్వితీయం అసదృశం,ఆదర్శనీయం

అజేయం అప్రమేయం ,అనితరసాధ్యం అనుసరణీయం

స్త్రీ శక్తి నిరుపమానం అనిర్వచనీయం

చులకనగా చూస్తే చురకత్తి వేటే

ఆరాధిస్తే అమ్మతల్లి జగదంబే

గృహిణిగా ఇంటికి ఇల్లాలే

ధర్మకార్యాలకు సహధర్మ చారిణి

ఆమె లేకుంటే హీరో అవుతాడు జీరో

ఆమె తోడుంటే శిఖరాగ్రాన నిలుస్తాడు

ఒకే నాణానికి బొమ్మా బొరుసు ఇద్దరూ

ఎవరు లేకున్నా చెల్లుబాటుకారు .

2-శ్రీమతి ఎం.సరస్వతీదేవి –ఉయ్యూరు

  స్త్రీశక్తి

స్త్రీ శక్తికి ,ప్రేమకు త్యాగానికి మారుపేరు

భూమిపై వెలసిన దేవత-

అమ్మతనం కై పునర్జన్మ నెత్తే సహనమూర్తి .

సబల అబలకాదు అన్నది యుగాయుగాలమాట

తల్లి చెల్లి భార్య బిడ్డా పేరేదైనా

ఎదిగి ఒదిగే ప్రేమమయి ,త్యాగమయి .

కలంతోపాటు హలమూ పట్టగలనేర్పరి

పాకం లోనే కాదు కధనం లోనూ ఆమె సాహసి

గద్దెమీదేకాదు గగనం లోనూ విహరించే దీమతి

సీతాసావిత్రే కాదు చింతలసీతాదేవి

శకు౦తలాదేవీ,ఆనందీ జోషి ,కాదంబరీ గంగూలీ

సుబ్బులక్ష్మి ,పట్టమ్మాళ్ ,లతా సుశీల, జానకి

అన్నిటా విశ్వకీర్తి నార్జించారు .

ఇందిరా సరోజినీ అరుంధతి ,చందాకొచ్చర్

థెరిస్సా ,ఆన౦దమయి  డొక్కా సీతమ్మ

అన్నపూర్ణలు కరుణామయి లు

ఆదర్శనారీమణులు ,జాతి శిరోరత్నాలు .

3-శ్రీమతి వై బి టి సుందరి –మచిలీపట్నం

                మాతృమూర్తి

మాతృమూర్తికన్న మిన్న మహిలోన –మరి లేరు ఎవరూ

మమతానురాగాల ప్రత్యక్ష దేవత మాతృమూర్తి

ప్రసవవేదన మరచి ,బిడ్డ ఎదుగుదలకు ఉప్పొంగి పరవశించు

చనుబాలతోపాటు శక్తి పంచి ఇచ్చి

బుడిబుడినడకలకు ఆన౦దాను భూతిపొందు

వేదశాస్త్ర పురాణాలలో అమ్మస్థానము మిన్న 

అమ్మఋణం తీరనిది తీర్చలేనిది .

4-శ్రీమతి మందరపు హైమవతి –విజయవాడ -9441062732

కంటి రెప్పల కోటల్లో

తలచుకొంటేనే గుండె చెరువైపోతుంది

తూనీగే ఎగిరినా ,పావురమే వాలినా

కళ్ళ ఆల్చిప్పలో  విప్పార్చుకొని ఆశ్చర్య౦గా

అకారణంగా నవ్వులపువ్వులు విరజిమ్మే పాపాయి

ఎవరి జోలికి వెళ్ళింది ,ఎవరి నేమి చేసిందో ఆరేళ్ళ అమ్మాయి 

కత్తులగోళ్ళతోరక్కి ,బాకుల చేతులతో కుమ్మి

ఆ ఒక్క అవయవం పై –

ఇంతదారుణంగా ,పాశవికంగా –మనుషులేనా అసలు వీరు ?

అంతా జరిగాక నష్ట పరిహారమిస్తారు –సరే

రూపాయి కట్టలేమైనా పాపాయి నవ్వుకు సరిపోతాయా ?

చిన్నారి ముద్దుమాటలకు సాటి ఔతాయా ?

అమ్మలారా ఒక విజ్ఞప్తి

కోడి తనపిల్లల్ని రెక్కల కింద పొదిగి కాపాడుతుంది

బయటికి పోయేటప్పుడు పిల్లల్నీ వెంట తీసుకు పొండి .

ఈ దేశం లో రక్షణకన్నా ఆడపిల్లలకు

పసుపు కుంకుమలు ,వితంతువులకు ఫించన్లు

ఠంచన్ గా అందుతున్నప్పుడు

తల్లులారా !మీరే కాపాడుకోండి

పిల్లల్ని మీ  కంటి రెప్పల కోటల్లో .

