‘’సృష్టికర్త ‘’శతక సృష్టికర్త మిత్రుడు శ్రీ తుమ్మోజు వారి శతకం ఆవిష్కరణ

‘’సృష్టికర్త ‘’శతక సృష్టికర్త మిత్రుడు శ్రీ తుమ్మోజు వారి శతకం ఆవిష్కరణ

నిన్న27-7-25-ఆదివారం సాయంత్రం  విజయవాడ  రామ్మోహన గ్రంధాలయం లో సృష్టికర్త శతకం ఆవిష్కరణ నా చేతులు మీదుగా జరిగింది . నేను చెప్పాలనుకొన్న మాటలు ,చెప్పినవి  చెప్పాలనుకోన్నవి తెలియ జేస్తున్నాను .సభకు ముందు రామ్మోహన్ లైబ్రరీకి పుస్తకాలు చలపాక గారిద్వారా సరసభారతి పుస్తకాలు అంద జేశాము .అక్కడి లైబ్రేరియన్ గారిని శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు రాసిన ‘’త్యాగరాజు ఆత్మ విచారం ‘’పుస్తకం ఉంటే ప్రకాష్ గారికిస్తే దాన్ని ఫోటో స్టాట్ తీయించి నాకు పంపిస్తారని చెప్పాను .చూసి చెబుతామన్నారు .

‘’సభాధ్యక్షులు, అనేకానేక పురస్కార ‘’పూర్ణ సింధు’’ డాశ్రీ పూర్ణచందు గారు ,పుస్తకపరిచయకర్త తన చేతులమీదుగా ఎంతోమందికి డాక్టరేట్ ప్రదానం చేయించిన ‘’డాక్టరేట్ చక్రవర్తి’’ డా.గుమ్మా సాంబశివరావు గారు ,రామ్మోహన్ లైబ్రరీకి ఎన్నో వసతులు కల్పించి ఆధునిక సొబగులు సంతరిస్తున్న శ్రీ పొట్లూరి నరసింహారావుగారు ,సృష్టికర్త శతక సృష్టికర్త ఆప్తులు శ్రీ తుమ్మోజు  రామ లక్ష్మణా చార్యులుగారు,రమ్యభారతి సాహితీ వేదిక ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ,పుస్తక ప్రచురణ కూడా చేసిన ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి రమ్యభారతి సంపాదకులు  ‘’సాహితీ చలమ,సాహిత్య ప్రకాశకులు’’  శ్రీ చలపాక ప్రకాష్ గారు  ఈ సభా ప్రాంగణం లో ఉన్న అశేష సరస్వతీ మూర్తులకు  వందనం .   

  సుమారు 35 సంవత్సరాల క్రితం ఈ సరస్వతీ నిలయం లో ఒక సాయం వేళ కరీం నగర్ కు చెందిన సాహితీ మూర్తి ,అచ్చంగా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి లా పద్యాలు గానం చేసే వారు, ఆయన్ను కరీం నగర్ కాలేజి ప్రిన్సిపాల్ గా ఆహ్వానించి తీసుకు వెళ్ళిన వారు శ్రీ జువ్వాడి గౌతమరావు గారు రామాయణ కల్ప వృక్షం లోని ముఖ్యఘట్టాలలోని పద్యాలను  అత్యంత శ్రావ్యంగా ,రెండు గంటలు.పాటు గానం చేసి తన్మయం చెందించారు .ఆ సభలో విశాలాంధ్ర పత్రిక సంపాదకులు శ్రీ రాఘవాచారి గారుఆచార్య  శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు  మొదలైన వాళ్ళం ఉన్నాం .నేను హాయిని అనుభవిస్తూనే రాఘవాచారి తన్మయత్వాన్ని గమనిస్తున్నా..సభఅయ్యాక ఆయన్ను ‘సార్ ! మీరేమో కమ్యూనిస్ట్ పత్రిక సంపాదకులు ,కానీ విశ్వనాథ వారి పద్యాలకు అంతలా పరవశం చెందు తున్నారేమిటి ‘’?ఆని అడిగితె ఆయన నవ్వుతూ’’అది వృత్తీ ,ఇదీ ప్రవృత్తి ‘’ అన్నారు .అప్పటినుంచి నాకు ఆయన ఆప్తులైపోయారు బెజవాడలో ఎక్కడ సభల్లో కలిసినా పలకరించి మాట్లాడేవారు .గౌతమ రావు గారితో ‘’అయ్యా !మీరు కరీం నగర్లో మీ ఇంట్లో తరచుగా విశ్వనాథ వారి పద్యాలు గానం చేస్తారని తెలిసింది .ఈ సారి అలాంటి కార్యక్రమం ఉంటే తెలియజేస్తే వచ్చి ఆస్వాదిస్తా’’అన్నాను ఆయన చాలా సంతోషించి ఒక కార్యక్రమానికిఆహ్వానం పంపారు నేను వెళ్ళలేక పోయాను .

