శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -1

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -1
 సరస భారతి సాహితీ బంధువులకు –హార్దిక శ్రీ వినాయక చతుర్ధి శుభా కాంక్షలు 
ఈ శుభ సందర్భం గా శ్రీ ఆది శంకరా చార్యుల వారి అపూర్వ కవితా సృష్టి” సౌందర్య లహరి ”ని ధారా వాహికం గా మొదలు పెడుతున్నాను .ఇందులో శ్లోకం ,తాత్పర్యం తో పాటు అవసర మైన విశేషాలను మాత్రమె అందరికి అందు బాటు లో ఉండే టట్లు తెలియ జేయటమే నా లక్ష్యం . ఇందులో భాగ వత్పాదుల కవితా సౌందర్యాన్నీ వెలువ రించటం కూడా ఉంది .అందుకే దీనికి ”లలి(కవి )తా సౌందర్య లహరి ”అని పేరు ఉంచాను .  .వచ్చేది అమ్మ వారికిష్టమైన శరన్నవ రాత్రులు కనుక ఈ ప్రయత్నం .సమాదరిస్తారని ,అమ్మ వారి కరుణా కటాక్షలహరి  మనందరి పై ప్రస రించాలని కోరుతున్నాను .మీ–దుర్గా ప్రసాద్
” శృతి స్మృతి పురాణామాలయం కరుణా లయం –నమామి భాగవత్పాదం శంకరం లోక శంకరం ”
సౌందర్య లహరి ని పరమ శివుడే ,పర దేవత ను స్తుతిస్తూ చెప్పినదని ,శ్రీ శంకర భాగ వత్పాదులు లోకానుగ్రహం బుద్ధి తో వెళ్ళ డించారని ప్రతీతి .ఇది భక్తీ సాహిత్యం లో మణి పూస గా పేర్కొన బడింది .సమయ మతాన్ని అనుసరించే శ్రీ విద్యోపాసకుల కు ఇది గౌరవ శ్రేష్టమైన గ్రంధం .ఇందులో శాక్త మతాన్ని సమర్ధి స్తున్నట్లు గా కనీ పిస్తుంది .కౌల ,మిశ్రమ ,సమయా చారాలు అని శాక్తేయ మతం లో మూడు రకాలున్నాయి .కౌల ,మిశ్రమ వారికి ఐహిక దృష్టి ఎక్కువ .సమయా చారు లది పరమార్ధ దృష్టి అని తెలుస్తుంది .షణ్మతస్థాపకు లైన భాగ వత్పాదులు శక్తి ఉపాసకులను సంస్కరించి ,వైదిక పద్ధతి  గా తన మార్గాన్ని చూపారు .ఇందులో మొదటి శ్లోకం అన్ని శ్లోకాలకు సార భూత మైన దానిని గా భావిస్తారు .
ఆగమాలు అంటే సగుణ బ్రహ్మ ను గురించి చెప్పేవి .ఇందులో తంత్ర గ్రంధాలు ముఖ్య మైనవి .ఇవే మంత్ర శాస్త్రాలని పిలువ బడుతాయి .సామాన్యులకు కూడా ఇవి అర్ధమవు తాయి .ఇందులో శైవ ,వైష్ణవ ,శాక్త ఆగ మాలు అని మూడు రకాలున్నాయి .శక్తి ని జగన్మాత గా ,పర తత్వం గా చెప్పేవి శాక్తాగమాలు .కౌల ,మిశ్రమ ,సమయ అని ఇందులో మూడు రకాలు .మిశ్రమాగమాలు -ధర్మ ,ఉపాసనా వివరణ ఉన్నవి .ఇందులో కుండలినీ శక్తి వివరణ ,దాని ఉత్థానం ,అవలంబించాల్సిన సాధన ప్రక్రియ తెలియ జేయ బడుతుంది .సమయ మతం అంటే పర మార్దదృష్టి తో కర్మ మార్గాన్ని వదిలి జీవ బ్రహ్మఐక్యాన్ని గురించి చెప్పేది .”బ్రహ్మం నాలోనే ఉన్నాడు ”అని సమయ శబ్దానికి అర్ధం .ఈ పద్ధతి లో శక్తిని ఉపాశించాలని చెబుతుంది .సమయ  అంటే ”సహ మయ ”అని అర్ధం చెబుతారు .
