’’నా అక్షరాలు పల్లవ పౌరుష బడబాగ్ని సమ్మిళితాలు,-నా అక్షరాలు అగ్నికుల క్షత్రియ తూణీరంలో అస్త్రాలు –నా అక్షరాలు చరిత్ర గతిని మరగున పరచిన ప్రక్షిప్తాల ముసుగు తెరలను దహి౦ఛి వేసే అగ్ని కణాలు .సూర్య వంశ ప్రక్షిప్త ప్రాచీన పల్లవ చరిత్ర ప్రచోదనాలు ‘’అంటూ నిప్పులు కురిపిస్తూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు .ప్రక్షిప్తచరిత్ర పరిశోధకుడు ,సూర్య వంశ పరిశోధకుడు ,దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు . వర్మ చింతా అనే శ్రీ చింతా కృష్ణ బాబు’’,
అగ్నికుల క్షత్రియ జాతి పితామహుడు మాహారాజ రాజశ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి ‘’అగ్నికుల దీపిక ‘’గ్రంథం కోసం చేస్తున్న అన్వేషణలో అంధకారం లో అద్భుత దీపంలా ,ఆధునిక భారత దేశ తొలి చరిత్ర పరిశోధకుడు కల్నల్ మెకంజీ స్వయంగా తాను పల్లి( అగ్నికుల క్షత్రియ)కులం పై పరిశోధన చేయించి రాయించిన ‘’అగ్నికుల దీపిక ‘’పల్లికులం (బల్లి చోడులు )పుట్టు పూర్వోత్తరాల కైఫీయత్తు కృష్ణ బాబుకు లభించింది .బహుశా పల్లికులం పుట్టు పూర్వోత్తరాలు పేరు స్పూర్తితో ,రేకాడి సముద్రారావు గారు తన ‘’అగ్నికుల క్షత్రియ పుట్టు పూర్వోత్తరాలు ‘’ ఆని పేరు పెట్టుకొన్నా ,దీనిపేరుకానీ ,మెకంజీ కైఫీయత్తు ప్రస్తావన కానీ ఎక్కడా పేర్కొనక పోవటం విచిత్రంగా అనిపించింది’’ బాబు’’ కు .అందుకని ‘’గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్పండి మనం పల్లి అంటే పల్లవ –చోళులం ‘’ఆని ప్రబోధించాడు .
‘’సనాతన భారత దేశం లో ఘనమైన చరిత్ర కలిగిన ఏకైక కులం నా అగ్నికుల క్షత్రియ (పల్లి )కులమే –నా కులం ఇది ఆని నానోటితో నేను చెప్పుకోలేని కులం కూడా నా అగ్నికుల క్షత్రియ( పల్లి ) కులమే ‘’ఆని గర్వంగా చెప్పుకోమని ఆకుల అస్తిత్వాన్ని గౌరవాన్నీ కాపాడుకోమని విజ్ఞప్తి చేశాడు కృష్ణ .అలనాటి శ్రీ కృష్ణ శంఖారావం గా పూరించి చెప్పాడు .తాము పల్లికులం బల్లి చోడ(అగ్నికుల )క్షత్రియ రాజవంశ వారసులం ఆని చెప్పుకొనే ఉన్నత స్థితి నుంచి మేము పల్లికారులం కాదు ‘’మత్స్య కారులం ‘’అంటూ హీన స్థితికి దిగజార్చి ,పల్లి అంటే అదేదో బూతు మాటలా వక్రీకరించి ,తమ వేళ్ళతో తమ కళ్ళనే పొడుస్తున్న కుహనా మనుష్యులను ఎండగడుతున్నాడు .వక్రీకరించిన తమ చరిత్రను తిరగరాద్దాం రారండి ‘’ఆని పిలుస్తున్నాడు బాబు .తమవారు తమకు దూరం చేసిన ‘’ఈ తరం ‘’ తమజాటికి ఇంతవరకు తెలియని ,మరుగున పడిన అరుదైన చరిత్ర ‘’పల్లికులం (బల్లి చోడులు )పుట్టు పూర్వోత్తరాలు కైఫీయత్తు ను శోధించి ,పరిశోధించి ,సూర్యవంశపరిశోధకుడిగా సగర్వంగా ,సూర్యవంశ అగ్నికుల క్షత్రియ చరిత్రను మొదటి సారిగా యధా తధంగా మనము౦దుంచాడు ఈ పరిశోధక బాబు .పల్లి అంటే ఎంత గొప్పదో ఎంత ప్రాచీనమైందో చెప్పటానికి మెకంజీ కైఫీయత్తు ఒక్కటి చాలు అన్నాడు .రెండు వేల సంవత్సరాలకు పూర్వం కావేరినది పై ఆనకట్ట కట్టిన ‘’ప్రపంచపు మొట్టమొదటి సివిల్ ఇంజనీర్ ‘’కరి (ర్రి)కాల చోళ చక్రవర్తి పల్లి కులంజాతి మూల పురుషుడు .శక పురుషుడు .వెయ్యేళ్ళ క్రితం పల్లవ జనిత రాజ వంశాలన్నిటినీ ఐక్యం చేసి ,అగ్నికుల క్షత్రియ పేరును సుస్థిరం చేసిన శక కర్త –కరి రాజరాజ చోళుడు ,నడుస్తున్న కాలం లో దిగజారిపోతున్న అగ్నికుల క్షత్రియ ఔన్నత్యానికి తిరిగి ఊపిరి పోస్తున్న పల్లవ కేసరి ,నవ శక కర్త –కర్రి స్వామినాథన్ చోళుడు ’’ఆని తమకులం గర్వంగా ప్రకటి౦చాలని హితబోధ చేశాడు .
