ఇద్దరు ‘’స్టెంట్’’ వీరుల నిరంతర తపన, శ్రమయే ఆరవ ప్రపంచ రచయితలసభ విజయానికి కారణం
పూర్వం స్టంట్ సినిమాలు ఉండేవి అంటే కత్తులతో గదలతో డాలు వగైరాలతో డిషుం డిషుం అంటూ యుద్ధాలు చేసే హీరో విలన్ ల సినిమాలు అన్నమాట .ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2024 డిసెంబర్ 28,29శని ఆదివారాలలో కె బి ఎన్ కాలేజిలో అంగరంగ వైభవంగా’’ యువత’’ ఉత్సాహ పూరిత వాతావరణం లో దిగ్విజయంగా జరిగాయి .ఈ సభలకు నేపధ్యంలో ‘’ఇద్దరు ప్రసాద్ ‘’ లున్నా ,వేదిక ఇచ్చిన కాలేజీ,కాఫీ టిఫిన్ భోజనాలు అందించిన స్థానిక శాసన సభ్యుడు ,సభలకోసం ఉదారంగా విరాళాలు అందించిన వదాన్యులైన దాతలు ,ప్రతినిధి రుసుం చెల్లించి స్వంత ఊర్లనుండి డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి, వసతి సౌకర్యం తామే చూసుకొని ,రెండు రోజులు పండుగ వాతావరణం గా చేసిన వారున్నారు,రిసీవింగ్ సెక్షన్ ను చక్కగా నిర్వహించిన వారు ,మూడు వేదికలపై కార్యక్రమాలను నిర్వహణ పర్యవేక్షణ చేసిన వారున్నారు .వీరందరిని నిత్యం సంప్రదిస్తూ ,కార్యక్రమ వివరాలు అందిస్తూ ,వైవిధ్యాన్ని కొనసాగిస్తూ అనుకొన్న ‘’మార్పు ‘’ప్రతి ఫలించిందా లేదా ఆని వేయి కళ్ళతో వీక్షిస్తూ తపో దీక్షగా నిరంతర శ్రమతో అలుపు సొలుపు లేకుండా ,విసుగు విరామం లేకుండా పని చేసిన వారు ఇద్దరు మనీషులున్నారు .వారే కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,శ్రీ జివి పూర్ణ చంద్ గార్లు .
వీరిద్దరిలో సుబ్బారావు గారికి కొంతకాలం బైపాస్ జరిగి స్టెంట్ వేయించు కొంటే ,ఆతర్వాత కొంతకాలానికి .పూర్ణ చంద్ గారికీ బైపాస్ జరిగి స్టెంట్ వేయి౦చుకొన్నారు .అందుకే వీరిద్దరిని ‘’స్టెంట్ మాస్టర్స్ ‘’అన్నాను .అయినా’’ తగ్గేదేలా’’అంటూ ఎంతో శ్రమకు ఓర్చుకొని క్షణం విశ్రాంతి లేకుండా కార్యక్రమ నిర్వహణ చేయటం ఆషా మాషీ కాదు .ఆ పూనికకు ,ఉత్సాహానికి కోటి దండాలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-1-25-ఉయ్యూరు .

