చల్లగా మెల్లగామధురంగా సాగిన శ్రీమతి పల్లావఝల శైలజ గారి ‘’అమూల్య’’ ‘’శ్రీ సాయి చరిత శతకం ‘’
నిన్న డిసెంబర్ 29 ఆదివారం బెజవాడ లో జరిగిన ఆరవ ప్రపంచ తెలుగు రచయితల రెండవ రోజు సమావేశం లో నాకు ఈ శాతకాన్ని కవయిత్రి శైలజ ఇచ్చిఅభిప్రాయం కోరారు .ఆమె ఇంటి పేరు చూస్తె ఉయ్యూరులో మా ‘’ముత్తయ్య మాస్టారు ‘’అంటే పల్లా వఝాల మృత్యుంజయ శార్మగారు జ్ఞాపకం వచ్చి ఆయనతో నా ఆనుభవాలు చెప్పాను .మా పార్ది గారి అరుగుపై సాయంత్రం వేళ మేము జరుపుకొన్న గోష్టులు ఆయన మాకు భమిడిపాటి వారి ‘’ అంతా ఇంతే ‘’ నాటకాన్ని నేర్పి ఉయ్యూరు హైస్కూల్ లో ప్రదర్శింప చేయటం గుర్తుకు తెచ్చుకున్నాను .ఆయన గోదావరి జిల్లాలో ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసి రిటైరై వారిఅత్తగారి ఊరు ఉయ్యూరు వచ్చి, మా బజార్లోనే ఇల్లుకొని కాపురం ఉండటం గుర్తుకు తెచ్చాను .శైలజ గారికి బెల్లం కొండ వారు బంధువులే .ఆఇంటి పేరున్నవారు వీరంకిలాకు దగ్గర హనుమంతపురం అనే గడ్డి పాడులో,మొవ్వా పాలెం లో ఉన్నారు.ఉయ్యూరు లో మా ఇంటికి రెండవ ఇల్లు బెల్లంకొండ వారిదే .బెల్లం కొండ సుబ్బయ్య గారు వెంకమ్మ గారు మాకు ఆత్మీయులు .వారి కుమారుల్లోకృష్ణ మూర్తి నాకు హై స్కూల్ క్లాస్మేట్ .
ఇక శతకం లోకి ప్రవేశిద్దాం .ఇదే మొదటి రచన .’’విద్యలు కోర్కెలు అనుగ్రహిస్తూ ,’’ధారగా సిరులు కురిపిస్తూ ,కూరిమి చూపు దైవం బొజ్జ గణపయ్య కు అవిఘ్నమస్తుగా నమస్కారం చేసి ,’’తానె గణపతి యయి ,తానేయై భారతి –నడుచునట్లు జేసి నాదు కలము –శతకమొకటి వ్రాయశక్తినిడిన సాయి –కంకితమ్ము జేసి అంజలి ‘’ఘటించారు .గోదారి జిల్లా మధురకవి శ్రీ మంకు శ్రీను ఈమెకు పద్య రచన నేర్పి ప్రోత్సహించారు .మంకు గారితో ఉయ్యూరులో ఉన్న మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పై శతకం రాయించి ,ఆయనతో పాటు మరిద్దరు కవులు శ్రీ తుమ్మోజు రామా లక్ష్మణా చార్యులు శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ గార్లచే చెరో శతకం స్వామి పై రాయించి మూడుశతకాలను ఒకే రోజు మా సువర్చలాన్జనేయస్వామి దీవాలయం లోమాఘమాసం లో ఒక ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం లో ఆవిష్కరించి ,ఘనంగా సత్కరించి విందు ఏర్పాటు చేసిన విషయం జ్ఞప్తికి వచ్చింది . .ఆట వెలదులతో శతకం రాషారు . ’’శ్రద్ధబూని చదువు సాయి చరిత ‘’అనేది శతక మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీకరుడు సాయి శిరిడి గ్రామబున –వేప తరువు క్రింద వి౦త యోగి –యవతరించె,ప్రజల కధ్యాత్మ గురువుగ-శ్రద్ధ బూని చదువు సాయి చరిత ‘’ సాయి గురుని శ్రేష్టత ,అవతరణ అలతి అలతి పదాలతో చెప్పారు .గొప్ప జ్ఞాని లా కూర్చున్న బాలసాయి ‘’మానవుడు కాదు మహనీయుడు ‘’అనే పవిత్ర భావాన్ని ప్రజలు దర్శన మాత్రంగా పొందారు .నమ్మిన వారికి సాయి కొంగు బంగారం .చిన్మయ రూపుడు సాయి ‘’పాండురంగడే’’అన్నాడు వృద్ధ భక్తుడొకడు ,.మొదట మహల్సా స్వాగతించి పకీరు ను ‘’సాయి ‘’ఆని గౌరవ నామం తో సంబోధింఛి,సాయిని భక్తకోటి హృదయాలలో సుస్థిరం చేశాడు .తిరగలి లో ఉన్న వేదాంతాన్ని చెప్పాడు సాయి –పైన తిరిగే రాయి భక్తీ ,తిరగని అడుగున ఉండే రాయి కర్మ ,పిడి జ్ఞానం .
