శ్రీ పబ్బిశెట్టి వారి మూడు పాయల కవితా కృష్ణ
శ్రీ పబ్బిశెట్టి వెంకటేశ్వర్లు గారితో నాకు ముఖ పరిచయం లేదు .నాలుగు రోజులక్రితం వారు రాసిన మూడు విలువైన పుస్తకాలు పంపగా అందాయి .వెంటనే వారికి ఫోన్ చేసి అందాయని చెప్పాను .గొంతు కొంచెం వణుకుతున్నట్లు అనిపించింది.ఇవాళ పుస్తకాలు చదివాక వారు నాకంటే కేవలం ఒక నెల చిన్న వారు అని తెలిసింది .ఇద్దరం ‘’యైటీ ఫోర్’’వాళ్ళమే అవటం సంతోషంగా ఉంది .వీరు పంపిన పుస్తకాలు –1-పసిడి పలుకులు -2012,2-వసుధ శతకం -2022,3-వనగోపాలుడు -2023.కవి గారి గురించి వివరాలు .ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామం లో 1-7-1940న శ్రీ దత్తయ్య గాలెమ్మ దంపతులకు జన్మించారు .హిందీ లో ఎం .ఎ. –అంటే సాహిత్యరత్న .కన్నడ భాషలో డిప్లమో పొందారు .త్రిపురాంతకం లో హిందీ ఉపాధ్యాయులుగా చేసి నాలాగానే 30-6-1998 న రిటైరయ్యారు ..తర్వాత అక్కడే ప్రభుత్వజూనియర్ కాలేజి లో హిందీ లెక్చరర్ గా చేసి రిటైరయ్యారు .పైన చెప్పిన మూడు పుస్తకాలుకాకుండా ,మానసబోధ రాశారు . వీరి అముద్రిత రచనలు –గడియారం ఆత్మకథ –కన్నడ తెలుగు ,మబ్జన్న తమ్ముడు –బాలగేయవాటిక ఉన్నాయి .7-5-1966 ప్రయాగలో హిందీ యూనివర్సిటి వారు ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఆనాటి కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారి చేతులమీదుగా ’’సాహిత్య రత్న’’పురస్కారం అందుకొన్న అరుదైన అదృష్టవంతులు . ‘ .మార్కాపురం ఆకాశ వాణి ద్వారా చాలా ప్రసంగాలు చేశారు ఏకపాత్రాభినయం ,పద్యపఠనం తో మెప్పించారు.వీర పాండ్య కట్టబ్రహ్మన గా వీరి ఏకపాత్రాభినయం ప్రసిద్ధమైంది . వితంతు వివాహం చేసి సన్మానం పొందిన ఆదర్శమూర్తి .ప్రస్తుతం ఒంగోలులో స్థిరపడ్డారు .
కవిగారు జన్మించిన మార్కాపురం మండలానికి ఒక విశిష్టత ఉంది “కృతయుగే గజారణ్యే, త్రేతాయాం మాధవీపురీ ద్వాపరే స్వర్గసోపానం, కలౌ మారికాపురీ” అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు, కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలుచేవారని అర్థం. మార్కాపురం చెన్నకేశవస్వామివారు అవతరించిన పుణ్యస్థలం. స్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షి రచించిన ‘గజారణ్య సంహిత’ ద్వారా మనకు తెలుస్తోంది.
కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి ‘మారికాపురం’ అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే ‘మార్కాపురంగా’ మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న ‘చెన్నరాయుడుపల్లె’కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.[2] ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఇక్కడ బసచేశాడు. ఇక్కడ శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం దగ్గర విజయసూచిక నిర్మించాడు..
