మిత్రుడు టి.ఎల్.కాంతారావు కు స్మృత్యంజలి – గబ్బిట దుర్గా ప్రసాద్

మిత్రుడు టి.ఎల్.కాంతారావు కు స్మృత్యంజలి – గబ్బిట దుర్గా ప్రసాద్

ఈ రోజు  10-1-26సాయంత్రం ఆయన కుమార్తె శ్రీమతి శైలజ( అమెరికా )హైదరాబాద్  రవీంద్ర భారతి లో ఆయన సమగ్రసాహిత్య ఆవిష్కరణ ,ఆయన స్మారక పురస్కార ప్రదానం చేస్తున్న  సందర్భంగా –

ఈ వికృతినామ ఉగాది మహాకవితా సంకలనాన్ని ‘మహాకవితా వసంతం’ పేరున ప్రచురించి కీ॥శే॥ టి.ఎల్. కాంతారావు గారికి అంకితం ఇస్తున్నాం. కాంతారావు గారి గురించి ఇప్పుడు కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. కాంతారావు, నేను ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేశాం. ఆయన మా యింటి పక్కన అద్దెకుండేవారు. స్కూలుకు ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చేవారం. నన్ను ‘గురుగారూ’ అని గౌరవంగా సంబోధించేవారు. మంచి మిత్రుడు, స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు, భోళా మనిషి. ఆయన కుటుంబం, మా కుటుంబం అన్యోన్యంగా ఉండేవి.

ఆయన మంచి ఉపాధ్యాయుడు. బోధనా పటిమ బాగా ఉండేది. ఇద్దరం కలిసి ఎమ్.ఎ తెలుగు పరీక్ష రాసి 1972లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి పట్టా పొందాం. పగలు స్కూల్, రాత్రి వేళ మా యింటి దగ్గర కంబైన్డ్ స్టడీ. మిత్రుడు వి.చెంచారావు కూడా మాకు తోడు. మా పరీక్ష కేంద్రం గుంటూరు. కాంతారావుకు ఒకసారి చదివితే మళ్ళీ చదివే పని ఉండేది కాదు. మనస్సులోనూ, మెదడులోనూ ముద్రపడి ఉండేది. శ్రీశ్రీ గేయాలు ఆయన నోట అనుక్షణం నర్తించేవి. అలాగే తిలక్ కవిత్వంకూడా. ఆయనకు ఇద్దరూ రెండు కళ్ళు. ఆధునిక సాహిత్యానికి ద్వారాలు తెరిచి ప్రవేశం కల్పించి అభిమానం, అభిరుచి, అవగాహన నాకు కలిగించిన మిత్రుడు ఆయన. అప్పటికే భారతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్రపత్రికలలో విమర్శ వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. నేను ప్రతిదీ చదివేవాడిని.

తను రాసిన ప్రతి రచన నాకు చూపించి పత్రికలకు పంపేవాడు. కాగితంమీద కలం పెడితే నాన్-స్టాప్-గా రాసేవాడు. చిన్న అక్షరాలతో సన్నని పాళీగల ఇంకు పెన్నుతో చీమల బారుగా రాసేవాడు. వ్యాసం పూర్తి అయ్యేదాకా కలం దించేవాడు కాదు. అన్నీ వాచోవిధేయం కనుక ప్రక్కన రిఫరెన్స్ పుస్తకాల అవసరం ఉండేది కాదు. దేనికీ వెతుక్కునేవాడు కాదు. ప్రతిరోజూ అర్ధరాత్రి దాకా ఎన్నో సాహిత్య విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆంగ్ల కవులు ఎజ్రాపౌండ్, జేమ్స్ జాయిస్, వాల్ట్ విట్మన్, టి.యస్. ఇలియట్ల కవిత్వాలను పుష్కలంగా కోట్ చేస్తూ మంచి అవగాహన కలిగించేవాడు.

హైస్కూల్లో ఖాళీ సమయంలో కేరమ్స్ ఆడేవాళ్ళం. ఇందులో ఆయన ఎప్పుడూ ప్రత్యర్థే. మంచి ఆటగాడు. కాఫీ పందాలు వేసుకొని పోటా పోటీగా ఆడేవాళ్ళం.


