మామిడి పళ్ళ తద్దినం
మా మామయ్య గారింట్లో వేసవి కాల0 లో ఆంటే వైశాఖ జ్యేష్ట మాసాల్లో తద్దినాలు వచ్చేవి .అది మామిడి పళ్ళసీజన్ కనుక ఆ తద్దినాలలో మామిడిపళ్ళు బాగా వడ్డించే వాళ్ళు భోజనం లో.. .అందుకే వాటిని మామిడి పళ్ళ తద్దినం అనేవాళ్ళం ఇది సుమారు అరవై ఏళ్ళ కిందటి ముచ్చట .తద్దినం ఎవరిదో మాకు పట్టేది కాదు . మామిడి పళ్ళ మీదే మా ధ్యాస . చాలా వైభవం గా జరిపే వారు. ముందే పనస కాయలు కొనేవారు .లేక పొతే ఎవరైనా తెచ్చి ఇచ్చే వారు .పైన వున్న ముళ్ళ పొర అంతా చెక్కి ,అడుగున గోనే పట్టా మీద నిలువుగా వుంచి దానికి పసుపు , నువ్వుల నూనె పూర్తిగా పట్టించి పైనుంచి కత్తితో ముక్కలు ముక్కలుగా పొట్టు వచ్చేటట్లు కొట్టే వాళ్ళు . దీనికి ప్రత్యేకమైన కత్తులు ఉండేవి. కనుకనే వీటిని పనస కత్తులనేవాళ్ళు . .చెరుకునరికే కత్తులను కూడా ఉపయోగించే వారు . మా నరసింహం తాతయ్య ,మామయ్య బాగా కొట్టేవారు .ఇందులో వాళ్ళు దిట్టలు .చూస్తుంటే మాకూ వచ్చేది .వాళ్ళు అలిసిపోతే నేను , సూరి నరసింహం ,పెద్ది భొట్ల ఆదినారాయణ మా మామయ్య తోడల్లుడి కొడుకు శాస్త్రులు ఆపని చేసే వాళ్ళం .ఆ రోజూ విస్తళ్ళు ఆంటే అరటి ఆకులు అంత బాగా వాడే వాళ్ళు కాదు .బాదం ఆకులు కోసి శుభ్రం చేసి గుండ్రగా విస్తళ్ళు కుట్టే వారు .నరసింహం తాత చాలా బాగా కుట్టే వాడు .ఒక్కొక్క సారి తామరాకులు కూడా వాడే వారు అవి ఒకరకమైన వాసన వచ్చేవి . అరటి దొప్పలతో విస్తళ్ళు కుట్టే వారు. వూళ్ళో వున్న బ్రాహ్మణ కుటుంబాలను అందర్నీ భోజనాలకు పిలిచే వారు . పెద్ద వాళ్లకు ,పెద్దవి చిన్న వాళ్లకు చిన్నవి వేసే వారు .మధ్యాహ్నం ఒంటి గంట తరవా తే భోజనాలు . వంట మా అత్తయ్య మహాలక్ష్మమ్మ గారు ,నా అమ్మ భవానమ్మ గారు కొలచల శ్రీరామ మూర్తి గారి భార్య ,మా చిన్న మామ్మ శౌభాగ్యమ్మ గారు కలిసి చేసే వారు .అంతా పరస్పర సాయమే .మడి కట్టుకొని చేయాల్సిందే .కాశీపోసి చీర కట్టుకోవాల్సిందే .