 శతకకర్త శ్రీ రామ లక్ష్మణాచార్యులు గారితో నాకు సుమారు 35 ఏళ్లనుంచి పరిచయం ఉంది .ఉయ్యూరులో మా గురువు గారు శ్రీ లంకా బసవాచార్యులు గారు  నేనూ ,వీరు పీసపాటి కోటేశ్వరరావు ,మునసబు కోటేశ్వర రావు మొదలైన వాళ్ళం కలిసి గురువు గారి ఆధ్వర్యం లో ‘’ఉయ్యూరుసాహితీ మండలి ‘’స్థాపించి ప్రతి నెలా మూడవ ఆదివారం సాహిత్య కార్యక్రమాలు సుమారు ముప్ఫై ఏళ్ళు నిర్వహించాం ..అందులో తుమ్మోజు వారి సాహిత్య ప్రసంగాలు అత్య౦త ఆహ్లాదంగా ఉండేవి .లోతులు ఎరిగిన పండితోత్తముడు ఆయన .ఉపాధ్యక్షులుగా కూడా పని చేశారు .ఆముక్తమాల్యదకలాపూర్ణోదయం ,మనుచరిత్ర ప్రస౦గాలు ఇప్పటికీ చెవుల్లో రంగు మంటూనే ఉంటాయి  నేను కన్వీనర్ గాఉన్నాను .మూడో నాలుగో వ్రాతప్రతులు సంతరించాం .ప్రతి సంక్రాంతికి ఉగాదికి కవి సమ్మేళనాలు నిర్వహించేవాళ్ళం .కార్యక్రమాలు కొంతకాలం విష్ణ్వాలయం లో కొంతకాలం మా ఆంజనేయ దేవాలయం లో కొంతకాలం కాలేజి పచ్చికమీద  మరికొంతకాలం హైస్కూల్ లోఆతర్వాత శాఖా గ్రంథాలయం లో జరిపెవాళ్ళం .తర్వాత నేను సరసభారతి ఏర్పాటు చేసి 16 సంవత్సరాలనుంచి నిర్వహిస్తున్నాను .మా ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి తుమ్మోజు వారు రావటం ,పద్యాలతో మత్తేక్కించటం జరిగేది .

  మా శ్రీ సువర్చలా ఆంజనేయస్వామిపై మూడు శతకాలు ముగ్గురు కవులతో రాయి౦చాలను కొని మా  ఆస్థాన  కవులైన  తుమ్మోజు వారు ఒకటి ,రెండోది శ్రీమతి ముదిగొండ సీతా రామమ్మ గారు ,  ,మూడోది డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారి సలహాపై అమలాపురంకవి మధురకవి శ్రీ మంకు శ్రీను గారి చేత రాయి౦చా౦  . .’’రాస్తే నాకేంటి ?”’ఆని కోట శ్రీనివాసరావు లాగా ఈ ముగ్గురు అనకపోవటం ఆశ్చర్యం .పుస్తకాలు మూడూ సరసభారతి తరఫున ముద్రించి శతకకర్తకు ఒక్కొరికి పది వేల రూపాయలు కానుక ,నూత్నపట్టు వస్త్రాలు దంపతులకు   సమర్పించి ఒక మాఘ ఆదివారం మా గుడిలో జరిగే సామూహిక  ఉచిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నాడు పొన్నూరు సంస్కృతకాలేజి రిటైర్ద్ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి చేత ఆవిష్కరి౦ప జేసి  విందు కూడా ఇచ్చాం తుమ్మోజుదంపతులు వ్రతం లో పాల్గొన్న జ్ఞాపకం .మంకువారు భార్యాసమేతంగా వస్తే సీతారామమ్మగారు వారబ్బాయి అమ్మాయి అల్లుడు తొ వచ్చారు  .తుమ్మోజు వారు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారు మెచ్చిన కవి శ్రేష్టులు .

