మహాభారతం లో యక్ష ప్రశ్నలు

యక్ష ప్రశ్నలు

శ్రీ ప్రేమ చంద్ గారికి నమస్కారములు .నూతన సంవత్సర శుభా కాంక్షలు .మీరు అడిగిన వాటికి సమాధానాలు తెలియ జేస్తున్నాను .మీ ”యక్ష ప్రశ్నలు ”తో ,నాకు మళ్ళీ మహా భారతాన్ని చదివే అదృష్టాన్ని కలగ జేసినందుకు మీకు ధన్య వాదాలు .నాకు తెలిసి నంత వరకు ఇవే యక్ష ప్రశ్నలు .ఇంకేవిధ మైనవి వున్నట్లు నాకు తెలియదు .ఒక రిద్దరిని అడిగాను .వారూ అలానే చెప్పారు .ఇంకా ఏవైనా విశేషాలు వుంటే తెలుసు కోని తెలియ జేస్తాను .

 ”  యక్ష ప్రశ్నలు ”మహాభారతం లో ఆరణ్య పర్వం లో సప్తమ ఆశ్వాసం    లో వస్తాయి . ఇవి     52 ప్రశ్నలు .దీని అనువాదం ఎర్రా ప్రగడ చేశారు . .నేను శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి వచన భారతాన్ని ఆధారం గా ఈ వివరాలు అందజేస్తున్నాను .
సందర్భం –అరణ్య వాసం చేస్తున్న పాండవులు ద్వైత వనం లో ,సైంధవుని బారి నుంచి ద్రౌపది ని రక్షించుకొని ,అక్కడి నుంచి కామ్యకా రణ్యం చేరారు .వారి వద్దకు    మార్కండేయ మహర్షి వచ్చి  వారికి  ఆయన రామాయణ కధా వృత్తాంతాన్ని ,సావిత్రీ సత్య వంతుల కధను ,కర్ణుని జన్మ వృత్తాంతాన్ని వివరించి చెప్పాడు .ఆ తర్వాత వారు మళ్ళీ ద్వైత వనానికి చేరు కొన్నారు .
    ద్వైత వనం లో వుండగా ఒక రోజూ ఒక బ్రాహ్మణుడు చాలా ఆదుర్దా పడుతూ వచ్చి ,తాను అగ్నిని మధించే ”ఆరణి ”ని ఒక చెట్టు కొమ్మ లో దాచాననీ ,అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాచుకోన్నందున ఆరణి దాని కొమ్ములలో చిక్కు కుందనీ ,ఆ తర్వాత దుప్పి పారి పొతే దానితో పాటే తన ఆరణి కూడా దాని కొమ్ముల్లో చిక్కు కోవటం వల్ల దానితో పాటే పోయిందనీ ,అది ఒక అరణ్యం లోకి ప్రవేశించి తనకు కని పించ కుండా పోయిందనీ ,ఆరణి లేక పోతే తాను నిత్యమూ చేసే అగ్ని హోత్రాది కార్యాలను చేయ లేననీ ,కనుక తనకు తన  ఆరణి ని వెతికి తెచ్చి ఇప్పించాలనీ ప్రార్ధించాడు .
 ధర్మ రాజు తమ్ములతో కలిసి వాడి బాణాలను సంధిస్తూ ,బ్రాహ్మణుడు చెప్పిన వైపు దుప్పిని వెదక టానికి బయల్దేరాడు .ఎన్ని బాణాలు వారు వేసినా ఒక్కటీ దానికి తగిలిన జాడ కని పించలేదు .అది అదృశ్యమైందని భావించారు .తమ ప్రయత్నం విఫలమైందని బాధ పడుతూ ,అలసట చెందటం వల్ల ఒక మర్రి చెట్టు నీడలో విశ్ర మించారు .నకులుడు ధర్మ రాజు తో ”మీరు ఇంత ధర్మ తత్పరత కల వారు కదా !మన కష్టాలకు కారణం ఏమిటీ “”అని ప్రశ్నించాడు .