ఇంతటి తపన ఉన్న రచయిత కృష్ణబాబు నాకు పదేళ్లుగా పరిచయం .నేనేదో ‘’పోడిచేస్తున్న’’ రచయితను ఆని ఎప్పుడూ’’ పంపు’’ కొడుతూఉంటాడు .అతనిలో ఇంతటి తృష్ణ ఉందని మొన్న జరిగిన ప్రపంచ తెలుగు రచయితలసభ మొదటి రోజు అతడు నాకుకనిపించి ,పై వివరాలన్నీ చెప్పి ,.ఆ కైఫీయత్ గ్రాంధిక భాషలో ఉందనీ ,దాన్ని వ్యావహారిక భాష లోకి మార్చి రాసి ఇవ్వమని కోరాడు .సరే అన్నాను .దాన్ని అక్కడికక్కడే వాట్సాప్ లో పంపాడు .నాలుగైదు రోజుల్లో ఆపని చేస్తాను అన్నాను .కానీ ఆగలేక మర్నాటినుంచే రోజూ మధ్యాహ్నం రాసి పూర్తి చేసి నిన్ననే అతడికి మెకంజీ కైఫీయత్ ను వ్యావహారికం లో రాసి పంపాను . అందులో కొంత నాకు అర్ధం కాలేదని కూడా ఫోన్ చేసి చెప్పాను .అతని వంటి సంస్కారి ,తపన ఉన్న రచయితలూ అరుదుగా ఉంటారు .ఆటను నన్ను గురువుగారు ఆని పిలుస్తాడు గౌరవంగా .ఇదంతా చదివితే అతడే గురు స్థానం లో ఉన్నాడని ,అతని పరిచయం ఒక అదృష్టం అనిపించింది
సాహితీ బంధువులకు పంపిస్తే మీలో ఎవరైనా అతడికిమరింత సాయపడగలరని ,ఆవివరాలు, కైఫీయత్ దీనితో జత చేస్తున్నాను . ..
పల్లికులం కైఫీయత్
శ్రీ సదాశివుని ఆజ్ఞతో గడచిన కృతయుగం ద్వాపర యుగం త్రేతాయుగం అనే మూడు యుగాలు గడిచి పోయాక ,కలియుగంలో పరీక్షిత్ మహారాజు మొదలైన కొందరు రాజులు గతి౦చాక ,సూర్య వంశం లో సమస్త భూమండలం లో అఖండ ప్రతాప సూర్యప్రకాశంతో ప్రావిర్భావం చెంది ,శత్రురాజ గర్వం అనే చీకటిని చీల్చి ,కీర్తి అనే కాంత తో మలయ పర్వత శ్రేణులలో విహరిస్తూ ,శ్రీ అరుణ చోళుడు తెల్లని శరీరం కలవాడు శ్రీ ముది గొండ చోళ రాజుల వంశ శిరో భూషణుడైన వీర విక్రమ చోళ మహారాజు ,చోడ మండలం లో విక్రమపురి లో సింహాసనం పై అధిష్టించి ,చతుస్సముద్ర వేలా వలయిత భూమండలాన్ని ,ఏకచ్చత్రాధిపత్యంగా సుపరిపాలన సాగిస్తు,సకల రాజ భోగాలు అనుభవిస్తునాడు.ఇన్నిఉన్నా,తనతర్వాత రాజ్యానికి వారసులై వంశ వర్ధనులైన పుత్రస౦తానం లేకపోవటంతో విచార హృదయంతో ఒక రోజు మంత్రులను పిలిపించి వారి సలహా ప్రకారం రాజ్యభారం అప్పగించి కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి శ్రీ కాళహస్తీశ్వరుని కై తీవ్ర తపస్సు చేస్తుండగా ,తపస్సుకు మెచ్చి గరళ క౦ఠుడు పరమేశ్వరుడు పార్వతీసహితంగా ప్రత్యక్షమై ,కోరిక ఏమిటో చెప్పమన్నాడు .’’దేవా !మీ అనుగ్రహంతో సర్వమూ అనుభవిస్తున్నాను .కానీ పుత్రసంతానం లేకపోవటంతో ‘’అపుత్రస్య గతిం నాస్తి ‘’అన్న వేదసూక్తి ప్రకారం నాకు గతి దిక్కు లేదు. నీవే భారం వహించిఅనుగ్రహించాలి ‘’అనిదీనంగా ప్రార్ధించగా ,కరుణామయుడు స్వామి అనుగ్రహించి ‘’నాపట్టణంలో ఒక్క ఏనుగు నాకు రోజూ పరిచర్యలు చేస్తూ భక్తిపారవశ్యంతో నన్ను సేవిస్తోంది , అది నీకు పుత్రుడుగా జన్మించి నీ కోరిక తీరుస్తాడు .అనుమానం లేదు’’ ఆని దీవించి పంపాడు .
