త్రిపుర నేని ఇంటి పేరు ఎలా వచ్చింది ?
కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు కు సేనాధిపతి శంభుడు . ఆంధ్ర దేశరక్షణ కోసం ఢిల్లీ సుల్తానులతో పోరాడిన యోధాగ్రేసరుడు .అతని ప్రతాపానికి మెచ్చి మహారాజు అతనికి మూడుపురములు ఇచ్చి రాజుగా ప్రకటించి ఘనంగా సత్కరించాడు .ఈ త్రిపుర రేడు క్రమంగా త్రిపురనేడు గామారి ,చివరికి త్రిపురనేని అయింది .ఇప్పటికీ శంభుని వంశం వారికి త్రిపురనేని ఇంటిపేరుగా ఉన్నది .’’వీరంతా యుద్ధ రంగం లో కత్తులు దూసిన సైనిక వంశ మొనగాళ్ళు’’అన్నారు ప్రముఖ చారిత్రిక పరిశోధకులు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు .ఈ త్రిపురరాజు తురాయి గల తలపాగా ధరించి యుద్ధం చేసేవాడు .దానిపై ఉన్న పువ్వును చూసి జనం ‘’పువ్వాడు ‘’వస్తున్నాడని స్వాగతం పలికేవారట .శత్రువులు భయంతో పారిపోయేవారట .త్రిపురనేని వంశం వారికి ‘’పువ్వాడ ‘’గోత్రం అయింది .
ప్రతాపరుద్రమహారాజు ఓరుగల్లు రాజధానిగా కాకతీయసామ్రాజ్యాన్ని పాలిస్తూ ఒకసారి శంభుడిని రాజధానికి కాపలాఉంచి దండయాత్రకు వెళ్ళాడు .అదే అదను అనుకోని శత్రురాజులు ఓరుగల్లు పై దండెత్తి వచ్చారు .శంభుడు ధైర్యంగా ఎదిరించిపోరాడి వాళ్లనందర్నీ పారద్రోలాడు .మహారాజు తిరిగిరాగానే ప్రజలు శంభుని వీర విక్రమ పరాక్రమాలను తెలియజేయగా ,పరమానందం చెంది ,శంభుని ప్రేమగా కౌగలించుకొని మెచ్చి త్రిపురాలను శత్రువులకు కైవశం చేయకుండా కాపాడినందుకు త్రిపురాలకు మూడు మేడలవంటి .పెద్ద దుర్గాలకు అధిపతిని చేసి ఘన సత్కారం చేశాడు .అప్పటినుంచి శంభుని సంతతివారికి ఇంటిపేరు త్రిపురనేని అయింది .ఓరుగల్లులో పువ్వులు అమ్మే వాడ లో శంభుడు నివశించటం చేత ఆవంశానికి గోత్రం పువ్వాడ అయిందని కూడా అంటారు.
కృష్ణా జిల్లా గుడివాడకు దగ్గరలో అంగలూరు గ్రామానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది .ఆగ్రామానికి పడమట దిశలో ఈమధ్యవరకు ఒక పాటి దిబ్బ ఉండేది .అది కాకతి దేవాలయ శిధిలాలకు గుర్తు .ప్రతాపరుద్రుడుజైత్రయాత్రలో ఇక్కడికి వచ్చి ఆ దేవాలయం కట్టించాడు .దీనికి అతిదగ్గరలో కౌతవరం గ్రామం ఉంది .ఇది కాకతీయుల ను విజయలక్ష్మి వరించిన ప్రదేశం కనుక ‘’కాకతీ వరం ‘’అనే పేరు పొందింది .కాలక్రమం గా ‘’కౌతవరం ‘’గా మారింది .ప్రతాప రుద్ర మహారాజు జైత్ర యాత్ర కు బయలుదేరి విడిది చేసిన ప్రదేశమే ‘’అంగలూరు ‘. సేనాని శంభుడిని ఇక్కడే ఉంచి, ప్రతాపరుద్రుడు రాజధాని ఓరుగల్లు కు వెళ్ళాడు .కాకతి ప్రతాపరుద్ర మహారాజు సైన్యాధ్యక్షుడు శంభుడే త్రిపురనేని వంశం వారికి మూలపురుషుడు .
శంభుడు అంగలూరు నివాసంగా చేసుకొని ,మహారాజు అనుమతితో శైవ మతానుసారంగా నందివాడ ,గుడివాడ ,,కౌతవరం లలో శివాలయాలు నిర్మించాడు . ప్రజారంజకం గా పాలించటం చేత ‘’త్రిపురనేడు ‘’అనే బిరుదునిచ్చి ప్రతాపరుద్ర మహా రాజు సత్కరించాడు .కాలక్రమం లో త్రిపురరేడు –త్రిపురనేని మారింది .పైన చెప్పిన మూడుగ్రామలు’’ అంగల’’దూరం లో చేరటానికి వీలుగా ఉండటం వలన దానికి ‘’అంగలూరు ‘’అనే సార్ధక నామం కలిగింది .కవిశేఖర జోసెఫ్ త్రిపురనేని వంశం వారి కీర్తిని వర్ణించిన పద్యం –
ఆధారం –శ్రీ మంత్రిప్రగడ వీరభద్రమూర్తి గారి ‘’విమర్శక రత్న త్రిపురనేని సుబ్బారావు గారి జీవితచరిత్ర ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-26-ఉయ్యూరు .