కూరలు పనసపొట్టు ఆవ పెట్టి కూర ,కంద లేక పెండలం కూర ,దొండ కాయ కూర అరటికాయ కూర లేక దోసకాయ కూర .ఆంటే కనీసం నాలుగు కూరలు ఉండేవి .అలాగే నాలుగు రకాల పచ్చళ్ళు .అందులో ముఖ్యం గా నువ్వుల పొడి ,అల్లం పచ్చడి ,దోసకాయ పచ్చడి ,ఆవ పచ్చడి ఉండేవి పెసరపప్పు ,మాత్రమే వ౦డే వారు .పరవాన్నం తప్పనిసరి . గారెలు కారంవి వుత్తవి .బూరెలు తప్పదుచారు , పెరుగు లేక మజ్జిగ అరటి ఊచ కూర వీలుని బట్టి చేసే వారు .బెండకాయ కూర కూడాఅంతే .చామదు౦పల కూర కూడా దేనికో దానికి ప్రత్యామ్నాయం. మంచి తిండి పుష్టి వున్న భోక్తలనే పిలిచే వారు, ఇద్దరు భోక్తలు తప్పనిసరి .మంత్రానికి వంగల సుబ్బయ్య గారే ఆయన ,మాకూ మా మామయ్య గారికి ఇంటి పురోహితుడు .మామయ్యకు సహాధ్యాయి నాన్నకు కు శిష్యుడు .వేదం క్షుణ్ణంగా చదువు కొన్న వాడు .బ్రాహ్మల ఇంట్లోనే కార్య క్రమాలు నిర్వహించే వారాయన .అపర కర్మలు కూడా కొద్ది కుటుంబాలకే పరిమితం .ఆయన మంత్రం చదువుతుంటే దేవతలు ,పితృదేవతలు ప్రత్యక్షం అయినట్లుండేది .చక్కని స్వరం .గంభీర మైన ధ్వని మామయ్య ఆయన్ను ఏరా అనేవాడు ,ఆయనా ఈయన్ను ఏరా గంగయ్య అనే వారు .భోక్తలు భోజనం చేస్తుంటే అధిశ్రవణ౦ చెప్పటానికి కనీసం నలుగురు బ్రాహ్మలు వచ్చే వారు .వారిని పిలవక్కరలేదు .తద్దినం ఎప్పుడో ముందే వారికి తెలిసి తమ విధి అని భావించి వచ్చే వారు .అధిశ్రవణ౦ చెబుతూంటే చాలా గొప్పగా వుండేది .అందరు గొంతు కలిపి వంతుల వారీగా చెప్పే వారు మేము విని ఆనందించే వాళ్ళం, అందులో ఏ అర్ధముందో మాకు తెలీదు .కాని వేద మంత్రాలు మమ్మల్ని ఆకర్షించేవి
మధ్యాహ్నం పదకొండున్నరకు కార్య క్రమం ప్రారంభ మయ్యేది . అప్పటికి ఆడ వాళ్ళువంట పూర్తి చేసి సిద్ధం గా వుండే వారు భోక్తలు భోజనాలు చేస్తుంటే మమ్మల్ని ఊళ్ళోకి వెళ్లి భోక్తల భోజనాలు అవుతున్నాయి భోజనానికి రండి అని చెప్పమనే వాడుమమయ్య. అలాగే ఇంటింటికీ ,చిన్నా ,పెద్ద ఆడ మగా ,అందరిని రమ్మని చెప్పేవాళ్ళం .వాళ్ళు కూడా ఈ పిలుపు కోసం ఎదురు చూస్తుండే వాళ్ళు ..భోక్తలుగా సాధారణం గా శాయపురం అగ్రహారం లోని వారిని పిలిచే వారు .వారు మంచి కర్మిష్టులు . వ్యవసాయం బాగా చేసే వారు . వేద వేదా౦గ పారీణులు .యజ్న యాగాలు నిర్వహించిన వారు . క్రమ జట ఘనా లలో ఘనాపాటీలు . ఉయ్యురుకు మూడు మైళ్ళ దూరం శాయపురం .అప్పటికి రవాణా సౌకర్యాలు లేవు నడిచి వచ్చి వెళ్ళటమే .ఉభయ సంధ్యల్లో సంధ్యావందనం ,దేవతార్చన వారి జీవితం లో భాగం వారికి మాంచి తిండి పుష్టి వుండేది .అందుకే వారిని పిలిచే వారు .అధిశ్రవణానికి కంభం పాటి వారిని కోట పూర్ణానందం గారిని అవధాన్ల గారినీ ఉయ్యూరు లోని కోట కృష్ణ మూర్తి గారిని పిలిచే వారు .ఏ తద్దిననికైనా ఈ బృందం మామూలే .
