కిరాణా ఘరానా కు చెందిన సంగీత విద్వాంసుడు అబ్దుల్ కరీంఖాన్
అబ్దుల్ కరీంఖాన్ లేదా ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ (నవంబరు 11, 1872 – 1937), 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు
జీవితం
అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ, గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద, మామ అబ్దుల్లా ఖాన్ వద్ద శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా – వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్.
సంగీత ప్రస్థానం
మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై, ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానే అబ్దుల్ కరీంఖాన్‌ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్‌బాయ్ కేర్కర్కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణెలో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.
కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.
అబ్దుల్ కరీంఖాన్ శిష్యుల్లో అగ్రగణ్యులు
· సవాయి గంధర్వ
· సురేష్‌బాబు మానె
· హీరాబాయ్ బరోడేకర్ లు.
అబ్దుల్ కరీం ఖాన్ అక్బర్ ఆస్థాన గాయకుడు మహా విద్వా౦సుడు అయిన తాన్సేన్ అవతారం అని సంగీతజ్ఞుల భావన .ఖాన్ గానం వినటమే ఒక మధురానుభూతి .’’రామ నీ సమాన మెవరురా ‘’అనే త్యాగరాజస్వామి కీర్తన ఖాన్ ఆలపిస్తుంటే భక్తీ పారవశ్యం ఆయనకే కాదు మనకూ కలుగుతుందని శిలలు ద్రవిస్తాయని ప్రత్యక్షంగా విని ఆనందించిన సంగీత రసపిపాసి శ్రీ ఆచంట జానకి రాం తన –‘’నా స్మృతి పథం లో ‘’రాశారు .ఎంతో ఊహిస్తూ ,ఊహి౦పజేస్తూ ఎంతో అనుభవింప జేస్తూ నిజమైన రామ భక్తిని వెల్లడించారు అని పొంగిపోయారు జానకిరాం..గంటకు పైగా యమన్ రాగాలాపన చేసి మంత్ర ముగ్ధుల్ని చేస్తారుఖాన్ .అందులో ఆయన అన్వేషణ ఆశ ,నిరాశా ప్రతిఫలిస్తాయి .క్షణ క్షణం కొత్తదనం కనిపిస్తుంది .ఆ రసవాహినిలో ఆయన మానవ మాత్రుడు కాదు అనే పవిత్ర భావం కలుగుతుంది .ఎంత మాధుర్యం ఎంత హాయి ఎంత తేజస్సు ఖాన్ గారి గానంలో అని పరవశించారు ఆచంట జానకిరాం ..ఆపాట వింటుంటే ఎప్పుడో జన్మాతరంలో జరిగిపోయిన పూర్వ గాధను గురించిన స్మృతులను ఆర్ద్ర హృదయంతో పునశ్చరణ చేసుకొంటున్నట్లుగా ఉందన్నారు .ఏదో అపూర్వ స్వప్న సీమలోకి మనల్ని లాక్కెళ్లి పోతారు ఖాన్ .కానీ అక్కడ విడిచిపెట్టరు చటుక్కున మెలకువ వస్తుంది .మళ్ళీ ఈలోకానికి వచ్చేస్తాంరాగబద్ధమైన మైన ఆయన కేకతో .ఎంతో సేపయ్యాక పాటనిలిపి ,సంగీతాన్ని గురించి ముచ్చటిస్తారుఖాన్ .’’అనుభవి౦చటమే గాన కళకు ప్రాణం ‘’అంటారు కరీం ఖాన్ .శ్రీరాముడిని అచ్చంగా కళ్ళ ఎదుట సాక్షాత్కరింప జేసుకోలేని వారు త్యాగయ్యగారి ‘’రామ నీ సమాను లెవరురా ‘’పాట జోలికి రాకూడదు అన్నారు ఖాన్ జీ .తన రామనామ సంకీర్తన విని నాస్తికులు కూడా ఆస్తికులు ,పరమ రామ భక్తులు అయితేనే తన గాన కళ, కళ గా ఉపయోగిస్తుంది అన్న పరమ రామభక్తాగ్రేసరుడు అపర తాన్సేన్ అబ్దుల్ కరీం ఖాన్ .
శ్రీ ఆచంట జానకిరాం గారికి నమస్సులతో –
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-23-ఉయ్యూరు