 ఇక ఈశతకం లో తుమ్మోజువారి అద్వితీయ ప్రతిభ  ప్రతి పద్యంలో ద్యోతకమౌతుంది .వేద వేదాంగాల పురాణాల లో ని సారమంతా పద్యాలలో గుప్పించారు .సృష్టించేవాడు, వాడి శతకం కనుక సృష్టికి మగాడితోపాటు ఆడదీ అంటే వెలది అవసరం కనుక ఆటవెలదులతో ఆడుకొన్నారు తుమ్మోజీ .ఇదీ నాకు బాగా నచ్చింది’’’’విశ్వ సృష్టి కర్త విశ్వ కర్మ ‘’ మకుటం మకుటాయ మానంగా ఉన్నది .  ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతాలన్నిటికి ఆధారం వేదాలు స్మృతులు పురాణాలే .ఈ విశ్వ కర్మ అంటే సృష్టికర్త కు కూడా అవే ఆధారాలు .యద్భావం తద్భవతి .విశ్వ కర్మ కు త్వష్ట అనే పేరున్నది . నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః.ప్రజాపతి విశ్వకర్మ మనసు .ఈశ్వరుడికి లాగా అయిడుముఖాలు .సృష్టికి పూర్వమే విశ్వకర్మ భగవాన్ తన సంకల్ప ప్రభావంతో అవతరించాడు .విశ్వకర్మాయే ప్రజాపతి బ్రహ్మ అన్నది కృష్ణ యజుర్వేదం .తూర్పు ముఖం సానగ మహర్షి ,దక్షిణముఖం సనాతన మహర్షి ,పశ్చిమాన ఆహభూన రుషి ,ఉత్తరాన బ్రత్నరుషి ,ఊర్ధ్వంలో సుపర్ణ ఋషులు ఉద్భవించారు విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మనుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన బ్రహ్మర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ బ్రహ్మర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్నస బ్రహ్మర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ బ్రహ్మర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినదివిశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం ఆని గురు పరంపర శ్లోకం ఉంది

  ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 న భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు .విశ్వకర్మ సత్యయుగం లో దేవతలకు స్వర్గలోకం ,త్రేతాయుగం లో శివుడికోసం సువర్నలంక ,ద్వాపరం లో ద్వారకా నగరం కలియుగం లో హస్తినా పురం ఇంద్రప్రస్థం ,మయసభ నిర్మించాడు .

 విశ్వకర్మ దేవాలయం  బెజవాడలో లేడు కాని బందరులో శ్రీ పాండురంగస్వామి దేవాలయం లో ఉంది .అందులో పాలరాతి విగ్రహం ,ఆలయ నిర్మాత శ్రీ నరసింహదాసు విగ్రహం ఉన్నాయి .ఉగాండా దేశం లో ‘’జింజు ‘’అనే చోట విశ్వకర్మ ఆలయం ఉంది

  సృష్టి సౌందర్యం అనిర్వాచ్యం .అన్నాడు జర్మనీ వేదా౦తి కవి దార్శనికుడు గోదే ..హెగెల్ ‘’The beauty of art is higher than the beauty of nature ‘’ఆని కళకు అత్యధిక ప్రాధాన్యమిచ్చాడు. కళా భారతి క్రీడా భారతి వంటిదే  .భౌతిక ప్రయోజనం లేకపోయినా ,మానసిక ఉల్లాసం కలిగిస్తుంది .విన తగిన క్రీడ మాకు కావాలని దేవతలు బ్రహ్మను కోరితే ఆయన సమాహార కళ అయిన నాట్యన్ని వాళ్లకు ఇచ్చాడని భరత మహర్షి చెప్పాడు .Play is the art of child .Art is the play of man ‘’ఇంతటి ఉత్కృష్టమైన స్తుష్టి కళ ను సంకుచిత్వం స్వార్ధం దెబ్బతీస్తున్నాయి వీటన్నిటి నుంచి ముక్తినిచ్చేదే కళ .మనీషి అయిన మానవుడు మనస్వి కావాలంటే ‘’Beauty is the hand writing of God ఆని భావించి భద్రపరచుకోవాలి .సౌందర్య దేవతకు గుండెలో గుడికట్టుకోవాలి అన్నాడు ప్రఖ్యాత అమెరికన్ రచయిత తత్వవేత్త ఎమర్సన్ ..ఇంకో అడుగు ముందుకు వేసి సోక్రటీస్ ‘’What ever is beautiful is for the same reason GOD ‘’అన్నాడు .’’The course of nature is the art of GOD ‘’అన్నాడు యంగ్ .కనుక సృష్టి యే రూపంలో ఉన్నా దాన్ని ఆస్వాదించాలి అనుసరించాలి కాపాడాలి కాని ధ్వంసం చేయరాదు .ఆని సృష్టికర్త శతకం మనకు ఇచ్చే సందేశం .అందుకే ఆచార్య ఎస్వి జోగారావు గారు ‘’సౌందర్య,మాధుర్య సౌకుమార్యాల సాహిత్యమే లాలిత్యం ‘’అన్నారు ఈమటలన్నీ ఈ శతక సృష్టికర్త తుమ్మోజు వారికి సరిగ్గా సరిపోతాయి .నిన్నసభలో ఎవరో రామ లక్ష్మణాచార్యులు అంటే రాముడికి లక్ష్మణుడికి ఆచార్యుడైన విశ్వా మిత్రుడు అన్నారు ,విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడు .త్రిశంకుడికి భూమి ఆకాశాల మధ్య ఒక స్వర్గం నిర్మించాడు .గాయత్రి మంత్ర ద్రష్ట .కాని నేను రామ అంటే విగ్రహవాన్ ధర్మః .లక్ష్మణ అంటే ఆదిశేషుని అవతారం సకల విద్యలకు నిలయమైన వాడు .కనుక ధార్మిక ,విద్యా దులకుఆచార్యుడు అంటాను .