5-శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్నం –

   స్త్రీ శక్తి

1-సీ-స్త్రీమూర్తి శక్తికి శీఘ్ర నిర్వచనము –స్థిర చిత్త యగుట స్త్రీ సుగుణము

పట్టుదలయు ,కృషి ప్రత్యేకతై –పనులు సాధించి ప్రగతి నొందు

సాధనకును భర్త సహకరించిన సతి –మేలైన ఫలితమ్ము ,మెప్పు పొందు

ఆబల యంచనగ ను సబలయై –పోరటమునగెల్చు పొలతి విధిగ

తే.గీ-ప్రతి పురుషునకును స్త్రీశక్తి పత్నిగాను – మాత, సోదరి ఏ రూపమైనగాని

వెనుకనుండగ విజయమగును –తరుణి విలువ తెలుసుకొను తరుణమగును .

2-వనితగా జన్మించవరమగు నన్నచో –పుడమిని పూబోడి పుణ్యమగును

 ఇల్లాలుగను జేయు  నింటిని స్వర్గము –శాంతి సౌఖ్యమ్ము లొసంగు చుండు

క్షమయా ధరిత్రియై ,కలతలు లేకను –అత్తమామల జూచు నాదరముగ

మమతతో పెంచు చు మాతయై పిల్లలన్-ఉత్తములుగ దీర్చు నున్నతులుగ

బాల,కన్య ,యువతి, ప్రౌఢ దశలుదాటి –ముదిమినైన నెంచు ముదము పంచ

పతియు ,పిల్లలగును పడతికి భాగ్యము –వెలది చూచు నింట వెలితి లేక .

3-ఆదర్శమహిళగ నలరగ మగువకు –శక్తి సామర్ధ్యముల్ శంభుడొసగె

 ముగ్గురమ్మలకును మూలపుటమ్మగు –ఆది శక్తియు నిచ్చె నదిక శక్తి

మానసికబలమాత్మాభిమానమ్ముల-మానిని నిలుచును మాన్యయగుచు

కష్ట సుఖమ్ములు  కావడి కుండలు –యంచని మదిని తలంచు కవికి

ఇంతి యే సమస్యలైన నింపు గొలుపు –ఆత్మ విశ్వాస పటిమను అధిగమించు

నిండుపున్నమి వెన్నెల నింపి నెలత –స్వర్గమనిపించు గృహమును చక్కగాను .

4-మాతృ దేశమ్ము పై మాత మమత నింప –ఎందరో దేశభక్తి పరులైరి

వీరపత్నులు గూడి వీరులనంపిరి –దేశ రక్షణ కోరి దిశదిశలకు  

మహిళ ఝాన్సి లక్ష్మి మహిషాసురాంతకి-వోలె విజ్రుమ్భించె నాలమందు

ఏకాలమందైన  ,యేదేశమందైన –ఉత్సాహవంతు లై యువిదలుండు

ఆధునిక యుగమ్ము నన్ని రంగమ్ముల –ముందడుగు వేయు ముదితనేడు

ప్రగతి పథము నడువ పాటుపడుచుండు-శక్తి యుక్తులు సహజమ్ములనగ..

6-డా. శ్రీమతి కొమాండూరికృష్ణా –విజయవాడ -9246434485

                   ‘’  శ్రీ ‘’శక్తి

1-శ్రీ విష్ణు మహిమకొంత -హ్రీశక్తికిచ్చినంత

శ్రీలక్ష్మి ఇలను చెంత- స్త్రీమూర్తిగా నిలచె నంత

2-అణిమాది గరిమమహిమ –ఆదిశక్తితొ కూడినంత

నరకాది మహిషాసుర –హతము చేసి వెలిగెగ

3-స్వాతంత్ర్య కాంక్ష దీక్ష –ఆంగ్లజాతి నణచె దక్ష

అపర కాళిగ నిలిచిన-మననాగమణి’’కర్ణిక ‘’.

4-చిన్నమ్మ చానమ్మలూ-బాలపాపమ్మ ,పోచమ్మలూ

నాగమ్మ ఐతమ్మలూ –మగువ మాంచాలి రుద్రమ్మలూ

5-సుబ్బమ్మ ,రత్నమ్మలూ –ఉన్నవ లక్ష్మమ్మలూ

కనపర్తి ,ఊటుకూరి –ఆచంట ,అచ్చమా౦బా .

నాణానికి మరోవైపు

6-  కైక వరములె-రాము కాననకు  పంపినా

  రామరావణ రణములో –సీత సహనమెగెలిచెగా

(సహనమే శక్తి )  

7-పుష్పాకాదులు నింగిలో –సిరుల వెలుగులు నింపగ

‘’పరకాల ‘’ప్రభల తోడ –సీత రామన్నను చెరెగా.

7-డా.జి మేరీ కృపాబాయి  -మచిలీపట్నం -9989347374

   మహిళ

నీవు మహిళవు –కదనరంగం లో కదను త్రొక్కే వేళ

తిరుగుబాటు చేసి ధృవతారగా తళుక్కుమన్నవేళ

నీవు ఝాన్సీ లక్ష్మీ బాయి .

కన్నబిడ్డను అందలమెక్కించే వేళ-నీవు వీరమాత జిజియాబాయి

జాతి పిత  గాంధీ వెన్నంటి నిలిచినవేళ-నీవే కస్తూరిబాయి .