తర్వాత పరమేశ్వరుడు ఆ ఏనుగును పిలిపించి ,ఆ వృత్తాంతం అంతా వివరించి చెప్పి ‘’నువ్వు చాలాకాలం నుంచి నాకు సేవ చేస్తూ నాకు పరమానంద౦ కలిగిస్తున్నావు .నువ్వు చోళరాజుకు వీర విక్రమ పరాక్రమ పుత్రుడుగా జన్మించాలి ,ఈ భూమండలాన్ని జనరంజకంగా పాలించి ,శాశ్వత కీర్తి సంపాదించు .తర్వాత నీకు మోక్షం ప్రసాదిస్తాను ‘’ఆని దీవించగా ఆ కరి శిరస్సు వంచి చంద్రధరునికి నమస్కరించి ‘’దేవా !నీ చిత్తం ‘’అని బాల కుమార రూపం దాల్చగా ,ప్రమధులు కొందరు ఆ బాలుని విక్రమ భూపాలుని దగ్గరకు తీసుకొని వెళ్ళి ‘’మహారాజా ! ఈ బాలుడు ఈశ్వరదత్త వరకుమారుడు .ఇతడిని పట్టపు రాణికి ఇవ్వండి .’’ఆని చెప్పారు .రాజు దివ్య తేజో సంపన్నుడైన ఆబాలుడిని అంతః పురానికి తీసుకొని వెళ్ళి మహారాణితో ‘’ఈ పిల్లవాడు సదాశివ అనుగ్రహ సంపన్నుడైన కుమారుడు .మనకు లభించాడు ఇదంతా ఈశ్వరానుగ్రహం .చక్కగా పోషించి తీర్చిదిద్దు ‘’ఆని చెప్పి అప్పగించగా ఆమె మహదానందంతో ఆ బాలుడికి ‘’కరి కాల చోడుడు ‘’అనే పేరు పెట్టి శ్రద్ధగా పెంచుతోంది .అతడు దిన దిన ప్రవర్ధ మానంగా అభివృద్ధి చెందుతూ ,కమల బంధువు లాగా తేజస్సుతో విరాజిల్లు తున్నాడు .
తండ్రి అరి వీర విక్రమ చోళుడు కరికాల చోళునికి మళయాళ రాజు కుమార్తె పుణ్యవతి తో వివాహం చేసి ఆతర్వాత సకల సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి ,భార్యా సమేతంగా తపోవనానికి వెళ్ళిశేషజీవితాన్ని తపస్సుతో గడిపాడు .కరికాల చోళుడు సత్యహరిశ్చంద్రునిలా సత్య వాక్య పరిపాలకుడై ,కార్తవీర్యునిలా అవక్ర పరాక్రమంతో ,నల మహారాజు వంటి సౌందర్యంతో ,ఆది శేషుని వంటి వాక్పటిమతో ,పరశురాముని వంటి ప్రతిజ్ఞా పాలనంతో ,శ్రీరామ చంద్రుని వంటి శరణాగత రక్షణ తో ,సుగ్రీవుని వంటి ఆజ్ఞలతో,శిబి చక్రవర్తి వంటి దానగుణ సంపదతో ,,మెరు పర్వతం వంటిధైర్యం సముద్రుని వంటి గాంభీర్యం , చంద్రుని వంటి కాంతి , ,దేవేంద్ర వైభోగంతో ,కుబేరుని వంటి ధన సంపత్తి తో చతురంగ సేనా బలం తో దిగ్విజయ యాత్ర చేసి అరివీర భయంకరుడు ఆని పించుకొన్నాడు .అనేకమంది రాజులు ఇచ్చిన కానుకలు కప్పాలతో తన ప్రతాపానికి నిలువెత్తు దర్పణంగా మెరువు అంతటి ఎత్తైన జయ స్తంభం నాటించాడు .దానికి రెండు ప్రక్కలా తన దాన ,వీర శాసనాలను చెక్కించాడు .సమస్త ద్వీపాలకు ఏక చత్రాధిపత్యంగా పాలించాడు .
