ఉయ్యూరు పంచదార ఫాక్టరి స్థాపకుడు శ్రీ అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య

ఉయ్యూరు పంచదార ఫాక్టరి స్థాపకుడు శ్రీ అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య

సుమారు నూట పాతిక సంవత్సరాలక్రితం కృష్ణా మండల జీవనాభి వృద్ధికోసం పాటు పడిన  కుటుంబాలలో అడుసుమిల్లి వారి కుటుంబం ఒకటి . ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ విద్యావంతులకు ,గ్రామవాసులకు  సత్సంబంధాలు కల్పించటానికి కృష్ణా జిల్లా సంఘం వారు మండల సభలను జరిపేవారు .కృష్ణా పత్రిక స్థాపించారు .సంచార కార్యదర్శులను నియమించారు .అప్పుడే అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు ,ఆతర్వాత సూర్యనారాయణ గారు చూపించిన అభిమానం మరువరానిది .వీరి తర్వాత తమ తండ్రి ,అన్నగార్ల గ్రామ జీవనాభిలాష ,నిరాడంబర జీవితం అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య గారికి కూడా సంక్రమించాయి .

  గోపాల కృష్ణయ్య  గారికి ఆంగ్లభాషలో అసలు పరిచయం లేదు . తెలుగులోనూ  అంతంత మాత్రమె ..వక్తృత్వం అస్సలు లేదు .వ్యవసాయమే వృత్తీ .కుగ్రామం లో నివాసం .రాజకీయంలో ప్రవేశించి ,జయప్రదంగా కొనసాగించటానికి ఆధునిక శిక్షణ అసలే లేదు .స్వార్జితం స్వయం కృషి మాత్రం పుష్కలంగా ఉన్నాయి .అవే ఆయన పెట్టుబడులు . వాటితోనే కృష్ణా మండల రైతాంగానికి రైతాంగానికి నాయకులుగా ,ప్రజాహిత జీవనంలో గణి౦పదగిన వ్యక్తిగా ఎదిగారు .ఆ నాయకత్వం ఆయన చురుకైన బుద్ధి బలం వల్ల వచ్చిందే కాని ,పాకులాడి ప్రయాస పడితే వచ్చింది కాదు .

 నాయకులైన గోపాలకృష్ణయ్యగారి నిగర్వం ఆదర్శంగా ,ఆయన గ్రామీణ జీవనాభిలాష అనుసరణ యోగ్యం గా ఉన్నాయి .ఆజానుబాహు మూర్తి .విశాలమైన ముఖం ,ప్రకాశవంతమైన కళ్ళు .దృఢమైన చెక్కిళ్ళు ఆయన నాయకత్వానికి ప్రతీకలు .కక్షలు జరిగినా వ్యతిరేక ప్రచారం తీవ్రంగా ఉన్నా ,ఆయన అనుయాయులకు ఆయనపై భక్తీ విశ్వాసాలు ఏమాత్రం తగ్గలేదు .ఆవేశాన్ని మాటలరూపం గా తప్పితే క్రియా రూపంగా ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు .మాటలు మాత్రం తూటాలే .కాని మనసుమాత్రం మెత్తన .స్నేహభావం జాస్తి .ఉపకార బుద్ధితోపాటు ఆశ్రిత పక్షపాతమూ ఎక్కువే .ఎవరెన్ని రకాల కఠినంగా విమర్శించినా ఆయన కపటం లేని మనిషి అని అందరూ ఒప్పుకొంటారు. అదీ ఆయన ప్రత్యేకత .

