నమస్తే శ్యాం గారు
మీరు పంపిన పుస్తకాలు మూడు చదివాను .ఒమర్ ఖాయం కవితల్ని సంస్కృతం లో శ్లోకాలుగా రాసిన హరికధా పితామహుడు ,అచ్చ తెలుగు కవి ,మహా పండితుడు స్వర్గీయ ఆది భట్ల నారాయణ దాసు గారి కి ఆంద్ర జాతి రుణ పడి వుంది వారు రాసిన ఉపోద్గాతంలో చాల విలువైన విశేషాలు చర్చించారు .”సుర ”ను దైవ భక్తీ గా ” సాకీ ని శ్రద్ధ గా పేర్కొనటం తో ఖయ్యాం మీద గొప్ప గౌరవం కలుగు తుంది .మితాహారం ,అరణ్య వాసం ,శివ శక్తి నామ సంకీర్తనం ను దాసు గారు ఆ కవితల్లో దర్శించటం బాగుంది వున్నత జీవిత సత్యాలవి .ఉమర్ పెద్ద జ్యోతిష్యుడని ,ప్రారంభం లో సూర్య దేవ స్తుతి చేయటం దీనికి నిదర్శనం అనటం భావ్యం గా వుంది .ఆయనలో గణిత శాస్త్ర వేత్తను చూపారు .ప్రాచీన పార శీకమే ప్రాకృత భాషా విశేషం గా గుర్తించటం విశేషం .ఒక గొప్ప ఆరాధనా భావం తో దేవ భాష లోకి దాసు గారు ఖయ్యాం ను ప్రవేశ పెట్టటం సాహసం తో చేసిన పనే .ఆనాటి సాహితీ వేత్తలపై విరుపులు ,మరకలు ఆదిభట్ల వారు విసిరారు .చాలా ఉదాత్తం గానే వారి రచన సాగింది అయితే నాకు ఏమనిపించిందంటే ఒమర్ చాలా లలితమైన భాషను ఉపయోగిస్తే దాసు గారు కొంత క్లిష్టమైన ,భారమైన పదాలనుపయోగిన్చారనిపించింది ఆయన పాండిత్య ప్రతిభకు అదొక నిదర్శనం కావచ్చు .లాలిత్యం లేక పోవటం కొంత ఇబ్బంది అని పించింది ఆ ఇబ్బందిని స్వర్గీయ యామిజాల పద్మ నాభ స్వామి తన అనుభవాన్ని రంగ రించి చాలా తేలిక మాటలతో ,లలిత సుందరం గా అనువాదం చేసి ఖయ్యాం ను తెలుగు వాడిని చేసి సఫలీ క్రుతులైనారు .హట్స్ ఆఫ్ to svaami మంచి పుస్తకము,అరుదైనది అందజేసి నందుకు అభినందనలు
రెండోది రావు బాల సరస్వతి గారి అభినందన సంచిక .అరుదైన ఫోటో లతో ,ఆంద్ర ,ఆంగ్ల భాషల్లో వ్యాసాలు ,ఆకర్షణీయ మైన ముద్రణా మనసుకు హత్తు కోనేట్లుంది .ఆ సంగీత సరస్వతికి అపు రూప కానుకే ఇది .thanks .ఇందులో సరస్వతి భర్త గారి ఫోటో లో ఆయన కళ్ళుచూస్తె ఆనాటి వేమూరి గగ్గయ్య గారి కళ్ళు కన పడి భయమేసింది .పాపం ఆమె యెంత భయ పడ్డారో అని పించింది .ఈ సంచిక రావటానికి భ.రా.గో .గారు యెంత శ్రమ పడ్డారో తెలుస్తుంది .ఇలాటివి తెసుకు రావటం లో ఆయనకు ఆయనే సాటి .మరనిచే వరకు ఆయన ఫోన్ లో మాట్లాడే వారు .ఆయనంటే నాకు అభిమానం ,మాత్రమే కాదు ,ఆరాధన కూడా .ఆయన జీవిత చరిత్ర ”ఆరామ గోపాలం’ చదివి స్పందించి రాస్తే ,దాన్ని ఫోటో స్టేట్ తీయించి బంధువు లందరికి పంపించి నట్లు ఫోన్ చేసి చెప్పిన సహృదయుడు గోపాలం గారు .ప్రత్యెక అభినందన సంచికలు తేవటం లో ఆయన నిబద్ధత ,కృషి పై ఎవరైనా చక్కని విశ్లేషణ చేయ తగిన సమాచారం వుందని పిస్తుంది .
పతంజలి గారి మూడు నవలలు .సామాన్య జన జీవితం లో వున్న భయాలు ,పీడన ,వేదన లను హాష్యం తో మేళవించి రాయ గల సామర్ధ్యం పతన్జలిది .సీరియల్ గా వచ్చిన వాటిని చదివాను .ఇంకొంచెం శ్రద్ధ గా వీటిని చద వాలి ఇదేమిటి ఇలా వుంది ,అనిపిస్తూనే ముందుకు నడిపిస్తాడు .వ్యంగ్యం అంగాంగం లో వుంటుంది .ఆలోచన రేకెత్తిస్తుంది .ఇదీ అందరినీ అలరించేది .
పాథకుల అభిప్రాయాలకు అనుగుణ మైన అపురూప విషయాలను అందిస్తున్నందుకు మరో మారు అభినందనలు .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ —12 -06 -11
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

