గద్య నన్నయ చిన్నయ సూరి

గద్య నన్నయ చిన్నయ సూరి 
—                          సకల సాహితీ” సుజన రంజకమైన” పత్రికను పుత్రికా  వాశ్చల్యం తో పెంచి ,ఎదుగుదలకు పులకించిన జనకునిగా ఆనందానుభూతి నంది ,పట్టరానంత సంబరాలతో అంబరాన్నంటే ఆనందం తో జరుపుకున్న సీమరాజు పట్టాభిషేకాన్ని అక్షరాభిషేకం తో అభినందించి ,భాట్టభానుని ,ముద్దు పట్టి కాదంబరిని అట్టహాసంగా ,ఆంద్ర కాదంబరిగా అవతరింప జేయటం లో తరించి ,గీర్వాణ కౌముదిని శాస్తాధ్యయన జనానికి వెన్నెల పర్వణం చేసి ,అమరలోకపు పారిజాతాన్ని తెలుగు భూరుహం గా నిలిపి ,పరిమళాలు నింపి ,గమ్మత్తు మత్తులో ఎదల నుయ్యాల లూగించి ,రంగు,రుచి వాసన గల తెలుగు అక్షరాలను గుది గుచ్చి అక్షరగుచ్చం చేసి ,శాస్వతకీర్తి నార్జించి ,ఆర్తజన బాన్ధవునిగా వర్ధిల్లమని పచ్చయప్ప నృపుని యశస్సు పదికాలాలు మండలాంతర విస్తృతి నందాలని మనసార ఆకాంక్షిమ్చి ,కృతజ్ఞత చాటించి ,బాలబోధకంగా   సంస్కృత బాలబోధ సాధన చేసి ,ఆకుచాటు పిందేల్లా  వుండి  చేటల్తో అర్ధాన్ని భావాన్ని చెరిగి ,జాతి జీవనానికి పట్టుగొమ్మలై నిలిచిన చాటువులను ఏర్చి కూర్చి ముత్తెపు సరులుగా తెలుగు తల్లికి ఆభరణంగా అరణం గా అందించి అఘటన ఘటనా సమర్ధం గా ఒంటిచేత ”అకారాది నిఘంటు ”నిర్మాణంతో తెలుగులకు వెలుగుల దారి చూపి తన చేత ,రాత ,అంతటి తో ఆగిపోనీక విశ్వ వ్యాప్తిత మయ్యే తపనతో ,తపస్సు తో ,”విశ్వ నిఘంటు ”వు కు టీకాతిలకం తీర్చి దిద్ది ,యాదవకులతిలకుని అభ్యుదయ పరంపరగా యాదవాభ్యుదయ యశోచంద్రికలను భువికి దించి, అలక్ష్మీ నిరసనగా శ్రీ లక్ష్మీ నారాయణ తంత్ర యంత్ర స్థాపన చేసి, అర్థము, పరమార్థము, లక్షంగా పదాలను సార్థకత చేకూర్చే సార్ధక పద మంజరి’ని, శారద  పద మంజీరంగా వేలయించి, అయోమయమైన దూమశకట విన్యాసాన్ని ధూం ధూం దండకంగా దండ గూర్చి , ప్రపంచ సర్వశాస్త్రాలకు ఆది, అనాది అనిపించుకున్న హిందూ ధర్మ శాస్త్రాన్ని అపర అగస్త్యునిగా  సంగ్రహించి చుళికీ కృతం చేసి,  సులభ గ్రహకంగా, నీతిని సంగ్రహించి, నీతి చంద్రికతో చిత్త శాంతిని సాధించి, సులభ భోధనకై విభక్త భోధిని కరతలా మలకం చేసి, ద్రావిడాంధ్ర గీర్వాణ ప్రాకృత భాషల పారమెరిగి, సారమెరిగి, సుసంస్క్రుతం అని చిరయశస్సు నార్జించిన సంస్కృత సూత్రాలకు ఆంద్ర వ్యాకరణాన్ని అక్షర రమ్యం గా మలచి ,”పద్యాంధ్ర వ్యాకరణం ”నిర్మించి ,శబ్ద శాసనుడైన నన్నయ్యకు సైదోడుగా ”ఆంద్ర శబ్ద శాసనాన్ని ”చేసి ,ప్రతిపర్వ మాధుర్య విలసిత మహాభారత నన్నయ కృత ఆదిపర్వానికి వన్నె ,చిన్నె లతో ,పరిపక్వ వచన రచన సొంపుల నందించి ,బాలలకే కాదు ,ఆబాల గోపాలానికి అవసరమయ్యే ,బాల వ్యాకరణాన్ని గ్రామ కరణం లెక్క గా నూలు అటూ ,యిటూ తేడా లేకుండా మంత్రాలల సూత్రబద్ధం చేసి ,,మననకు ,మాననీయతకు ,గణనీయతకు ,ఆదర్శంగా  నిలిపి ,”తెలుగు వ్యాకరణ దీపం చిన్నది ”అన్న వారికి ”తెలుగు వ్యాకరణ దీపంచిన్నది   కాదు చిన్నయ్యదే ”అని దాని కీర్తి చంద్రికలు పాణిని దాకా చేరేట్లు చేసి ,తెలుగు భాషకు వున్న నుడులు ,సంధులు ,సమాసాలు ,అలంకారాలను అద్భుతం గా ,కమనీయం గా మనోహరం గా కూర్చి ,కలకండ మాధుర్య ,గాంభీర్య వచన రచనకు మార్గ దర్శియై ,వచన విదాతయై ,తన వచన రచనతో ప్రాభవమ్ కల్పించి ,పోషించిన విష్ణువై,చివరికి తనలోనే ,తనతోనే లలయం చేసుకొన్న శివుడైన త్రిమూర్త్యాత్మక మూర్తి,తెలుగు గ్రాంధిక వచనావిన్యాసానికి చలువ కుటీరం నిర్మించిన  వాస్తుశిల్పి శ్రీ పరవస్తు చిన్నయ సూరి .ఆ వాస్తు అప్పుడు అందరి వస్తువే .కాలక్రమాన అది ”పరవస్తు”వు అయింది .మీగడ పెరుగు ఆయన భాష ..ఆ తర్వాత వ్యావహారికం తో పల్చని మజ్జిగ అయింది .అదీ జీర్ణించుకోలేక సతమతమాయే జీర్ణాశయ  బాధ మనది .ఆయన ఒక్క” సూరి  ” మాత్రమే కాదు పన్నిద్దరు (12 ), సూర్యుల తేజో విరాజితుడు .పద్యం లో నన్నయకు వున్న గౌరవం గద్యం లో చిన్నయ సాధించారు .పేరుకు చిన్నయ్యే కాని ప్ర జ్ఞా ప్రాభవాలకు   పెద్దయ్య పెద్దన్నే .ఆ మాధుర్య విలశిత మైన హృద్య గద్య వైభవ నిర్మాతకు వినమ్రం గా అంజలి ఘటిస్తూ      సెలవ్ .   i

                                                                                 మీ —————గబ్బిట దుర్గా ప్రసాద్
                                           పరవస్తు చిన్నయసూరి పీఠం ,నాగార్జున విశ్వ విద్యాలయం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తం గా 17 -01 -08 ,18 -01 -08 తేదీలలో గుంటూరు లోని నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో నిర్వహించిన చిన్నయ సూరి ద్విశతాబ్ది  ప్రారంభవ ఉత్చావ  సమా వేశం లో చివరి రోజున జరిపిన ”అక్షరాభిషేకం ”లో నేను చదివినది .ఇది తర్వాత ఆకాశవాణి విఇజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైంది
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.