కాశీ లో నుంచి రామేశ్వరం వరకు ఉన్న ఉత్తమకుల క్షత్రియుల చేత బంగారు కలశాలతో గంగా జలం తెప్పించి ,అ పుణ్య జలం తో రామేశ్వరంలో సేతుబంధ రామేశ్వరునికి అభిషేకం చేయించి ,నిత్య శివ పూజా దురంధరుడై శివ మహాదేవుని భక్తితో మెప్పించగా ,సదాశివుడు ప్రమధ గణాలతోకలిసి ప్రత్యక్షంగా వచ్చి ఆతడు పెట్టె ముప్పందు మిరియాలను నైవేద్యాలను కడుపారా భుజించేవారు .అతడి భక్తికి మెచ్చి రెండు సార్లు శివుడు ప్రత్యక్షమై ,వరాలు ప్రసాదించాడు .పర మేశ్వరునిలా ఆ రాజు ధర్మ దేవత నాలుగు పాదాలతో నడిచేట్లు బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు జాతులవారిని తమ ఆచారాలు తప్పనట్లు సుపరిపాలన చేస్తున్నాడు .
వసంత ఋతువులో ఒక రోజు బాహ్య విహారం కోసం కావేరి నదికి వెళ్ళి అక్కడి ఒడ్డు పైన ఉన్న వట వృక్షం నీడలో పరివార సమేతుడై నిలిచి ,అక్కడి పెద్దలను అది ఏ పుణ్యనది ఆని అడగ గా వారు ‘’ఇది సంధ్యా పర్య౦త౦ గా ఉండి జనుల పాపాలను తొలగించే పుణ్య కావేరిమహా నది.పూర్వం ఈ నదీ తీరంలో శ్వేతకేతు ,,ముచికుంద మొదలైన మహర్షులు ఇక్కడ తపస్సు చేసి ,అభీష్ట సిద్ధి పొందారు .ఆ పుణ్యనది మహిమలను పురాణాలు వివరంగా తెలియజేశాయి .త్రేతాయుగం లో శ్రీరామ చద్ర్రుడు సముద్రానికి ఆనకట్ట కట్టించి ,లోక కంటకుడైన రావణాసురుని లంకకు ప్రవేశించి అతనితో సహా సకల రాక్షస సంహారం చేశాడు . ,కరికాలుడు అప్పుడు సమస్త జనులకు మహోపకారం కోసం కావేరి నదికి ఆనకట్ట కట్టించి ,చప్పన్న దేశాల ప్రజలచేత వెట్టి చేయిస్తానని ప్రతిజ్ఞ చేసి,అంగ వంగ కళి౦గ ,అవంతి ,పులిద ,కేరళ ,హాటక మహారాట ,ఘూర్జర కుశ కర్ణాట,లాట మాళవ ,మచ్చప ,నేపాళ,గాంధార పాంచాల కాంభోజ ,కురు సింధు ,జాలుక ,కాశ్మీర ,విదేహ ,పాండ్య ,బర్బర ,బాహ్లిక ,హూణ,కుంతల ,,ద్రవిళ ,సౌరాష్ట్ర ,త్రిగర్త ,ఖోట ,గాంధార ,కాంభోజ విదర్భ ,వరాట ,జ్యోతిష , ఆంధ్ర ,దశానన ,యవన చేది ,మగధ ,కోసల ,టెంకణ,కొంకణ పౌండ్ర దేశాలకు వెళ్ళి ,ఆ రాజులు ,మంత్రులు పరిచారకులు మొదలైన సకల జనులణు తన పాదపద్మాల పై ఆన పెట్టి ,తోడి తెమ్మని ఆజ్ఞాపించగా ,వారంతా ఆప్రకారం చేయగా ,సకల దేశాదీశులను పిలవగా ,వారు తమ సర్వస్వం వదిలేసి ,కిరీటాలున్న తలల మీద ,మట్టి తట్టలు ధరించి ,తాము తమ దేశీయులతో కలిసి కలసికట్టుగా కావేరి నదికి ఆనకట్ట కడుతుండగా ,కొందరు కొండ పట్టణానికి వెళ్ళి ,అక్కడి ప్రజలందర్నీ పిలుస్తూ ,ఒక ఇంటిలోశివారాధన సంపన్నురాలైన ‘’తిమ్మవ్వ ‘’అనే వృద్ధురాలైన వేశ్య ను చూసి ‘’అమ్మా !నువ్వు కరికాల మహారాజు కట్టే కావేరి గట్టు కట్టాలని కోరగా ఆముసలి వొగ్గు తాను ఆశక్తురాలను .శరీరంలో శక్తి లేదు, అదీ కాక నేను నిత్య శివ పూజా దీక్ష లో ఉన్నాను ‘’ఆని చెప్పగా,వారు ఆమె మాట వినకుండా రాజాజ్ఞ తప్పక పాటించాలని వొత్తిడి చేయగా ,భక్తుల కాపాడే ఫాలలోచనుడు తానె ఆ ముసలి వేశ్య రూపం లో వచ్చి ,ఆముసలితిమ్మవ్వకు బదులు తానె వచ్చానని చెప్పి నమ్మించి ,గంగానది ,చంద్ర రేఖ ఉన్న శిరస్సుపై మట్టి తట్ట పెట్టుకొని మట్టిని మోస్తూ కావేరీ కట్ట కు సాయం చేస్తుండగా ,ఆమె దివ్య తేజస్సు గుర్తించిన కరికాల చోడుడు ‘’నువ్వు ఎవరు ?’’ఆని ప్రశ్నించగా శివుడు తన కళారూపం చూపించి ప్రత్యక్షమై వెళ్ళిపోయాడు .