అలాగే ఉద్యోగించిన త్రిపురాంతకం మహా పుణ్య క్షేత్రం .శివుడు త్రిపురాసురులను సంహరించిన దివ్య ప్రదేశం .ఇక్కడి .శ్రీ బాలా త్రిపురాసు౦దరి ఆలయం జగత్ప్రసిద్ధం .త్రిపురాంతకం దాటితే శ్రీశైలమే. శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారల ఆవాస క్షేత్రం పవిత్ర కృష్ణానది ఇక్కడ పాతాళ గంగ గా ప్రసిద్ధం .ఇంతటి నేపధ్యం ఉన్నకవిగారు కమ్మని పద్యాలు రాసి అందర్నీ మెప్పించారు .
1- కవిగారి పసిడిపలుకులు –మంచి వారి చెలిమి మంగళకరం ,సంకటం లో ఉన్న వారికి సాయపడుట మేలు ,మంచి చెడులు తెలిసి మసలవలె జగతిలో , సాగర జలమెపుడు సాగుకు కూడదు ,నీదు దోషములను నిజమిత్రుడెరిగించు,గ్యాసు పొదుపు చేయు ధ్యాస ఉండవలయు ,వాహనంబా వందనంబు .ఈ పసిడి పలుకులశతకానికి మకుటం –‘’పబ్బి శెట్టిపలుకు పసిడి పలుకు’’.
2-వసుధ శతకం – ఆట వెలదులతో ఆడుకొంటూ ముసలి వయసులో ఈ శతకం రాశారు కవి .’’వాస్త వమ్ము నిదియె –వసుధ లోన ‘’అనేది శతకమకుట౦.ఇందులోనూ చక్కని నీతులు బోధించారు .తెలుగు తీపిదనము –తెలుగు కమ్మదనము –మరువకెప్పుడు నీవు మనసులోన ,అమ్మకన్నమిన్న అవనిలేదు ,మానవుడుగా పుట్టి మంచి చేయాలి ,మందుకొట్టి అలసుగా చూడబడకు ,మంచివారిని మరువరాదు ,కలతలన్ని మరచి –కలిమి కాంక్షను వీడి –సమతమమత తోడసంతసమున –పరుల హితముకోరి-బ్రతుకుటే ఘనమౌను – వాస్తవమ్ము నిదియే –వసుధ లోన ‘’
3-వనగోపాలుడు –బాలల నాటిక –గురు భక్తిని ,శ్రీకృష్ణుని ప్రేమ కృపా వాత్సల్యాన్ని తెలియజెప్పే నాటిక .గోపాలుడు పేదతల్లి కొడుకు .రోజూ వాడిని బడికి పంపుతూ కృష్ణుని తలచుకొంటూ దారిలో వాడికి భయం లేకుండా చేయమని కోరుకొంటుంది .చదువు పూర్తయ్యాక గురువుగారికి అందరూ విలువైన కానుకలు సమర్పిస్తే గోపాలుడు తల్లి ఇచ్చిపంపిన పెరుగు ముంత మాత్రమె ఇవ్వగలిగాడు .దానినే అక్కడి వారందరికి వడ్డిస్తూఉంటే ,ఎంత తీసినా పెరుగు తరగక పోవటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది .ఇది వనమాలి అక్షయ కటాక్షం అని అతడి తల్లి భక్తికి మెచ్చిన కృష్ణుడు చూపిన కృపఅని అందరు అర్ధం చేసుకొంటారు .
పద్య రచనలో కవిగారి ప్రతిభ బాగా కనిపిస్తుంది ధారాళంగా సాగుతుంది పద్యం.నీతులు సుద్దులు మురిపెంగా ఉన్నాయి .తేట తెలుగు తీయదనం నిండిన మూడు రంగుల జండా లా పవిత్రం .గుండ్లకమ్మ వాహినిలా ,కృష్ణమ్మ లోతూ ప్రవాహంగా కవిత్వం ప్రవహించింది .కవిగారికి మనఃపూర్వక అభినందనలు .చక్కటి ముద్రణ, అర్ధవంతమైన ముఖ చిత్రాలు తో ఈపుస్తకాలు కరతల కమలాలుగా ఉన్నాయి .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-23-ఉయ్యూరు

