కొమ్మ -బొమ్మ -అమ్మ
వసంతం హసించని కొమ్మతో
బొమ్మ చేసి ,ఎత్తుగా వున్న పీఠం పై
మోజుగా ,ముద్దుగా ,కూర్చోబెడితే
”అమ్మవారై,ఎక్కించిన వారి పాలిటి
మహామ్మారై విజ్రుమ్భించింది
కొమ్మ బొమ్మైంది ,బొమ్మ అమ్మైంది.
కొమ్మ బొమ్మ అమ్మ ముగురమ్మల
మూలపుటంమై విజ్రుమ్భించింది
పంచన జేరిన వాణ్ని పన్నీట ముంచింది
వంచన పేరుతొ వాణ్ణీ పాతాళం లో దించింది
కల్ల కపటము లేనట్లు కపిల దేనువన్నట్లు
పల్లు మాటాడనట్లు పసిహృదయమట్లు
తన్ను తానేట్లో ప్రకటించు కుంది
అశరీర వానితో శృతి చేయించుకున్నది .
ఎటు చూసినా నేడు దైన్యం
హైన్యం నైచ్యం ,పరతంత్రత
స్వచ్చత లేని బ్రతుకుల్లో నిత్యం గచ్చ పొదలు
ప్రతిదీ అందరానంత దూరం –ఆకసాన కుసుమం
ప్రజ కదిలింది చైతన్య స్రవంతిలా
కబంధ హస్తాలు తెంచి
స్వేచ్చా పిపాసల నుంచి
జగతి నవ్య దివ్య స్ఫూర్తి వహించే
శుభ తరుణం చేరువైంది .
అమ్మ పతనం తప్పదు
బొమ్మ కావటం తప్పదు
వసంతం లేని కొమ్మ మళ్ళీ
నోరెత్తక పోవటం తప్పదు .
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రీ ప్రసాద రాయ కులపతి సంపాదకులు గా స్వర్గీయ ఆర్. ఎస్ .కే .మూర్తి (మచిలీ పట్నం ) ఉప సంపాదకులు గా నిర్వహింపబడిన ”సాందీపని ”మాస పత్రికలో నవంబర్ 1974 లో ప్రచురింపబడి ,,శ్రీ కందుకూరి వెంకటేశ్వర్లు గారి సంపాదకత్వం లో 1975 లో వెలువడిన కవితా సంపుటి ”నవ చేతన ” లో ప్రచురింపబడిన నా కవిత ఇది