అతను గొప్ప బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. పసుమర్తి ఆంజనేయశాస్త్రి అనే లెక్కల మాస్టారు, నేను, కాంతారావు, డ్రిల్ మాస్టార్లు వై.రామారావు, వై.పూర్ణచంద్రరావు, యస్.వి సుబ్బారావు, క్రాఫ్ట్ మాస్టర్ కె. రామ మోహనరావు స్కూల్ అవగానే చీకటి పడే దాకా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం, ఆరగా ఆరగా కాఫీలు తాగుతూ, పోటీలు వేసుకుంటూ. వాలిబాల్ కూడా ఇంతే ఉత్సాహంగా ఆడేవాళ్ళం.

హైస్కూల్ సైన్స్ రూమ్ మాకు సాహిత్య వేదికగా ఉండేది. ఇంగ్లీష్ మాస్టరు వల్లభనేని రామకృష్ణరావు, తెలుగు పండితులు యమ్.జ్ఞానసుందరరావు, అన్నే పిచ్చిబాబు, వి.పూర్ణచంద్రరావు, హిందీ టీచర్ కొడాలి రామారావు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మహంకాళి సుబ్బరామయ్య, కె.ఆర్. కాంతయ్య, సూరి రామశేషయ్య, వజ్రకూరి గురుదాచలం, డ్రాయింగ్ టీచరు తాడినాడ శేషగిరిరావు, నేను, కాంతారావు, ఆంజనేయశాస్త్రి, సోషల్ టీచరు లంక బసవాచారి అందరం కలిసి నెలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి, మాలో ఎవరో ఒకరితో ప్రసంగం చేయించేవాళ్ళం. మిగిలిన ఉపాధ్యాయులు హాజరు అయ్యేవారు. ఖర్చు మేమే భరించేవాళ్ళం. విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంపై అప్పుడు ఆకనూరు ప్రభుత్వ హైస్కూల్‌లో తెలుగు పండితులుగా వున్న సుబ్బరాయశాస్త్రి గారు, రెంటచింతల నరసింహశాస్త్రి గార్లచే అద్భుతమైన ప్రసంగం ఏర్పాటుచేశాం. సంక్రాంతికి, ఉగాదికి కవిసమ్మేళనాలు నిర్వహించాం. నన్ను ప్రోత్సహించి తిలక్, కృష్ణశాస్త్రిలపై వ్యాసాలు రాయించాడు. వచన కవితకు మార్గం చూపాడు. ఆయన प्रभावం నామీద చాలా వుంది.

ప్రముఖ రచయిత ఆలూరి భుజంగరావు పదునేని కవిత్వంతో, అధోజగత్పోదరుల ఆర్తిని వెలువరించేవారు. ఆయన అప్పుడు సి.బి.ఎమ్ స్కూల్ హిందీ పండితులు. వంగల కృష్ణదత్తశర్మ గొప్ప సాహిత్యజీవి. ఆయన మాకు మంచి ప్రోత్సాహం యిచ్చేవారు. కవి సమ్మేళనంలో కె.సి.పి కెమిస్ట్ గా వున్న టి.వి.సత్యనారాయణ, గరికపర్రు మునసబు గూడపాటి కోటేశ్వరరావు మొదలైన వారు పాల్గొనే వారు. అప్పుడే వేమన త్రిశతజయంతి వచ్చింది. దాన్ని చాలా ఘనంగా నిర్వహించాం. వేమన చిత్రాన్ని డ్రాయింగ్ మాస్టర్ శేషగిరిరావుగారు చిత్రించారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మను అధ్యక్షులుగా ఆహ్వానించాం. మన తరం మేధావి డా.జి.వి.కృష్ణారావును ముఖ్యఅతిథిగా ఆహ్వానించి వేమన కవిత్వంపై ఉపన్యసింపజేశాం. కృష్ణారావుగారికి నూతనవస్త్రాలు బహుకరించి ఘనసన్మానం చేశాం.