గోపాలరావు గుండ్ శ్రీ రామనవమినాడు ఉర్సు ఉత్సవం ప్రారంభించాడు .ముస్లిం అయిన అమీర్ ద్వారకా మాయి లో చందనోత్సవం జరిపించాడు .సాయి హారతి మహా నేత్రపర్వం, జన్మ ధన్యం చరితార్ధం .’’చేత కర్ర ,త౦బి రేకు డొక్కా ‘’తో తిరువీధులలో భిక్షమేట్టి అజ్ఞానుల పాపాలను తాను పొంది జ్ఞానం ఇచ్చే మహాత్ముడు సాయి భగవాన్ .సాయి శయన లీల దేవతలకూ పరమాశ్చర్యం . ,చోల్కర్ బాబా దర్శనం కోసం టీ లో పంచదార వేసుకోటం మానేసి, డబ్బు అదా చేసి షిర్డీ వెళ్ళి పరమానుభూతి పొందాడు .సాయి పలుకులు బ్రహ్మ వాక్కులే .ఉపవాసాలు చేస్తే సాయి ఊరుకోడు .మనసు నిశ్చలంగా ఉండటమే ముఖ్యం ఆని చెప్పాడు .దాన గుణం నేర్పటానికే దక్షిణ అడిగే వాడు సాయి .
‘’చక్కగాను బోధ చా౦దోర్కనునకు జేసె –దేవ భాష యందు దిట్ట యయ్యు –గీత శ్లోకమొకటి కృష్ణుడై బోధించె’’అంటూ సాయి సంస్కృత పాండిత్యాన్ని గొప్పగా చెప్పారు భక్తులకోసం’’ సాఠే ‘’వాడాలు ,మురళి విగ్రహం కోసం’’బూటే’’వాడా కట్టించాడు సాయి .కక్కుర్తి పడకుండా అనుక్షణం తనకు మనసునిచ్చి నిశ్చింతగా ఉండమన్నాడు .అంతా తానె చూసుకొంటాను ‘’మై హూనా ‘’ఆని భరోసా ఇచ్చాడు .పాముకాటు నుంచి శ్యామా ను , ,చావునుంచి రామచంద్రను కాపాడిన కరుణామయుడుసాయి .సాయి కృపకు చక్షువులు తెరచి సాయి చరిత చదవాలి .’’దివ్య సాయి కధలు దీప స్తంభము వోలె –ధర్మమార్గములకు దారి చూపు –బ్రతుకు బండి నడుపు భగవానుడు ‘’సద్గురు సాయి మహారాజ్ .బడుగుజనాన్ని ఆడరించటమే సాయి కోరేది .మనవ సేవే మాధవ సేవ .అంటూ శైలజ ఈ ఆట వెలదుల సాయి శతకం పూర్తి చేశారు .
గురు పౌర్ణమి నాడు సాయి భక్తులు సాయి చరితను మహా భక్తితో పఠిస్తారు .హేమాండ్ పంత్ మరాటీ లో రాసిన ‘’సాయి సచ్చరిత్ర ‘’అన్ని భాషలలోనూ అనువాదం పొందింది .ఇది బృహద్గ్రంధం .దీన్ని పతించలేని వారు శైలజ గారి ఈ శతకం చదివితే చాలు అంతటి ఫలితం పొందవచ్చు .సాయి చరిత్ర అంటే జ్ఞాపకం వచ్చింది .2017లో మా దంపతులం ఆమెరికాకు అయిదవ సారి నార్త్ కరోలినా లోని షార్లేట్ కు మా అమ్మాయి,అల్లుడు గారింటికి వెళ్ళి నప్పుడు ’ ,అక్కడ అప్పారావు గారనే రిటైర్ద్ స్టేట్ బాంక్ ఆఫీసర్ ,సాయి భక్తుడు పరిచయమై గురు పూర్ణమి ముందు మా ఇంటికి వచ్చి ,చాలా కాలం నుంచి గురు పూర్ణమికి సాయి చారిత్ర చదువు తున్నాననీ ,ఈ ఏడు ఎవరూ తోడూ లేరని చెప్పగా మనిద్దరం కలిసి చదువుదాం ఆని ,మా ఇంటికి రమ్మని పిలిచి ఇద్దరమ రోజు సాయంత్రం నాలుగు నుంచి అయిదు వరకు చదివి అయిదు రోజులలో గురుపూర్ణమి నాడు పూర్తి చేశాం .రోజూ మాఅమ్మాయి ప్రసాదం చేసేది. నైవేద్యం పెట్టేవాళ్ళం .అదే నేను మొదటి సారి సాయి చరిత్ర దీక్షగా చదవటం . నాలుగు సార్లు షిర్డీ వెళ్ళాం .
శైలజ గారి పద్యాలు మాధుర్య భరితం .మంకు శ్రీను గారిప్రభావం అది .అలవోకగా రచన సాగింది భక్తిభావ బంధురంగా,కర్ణ పేయం గా పద్యాలు నడిచాయి .సూటిగా హృదయానికి తాకేట్లున్నాయి .సాయి భక్తులకు దివ్య వరం ఈ శతకం ‘’.అమూల్యం’’ ధరలోనే కాదు కవిత్వం లో కూడా . మరిన్ని రచనలు ఆమె చేయాలని కోరుతున్నాను .
సంక్షిప్తంగా కవయిత్రి పరిచయం –పల్లావఝల వెంకట శైలజ-ఎం ఎ బిఎడ్ -తెలుగు పండిట్ -విజయవాడ పుట్టినిల్లు కృష్ణాజిల్లా మొవ్వ పాలెం .మెట్టింది పగోజి కొప్పర్రు (మంకు శ్రీను కవి స్వగ్రామం ).భర్త -బొల్లాప్రగడ వెంకట దత్తాత్రేయులు ఎం ఎ.
మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-24-ఉయ్యూరు