దానికి ధర్మజుడు నవ్వి ”మన పూర్వ జన్మ కర్మలే ,మన సుఖ ,దుఖాలకు కారణం అని పెద్దలు చెప్పారు ”అన్నాడు .భీముడు కల్పించుకొని ”ఆ రోజూ పాంచాలిని నిండు కొలువు లోకి ప్రాతి గామి ఈడ్చుకొని వచ్చినప్పుడేకౌరవు లందర్నీ   నేను చంపేసి వుండాల్సింది .అలా చేయక పోవటం వల్లే మనకీ కస్టాలు ”అన్నాడు . అర్జునుడు భీముని కోపానికి వత్తాసు పలుకుతూ ,అహంకారం ఆవహించి ”సూత కుమారుడైన కర్ణుడు ఆరోజు పలికిన కారు కూతల్ని విని ,పిరికి పంద లాగా నేను ఊరుకో బట్టే ఈ బాధలు ,కస్టాలు ”అన్నాడు . సహదేవుడు ”దుష్ట ద్యూతాన్ని మన తో ఆడించిన మాయావి శకుని ని నేను ఆ రోజే చంపి ఉండక పోవటమే మన కష్టాలకు కారణం ”అన్నాడు .అన్నీ విన్న అజాత శత్రువు పాండవాగ్రేసరుడు ధర్మ రాజునకులుని తో   ”అన్నదమ్ములమైన మనం అందరం బాగా దాహం తో బాధ పడుతున్నాము .దగ్గర లో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకొని రా ”అని ఆదేశించాడు .
నకులుడు అన్న  గారి మాటకు బద్ధుడై , వట వృక్షంఎక్కి నీళ్ళు ఎక్కడైనా  దొరుకు తాయేమో నని పరిశీలించాడు .కొంత దూరం లో ఒక జలాశయం  వుందని తెలుసు కోని అన్న గారికి చెప్పాడు .ధర్మ రాజు నకులున్ని అక్కడికి వెళ్లి దాహం తీర్చుకొని  ,తమకందరికి వెంటనే మంచి నీరు తేవలసిన ది గా ఆజ్ఞా పించాడు .
నకులుడు జలాశయం చేరాడు .అందులోకి దిగి ,నీళ్ళు తాగాలని ప్రయత్నం చేశాడు .ఇంతలో ఒక గొంతు విని పించింది .ఆ తటాకం తనది అనీ ,తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే నీరు తాగానిస్తాను అంది ఆ గొంతు .నకులుడు ఆ మాటలను విన కుండా లోపలి దిగి కొంచెం నీరు తాగాడు .వెంటనే స్పృహ కోల్పోయి నేలపై కూల పడ్డాడు .ఎంత సేపటికీ నకులుడు రాక పోయేసరికి ధర్మజుడు సహ దేవుణ్ణి పంపాడు .అతను వెళ్లి ,నకులిది స్థితి గమనించి ,నీళ్ళ లోకి దిగాడు .అప్పుడు మళ్ళీ ఒక అశరీర భూతం గొంతు ”ఈ తటాకం నాది .నేనడిగిన ప్రశ్నలకు సరైన జవాబులిస్తేనే నీళ్ళు తాగ నిస్తాను ”అని విని పించింది .కానీ ,అహంకారం ,ఆవేశం వున్న సహదేవుడా మాటలను లక్ష్య పెట్ట క లోపలి దిగి ,దాహం తాగి మూర్చ పోయాడు .ఆ తర్వాత అర్జున ,భీములు కూడా వచ్చి అలానే మూర్చ పోయారు .చివరికి ధర్మ రాజే బయల్దేరి వచ్చాడు .