 గోపాల కృష్ణయ్యగారి నిష్కల్మష హృదయం అందర్నీ ఆకర్షించేది .అంతటి ఆశ్రిత పక్షపాతి ,అంతటి స్నేహపాత్రుడు అరుదు అనే వారు .మాట కొంత కర్ణ కఠోరమే.పైగా అప్పుడు జస్టిస్ పార్టి ఊపులో ఉంది .బ్రాహ్మణేతర ఉద్యమం హై పిచ్ లో  ఉన్నది. ఈ  రెండూ గోపాల కృష్ణయ్యగారిని ఆవహించాయి . అమహాప్రవాహంలో అందర్లాగానే ఆయనా కొట్టుకుపోయారు .ఆఉద్యమాలవల్ల చాలామంది బాగుపడ్డారు ప్రాబల్యం ,ప్రాముఖ్యం సంపాదించారు .కానీ గోపాలకృష్ణయ్యగారుమాత్రం వాటిని స్వప్రయోజనానికి ,స్వలాభానికి మాత్రం ఉపయోగించుకోలేదు .ఆయన వల్ల ఉద్యమానికి బలం కలిగిందికాని ,ఉద్యమం వలన ఆయనకు కలిగిన ప్రయోజనం మాత్రం లేదు..వెనక ఉంటూ ఉద్యమం నడిపించారు కాని ముందు ఉండి సారధ్యం వహించలేదు .జిల్లాబోర్డు ఎన్నికలు ,శాసన సభ ఎన్నికలు వచ్చినా అవి ఆయనకు మూన్నాళ్ళ ముచ్చటలే .

   క్రమంగా గోపాల కృష్ణ య్యగారి దృష్టి రాజకీయాలనుంచి ,పారిశ్రామిక రంగం వైపుకు మరలింది .ఆయన దేనిలో తన శక్తి సామర్ధ్యాలు బుద్ధి పెడతారో అది విజయవంతం అయి తీరాల్సిందే .ఉయ్యూరులో పంచదార కర్మాగారం గోపాలకృష్ణ య్య గారి ముందుచూపు వల్లనే రూపు దిద్దుకోన్నది .అప్పటికే మన దేశంలో పెద్ద పంచదార ఫాక్టరీలలో ఇది ఒకటిగా పేరు పొందింది .కానీ యంత్రాలయ నిర్వహణ మనకు కొత్త .కనుక మొదట్లో చాలా డక్కామక్కీలు తిన్నారు .క్రమంగా గాడిలో పెట్టారు. రైతులకు కొంగుబంగారం అయింది ఫాక్టరి .అయన పెద్ద జమీందారు అయినారైతు వేషమే .గొప్ప ధనికుడు అయినా మూడవక్లాసులోనే ప్రయాణం ..నాయకుడు అయినా గ్రామజీవియే .

 ఒకసారి విదేశీయులు ఉయ్యూరు వచ్చి షుగర్ ఫాక్టరి చూసి ,గోపాల కృష్ణ య్యగారి కృషిని ప్రశంసిస్తే ఆయన ‘’మామేకేం మేకు సార్. మా  మేకు మీ మీకంత  గొప్పది కాదు .మీమేకే మేకు ‘’‘’అని అన్నారని నవ్వుతూ శ్రీ పరుచూరి గోపాలకృష్ణ ఉయ్యూరులో అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యఅండ్ షుగర్ కేన్ గ్రోయర్స్  డిగ్రీ కాలేజి1975లో  ఏర్పడి ,తెలుగు లెక్చరర్స్ నియామకానికి ఇంటర్వ్యు జరిగినపుడూ హాజరై  నాతో, మిత్రులతో అన్నారు .పగలబడి నవ్వాం .ఆయన సెలెక్ట్ అయ్యారు .మేము కాలేదు .

1941లో కెసిపి ఫాక్టరిగా మారింది .గోపాలకృష్ణయ్యగారి అల్లుడు సైంటిస్ట్ టెక్నీషియన్  శ్రీ వెలగపూడి రామకృష్ణారావు ఫాక్టరి అభివృద్ధికి గొప్ప కృషి చేశారు .ఆయనతర్వాత ఆయనకుమారులు లక్ష్మీ దత్ ,మారుతి రావు గార్లు యజమానులయ్యారు .ఆతర్వాత అన్న దమ్ములు విడిపోగా ,మారుతి రావు గారికి ఉయ్యూరు ఫాక్టరి వస్తే దత్తుగారికి మాచర్ల సిమెంట్ ఫాక్టరి మద్రాస్ లోని వర్క్ షాప్ వచ్చాయి .ఉయ్యూరు షుగర్ ఫాక్టరి ఆసియాలోనే పెద్ద ఫాక్టరి అని గుర్తింపు పొందింది .పంచదార నాణ్యత కు కూడా చాలా ప్రసిద్ధి .ఒకప్పుడు ఇక్కడ మనం చిన్నప్పుడు తినే బిళ్ళలు తయారు చేసేవారు .ఆల్కహాల్ ,అసిటిక్ ఆసిడ్ ,సోడా గాస్ తయారు చేస్తారు . .ఉయ్యూరు సోడా గాస్ కు కూడా మంచిపేరు ఉంది .ఈ ఫాక్టరి చల్లపల్లి దగ్గర లక్ష్మీపురం లో ఉన్న చల్లపల్లి రాజాగారి షుగర్ ఫాక్టరీని కూడా కొని నడిపింది .ప్రస్తుతం ఆఫాక్టరి పని చేయటంలేదు .ఉయ్యూరు పరిసర గ్రామాల అభి వృద్ధికి రోడ్ల నిర్మాణాలకు పాఠశాలల  నిర్మాణానికి ,రక్షిత మంచినీటి సౌకర్యాలకు ,రైతుల కార్మికుల సంక్షేమానికి సామాజిక సేవకు మహిళా సేవకు రోటరీ సంస్థకు కెసిపి సంస్థ విస్తృత సేవలు అందించింది .