సరిగమలు

డా పూర్ణ చందు ‘’ఇక్కడే ఈ లైబ్రరి లోనే కృష్ణాజిల్లా రచయితల సంఘం మొదటి సమావేశం జరిగిందన ,ఇదే ఆసంఘానికి పురుడు పోసిన పుట్టినిల్లు అన్నారు .

సుమారు పది హేను రోజుల ముందరే తుమ్మోజు వారు బెజవాడ నుంచి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి ఆవిష్కరణ చేయాలని కోరి శతకం నాకు అంద జేసిన సౌజన్యశీలి .ఫోన్ లో చెబితే సరిపోయేదిగా అన్నా వినకుండా ఉయ్యూరు వచ్చారు  .ఆ రోజే చదివేశాను .

 మర్నాడే చెన్నై నుంచి నన్ను ‘’బాబాయి గారు ‘’ఆని గౌరవంగా పిలిచే శ్రీమతి శ్రీదేవి దంపతులు మా ఇంటికి వస్తే ఆశతకాన్ని నేనే ఆవిష్కరిస్తున్నాను ఆని చెప్పి దాన్ని వారికిచ్చేశాను. అంటే శతకం అప్పుడే మరో రాష్ట్రానికి పరచయం అయిందన్న మాట .

 ఉయ్యూరు నుంచి నాతోపాటు సరసభారతి కార్యవర్గ సభ్యులు గబ్బిట రామనాధ బాబు ,శ్రీ గంగాధర రావు గార్లు వచ్చారు .మేము ముగ్గురం రామలక్ష్మణాచార్యులకు నూతన వస్త్రాలు  ,నగదు కానుక అందించి ఆదంపతులకుశాలువా కప్పి సరసభారతి తరఫున సత్కరించాము .

ఆచార్య దంపతులు  కూడా అతిధులకు అందరికి శాలువా ,విశ్వకర్మ ఫోటో అందించి సన్మానించారు .

మధ్యలో కమ్మని టీ,చివర అందరికి ఇడ్లీ గారే ఉప్మా స్వీట్ మూడు చట్నీలతో ఉపాహారం ఇచ్చి తృప్తి చెందించారు .అందులో కారం పొడి కర్నటక రుచి ,మా అమ్మగారు చేసే కారప్పొడి రుచి తలపిస్తూ మహా బాగా ఉంటే ఆయన్ను ఎక్కడనుంచి టిఫిన్లు ఆని అడిగితె ‘’అరటాకులో భోజనం ‘’అనే దగ్గరే ఉన్న హోటల్ నుంచి ఆని చెప్పారు .

అంతేకాక ‘’డబ్బు ఎందుకు ఇచ్చారండీ ‘’ఆని అడిగారు .మీరు మా ఆస్థానకవి కవికి సత్కారం అన్ని రకాలుగా జరగాలి అన్నాను నవ్వారు .

బెజ వాడ లో ఈ మధ్య ఇంత మందితో సాహిత్య సభ జరగలేదు .రికార్డ్ సంఖ్యలో సాహితీ మూర్తులు బందరు గుడివాడ  బెజవాడ లనుంచి వచ్చి శాలువాలతో ముంచి ,మాటలతో అభినందించి తమ అభిమానం వర్షించి దిగ్విజయం చేశారు .హాట్స్ ఆఫ్ టు ఆడియెన్స్ .

పదనిసలు

 సభ రాత్రి తొమ్మిదింటి దాకా సా—-గింది .

 శతకం ముఖచిత్రం  సృష్టి కర్త విశ్వ కర్మ ను తలపించేదిగా’’ డివైన్’’ గాలేదు హిరణ్యాక్షుడు గా ‘’డేమోనిష్ ‘’గా ఉంది .ఈ మాట సభా ముఖంగా చెబుదామనుకొన్నా కాని సభ్యత కాదని ఆగిపోయాను .కొంచెం జాగ్రత్త తీసుకొంటే మరింత సుందరంగా రమ్యంగా వచ్చి ఉండేది .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-25-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.