ఆ కొలను దగ్గర మూర్చపడి వున్న సోదరులను చూశాడు .ఇతరు లేవరు వచ్చిన జాడ లేదని గ్రహించాడు .ఇది దుర్యోధన మాయ ఏమో అనుకొన్నాడు .సోదరుల ముఖాల్లో చైతన్యం తగ్గ లేదు ,చేతులు కాళ్ళలో శోభ తగ్గలేదు అని గమనించాడు .దుర్విది తమల్ని ఇంకా వెంటాడు తోందనివిచారించాడు .తాను వీళ్ళను వదిలి వెళ్లి తే  తల్లి కుంతీ దేవికి యేమని  సమాధానం చెప్పు కోవాలా ని సందేహించాడు .దాహం విప రీతంగా వుంది .కొలను లోకి దిగాడు .అశరీర భూతం ఇదివరకటి లానే హెచ్చరించి ,తన ప్రశ్నలుకు సరైన  సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తి అంది .అది తన కొలను అని ,తాను ఒక కొంగ అని చెప్పాడు . ధర్మ రాజు వినయంతో ”మీరెవరో మహా పరాక్రమ వంతు లయి వుండాలి .లేక పోతే కుల పర్వ తాలనే ధీకొనే   నా సోదరులు ఇలా మూర్చ పోరు .మీరెవరో మీ కోరిక ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి ”అన్నాడు .దానికి ఆ అదృశ్య గొంతు ”ధర్మ రాజా !నేను ఒక యక్షుడను .నా వల్లే నీ సోదరులకు ఈ గతి పట్టింది .”అని చెప్పి వెంటనే అక్కడ ప్రత్యక్ష మయాడు .అతను ఆజాను బాహువు .అతని గర్జనకు అడవి లోని ప్ర్ప్రాణులు  ఒణికి పోయాయి ..పరమ భయంకరం గా వున్నాడు .కాని ప్రశాంత గంభీర స్వరం తో ”యుదిస్టిరా !నా అనుమతి లేకుండా నీ తమ్ములు నీరు తాగి ఇలా అయి పోయారు .నువ్వు వివేక వంతుడివి కనుక దుస్సాహసం చేయ లేదు .నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నావు .నా ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి ,అప్పుడు నీళ్ళు తాగు ”అన్నాడు యక్షుడు .సరే నని ప్రశ్నలు వేయ వలసిందిగా ధర్మ రాజు యక్షుని   కోరాడు .ఇప్పుడు ప్రశ్నలు ,వాటికి ధర్మ రాజు సమాధానాలు తెలుసు కొందాం
ప్రశ్న పరం పర
01 -సూర్యుడిని నడిపేది ఏది ?అతని ఎవరు అనుసరిస్తున్నారు ?అతడు ఎందుకు అస్తమిస్తాడు ?అతనికి ఆధారం ఏమిటి ?
సమాధానం -సూరుడిని బ్రహ్మ నడి  పిస్తాడు .దేవతలు సూర్యుని అనుసరిస్తారు .ధర్మం వల్లనే భాస్కరుడు అస్త మిస్తున్నాడు .అతనికి ఆధారం సత్యమే .
02 –పురుషుడు ఎందుకని శ్రోత్రియుడుఅవుతాడు ?  ఎందు వల్ల మహిమ ఎక్కు వవుతుంది ?దేని వల్ల సహాయం లభిస్తోంది .ఎందు వల్ల బుద్ధి మంతుడు అనే పేరు వస్తోంది?
సమాధానం –వేదాధ్యయనం వల్లనే శ్రోత్రియుడు అవుతున్నాడు .మంచి తపస్సు వల్లే మహిమ పెరుగు తుంది .కేవలం ధైర్యం వల్లే మానవుడు సహాయ సంపన్నుడు అవుతున్నాడు .విద్వజ్జనులను సేవించటం వల్లే బుద్ధి మంతు డవుతాడు
03 –బ్రాహ్మణుడికి ఎందు వల్ల దేవత్వం కలుగు తుంది .అతనికి సాధువు ,అసాద్ధువు ,మానుషత్వము వేటి వల్ల కలుగు తాయి ?