రాజ పరివారం పానుగంటికి వెళ్ళి,అక్కడ భోజరాజు రోజూ బంగారుపాత్రలతో సూర్యునికి పూజా ద్రవ్యాలు ఇస్తూ ఉండటం ఆయన ఆనందంగా గ్రహించటం ,అందువలన ఆయన అజేయుడుగా ఉండటం చూసి ,మట్టి మోయటానికి రమ్మని రాజాజ్ఞగా చెప్పగా ,తిరస్కరించి ‘’నాకంటే లోకంలో గొప్పరాజు లేడు. అలాంటి నేను వెట్టి చాకిరీ చెయ్యను ‘’ఆని చెప్పగా కరికాలుని భటులు ‘’భోజ మహారాజా !పర్వతాలలో మెరు పర్వతంలాగా ,సర్పాలలో ఆదిశేషుడు లాగా ,చుక్కల్లో చంద్రుడు లాగా ,దేవతలలోసదాశివుని లాగా ,కరికాల చోడుడు రాజులలో మహారాజు .ఆయన ఆజ్ఞ మీరితే మీకు కీడు జరుగుతుంది ‘’ఆని హెచ్చరించగా ,భోజుడు తీవ్ర కోపంతో చూడగా వారు చేసేదిలేక కరికాలుని దగ్గరకు వెళ్ళి జరిగింది విన్న వించారు .చక్రవర్తి కరికాలుడు వారితో ‘’మీరు మళ్లీ వెళ్ళి పూజా పాత్రలను అందుకోకుండా సూర్యునికి ఆజ్ఞ పెట్టండి ‘’అన్నాడు .వాళ్ళు అలాగే చేయగా ఆబంగారు కలశపాత్రలు,ఆకాశంలో ఎగిరి పోగా ,భోజుడు తన ప్రతాపం తగ్గగా వెట్టి చాకిరీకి వొప్పుకొని అలాగే మట్టి తట్టలు మోశాడు .
కరికాలులి పరిచారులు కొందరు ధరణి కోట అనే అమరావతికి వెళ్ళి అక్కడ అమరేశ్వరుని సేవలో ధన్యుడై స్వామి అనుగ్రహంతో మూడవ కన్ను పొందిన ‘’ముక్క౦టీశ్వరుడు’’అనే రాజును కలిసి కరికాలుని ఆజ్ఞ చెప్పగా ‘’నేను ముక్కంటిని .రెండు కళ్ళున్న రాజుకు వెట్టి చేస్తానా ?”” ఆని ఆగ్రహించగా ,వెళ్ళి చక్రవర్తికి చెప్పగా ,అతడి గర్వాన్ని నిగర్వం చేయటానికి ,ఆరాజు ఆకారం నేలమీద రాయించి ,తన బొటన వ్రేలితో అతడి మూడోకన్నును చిదిమేయగా ఆ ముక్కంటి రాజు కన్ను రక్తం కారగా గర్వం వదిలి, వెట్టి చాకిరీకి ఒప్పుకోని తనవంతు పని చేసాడు .60లక్షల గొల్లలకు ప్రభువైన యాదవ రాజు మధురాపురాన్ని పాలిస్తున్నాడు .అతని దగ్గరకు వెళ్ళి కరికాలుని ఆజ్ఞ చెప్పగా మత్తుడైన అతడు ‘’ నీటిలో పుట్టిన గడ్డి పరక గల భూమికి అంతటికి నేనే రాజాధి రాజును .నేనెందుకు వెట్టికి వస్తాను ?’’అనగా ఈవిషయ౦ కరి కాలుడికి చెప్పగా లాట లోచనుడిలా కోపం తో ఉగ్రుడై ,ఆకాశంలో విభూతిని తీసుకొని మంత్రించి ,యాదవరాజు మందలపై చల్లి౦చగా , ఆ ఆవులు రక్తాన్ని వర్షి౦చగా ,గర్వం తగ్గి వెట్టికి తయారై యాదవ రాజు మట్టిమోసి ,కావేరి వరకు కాలువత్రవ్వి౦చి ,కావేరీనదిని ప్రవహి౦ప జేయగా అది ‘’పాలేరు ‘’పేరుతొ పిలువబడింది .