ఆయన్ని విజయవాడ నుండి కారులో నేను, కాంతారావువెళ్ళి తీసుకొనివచ్చాం. మళ్ళీ వెళ్ళి దింపి వచ్చాం. అలాంటి బుద్ధి జీవి ప్రక్కన కూర్చునే అదృష్టం, ఆయన ప్రసంగం వినే భాగ్యం కాంతారావు వల్లనే కలిగింది. అద్దేపల్లి రామమోహనరావుకు కాంతారావు ప్రియశిష్యుడు. ఆయన ఉయ్యూరు తరచుగా వస్తూండేవారు. ఆయనతో మాకు చక్కని సాహిత్య కాలక్షేపం. మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేసే వాళ్ళం. అలాగే రేడియో ఆర్టిస్టులు ఎ.బి. ఆనంద్, సుమన్, నండూరి సుబ్బారావులు కూడా ఉయ్యూరు వచ్చి మాతో సరదాగా గడిపేవారు. ఒక సారి దత్తుగారింట్లో పౌర్ణమినాడు రాత్రి మంచి సాహిత్య సభ నిర్వహించాం. జ్ఞానసుందరం, సుబ్బరామయ్య, హిందీ రామారావు వగైరాలు సాహిత్య ప్రసంగాలు చేశారు. టీఫిన్లు, కాఫీలు మా ఇంటినుంచి ఏర్పాటు చేశాం. అదొక వైభవం. సూపర్ వైజర్ గొట్టిముక్కల పూర్ణచంద్రరావు, చెరకు విస్తరణాధికారి మీసాలరెడ్డిగారు, కాంతారావు, నేను, శాస్త్రి రామారావు వీడని బృందం. ఎన్నో సినిమాలు కలసి చూశాం. విజయవాడ రేడియోస్టేషన్ నిర్వహించే కవి సమ్మేళనాలకు వెళ్ళేవాళ్ళం.

బందరులో సింగరాజు రామచంద్రమూర్తి, ఆర్.యస్.కె మూర్తి, పువ్వాడ శేషగిరిరావు, విహారి, శాలివాహన, ఆదివిష్ణు, దొండపాటి దేవదాస్ వంటి రచయితలతో పరిచయం కాంతారావు వల్లనే కలిగింది. ఎమ్.వి.ఎల్. నరసింహారావు, మిరియాల రామకృష్ణ, మోహన ప్రసాద్, లత, బాలాంత్రపు రజనీ కాంతారావు, హిందీ సుమన్లను తరచుగా కలుస్తూండేవళ్ళం. కాంతారావు రేడియో ప్రసంగాల రికార్డింగ్ కు అందరం కలసి వెళ్ళేవాళ్ళం. అరమరికలు లేని స్నేహం అది. ఇంత గొప్ప విమర్శకుడు మా స్నేహితుడు అంటే గర్వంగా వుండేది. ఎమ్.ఎ. పరీక్షలు రాసేటప్పుడు పరీక్ష కేంద్రం వద్ద కాంతారావు వ్రాసిన వ్యాసాలు విద్యార్థులు చదువుతూ పరీక్షకు తయారవుతూ వుంటే, వాళ్ళకు కాంతారావును పరిచయం చేస్తుంటే, వాళ్ళు విశ్రాంతికి గురయ్యేవారు. ఇద్దరం సెకండ్ క్లాస్ లో పాసయ్యాం. ప్రముఖ కథా రచయిత, విమర్శకుడు, నటుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు ఉయ్యూరులో ఎమ్.ఎల్.ఎ వద్దే శోభనాద్రీశ్వరరావు గారి యింటికి వచ్చినప్పుడు నేను, కాంతారావు మిత్రబృందం కలసి రెండు గంటలకు పైగా సాహిత్య రాజకీయ విషయాలను చర్చించటం మరుపురాని అనుభూతి.


కాంతారావు ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ కాలేజీలో తెలుగు లెక్చరర్ అయ్యాడు. అయినా తరచుగా ఉయ్యూరు వచ్చి పలకరించి వెళ్ళేవాడు. ఆయన భార్య కమల, నా భార్య ప్రభావతి మంచి స్నేహితులు. కుటుంబ స్నేహం మాది. ఆయన ఆకస్మికమరణం జీర్ణించుకోలేక పోయాం. మంచి హాస్యాన్ని పండించేవాడు మాటల్లో, హృదయం చాలా మంచిది. కోపం క్షణికం. మంచి చెప్తే గ్రహించేవాడు. అందుకని ఉయ్యూరులో ఆయనతో మా సంబంధాన్ని పురస్కరించుకొని మాలో సాహితీ చైతన్యాన్ని కల్గించి ప్రేరణ కల్పించినందుకుగాను ఈ ‘మహా కవితా వసంతం’ పుస్తకాన్ని కాంతారావుకు అంకితం చేస్తున్నాం.