మామయ్య కు మామిడి తోట వుండేది. ముందే పక్వానికి వచ్చిన కాయలు కోసి వాళ్ళింట్లో గదిలో పండపెట్టే వారు .అవి ఎప్పుడు పండుతాయా అని మాకు ఆరాటం మూడు రోజులకోసారి కాయలు తిరగేసే వారు .సరిగా ఆనాటికి తయారయ్యేవి. ఘుమ ఘుమ వాసనలు ఇల్లంతా వ్యాపించేవి ము౦దుగా రాసాలు వస్తాయి .తరువాత బంగిన పల్లి .బ్రాహ్మణులకు సుష్టుగా వడ్డించే వారు .కమ్మని నెయ్యితో పప్పు కలిపి పచ్చళ్ళు అనుపానం గా తినేవారు చేతి వెళ్ళ లోంచి నెయ్యి కారి పోయేదాకా వద్దనే వారు కాదు .అది అయింతర్వాత పనస పొట్టు కూర మరీ మరీ వడ్డించుకొని తినేవారు మా అత్తయ్య పనస పొట్టు వండటం లో expert చాలా రుచిగా వుండేది ఆ కూరకు ఆవ పెట్టటమే ఒక కళ రుచి దాని వల్లే వచ్చేది .దానిలో వేగిన మిరపకాయలు నంచుకొంటు తింటే స్వర్గంకనిపించేది .అది లాగించిన తర్వాతే మిగతా కూరల జోలికి పోయే వారు .నువ్వుల పొడి మహా రుచికరం .మారు వేసు కోని తినేవారు దేన్నీ వదిలే వారు కాదు .గారెలు వడ్డి౦చడం తరువాయి, వాయి వాయి లోపలి వెళ్ళేవి .బూరెలు అంతే .కనీసం అవి ఒక్కొకటి ఇరవైకి తక్కువ కాకుండా తినే వారు .చారు పోయించుకొనే వారు చివరికి మామిడి పళ్ళు ఒక పట్టు పట్టే వారు .కొసరి కొసరి రసాలు వేసే వారు. వడ్డన అంతా ఆడ వాళ్ళే ..ఒక వేల బంగిన పల్లి కాయలైతే అటూ ఇటూ చెంపలు తరిగి టెంకతో సహా వేసే వారు .భోజనం అయింతర్వాత చూస్తే ఒక్కో విస్తరి దగ్గర చిన్న కొండ పరిమాణం లో టే౦కలు పోగులు .భోక్తలు ఇంత ఇష్టం గా తింటే పితృ దేవతలు సంతృప్తి చెందినట్లు భావించే వారు .తృప్తి చెందుతారని నమ్మకం .అందుకే అంత శ్రద్ధగా చేసే వారు కనుక దానిపేరు శ్రాద్ధం అయింది .కాల క్రమం లో ఆ తిండి పుష్టి లేదు తిని హరాయించుకొనే వారు ఆ నాడు .ఇవాళ తిన్నా హరాయిన్చుకోలేని దుస్థితి మనది .కమ్మని భోజనం పెట్టటం తన అదృష్టం గా గృహస్తు భావించే వాడు .తిని గృహస్తుని సంతోష పెట్టాలని అతిధులు భావించే వారు .బ్రాహ్మల భోజనాలు అయ్యేదాకా అధిశ్రవణ౦ జరిగేది .వాళ్ళు కూడా భోక్తల భోజన౦ తర్వాత మాతో పాటు కూర్చుని భోజనం చేసే వారువూరి వారందరితో . భోజనాలకొచ్చిన వారికీ పై విధం గానే వడ్డన జరిగేది. అందరు సంతృప్తిగా భోజనం చేసే వారు .మామిడి పళ్ళు తరిమి తరిమి వడ్డించే వారు .పొట్ట బరువవుతున్నా ,సర్దుకుంటూ ,తినేవారు .ఒక్క ముక్క కూడా విడిచిపెట్టే వారుకాదు .భోజనం అయేసరికి విస్తరి కడిగిన ముత్యం లావుండేది .అంత శుభ్ర౦ గా భోజనం చేసే వారు .ఆ నాడు భోజనం ఒకకళ .ఇవాళ ఫాషన్ .సంతృప్తి ఆనాటి జీవితం .