శ్రీ శంకరుల లలి(కవి)తా సౌందర్య లహరి -25
57—‘’దృశా ద్రాఘీ యస్యా ,దార దళిత ,నీలోత్పల రుచా –ద్రవీ యామ్సం ,దీనం ,స్నపయ కృపయా ,మామపి ,శివే
అనేనాయం ,ధన్యో భవతి ,నచతే ,హాని రియతా –వనేవా ,హర్మ్యేవా ,సమకర ,నిపాతో మహికరః ‘’
తాత్పర్యం –మహేశ్వరీ !చాలా దీర్ఘ మై ,వికసించిన నల్ల కలువల వంటి చల్లని కాంతి తో ఉన్న నీ కడ గంటి చూపు అనే కృపారసం తో ,కడుదీనుడను ,నీకు చాలా దూరం గా ఉన్న వాడను ,సామాన్యుడను అయిన నన్ను తడిసి పోయేట్లు చేసి ,నన్ను ధన్యుడిని చెయ్యి .దీని వల్ల నీకేమీ నష్టమూ లేదు .ఎందు కంటే ,చల్లని వెన్నెల నిచ్చే చంద్రుడు ఉచ్చ ,నీచాలు అని చూడ కుండా ,అందరి మీదా ,తన చంద్ర కల ను ప్రసరించి ,వెలుగు వెల్లువ లతో ముంచెత్తడం లేదా !
విశేషం –స్వచ్చ మైన అంతఃకరణ ఉన్న వారికి అందరి మీదా సమాన మైన ఆదరణ ఉంటుందని భావం .అది స్వభావ సిద్ధమే .అసలు సృష్టి అంతా శ్రీ దేవికి ఆత్మీయం గా ఉంటె ,తన వాళ్ళనీ ,బయటి వాళ్ళనీ తేడా ఉండదు కదా !చంద్రుడు ఆమె నేత్రాల్లో ఒక భాగం .ఆ చంద్రునికే నర్వ సమభావం ఉంటె శ్రీ దేవికి ఉన్నట్లే .కారణం చంద్రుడు ఆమె నేత్రమే కనుక .ఆమె దృష్టి దీర్ఘ మైనది .అందుకే దూరం గా ఉన్న భక్తుడిని ఆదు కొనటం లో కష్టం లేదని భావం .లీలా మాత్రం గా దృష్టి ప్రసరిస్తే చాలు ఆయాస పడ నక్కర లేదని అర్ధం .చంద్రుడు ఔశదీషుడు .అందుకే వనాల మీద ఎక్కువ కాంతి ప్రసరించి ,మిగిలిన వాని పై తక్కువ ప్రసరించే పక్ష పాతం కల వాడు కాదు .అలాగే అమ్మ కూడా దూరంగా ఉన్న వారనేభేదం లేకుండా సమానం గా కృప చూపిస్తుంది .తాను దీనుడిని ,అయినా తన మీద పక్ష పాతం చూపించినా న్యాయమే .
శ్రీ దేవి అనాయాసం గా బహుజన ధర్మ బుద్ధి తో ,ఆపన్నులను రక్షించే బుద్ధితో ,అనవధిక మైన కారుణ్యం తో ,రక్షణా భార నిర్వహణ తో ,సత్కర్మ లను చేస్తున్నది అని భావం .
58—‘’అరాళం తే పాళీయాగళ ,మగ రాజన్య తనయే –న కేశా ,మాధట్టే ,కుసుమ శర ,కోదండ కుతకం
తిరశ్చేనో ,యత్ర శ్రవణ పద ,ముల్లంఘ్య విలసన్ –అపాంగ వ్యాసంగో ,దిశతి ,శర సంధాన దిషణం‘’
తాత్పర్యం –శరవణ భవ జననీ !వంకర గా ఉన్న నీ కణతల జంట (తమ్మల జంట )మన్మధుని ధనుస్సు యొక్క విలాసం గా అని పిస్తోంది .ఎందుకంటె ,నీ కనుల కటాక్షప్రసారం అడ్డం గా తిరిగి ,చెవిని దాటి మెరుస్తున్న బాణాలను సందిస్తున్నాయేమో ననే అనుమానాన్ని కల్గిస్తోంది .అంటే చెవి తమ్మలు అంటే కణత మన్మధుని విల్లులాగా ,అపాంగ వీక్షణం మన్మధుని పూల బాణాల్లా ఉన్నాయని భావం .
విశేషం –ఈ భావం ఎవరికి ?అమ్మ వారి చూపుతో మన్మధ ప్రసక్తి ఎవరికి ?సదాశివునికే .వేరెవరికీ కాదు అని అర్ధం
సశేషం –మీ –గబ్బిత దుర్గా ప్రసాద్ –22-10-12-ఉయ్యూరు