సమాధానం –వేదాధ్యయనం వల్లే బ్రాహ్మణుడు అవుతాడు .ఎక్కువ గా వ్రతాచారణం వల్ల సాధుత్వము ,వ్రతం చేయక పొతే అసాదుత్వము ,శుభ్రత లేక పోవటం వల్ల కలిగే మృత్యు భయం వల్ల మానుషత్వము కలుగు తాయి .
04 –జీవన్మృతుడు అంటే ఎలాంటి వాడు ?
జవాబు –దేవతలను ,అతిధులను ,సేవకులను కాదని తాను ఒక్కడే భుజించే వాడు జీవన్మృతుడు .
05 –భూమి కంటే బరువుగా వుండి ,మహత్తరమైనది ఏది ?ఆకాశం కంటే పొడవైనది ఏది  ?గాలికంటే వేగం కలది ఏది ?గడ్డి కంటే చివికి జీర్ణ మయేది ఏది ?
జవాబు –తల్లి -భూమి కంటే బరువై మహత్తర మయింది .తండ్రి ఆకాశం కంటే పొడవైన వాడు .గాలి కంటే మనసు వేగ వంత మైనది .గడ్డి కంటే చింత తో ఉన్న మనసు చివికి జీర్ణ మయేది .
06 -నిద్రించినా కన్ను మూయనిది ఏది ?జన్మించినా చైతన్యం లేనిదేది ?రూపం వున్నా ,హృదయం లేనిదేమిటి ?వేగం వల్లే కోన సాగేది ఏది ?
జవాబు –చేప నిద్రించినా కన్ను మూయదు .జన్మించినా అండం (గుడ్డు )చైతన్యం లేనిదే .రాతికి రూపం వున్నా హృదయం లేదు .
07 -ప్రయాణించే వారికి ,రోగం తో ఉన్న వాడికి ,గృహస్తు కు ,మరణించిన వాడికి చుట్టాలు ఎవరు ?
జవాబు –ప్రయాణీకుడికి అధ్వరులు మిత్రులు .రోగం ఉన్న వాడికి వైద్యుడు ,గృహస్తునికి మంచి భార్య ,మరణించిన వాడికి చేసిన ధర్మమూ బంధువులు .
08 –ధర్మానికి కీర్తికి ఏది ఆధారము ?స్వర్గానికి మార్గం ఏది ?సుఖాలకు ఏది ఆధారం ?
జవాబు -ధర్మానికి ,దాక్షిణ్యం ఆధారం .కీర్తికి మహిమ ఆశ్రయం .దానం తో కూడిన సత్యం స్వర్గానికి మార్గం .సుఖానికి సౌశీల్యం ఆధారం .
09 –నరునికి ఆత్మ ఎవరు ?అతనికి దైవిక మైన బందువేవరు ?మానవుని  మనుగడ దేని వల్ల కొన సాగుతోంది ?మానవుడు ఇతరముల కంటే ఎందు వల్ల అధికుడు ?
జవాబు –కొడుకే మనిషి ఆత్మ .భార్య దైవిక మైన చుట్టం .పర్జన్యుడి (మేఘుడు )   వల్ల మనుష్యుని జీవితం సాగి పోతుంది .వితరణ వల్ల ,మనిషి ఇతరుల కంటే అధికుడు
10 –లోకం లో గొప్ప ధర్మం ఏమిటి ?ఎప్పుడూ  పరిణతి తో వుండేది ఏది ?ఆనందం  పెరగాలంటే దేన్నీ నిగ్రహించుకోవాలి ?ఎవ్వరి తో సంధి చెడి పోదు ?
జవాబు –అహింస అన్ని ధర్మాల కంటే ఉత్తమం .యోగ కర్మ ఎప్పుడు పరిణతి చెంది ,మంచి ఫలితం ఇస్తుంది .మనసు లోని అహంకారాన్ని నిర్మూలించుకొంటే ,పరమానందం తప్పక కలుగు తుంది .మంచి వారి తో ఏర్పరచుకొన్న స్నేహం ఎప్పుడు చెడి పోదు .