అందంగా బోధించిన వేళ-సేవ చేస్తూ సమాజంలో మెరిసినవేళ

కలం పట్టి రచించినవేళ-నీవే సావిత్రీబాయి

గెరిల్లా యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించినవేళ

ప్రారంభవిజయం సాధించిన వేళ

స్వాతంత్రోద్యమాన్ని సాగించినవేళ

నీవే భీమాబాయి .

పండిట్ బిరుదు గెలుచుకున్నవేళ

సంఘ సంస్కర్తగా మారిన వేళ

స్త్రీ సాధికారతకు చిహ్నంగా నిలిచిన వేళ

నీవే రమాబాయి –నీవు మహిళవు

అందలమెక్కే సబలవు –నీవు మహిళవు .

8-శ్రీమతి ఎస్.అన్నపూర్ణ –విజయవాడ -9493312028

స్త్రీ ఓమహాశక్తి

స్త్రీ మహాశక్తి –ప్రకృతిశక్తి

తల్లియై జీవనధారయై ,సర్వజీవుల పోషకశక్తి

బాధలో అక్కున చేర్చే ఆదిశక్తి

నిత్యజీవిత చైతన్యశక్తి సర్వం సహా మూలశక్తి

ఉత్సాహ బుద్ధిబలాలకు జీవశక్తి

కారుణ్య శక్తి  కమనీయ స్పూర్తి ,ఉద్దీపక శక్తి

 ఆగ్రహాన కాలశక్తి అఖండ తేజోమయ మహాశక్తి

స్త్రీ రూపమై భువిని విరాజిల్లుతూ

లోకాలను సాకుతున్న సాత్వికశక్తి

ప్రేమిస్తే జీవామృత శక్తి

కామిస్తే కాళికా శక్తి

స్త్రీశక్తి –నిత్య సత్య స్వరూప భువనైక శక్తి .

9-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర –విజయవాడ –

  స్త్రీ శక్తి

శిష్టులను రక్షించి

దుస్టులను దునుమాడు కాళీమాతా వందనం

స్వాతంత్ర్య సమర శంఖారావం

పూరించిన ఝాన్సీ లక్ష్మీబాయీ జోహారు

పురుషులకు దీటుగా రాజ్యపాలన చేసిన

రాణీ రుద్రమా౦బా నమోవాకాలు

అనాధలను ఆరోగ్యహీనులను ఆదరించిన దయామయీ

మదర్ తెరీసా ప్రణామాలు

అంతరిక్ష వీర విహారం చేసిన జూహీచావ్లా అభినందనలు

స్త్రీశక్తిని గుర్తించని పురుషులనెదిరిద్దాం

ఆడదానిపై మృగాలుగా దాడి చేసే మృగాళ్ళ

పాలిటి సంహార శక్తులమవుదాం

సహనం సాహసం ఓరిమీ ,కూరిమి యే

మన ఆయుధాలు .

10-మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –విజయవాడ -9299303035

శక్తి స్వరూపిణి స్త్రీ

1-కం-ఆకాశపు కోవెలలో –సాకారము నందినట్టి సాత్విక శక్తే

చీకాకులు తొలగించగ-ఆకారము దాల్చి వచ్చెన వనికి దయతో .

2-తే.గీ.-మూడు రూపాల నుండెడి ముద్దుగుమ్మ –మూడు శక్తులు కలిగిన మూలశక్తి

ముదము గూర్చంగ పుట్టెను ముదితగాను –ముగ్గురమ్మల మూలమే మూర్తి ,శక్తి .

3-సీ.-జగదంబ వోలెను జనియి౦పజేయును –పెంచును సంతును ప్రేమతోడ

పోషించు బిడ్డలపురుషోత్తముని వోలె-పుణ్యపు రాసియై పొందికగను

శక్తి నిచ్చుకొరకు శయని౦పజేయంగ-జోకొట్టు లీలగా జోలతోడ

లయము నందగ జేయు లాలిత గుణి యౌచు –దుష్ట బుద్ధు లిలను,దురితములను

ఆ.వె.-బ్రహ్మ ,విష్ణు హరులు రమ్యంబుగా జేయు –క్రియలనెల్ల చేయు కృపను జూపి

అమ్మ మామ్మ చెల్లి అమ్మమ్మఆలిగా –అన్నిరూపు లందు యామెగలదు .

4-సీ-కత్తిపట్ట గలదు కదనరంగము నందు –కలము పట్టిన వ్రాయు గ్రంథములను

కారు రైలు నడుపు ,కాపురమ్ము నడుపు –కాంత చేయగలేని కార్యమేది ?

ఎక్కు శైలములైన ,ఎన్ని విద్యలనైన –మిన్నగ నేర్చును మి౦చ శక్తి

దేశమేలగలదు దివ్యమౌ యుక్తిని –సబలయనుచు తాను శక్తి చూపు

ఆడదాడదనుచు నాడించ నెంచిన –శిక్షవేయగలదు దుస్టులకును

ఆత్మ బలము తోడ నతివ నడుచు చుండె-ఆత్మబలమెయామె యాయుధమ్ము.’’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.