మిథున జనకుడు శ్రీరమణ
పేరడీ శ్రీరమణ గా ప్రసిద్ధి చెంది ,ప్రేమ పల్లకీ మోసి ,రంగులరాట్నం లో తిరిగి ,గుత్తొంకాయ్ కూర వండి ఆంధ్రబావలకు రుచి చూపి ,కామ్ గా సరసకామ్ నిర్వహించి,సింహాచల సంపెంగ ను అన్నిచోట్లా విరగపూయించి ,జేబులో బొమ్మతో జేజేల బొమ్మా బొరుసు ఆడి,టీ కప్పులో సూర్యుని కని , పూలలో పడగలు చూపి ,స్టాలిన్ లో వెంకట కృష్ణ ను అవతరింపజేసి , ,హాస్య జ్యోతి వెలిగించి ,నవ్య నవ్యంగా మొదటిపేజీ తీర్చి దిద్ది ,శ్రీకాలం కు శ్రీకారం చుట్టి ,చిలకల పందిరి వేసి ఆహ్లాద పరచి ,శ్రీరామాయణ ,మహాభారతాల రామణీయకతను వెలికి దీసి ,అందులో మానవ సంబంధాలు వెతికి పట్టుకొని ,శ్రీ చానెల్ లో స్థిరపడి ,తెలుగు వ్యంగ్యాన్ని ఉయ్యాలలూగించి ,అన్నిటికి మించి తెలుగు కథను విశ్వ వీధిలో అజరామరంగా నిలిపే ‘’మిథునం ‘’కు జనకుడయ్యాడు వంకమామిడి రాధాకృష్ణ ,మరియు కామరాజు రామారావుఅనే తనపేరును కన్ఫ్యూజ్ కాకుండా ‘’శ్రీ రమణ ‘’గా తీర్చి దిద్దుకొన్న శ్రీ రమణ . ,బాపు రమణల వీరాభిమానియై ,అఆడుగు జాడలలో నడిచి ,మరో హాస్య శ్రీ రమణ అయ్యాడు శ్రీరమణ .
వెంకట రమణ రాస్తున్నాడో, ఈ రమణ రాస్తున్నాడో అన్న విషమ పరీక్ష చదువరులకు పెట్టిన పరీక్షాధికారి .మానవత్వం ఆయన మతం ,అభిమతం .నవ్వు నవ్వించు అనేది తత్త్వం .నవ్వులో జీవితం పూయించటం హాబీ .గుంటూరు జిల్లా వాడైనా గుంటూరు కారం రచనలలో చూపించక ,మమకారం ,మనసునిండా నవ్వు పూయించిన విశాల హృదయుడు .ఈ చేయి తిరిగిన మొనగాడు’’ సినేమా’’ నూ సుసంపన్నం చేశాడు .మిథునం కథను బాపు స్వహస్తం తో రాసి శ్రీరమణ కీర్తికిరీటానికి మరో కలికితురాయి చేర్చి స్నేహానికి గొప్ప వారధి నిర్మించాడు . ఈ కథ శ్రీరమణ బాల్యం నుంచి మనసులో నాటుకున్న అక్షరరూపం ఎన్నో సంప్రదాయ కుటుంబాల కథ ‘’అని తానే చెప్పుకొన్నాడు .ఇలా అన్నిటా నవ్వులు పండించిన శ్రీరమణ 21-9-1952లో జన్మించి ,19-7-2023న డెబ్భై ఒకటవ ఏట హైదారాబాద్ లో మరణించి, దేవలోకం లో హాస్యం పండించటానికి వెళ్ళిపోయాడు మనకు శూన్యం మిగిల్చి .
కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ఒక కార్యక్రమం లో శ్రీరమణ పాల్గొని ఒక పురస్కారం అందుకొని అద్భుత ప్రసంగం చేశాడు .అప్పుడు ఆయనతో నేనూ మా శ్రీమతి చాలాసేపు మాట్లాడుతూ గడిపాం .నవ్వుతూ హాస్యం చిలికిస్తూ,అనేక విషయాలు ముచ్చటిస్తూ ఉన్నాడు వేదిక ఎక్కే దాకా .ఆతర్వాత కలిసే భోజనాలు చేశాం అక్కడే .మరో జ్ఞాపకం బందరులో శ్రీ రావి రంగారావు జరిపిన సభలో శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు ,శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ,శ్రీ వీరాజీ మొదలైన వారు మాట్లాడిన సభలో నేను రెండు నిమిషాలు మాట్లాడుతూ శ్రీరమణ ‘’మిథునం ‘’గురించి చెప్పి అది ఆధునిక క్లాసిక్ కథ అనీ, దాన్ని గురించి వేదికపై నున్న పెద్దలు మాట్లాడక పోవటమేమిటి అన్నాను .మర్నాడు ఉదయం శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి ఆరాత్రి కొమ్మూరి తనతో ఫోన్ లో మాట్లాడుతూ ఆ ఉయ్యూరాయన మనకు మంచి కథ జ్ఞాపకం చేశారు అభినందనలు తెలియ జేయి అన్నారట .ఇది నాకు గర్వకారణం అయినా ఆగర్వానికి అర్హుడు శ్రీ రమణ . తెలుగు హాస్యంఇప్పటికే ఒక’’ రమణ’’ ను కోల్పోయి ,ఇప్పుడు ఈ ‘’శ్రీరమణ’’ నిష్క్రమణతో బోసి పోయింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-23-ఉయ్యూరు