ఇంతవరకు కాంతారావుతో మా పరిచయం చెప్పాను. ఇక ఆయన జీవిత విశేషాలు తెలియజేస్తాను. దివిసీమలోని నాగాయలంక మండలం తలగడదీవిలో టి.ఎల్. కాంతారావు 1943లో జన్మించాడు. చిన్నప్పటి నుండి సాహిత్యాభిమాని. వేదపఠనంలాగ మహాప్రస్థానాన్ని నిత్యపారాయణం చేసేవాడు. మంచి మేధావి, లోతైన విమర్శకుడు. ఎవరూ చూడలేని విషయాలను కవిత్వంలో, రచనలో చూసి, వాటిని వ్యాసాలుగా వ్రాసి ఆవిష్కరించి, ఆ రచయితల శేముషిని సాహితీలోకానికి చాటాడు. భారతి, ఆంధ్రప్రతిక, ఆంధ్రప్రభలలో ఎన్నో విలువైన సాహిత్య వ్యాసాలను రాశాడు. రేడియో ప్రసంగాలు చేశాడు. సంప్రదాయం, ఆధునికం అని గీత గీసుకోలేదు. రచనలో గొప్పదనం వుంటే ఎవరైనా ఆయనకు ఆరాధ్యుడే. తిక్కన మీద ఎవరూ చేయనంత గొప్ప విశ్లేషణ చేశాడు. అభ్యుదయ రచనలపై ఆసక్తి మెండు. మొహమాటం లేదు, పదునైన విమర్శనాశైలి ఆయన సొత్తు. ఎందరో కొత్త యువకవుల కవిత్వాలను విశ్లేషించి, శ్లాఘించి, ప్రోత్సహించాడు ‘క్రొత్త గొంతుకలు’ పుస్తకంలో. ఆయన రావిశాస్త్రికి వీరాభిమాని. ఆయనపై రిసెర్చి చేస్తానని చాలా సార్లు అన్నాడు. తన రిసెర్చి ప్రణాళికను రాసి ప్రచురించాడు. రావిశాస్త్రి కథలపై ‘రావిశాస్త్రి కథాప్రపంచం’ పుస్తకం రాశాడు, సాహితీఉపనిషత్తు, కవితాలోకనం, సాహిత్యంలో సంప్రదాయం – ప్రగతి యీయన యితర రచనలు. ఏ విషయంపైన అయినా కాంతారావు అభిప్రాయం ఏమిటి అని ఎదురు చూసేది సాహితీ లోకం. ప్రముఖ సాహితీ విమర్శకుడు చేకూరి రామారావు (చే.రా.) మెచ్చిన విమర్శకుడు కాంతారావు. ఆత్మీయత, అనురాగం, గాఢస్నేహం, నిర్మొహమాటం, మాట పదును, గుండె మెత్తన అన్నీ కలిస్తే కాంతారావు.


ఆయన రాసినవి చాలా వున్నాయి. ఆయన కుమార్తె, కుమారులు వీటిని కొన్ని యీ మధ్య సంపుటిగా ప్రచురించారు. ఇంకా చేయాల్సింది వుంది. తెలుగు విద్యార్థి సంపాదకులు కొల్లూరి కోటేశ్వరరావు ఆయన సహాధ్యాయి. తెలుగు విద్యార్థి పత్రిక బాధ్యతలను ఆయన కొంత కాలం నిర్వహించాడు. ఆర్.యస్.కె. మూర్తి, అద్దేపల్లి ఆయన గురువులు. గలగల మాటల ప్రవాహంతో, కవితా ఝంకృతితో, విమర్శన శస్త్రస్రాలతో అందరినీ ఆకట్టుకునే మిత్రుడు కాంతారావు అకస్మాత్తుగా 5-3-1990లో మనందర్నీ విడిచి పరలోకం చేరాడు. మహా ప్రస్థానం చేశాడు.

ఆయన అకాల మరణానికి చింతిస్తూ గుండె లోతుల్లోంచి పెల్లుబికిన కవిత ‘మంచి మిత్రుని మృతికి స్మృతి గీతం’ (ఏన్ ఎలిజి ఆన్ ది డెత్ ఆఫ్ ఏ గుడ్ ఫ్రెండ్) వ్రాసి అక్షర బాష్పాంజలి ఘటించాను.

కాంతారావు రచనలు కాలాతీతాలు. ఆ సాహితీ మిత్రునికి, అభ్యుదయ వాదికి స్మృత్యంజలి ఘటిస్తూ ఈ ‘మహా కవితా వసంతం’ పుస్తకాన్ని నీరాజనంగా అంకితం ఇస్తున్నాము.

శారదము దివ్య వేదము, సునాద వినోదము నుస్వరామృతా స్వాదము, సామగాన వరసాధనతో నవభావ కల్పనా మోదము, స్ఫాదు చందన ప్రమోద సమీరము, మా తెలుంగు, స మ్మోదము గూర్చు వీడియలు మ్రోగిన నాదము వాయులీనమున్. — దూసి ధర్మారావు

తెలుగులో మాట్లాడటం మన జన్మహక్కు

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ –10-1-26

సరసభారతి అధ్యక్షులు-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.