రఘుపతి వెంకటరత్నం గారి గోల్డ్ మెడల్ విజేత ,ఆంధ్రనాటక విమర్శనం గ్రంథ రచయిత,మద్రాస్ యూని వర్సిటి తెలుగు శాఖాధ్యక్షుడు –శ్రీ శిష్ట్లా రామ కృష్ణ శాస్త్రి
పాత తరానికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ శిష్ట్లా రామ కృష్ణ శాస్త్రి .1941లో ఆయన మద్రాస్ విశ్వ విద్యాలయ పరిశోధన విద్యార్ధి .ఆప్పటికే ఆయన నద్రాస్ మహిళా కాలేజి ,బందరు నోబుల్ కాలేజే లలో తెలుగు అధ్యాపకులు గా పని చేసిన అనుభవం ఉంది.1940లో విమర్శ –వ్యాసములు అనే గ్రంథం రాసి ప్రచురించారు .1947 రఘుపతి వెంకట రత్నం రిసెర్చ్ మెడల్ కోసం జరిగిన పోటీకి ‘’వీరశైవాంధ్ర వాజ్మయం ‘’అనే గ్రంధం రాసి ‘’స్వర్ణపతకం సాధించారు .తిరుపతి దేవస్థానం దీన్ని 1948లో ప్రచురించింది .
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం లో శాస్త్రి గారు సంపాదకుడు గా పని చేశారు.ఆయన ఎం. ఎ .తొ పాటు బి.వో.ఎల్ .కూడా చదివి ఉత్తీర్ణులయ్యారు .బందరులో పని చేస్తున్నకాలం లో 1949లో ‘’ఆంధ్ర నాటక విమర్శనం ‘’గ్రంథం రాశారు .ప్రాచ్య ,పాశ్చాత్య నాటక విమర్శన పద్ధతులద్వారా ప్రధాన సంస్కృత నాటకాలపై ఈగ్రంథం లో చక్కని ప్రామాణిక విమర్శ చేశారు .ఇది బి. ఎ .విద్యార్ధులకు పాఠ్యాంశం అయింది.భవభూతి నాటకాలు, షేక్స్ పియర్ నాటకాలు శ్రవ్య నాటకాలే కాని దృశ్యనాటకాలు కావు ఆని తేల్చి చెప్పారు .నాటకం లోని నాయక లక్షణాలు ,రస పోషణ ,కథా సంవిధానం ,పాత్ర పోషణలను ఈ గ్రంథం లో సోదాహరణం గా చర్చించారు .
రామ కృష్ణ శాస్త్రి గారు మద్రాస విశ్వ విద్యాలయం లో 1949నుంచి 1968 17 సంవత్సరాలు తెలుగు లెక్చరర్ గా పని చేశారు .అప్పుడు శ్రీ నిడదవోలు వెంకటరావు గారు తెలుగు శాఖ అధిపతి .ఈ ఇద్దరితోనే తెలుగు డిపార్ట్ మెంట్ నడిచింది .1960లో నిడదవోలు వారు రిటైర్ అయ్యాక ,శిష్ట్లా వారు శాఖాధ్యక్ష బాధ్యత స్వీకరించి 1968లో రిటైరయ్యారు .1968 లో అక్కడ ఒక మహాశకం అంతమైంది .1927లో శ్రీ కోరాడ రామ కృష్ణయ్య గారితో ప్రారంభమైన తెలుగు శాఖ 1968 వరకు 40 సంవత్సరాలు ప్రాచీన సంప్రదాయం లో నిష్ణాతులైన విద్వాంసుల ఆధ్వర్యం లో ఒక వెలుగు వెలిగి స్వర్ణాధ్యాయం అనిపించింది .రెండేళ్లపాటు తెలుగు శాఖలో ఎవరూ లేరు .1970 శ్రీ గంధం అప్పారావు గారు చేరేవరకు తెలుగు శాఖలో జవ జీవాలు లేవు.
శాస్త్రిగారి జనన మరణాలు తెలియలేదు .వారి గురించిశ్రీ పొట్టిశ్రీరాములు యూని వర్సిటి ప్రచురించిన ‘’ 20 వ శతాబ్దం తెలుగు వెలుగులు’’ఉద్గ్రంధం లో అసలు లేదు. వారి ఫోటో కూడా లేకపోవటం విచారకరం .
ఆధారం –శ్రీ రేవూరు అనంత పద్మనాభరావు గారి వ్యాసం –ఆచార్యదేవో భావ -13.
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-24-ఉయ్యూరు .