11 -లోకానికిదిక్కు ఏది ?అన్న పానాదులు వేటి వల్ల పుడుతాయి ?ఏది విషం ?శ్రాద్ధ విధికి తగిన సమయం ఏది ?
జవాబు –సత్పురుషులే లోకానికి అంతటికి దిక్కు .ఆకాశము , భూమి లే    అన్న ,పానాదులకు ముఖ్య కారణం .బ్రాహ్మణుల డబ్బు విషం .బ్రాహ్మలు వచ్చిన సమయమే శ్రాద్ధ విధికి అనువైన సమయం .
12 -పురుషుడు అంటే ఎవరు ?ఎటు వంటి వాడు ?అందరి కంటే ధన వంతుడు ఎవరు ?
జవాబు –ఎవరి సత్కీర్తి  భూమి  ,స్వర్గ లోకాల్లో నిరాఘాటం గా వ్యాపిస్తుందో అలాంటి వాడే పురుషుడు అని ఆర్యుల అభి ప్రాయం .ప్రియం ,అప్రియం ,సుఖ దుఖాలు ,భూత భవిష్యత్తులు ,సమానం గా చూసే  మహాత్ముడే అందరి కంటే ధన వంతుడు ..
ఈ సమాధానాలు విన్న యక్షుడు ”నా ప్రశ్న లన్నిటికీ సరి అయిన సమాధానాలు ఇచ్చావు .నాకు ఆశ్చర్యం కల్గిన్చావు .నీ సోదరులలో ఒక్కరిని బ్రతికిస్తాను .ఎవర్ని జీవిమ్పజేయాలో నువ్వే చెప్పు ‘అన్నాడు యక్షుడు .కొంచెం సేపు మాత్రమే ఆలోచించిన ధర్మ రాజు ”సమున్నత బలశాలి ,అయిన నా సోదరుడు  నకులిడిని బ్రతికించు మహానుభావా ”అన్నాడు .యక్షుడు ”భీమార్జునులు అత్యంత ధైర్య సాహస వంతులు వారిని బ్రతికించమని కోర కుండా నకులిని ఎందుకు ఎంచుకోన్నావు ?”అని  అడి గాడు .దానికి ధర్మ రాజు ”యక్షీశ్వారా !మా తండ్రి పాండు రాజు గారికి కుంతీ ,మాద్రి అనే ఇద్దరు భార్యలు .కుంతీ తనయుల్లో నేను బ్రతికే వున్నాను .మాద్రి తనయుల్లో ఒక్క రైనా జీవించాలి కదా ??”అన్నాడు .సంతోషించిన యక్షుడు ”నీ ధర్మజ్ఞత కు మహా దానందం గా వుంది .నీ సోదరులన్దర్నీ పునరుజ్జీవితుల్ని చేస్తాను .”అని చెప్పి వారందరికీ స్పృహ కల్గించాడు .పరమానంద భారితుడైన ధర్మ తనయుడు ”నీవు యక్షుడవు కావు నువ్వు ఏదో దేవతవు .సందేహం లేదు .నీ యదార్ధ స్వరూపం నాకు చూపించు .”అని కోరాడు .దానికి యక్షుడు ”నేను ధర్మ దేవతను .సత్యం ,శౌచం ,దానం ,తపం ,శమం ,దాంతి ,కీర్తి ,సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే .నా కుమారుడి వైన నిన్ను చూడాలనే ఉద్దేశం తోనే ఈ కొలను చేరాను .నన్ను ఆశ్రయించిన ,వారెవరు దుర్గతి పొందరు  .నీ సాదు వర్తన కు   సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను .కోరుకో ”అన్నాడు .
