నంద్యాల కేసి కెనాల్ ఆనకట్ట కాంట్రాక్టర్ ,ఆటోమొబైల్ ,సినీరంగాలలో రాణించిన ఉదార శీలి –శ్రీ సయ్యద్ రహ్మతుల్లా సాహెబ్
నంద్యాల తాలూకా లో 1908లో మౌల్వీ దాదా పీరాన్ సాహెబ్ ,జహీరా దంపతులకు శ్రీ సయ్యద్ రహ్మతుల్లా సాహెబ్ జన్మించారు .తండ్రి నంద్యాల తాలూకా మొత్తానికి ఏకైక మౌల్వి అంటే ఇస్లాం మత పురోహితుడు .రహ్మ తుల్లా యవ్వనం లో కాడి పట్టి వ్యవసాయం చేశారు .తండ్రితో ,తమ్ముడు సయ్యద్ అబ్దుల్లా హై తో కలిసి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ నిర్మాణాలు చేసే ప్రతిభ ఏర్పడి నైపుణ్యానికి ,నాణ్యతకు ప్రసిద్ధి పొంది బాగా రాణించారు .వీరి నైపుణ్యానికి నిలువు టద్దం గా, ఈ నాటికీ నంద్యాల డివిజన్ కు సాగునీరు తాగు నీరు అందిస్తున్న సంత జూటూరు పికప్ కేసి కెనాల్ ఆనకట్ట సాక్ష్యంగా ఉంది .
రహ్మ తుల్లా సినీ డిష్ట్రిబ్యూషన్ రంగం లోనూ బాగా రాణించి ,వివిధ వ్యాపారాలను నిర్వహించి సంపన్ను లయ్యారు .సంపాదించిన డబ్బును పేదలకు ,దాన ధర్మాలకు సద్వినియోగం చేసి వితరణ శీలురు అనిపించుకొన్నారు .ఆ రోజుల్లో వీరి ఉదార సహాయాన్ని పొంది వృద్ధిలోకి వచ్చిన కుటుంబాలు వందలకొద్దీ ఉన్నాయి . వీరంతా తమ ఇళ్ళల్లో దుకాణాలలో రహ్మ తుల్లా ఫోటోలు పెట్టుకొని నిత్యం పూజించటం వారి కృతజ్ఞతకు నిదర్శనం . వీరి కుటుంబం రవాణా రంగం లోనూ ప్రవేశించి బస్సులు వాన్లు లారీలు , రిపేరింగ్ షాపులనూ నిర్వహించి ప్రజలకు మరింత దగ్గరయ్యారు .నంద్యాలలో ఆటోమొబైల్ రంగానికి ఆద్యులయ్యారు .
ఉదారత్వం ,దాన శీలం సచ్చరిత్ర లతో రహ్మ తుల్లా హిందూవులకు కూడా బాగా దగ్గరయ్యారు .సహన గుణం కల మంచి మనసు ఆయనది.రాజకీయ నాయకులతోనూ మంచి సంబంధాలు ఉండేవి ప్రత్యక్షంగా రాజకీయం లో పాల్గొన లేదు .పదవులలో లేకపోయినా ,కోటీశ్వరులు కాకపోయినా ఉన్న దానిలో నలుగురికి సాయం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందారు .1964లో సయ్యద్ రహ్మతుల్లా 56 వ ఏట అల్లాను చేరారు .
ఆధారం – నంద్యాలకు చెందిన విద్వాన్ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సేకరించిన సమాచారం ఆధారం గా శ్రీ జి.శుభాకర రావు రాసిన వ్యాసం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-24-ఉయ్యూరు.

