పరీక్షిత్ కాలం లోనే ‘’ఆమ్యామ్యా ‘’ఉందా?
ఉన్నదనే దేవీ భాగవతం చెబుతోంది .
పరీక్షిన్మహారాజు 60 ఏళ్ళు ధర్మ బద్ధంగా రాజ్యపాలన చేశాడు .ఒక రోజు వేటకు వెళ్లి అలసి దాహార్తుడై ఒక ముని ఆశ్రమం చేరటం ఆయన్ను దాహం అడగటం ఆయన సమాధి ఉండగా కోపంతో విధి వక్రించి చచ్చిన పాము మెడలో వేయటం,విషయం ముని కుమారుడికి తెలిసి ‘’నా తండ్రి మెడలో సర్పాన్ని వేసిన వాడిని ఇవాల్టికి ఏడవ రాత్రి తక్షకుడు కాటు వేయుగాక ‘’ఆని శపించటం ,దాన్ని తప్పించుకోవటానికి ఒంటి స్థంభం మేడలో ఇతరులెవరూ చొరటానికి వీల్లెకుండా కట్టు దిట్టం చేసుకొని ప్రాణభీతితో ఉండటం మనకు తెలుసు .ముని అనామకుడే కొడుకు అనామకుడే .కాని శాపం మాత్రంభీకరం .కాలం కాకపొతే తాడే పామై కరవటమంటే ఇదే .
ఎక్కడో ఉన్న కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి ఈ విషయం తెలిసి ,తాను మంత్రవేత్త కనుక రాజును కాపాడితే పుష్కలం గా డబ్బు పొందచ్చు అని ఆశ పడ్డాడు. ఏడవ రోజు శాపానికి చివర రోజు తక్షకుడు పరీక్షిత్తును కాటు వేయటానికి బయల్దేరాడు .దారిలో కశ్యపుడు ఎదురయ్యాడు .ఎక్కడికి వెడుతున్నావు ?ఆని అడిగితె ‘’మా రాజును కా పాడటానికి వెడుతున్నాను .తక్షకుడే కాదు వాడి తలలో జేజమ్మ వచ్చి కరిచినా రాజును కాపాడే మంత్రం నా దగ్గర ఉంది’’ఆని అన్నాడు .ఖంగు తిన్న తక్షకుడు ‘’నేనే తక్షకుడిని .నా కాటుకు విరుగుడు లేదు . వెనక్కి తిరిగి కొంపకు చేరు ‘’అన్నాడు .పౌరుషం పొంగిన పిచ్చి బాపడు ‘’ముని శాపం ఉన్నా ,నువ్వు కరచినా పరీక్షిత్తును కాపాడి తీరుతాను ‘’అన్నాడు ,అయితే ‘’ఈ మర్రి చెట్టును కాటేస్తా .అది క్షణం లో మాడి మసి అవుతుంది .దానికి ప్రాణం పోసి బతికించు ‘’ఆని పందెం వేసి అలానే చేయగా బ్రాహ్మణుడు ఆ బూడిద అంతా పోగేసి తన మంత్ర ప్రభావంతో దాన్ని మళ్లీ కొమ్మలు ఆకులూ కాయలూ ఉన్న చెట్టుగా మార్చేశాడు .కశ్యపుడు మహా మంత్ర వేత్త ఆని గ్రహించి సామ దానాలతో లొంగదీసే ప్రయత్నం చేశాడు.’’బాపనయ్యా! రాజును రక్షించే నీ ప్రయత్నమంతా డబ్బు కోసమే కదా .ఆ డబ్బు నేనే ఇస్తాను ఇంటికి వెళ్ళు ‘’అన్నాడు .
ధర్మ సందేహంలో పడిన ఆ కశ్యపుడు ‘’డబ్బుకు లొంగితే రాజును కాపాడిన కీర్తి రాదు .కీర్తి శాశ్వతం .రఘుమహారాజు ,హరిశ్చంద్రుడు కర్ణుడు మనకు ఆదర్శం . ప్రజా క్షేమం కోసం నా రాజును కాపాడుకోవాలి .అనుకొని ధ్యానం లోకి వెళ్లి దివ్య దృష్టితో రాజు భవిష్యత్తు చూశాడు .రాజుకు నూకలు చెల్లిపోయినట్లు అర్ధమయింది.ఆసన్న మరణం. ఇక ఎవరూఏమీ చేయలేరు .తక్షకుడు ఇచ్చే డబ్బు తీసుకొంటే దరిద్రమైనా తీరుతుంది .కీర్తి కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా ?ఆనుకొని తక్షకుడు పుష్కలంగా ఇచ్చిన ధనం పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు .ఇదే ఆమ్యామ్యా ప్రభావం .ఆకాలం లోనే ఉంది కదా .
తక్షకుడికి పరిక్షిత్తు గురించి ఆలోచన వచ్చి చివరి రోజుల్లో దాన ధర్మాలు చేసుకోకుండా ,భయంతో ఒంటి స్థంభం మేడలో బతకటమేమిటి చావుకు భయపడి?ఎవరూ ఆయనకు ఇలాంటి సలహా ఇవ్వలేదా? దురదృష్టం. విధి బలీయం . అతని చావుకు నేను నిమిత్త మాత్రుడిని.అనుకొన్నాడు .ఒకపండులో కీటకంగా దూరి,కొన్ని పాములను తాపసుల వేషాలతో పళ్ళూ ఫలాలుతీసుకొని ఒంటి స్థంభం మేడలోకి వెళ్లటం ,తాపసులకు రేపు దర్శనం ఇస్తానని చెప్పి ఆ పళ్ళు మాత్రం లోపలి పంపమనటం ,సూర్యాస్తమయం అయింది ఇక తనకు చావు భయం లేదనుకోవటం ,విప్రశాపం తీరిపోయింది అయినా శాపాన్ని మన్ని౦చ టానికి ఈ పండు తీసుకొంటా. అనగా అందులోనుంచి చిన్న పురుగు బయటికి రాగా ‘’ఈ పురుగు నన్ను కాటు వేయుగాక ‘’ఆని దాన్ని మెడ మీద పెట్టుకోగా , తక్షక రూపం లో ఉన్న అది మహా విష సర్పమై పరీక్షిత్తు ను చుట్టేసి కాటు వేయగా మొదలు నరికిన చెట్టుగా కూలిపోగా ,తక్షకుడు నిప్పులు కక్కుతూ నింగికి ఎగిరిపోయాడు .పాపం స్వయం కృతాపరాధం.చావుదగ్గర పడ్డప్పుడు చావు తెలివి తేటలు వస్తాయంటే ఇదే నేమో .
ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి -శ్రీ దేవీ భాగవతం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-25-ఉయ్యూరు ..