  గోపాకృష్ణయ్యగారిది గుడివాడ దగ్గర సిద్ధాంతం అనే గ్రామం .ఆయన ఎంత పొదుపరో ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యే శ్వరరావు అంత దుబారా మనిషి అనీ ,ఆయన మద్రాస్ లో చదువు పూర్తి అయి గుడివాడ కు స్పెషల్ ట్రెయిన్ లో వచ్చారని మా చిన్నప్పుడు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అక్కడమండల ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలిచారు .కాంపు  రాజకీయాలు అప్పుడే మొదలయ్యాయని చెప్పేవారు .ఓటర్లను కొనటం అప్పుడే మొదలు అయిందని చెప్తారు .ఆయన ఇంటికి మేము ఒకసారి వెళ్ళినట్లు జ్ఞాపకం ఎందుకు ఎప్పుడు వేళ్ళమో గుర్తులేదు . బహుశా శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి ఎం .ఎల్ సి . ఎన్నికలకు అని లీలగా గుర్తు .ఉయ్యూరు డిగ్రీ కాలేజి ప్రారంభానికి సుబ్రహ్మణ్యేశ్వర రావు గారు రావటం ,ఆతర్వాత ఆయన తమ్ముడు గారు కూడా పాలకవర్గం లో ఉన్నజ్ఞాపకం .తర్వాత కాలేజీని బెజవాడ సిద్దార్ధ వారు తీసుకొన్నారు .

 ఇంతకు మించి అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య గారి గురించి వివరాలు తెలియలేదు .మొదలు రాసిన వివరాలు మాత్రం శ్రీ అవటపల్లి నారాయణరావు గారి ‘’విశాలాంధ్ర౦ ‘’పుస్తకం లోనివి .మిగిలినవి నాకు తెలిసినవి .గూగుల్ లోనూ దొరకలేదు .తెలుగు వెలుగులు లోనూ లేదు.ఎవరికైనా ఇంకా వివరాలు తెలిస్తే ,తెలియజేయండి .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-24-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

2 Responses to ఉయ్యూరు పంచదార ఫాక్టరి స్థాపకుడు శ్రీ అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య

  1. విన్నకోట నరసింహారావు says:

    ఉయ్యూరు పంచదార ఫాక్టరి చరిత్ర ఆసక్తికరంగా ఉంది.

    శ్రీ వెలగపూడి రామకృష్ణ గారిని టెక్నిషియన్ అన్నారేమిటి? వి.ఎల్.దత్తు, మారుతి రావు, రాజేశ్వరి గార్ల తండ్రిగారైన వెలగపూడి రామకృష్ణ గారే కదా? ఆయనయితే ఆయన ఒక ICS ఆఫీసరండి. జిల్లా కలెక్టరు, తదితర ఉన్నత పదవులు బ్రిటిష్ వారి పాలనాకాలంలో నిర్వహించిన వ్యక్తి. ఆయన ఆనాటి మద్రాసు ప్రభుత్వంలో Director of Industries గా పని చేస్తున్నప్పుడు KCP గ్రూపు (Krishna Commercial Products) మొదలెట్టారు. ఆ గ్రూపే ఉయ్యూరు పంచదార ఫాక్టరీని take over చేసింది.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.