కరికాలుని భటులు అవంతి అనే పేరుగల భల్లాణు పట్టణానికి వెళ్ళి వెట్టికి రమ్మని పిలువగా అతడు గర్వంతో వాళ్ళను పట్టించు కోకుండా ,అక్కడ ఉండటం క్షేమం కాదని తలచి ,సముద్రుడిని ప్రార్ధించి ,సముద్ర మధ్యలో ఒంటి స్తంభం మేడ కట్టించుకొని ,తానూ పతివ్రతామతల్లి అయిన భార్యతో దిగులు లేకుండా ఉన్నాడు.వార్త విన్న కరికాలుడుసర్వ సేనలను రాజులను పంపి అక్కడికి వెళ్ళి వాడి తలనరికి తెమ్మని ఆజ్ఞాపించాడు .వాళ్ళు సముద్ర మధ్యంలో ఉన్న అతడిని వోడించటం మానవ మాత్రులకు సాధ్యం కాదని హనుమలేక వాయుదేవతలకు వంటి వారికే అది సాధ్యమని చెప్పగా , అతని తమ్ముడు రాజు ప్రతిజ్ఞ నేర వేర్చటనికి అమానుష రూపం పొందాలని దివ్యజ్ఞానం తో తెలుసుకొని,తుల్ల’’ (విడ్డూర )ముని సంతతిలో జన్మించి ,అసాధారణ వైభవ సంపన్నుడై ,మహాకోపిష్టి అయిన దూర్వాస మహాముని శాపం వలన సముద్ర జీవుల జీవనానికి సముద్రజలం ముఖ్యం అక్కడి జీవనానికి హాని కల్గించకు ఆని చెప్పగా ,ఆపురాన్ని వదిలేసి కావేరీ తీరం లోని ‘’కైకాల ఏవూరు ‘’అనే ఊరికి వెళ్ళి ‘’రెడియేవూరు ‘’ఆని దాన్ని అందరి చేత పిలిపించి ,వారి వలన పని కాదు ఆని తెలుసుకొని ,బంగారం వగైరా విలువైన కానుకలిచ్చి ,అనుకొన్న పని పూర్తి చేయించి ,’’మీరు నాకు పుత్రులై ,నేనిచ్చిన బిరుదులు గ్రహించి ,భూలోకం లో కలకాలం కీర్తి పొందుతారు ‘’ఆని అభయం ఆజ్ఞా ఇచ్చి పంపగా ,నమస్కరించి వెడుతూ భల్లుని ఆనతితో ఒక కోడి వచ్చి కూసి ,ప్రభాతకాలం ఆని తెలియక ,అర్ధరాత్రి వేళ వెడుతుండగా , అతని ఆజ్ఞాప్రకారం ఒక పంది వచ్చిఒక ఉమ్మ చెట్టు ఎక్కబబోగా,పట్టు తప్పి ,త్రవ్విన గుంటలో పడి ,దారి దొరకక చికాకుపడుతూ ,శ్రీరాముని సతి సీత దశకంఠ రావణుని చేత పరాభవం పొందినట్లు ,అలంకారం లేకుండా ఉన్న ఆమెను చూసి నవ్వగా ,వారి ప్రార్ధనపై ఆ నల్లని వారికి ముక్కు ,చెవులు మొదలైన ఆభరణాలు వికారాలు లేకుండా శపించి ,వెళ్ళి లంకేశ్వరుడు రావణుని ఇంట ఉన్నమహాలక్ష్మిణి వెదుకుతూ ,తాము కార్యనిమిత్తం మయుడి బిలం లో అందమైన పూల వలె ఆకోడి ,వరాహం తమలో ఎవరు కూతకూస్తే వారు గోహత్యా పాపం చేసినట్లే ఆని శపథం చేసి ,కామాక్షమ్మ సన్నిధికి చేరి ,సాష్టాంగ దండ ప్రణామం చేసి ‘’తల్లీ !పరంజ్యోతి స్వరూపిణీ !మాకు భల్లానుడి శిరస్సు ఖండించి తేవటానికి అనుజ్ఞ, బల౦ ఇచ్చి ,ఆపని పూర్తికాగానే నీకు కోరిన వేట సమర్పించి మా భక్తీ ప్రకటిస్తాం .