కేన ఉపనిషత్ లోని ”ఉమ”సాక్షాత్కారాన్ని విపులీకరించే దే ”సౌందర్య లహరి ” కుండలిని జాగృతం చేసి ,మూలాధారం నుంచి ,పైకి తెచ్చి ,షట్ చక్రాలను భేదం చేయించి ,సహస్రారం లో చేర్పించటం ఇందులో చెప్ప బడిన ముఖ్య విషయం .కౌల మతం వారికి మూలాధారం లోనే ఉపాసన ఉంటుంది .సమయా చార సారమే సౌందర్య లహరి .నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసు కోవటం సామాన్యులకు వల్ల  కాని విషయం .అటు వంటి వారికి పర తత్వం సగుణ మైనదే అని శ్రీ శంకరులు అంటారు .బ్రహ్మం దాని కది గా నిష్ప్రాపంచికం గా ,చూస్తె ,నిర్గుణమే .అవాన్మానసమే .ప్రాపంచిక దృష్టి లో చూస్తె మాత్రం సగుణమే .బ్రహ్మం మాయ తో కూడి నప్పుడు ఈశ్వరుడు అవుతాడు అని తాత్పర్యం .భక్తుల కోసం దేవతా స్వరూపం ధరిస్తాడు .శివ ,విష్ణు, దేవీ, సూర్య ,గణపతి,  కుమార స్వామి పూజా విధానాలను సంస్కరించి ,ప్రార్ధనా శ్లోకాలను  శంకరా చార్యుల వారు మనకు ఎంతో మేలు చేశారు .ఈ దేవతా మూర్తులు వేరైనవి కావు .పర తత్వ రూపాలే అని తెలియ జెప్పారు .ఇందులో యే దేవత నైనా స్వార్ధ త్యాగ బుద్ధి తో పూజిస్తే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది .అప్పుడు అద్వైత భావన కలిగి ముక్తి లభిస్తుంది .వేద విరుద్ధ మైన వాటిని విసర్జించి ,వేద విహిత మైనవీ ,శుద్ధ మైన ఆగమ పూజలను ఆచార్యుల వారు అంగీక రించారు .అదే షణ్మత స్థాపన అని పెద్దలంటారు .
శ్రీ విద్య -లో జ్ఞాన ,కర్మ లు కలిసే ఉంటాయి .ఇది క్రియ తో కూడిన అద్వైత సాధనం గా పరిగ ణిస్తారు .బ్రహ్మ విద్యా స్వరూపమే ఇది అని స్పష్టం చేస్తారు .శక్తి లేని శివుడు కర్తృత్వ హీనుడు .కనుక శక్తికే ప్రాధాన్యం .శివుడు శక్తి అవసరం లేకుండా నే సర్వ స్వతంత్రుడు .అనే ఈ రెండు భావాలకు సమతూకం లో ఆది శంకరులు సౌందర్య లహరి రచించారని ఇందులోని గోదార్ధ దర్శనం చేసిన శ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర రావు గారు తెలియ జేశారు .”మాయాంతు ప్రకృతిం ,విద్యాన్మాయి నంతు మహేశ్వరం -తరత్య విద్యాం వితథం హృది తస్మిన్నివేశితే ”అన్న దాని లో ”మిధ్యా జగదది ష్టాత్రి ”అనే అమ్మ వారి నామం లో భావం .శ్రీ విద్యనే మోక్ష విద్య అంటారు .”ఆత్మా విద్యా ,మహా విద్యా శ్రీ విద్యా ,”అని లలితా సహస్రనామాలలో ఉంది .ఆత్మా స్వరూపాన్ని చెప్పేదే.ఆత్మా విద్య మోక్ష విద్య అని చాందోగ్య ఉపనిషత్ చెబు తోంది .బ్రహ్మ విద్య అయిన ఆత్మా విద్య ను స్త్రీ రూపం గానే శంకరులు ధ్యానిన్చారని భావం .
సౌందర్య లహరి లో నిర్గుణ పర బ్రహ్మాన్ని వర్ణించ కుండా సగుణ రూపం లోనే ఆమె సౌందర్యాన్ని వివరించారు శ్రీ శంకరులు .నిర్గుణ పరబ్రహ్మాన్ని దాచి పెట్టి ,దాని ప్రాపంచిక దృష్టికి కన్పించిన సృష్టి విలాసాన్ని వర్నిం చట మే శ్రీ శంకరులు  చేసిన కవితా సౌందర్యం .దీన్నే అలంకార శాస్త్రం లో ”అపహ్నవ అలంకారం ”అంటారు .మనసుకు ,వాక్కు కు గోచరించని ,జగత్తుకు కారణం అయినట్టి ,మొదటగా ప్రాదుర్భావించిన స్త్రీ రూపం గా కేన ఉపనిషత్ లో ”ఉమా దేవి ”గా చెప్పబడింది .ఉపనయన సమయం లో బ్రహ్మోప దేశాన్ని స్త్రీ రూపం గానే చేయటం మనకు ఆచారం గా వస్తోంది .బీజ ప్రాయం గా ”కేన ”లో ఉన్న శ్రీ విద్య  సౌందర్య లహరి లో విస్తృతి చెందింది  .ఇది మంత్ర ,యంత్ర ప్రతీక రూప ఆరాధనం .మంత్రం వాక్కు కు సంబంధించింది .ప్రతీక మనస్సు కు సంబంధించింది .పూజ చేసేది కాయానికి .ఇవి వాక్ ,మన ,కాయ త్రికరణాలు .దీనికి ప్రతీక శ్రీ చక్రమే నని భావన .ఇదీ సౌందర్య లహరి లో ప్రవేశించే ముందు మనకు అవగాహన కావలసిన విషయాలు .ఇక ఆ సౌందర్య ప్రవాహం లో మునిగి ఈదుతూ తేలియాడుదాం .