ధర్మ రాజు అమితానందాన్ని పొంది భక్తి తో ధర్మ దేవతకు సాష్టాంగ నమస్కారం చేశాడు .”ధర్మ దేవా !ఆశ్రమ సమీపం లో వున్న ఒక బ్రాహ్మణుడి ”ఆరణి ”ని జింక  అపహరించి పారిపోయింది .దాన్ని  ఆయనకు కర్మ లోపం రాకుండా మళ్ళీ   ప్రసాదించాలి ” అని ప్రార్ధించాడు .ధర్మ దేవత చాలా సంతోషించి ,ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసు కోవటానికే అలా కల్పిత జింకను సృష్టించానని చెప్పి ”ఆరణి ”ని అనుగ్రహించాడు .
ధర్మ దేవత కుమారుడైన ధర్మ రాజు పై అపార కృపా కటాక్షాలతో ,”ధర్మ నందనా !మీ పన్నెండేళ్ళ ఆరణ్య వాసం పూర్తి అయింది .పడ మూడవ ఏడు అజ్ఞాత వాసం మీరు చేయాలి .అజ్ఞాత వాస సమయం లో మీరు అందరు ఏ రూపం లో వుండాలి అని అనుకుంటారో ,అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది .మిమ్మల్ని ఎవరు కొంచెం కూడా గుర్తు పట్ట లేరు .ఇది మీకు వరం గా ఇస్తున్నాను .ఇంకే మైనా కోరిక వుంటే నాకు తెలియ జేయి .నెర వేరుస్తా ..”అన్నాడు .
విజ్నుడైన ధర్మ రాజు ”నీ దర్శనం తో ధన్యుణ్ణి అయాను .ఇంకే కోరికా లేదు .నా మనసు క్రోధ ,లోభ ,మొహాది దుర్గుణాలకు ఎప్పుడు దూరం గా వుండి, సదా ధర్మాచరణ తో విలసిల్లేట్లు అనుగ్ర హించు .”అని వేడుకొన్నాడు .ఆ వరాన్ని ఆనందం గా ప్రసాదించి ,ధర్మ దేవత అదృశ్యం అయాడు .భీమార్జున నకుల సహదేవులు యధా స్థితికి వచ్చారు .అందరి తో కలిసి  ధర్మ రాజు మళ్ళీ ఆశ్రమానికి చేరు కొన్నాడు .బ్రాహ్మణుడికి ”ఆరణి ”ని అందజేసి ఆయన శుభాశీస్సులను పొంది ఆనందం గా సోదరులతో గడిపాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.co

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

9 Responses to మహాభారతం లో యక్ష ప్రశ్నలు

 1. gpvprasad అంటున్నారు:

  నేను నేర్చుకోవాలి కొన్నాళ్ళు ఇక్కడే ఉంచండి.

 2. పింగుబ్యాకు: మహాభారతం లో యక్ష ప్రశ్నలు | సరసభారతి ఉయ్యూరు « Gpvprasad's Blog

 3. G.V. Subrahmanyam అంటున్నారు:

  Manchi samacharam ichcharu

 4. ramanji pasupuleti అంటున్నారు:

  chaalaa manchi samacharam teliyaparichaaru meku dhanyavaadhamulu

 5. vanaja అంటున్నారు:

  maha bharathamlo elanti kathaunnatlu naku teliyadu katha chavanu calabagunnadi

 6. K venkateswararao అంటున్నారు:

  Good very informative..keep sharing good info like this to all of us..

 7. సరసభారతి గారు నమస్కారం

  యక్షప్రశ్నల గురించి చాలా చక్కగా వివరించారండి• మనము మన భాషను మన సంస్కృతిని మరచిపోకుడదు సరేనండి ఉంటామరి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.