మా గృహాలలో కుంకుమ తాంబూలం మొదలైన కళ్యాణ ద్రవ్యాలతో అర్చిస్తాం .నిన్నే మా కులదేవతగా భావించి పూజిస్తాం .’’ఆని విన్నవించుకోగా దేవి ప్రత్యక్షమై ‘’సముద్రం లోకి మీరు వెళ్లటం అసాధ్యం .నేనుగొల్ల స్త్రీనై మీకు దారి చూపిస్తా .’’ఆని అభయమిచ్చింది అమ్మ .వారి ముందర గొల్ల స్త్రీ వేషంతో ముందు నడుస్తూ ,మార్గం చూపిస్తూ ,’’మా కరికాల చోళ చక్రవర్తి సత్య ధర్మాలు తప్పని ఉత్తమ క్షత్రియ కులజుడైతే ,ఆ నిప్పుల యేరు శీతల ప్రవాహమై దాటటానికి వీలుగా ,వట్టి గాజు స్తంభం మేడ ఎక్కటానికి దారి కనపడకుండా ,ఆ వల్లభ గంటు కామాక్షమ్మ గొల్ల మహిళ రూపం మాని ,నిజ రూపంతో ప్రత్యక్షమై ,ఆ రూపంతో శక్తికి పదికి శిరస్సులు ఖండించి ,మిగిలిన అయిదుగురు రక్తంలో పడేట్లు చేసి ,మట్టి మెట్లు గ చేయగా ,ఆ గాజు స్థంభం లో ‘’అరసానయమ్మ ‘’ పేరు ధరించి ,భోగవతి వహించి ,ఆఅమ్మ ఆ మేరకు అక్కడ భల్లాలుని భటులుఅనేక రకాల ఆయుధాలు ధరించి ,యుద్ధ సన్నద్ధులు కాగా ,ఆ పరంజ్యోతి పాదాల మనసులో తలచుకొని ,మ్రొక్కగా ,అనేక రకాల విద్యలతో ఆ మేడ ఎక్కి భల్లాణుడిని పట్టుకొని,శిరస్సు ఖండించ బోతుండగా ,అతని భార్య సంతాపంతో అడ్డం వచ్చి ‘’అన్నలారా !నేను మీకు చేల్లెలిలాంటి దాన్ని .పతి భిక్ష పెట్టండి ,పతి దానంకంటే గొప్ప దానం లోకం లో లేదు’’ఆని రెండు చేతులతో నమస్కరించగా వారు ‘’భల్లాలుడి శిరస్సు తెమ్మని మాకు మహారాజు ఆజ్ఞ.ఆ ఆజ్ఞ ను మేము పాటించాల్సిందే ‘’ఆని స్పష్టంగా చెప్పగా ‘’అలా అయితే ఆయన శిరస్సుకు ప్రతి రూపంగా బంగారు శిరస్సుఇస్తాను తీసుకు వెళ్ళి మీ రాజుకు చూపించి ,అప్పుడు మీ రాజు పిలిస్తే ,నాపాతివ్రత్యమహిమతో ,,కామాక్షీ దేవి అనుగ్రహంతో ఆ స్వర్ణమయ శిరస్సు బదులు పలుకుతుంది ‘’ఆని అత్యంత వినయంగా చెప్పి ,శక్తికి నమస్కరించి ,మిగిలిన వారి శిరస్సులు ఖండించి సమర్పించబోగా ,ఆ లోకమాత పూర్వపు శిరస్సులు ఖండించి ,మొత్తం పది మందికి ప్రాణ భిక్ష పెట్టి , మళ్లీ సముద్రాన్ని దాటించి’’మీకూ ,మీ అన్ని కార్యాలకు నేను సహాయం చేస్తూ ,కరికాల చోళ మండలం లో ‘’కొల్లాపురమ్మ ‘’ కొల్లాపురా౦బిక గా , ,కాశీలోఅన్నపూర్ణ విశాలాక్షిగా ,కాంచీపురంలో కామాక్షిగా ,ఏక శిలా నగరం లో వెల్లాది గా ,చందవోలులో బండ్లమ్మ నై ,ఇంద్ర కీలాద్రిపై దుర్గా భవానిగా ,ద్రాక్షారామం లో గోగులమ్మగా ,కటకం లో ఆశీరమ్మగా మీకు ఇష్టదేవతనై ,మీ మనో భీష్టాలు నెరవేరుస్తూ ఉంటాను .’’ఆని అభయమిచ్చి పంపింది .