1–”శివ శ్శక్త్యా యుక్తో ,యది భవతి శక్తః ప్రభు వితుం –నాచే దేవం ,దేవో న ఖలు కుశలః స్పందితు మపి
అతస్త్వా మారాధ్యాం హరి హర విరించాదిభిరపి –ప్రణంతుం స్తోతుం వా ,కధ మక్రుత పుణ్యః ప్రభవతి ”
తాత్పర్యం –తల్లీ !సర్వ మంగళవు అయిన నిన్ను చేరితేనె ,నీ నాధుడు శివుడు సర్వ ప్రాభవం తో ,ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు .అలా కాక పోతే స్థాణువు అంటే కదల టానికే సామర్ధ్యం లేని వాడు అవుతాడు .అందుకే హరి ,హర ,బ్రహ్మ మొద లైన దేవతల చేత కొలువ బడే నీకు మ్రోక్కటం ,నిన్ను స్తుతించటం పూర్వ జన్మ సుకృతం లేని వాడెవడూ చేయ లేడు .
విశేషం –శివుడు జగన్నిర్మాణశక్తి తో కూడిన వాడైనాడు .ఆయన అవిచ్చిన్నుడు .అవిద్య అయిన మాయ తో కూడిన వాడు .జగన్నిర్మానానికి శక్తి యుతుడైన పుడే ఆది సాధ్యం అయింది .లేక పోతే స్పందించ టానికి కూడా ఆయనకు సాధ్యం కాదు .శివ ,శక్తులు భార్యా భర్తలు .జాయా పతులు .జాయా పతి ,జాయ యొక్క శక్తి తోనే ప్రపంచ రూప సంతానాన్ని నిర్మించ గలదు .శక్తి లేక పోతే సంతాన ప్రాప్తి లేదు .శివుడు సర్వ మంగళుడు .అంటే జనన ,మరణ మైన అమంగళం లేని వాడు అని అర్ధం .
శ్రీ చక్రం లో తొమ్మిది యోనులు ఉంటాయి .అందులో నాలుగు శివ సంబంధ మైనవి .అయిదు శక్తికి సంబంధించినవి .రెండు అర్ధ చక్రాలు గల తొమ్మిది యోనుల తో కూడిన శ్రీ చక్రమే ఇది .ఇది విశ్వ వ్యుత్పత్తి ,స్తితి లయాలకు స్వరూపమే .పరుడు అంటే శివుడు శక్తి లేని వాడు అయితే సృష్టి స్తితి లయాలు చేయ లేడు .అందుకే వీరి  అధి దేవత లైన విష్ణు ,బ్రహ్మా ,రుద్రులచే పూజింప బడే భ,గ వతి -ప్రపంచానికి తల్లి .”ఆది ”అనటం లో వేద ధ్వని కని పిస్తుంది .శ్రీ విద్యోపాసకులు– విష్ణు ,శివ ,మను ,చంద్ర ,కుబేర ,లోపాముద్ర ,అగస్త్య,స్కంధ ,మన్మధ ,ఇంద్ర ,బల రామ ,దత్తాత్రేయ, దుర్వాసాదులు .శ్రీ దేవుని స్తుతించ టానికి పూర్వ జన్మ సుకృతం ఉండాలి .ఇతర దేవతలను పూజించినా ,ఆ దేవతలు శ్రీ దేవి అనుగ్రహం తోనే భుక్తిని, ముక్తిని ఇస్తారు .శ్రీ దేవి సేవ సర్వత్రా ఫల దాయకం .ఇతర  దేవోపాసన కూడా శ్రీ దేవి ఉపాసనే అవుతుంది .అన్ని వర్ణాలు శివ శక్తి మయాలే .దీన్ని పథిస్తే సకల శ్రేయోభి వృద్ధి కలుగు తుంది అని  ఫల శ్రుతి .
సశేషం –
మరొక్క సారి శ్రీ వినాయక చతుర్ధి శుభా కాంక్షల తో   –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –19-9-12-కాంప్–అమెరికా
Rtd. head Master

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.