వీళ్ళ విస్తళ్ళ దగ్గరా మామిడి టెంకలు గుట్టలే గుట్టలు ,ఇద్దరు ముగ్గురు తరుగు తుంటే ఇద్దరు వడ్డించే వాళ్ళు .పిల్లలం కదా మేము .మేము యధా శక్తి గా లాగించే వాళ్ళం .బాగా తినే వాళ్ళను చూసి ఇకిలించేవాళ్ళం .భోజనాల తర్వాత అందరికి వక్క పొడి .తమల పాకులు ఇచ్చే వాళ్ళు సున్నం రెడీ గా వుండేది తాంబూలం సేవించి అందరు మామయ్యను అభినందించి వెళ్ళే వారు .తద్దినం పెట్టె వారు ముందు రోజూ రాత్రి ఉపవాసం .తద్దినం నాడు రాత్రి ఏమీ తిమరు .మామయ్య దీన్ని తప్పకుండా పాటించే వాడు .నాకూ అదే అలవాటయింది .పితృ కార్యాన్ని ఇంత శ్రద్ధాసక్తులతో పెట్టట౦ .వాళ్ళింట్లోనే కనపడేది .కొలచల శ్రీ రామ మూర్తి గారింట్లోను ఇలాగే జరిపే వారు వూళ్ళో వాళ్ళు భోజనాల తరువాత ఇళ్ళకు వెళ్ళేవారు సుమారుగా ఎనభై మ౦దికి పైనే భోజనం చేసే వాళ్ళు .ఎ౦త ఖర్చు ,ఎ౦త శ్రమ ,ఎ౦త ముందస్తు తయ్యారు ? వీటిని గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది .మామయ్య వాళ్ళు అంత గొప్పగా ఈ వేసవి తద్దినాలు పెట్టె వారు. మా అమ్మమ్మ దుర్గమ్మ గారి తద్దినం వైశాఖ మాసం లో వచ్చేది. జ్యేష్టం లో మా అమ్మ నాన్న అంటే మా మాతామహులు శి౦గిరి శాస్త్రి గారి తద్దినం .తద్దినం ఎవరిదైనా మాకు మాత్రం అవి మామిడి పళ్ళ తద్దినాలే .బయటి వూరి న్నుంచి వచ్చిన వారు భోజనం తర్వాత మామయ్య గారి అరుగు మీద పడుకొని విశ్రాంతి తీసుకొని సాయంత్రం నెమ్మదిగా వాళ్ల ఊళ్ళుచేరే వారు బ్రాహ్మలకు దక్షిణ పట్టింపు లేదు .యెంత ఇచ్చినా తీసుకొనే వారు .భోజనమే ముఖ్యం .తోటలో మామిడి పళ్ళు లేక పొతే కొని అయినా ఇంత తంతూ జరిపేవారు .అదో ఆనందం .అంతే ఈ ఖర్చులు కోసం ఎకరాలమ్ము కోలేదు, అప్పులు చేయలేదు .బ్రాహ్మణ వ్యవసాయం అనిపించుకో లేదు .మంచి ఫల సాయం తీసే వాడు .మామయ్య కుటుంబం లో అందరు ఆయనకు సహకరించటం గొప్ప విశేషం .
మాతో పాటు మీరు కూడా మామిడి పళ్ళతో శుష్టుగా భోజనం చేశారు కదా .భుక్తాయాసం గా వు౦డి వుంటుంది, కొంచెం విశ్రమించండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -06 -11
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


పాత రోజులు చాలా బాగా గుర్తు చేశారు మాస్టారూ.
LikeLike
I just read your posting.It reminded me of my childhood days of 70 years ago in our street of my family and relatives in Anakapalle.We,the school children were the last batch of the people to eat around 4pm on if Taddinam falls on school day.Thanks for reminding me of the lives in Brahmin households of yester years.
LikeLike