ఆ ‘’కనక శిరస్సు’’ను భటులు తీసుకు వచ్చి కరికాలునికి చూపించగా సమస్త దేశ రాజులు తానూ కోలువైఉండి’’ఓ భల్లాలుడా ! ‘’ఆని పిలువగా ‘’ఓహో ‘’’ఆని ఆ శిరస్సునుంచి ప్రతిధ్వని రాగా ,చక్రవర్తి సంతోషించి వల్లే యేవురు ,కైకోలయేవురు , రెడ్ది యేవురు లను చూసి మెచ్చి ,నందుల ముఖ మండపం లో వజ్ర సింహాసనాలపై కూర్చో పెట్టి గౌరవించి ‘’చోడ రాజ స్థాపనా చార్య,భల్లాల రాయనిశిరః ఖండన ,రఘుకులగోత్ర పవిత్ర ,పున్నామ్రనామ ధేయ దివ్య పాదపద్మారాధకులు ‘’మొదలైన తన ప్రఖ్యాతమైన బిరుదులు అందజేసి ‘’మీరు నాకు ఈ రోజు నుంచి ప్రియమైన కుమారులు కనుక చోడ కుమారులు ఆని భూలోకం లో మిమ్మల్ని కీర్తిస్తారు ,అనేక బహుమానాలిచ్చి గౌరవిస్తారు ‘’ఆని ఆనతిచ్చాడు .ఉత్తర జంధ్యాలు ,బంగారు దండం ,అందలాలు బంగారు కామ కుంచలు , విలాస వంతమైన గొడుగులు ,పాపడ చీరలు ,చిన్న ధారలు ,పెద్ద దారలు , పెద్ద గౌరవాలు ,కామాక్షి లోగిళ్ళు ,మకర తోరణాలు ,తెల్లని శంఖాలు ,పూజకు కుండలు నుదుట కుంకుమ ,బిరుదు పెండేరాలు ,కాళ్ళకు విలాసవంతమైన జోళ్ళు ,బంగారు కలశాలు ,అయిదురోజుల నాగవల్లి ,మీ ఇష్ట దేవత కాత్యాయి పూజ వడి ,అరసానమ్మఇచ్చినవి ఎడమ చంప గంధం ఎడమ చేత పుష్పాలు మొదలైనవి .కాశీ రామేశ్వర కటక ,కళింగ,కంచి కాళహస్తి ,విక్రమపురం మొదలైన పుణ్య క్షేత్రాలకు వెళ్ళమని ఆనుమతిచ్చాడు .కాశీ విశ్వేశ్వర ,కంచి కామాక్షమ్మ ,,ఏకామ్రనాధ,శ్రీ రంగనాయకులు ,ద్రాక్షారామ భీమేశ్వరుడు ,సేతుబంధ రామేశ్వరుడు ,సూర్య చంద్రాదులు సాక్షిగా ఆజ్ఞ ఇవ్వగా ,శిరసావహించి ,అన్ని దేశాల అన్ని పట్టణాల కు వెళ్ళమని దిగ్విజయం చేశాడు .
పల్లె యేవురికి పేద సింగ నారాయణుడే పెద్దయై ఉండగా ,కుమార బిరుదులేదని పనికి నిలిచి ,ఆ పెద్దకొడుకు పుణిక లో మెదడు తీసుకొని శిలాపాయాసం వండుకు తిన్న దోషం, కాశీలో గోహత్య చేసిన పాపం ,గంగా తీరంలో బ్రాహ్మణ వధ చేసిన పాపం ,పొందుతారు .చోడ చక్రవర్తి కాశీ నుంచి రామేశ్వర వరకు చేసిన ప్రతిష్టలు ,శివపూజలు చెడగొడితే పాపాల పాలౌతారు .ఈ బిరుదులనుఎవరు విన్నా చదివినా సకల శ్రేయస్సులు కలుగుతాయి .
ఇది ఆగమ బిరుదు ప్రసిద్దు శ్రీ మంగళ మహాశ్రీ శ్రీ శ్రీ చేస్తుంది ,కాశీ నుంచి రామేశ్వరం దాకా ఇది తాడుతో కట్టని కట్టు .కొల(కోలా బద్ద)లేని కొట్టు .దండాలు పెద సింగు గారికి .భూమి ఉన్నంతకాలం ఈ కులం నిలిచి ఉంటుందని ప్రమాణం .
వర్తనం –కట్టాలు
పావనం –కట్టుమాయి రూక( రూపాయి )
పంమీరు కట్టం –అయిదు రూకలు
పెద్దిరి చెయ్యి జ౦గానికి ,ఈ పుశ్చరికి కాలు(నాలుగోభాగం ) ఇచ్చి -కామాక్షమ్మ చేసిన ఏర్పరచిన పధ్ధతి .
ప్రమోదూత నామ సంవత్సర ఫాల్గుణ బహుళ చతుర్దశి ఆదివారం .24 మార్చి -1910
మల్లయ్య వ్రాలు .
జి .నరసింహ శర్మ చె రికార్డ్ చేయబడినది -6-2–43
మూల ప్రతితో సరి చూడ బడినది -కె.వి .ఎస్. ఎస్ . 26-6-26.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-25-ఉయ్యూరు

