మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -4(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )
1885లో కాకినాడలో శ్రీ దినవహి హనుమంతరావు అనే సంపన్నుడు మిత్రులప్రోత్సాహంతో ఒక నాటక సమాజం స్థాపించి తెరలకే అయిదు వేల రూపాయలు ఖర్చు చేశారు .అందులో వైజర్స్ అప్పారావు .జయంతి భావనారాయణ కవి,ఆనేసాలు భీమ సేనరావు ,కంచి ఆనందరావు ,వల్లూరి సూర్యప్రకాశరావు ,కోపల్లె రమణారావు ,రాయవరపు హనుమంతరావు మొదలైన వారు పాత్రలు ధరించేవారు .మేనేజర్ సింగితపు అబ్బాయి అనే మధ్వ బ్రాహ్మణుడు .ఆనంద రావు మంచి హాస్యం చెప్పి రంజింప జేసేవాడు నాయుడుగారుకూడా అతన్ని పిలిపించి తమనాటకాలకు హాస్యం చెప్పించేవారు .
పారిజా తాపహరణం తర్వాత చిలకమర్తి వారు ‘’నల ‘’నాటకం రాస్తుండగా . రాజు వేషం వేసే పిళ్ళారి శెట్టి రామ కృష్ణమ్మ నాయుడు కవి గారి దగ్గరకు వచ్చి,నలుడుపాత్ర తనకు ఇమ్మని పద్యాలు పెట్టద్దని ఒకవేళ ఒకటి రెండు పద్యాలున్నా భావం కూడా రాయమని విసిగిస్తే చిలకమర్తి గారికి కోపం వచ్చి ఆనాటకం నిలువుగా చించిపారేశారట .నాటక సమాజం వారు చూసి దాన్ని జాగ్రత్త చేసి కాపీ రాసుకొని చాలా సార్లు ఆనాటకం ప్రదర్శించారట .నలపాత్ర ను కవిగారి శిష్యుడు దుర్గి గోపాల కృష్ణారావు ధరించాడు .పద్యాలు మహా కమ్మగా పాడి మెప్పించేవాడు .ప్రకాశం గారు దమయంతి వేసేవారు .ఈ నాటకం అచ్చు వేయలేదని కవిగారు చెప్పారు దానికి కారణం బళ్ళారి లోని ఆంధ్రనాటక పితామహ శ్రీ ధర్మవరపు కృష్ణమాచార్యులవారు ‘’చిత్ర నలీయం ‘’నాటకం రాసి ,’’సరస వినోదిని ‘’నాటక సమాజం స్థాపించి ,మద్రాస్ వెళ్ళి ఆనాట కాన్ని తానె నలుడి పాత్ర ధరించి ప్రదర్శించారు .అక్కడి ఆంధ్రులు దానికి బ్రహ్మ రధం పట్టారు .అనాటకాన్ని తెప్పించుకొని చిలకమర్తి వారు చదివించుకొని ,అన్ని విధాలా అది తన నల నాటకం కంటే బాగున్నదని భావించి ,దాని ముందు తననాటకం బలాదూర్ అని అచ్చు వేయించ లేదని వారే చెప్పుకొన్నారు .అదీ చిలకమర్తి వారి గొప్పతనం .దాని ప్రతికూడా ఆయన దగ్గర లేదట .ఏ నాటకం రాసినా రెండవ ప్రతి రాసి ఉంచుకోవటం తనకు అలవాటు లేదని చెప్పారు .రాసిన ప్రతి సమాజం వారికిచ్చేవారట .
1890 మార్చి లో ‘’సీతారామ కళ్యాణం ‘’నాటకం రాశారు చిలకమర్తి .శ్రీరామనవమి నాడు హనుమంతరావు నాయుడు గారి సమాజం దాన్ని ప్రదర్శించింది .బ్రహ్మ సమాజ గురువు శ్రీ శ శివనాద శాస్త్రి రాజమండ్రి రెండవ సారి వచ్చినప్పుడు వీరేశలింగం గారింట్లో ఉన్న ఆయన్ను చూడటానికి చిలకమర్తి వారు వెడితే ,ఆదరంగా మాట్లాడుతూ ‘’Local Shakspere ‘’అని సంబోధించి గౌరవించారు .ఆయన పై ఈయన పద్యాలు రాసి వినిపించారు .నాయుడు గారి సమాజం చిలకమర్తి గారు రాసిన నాటకాలే కాక ,శ్రీ ముడు౦ బై రామానుజచార్యులవారి ‘’సిరియాళరాజు చరిత్ర ‘’,’’పాండవాశ్వమేధం ‘’,వేరెవరో రాసిన ‘’సారంగధర ‘’నాటకాలేకాక వీరేశ లింగం గారి ‘’చమత్కార రత్నావళి ‘’కూడా ప్రదర్శించేవారు .స్త్రీల పాత్రలను ప్రకాశం గారే కాక ,యరగర్ల సత్యరాజు గారు కూడా ధరించేవారు .ఈయనా అందంగా ఉన్న యువకుడే .ఆకారం స్త్రీ వేషానికి బాగా తగినట్లు ఉండేవారు అన్నారు చిలకమర్తి .ప్రకాశంగారు సారంగధర లో ‘’రత్నాంగి ‘’వేస్తె సత్యరాజు ‘’చిత్రాంగి ‘’వేసేవాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-23-ఉయ్యూరు

