దారిలో ‘’బామ్మా ఎలా ఉంది అమెరికా ?’’అన్నాను …”బాగుంది .అంతా పధ్ధతి ప్రకారం వుందని పిస్తోంది .ఆ రోడ్లేమిటి రా అంత బాగున్నాయి?/రెండు వైపులా పచ్చని చెట్లు ,పూల మొక్కలు మనసు లాగేస్తున్నాయి .ఒళ్ళు అలవ కుండా ప్రయాణం అంటే ఇదే నేమో” ?అన్నది .మొత్తం మీద బామ్మ కు కూడా అమెరికా పై ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఉన్నందుకు సంతోషించాం .రవి తీసుకొన్న శ్రద్ధకు బామ్మ చాలా సార్లు మెచ్చుకోంది ‘’ఒరే అవధాన్లూ !నువ్వైతై, అతనంత శ్రద్ధ చూపించే వాడివి కాదురా నిజం .అతని అమ్మ కడుపు చల్లగా మంచి కుర్రాడు దొరికాడు మన ఊరి వాడే అవటం మనకు తెలిసిన వాడవటం ఇంటి ప్రక్కే కాపురం అవటం నీ అదృష్టం ‘’అని రవి ని ప్రశంసించింది .అతను ఇబ్బంది పడి పోతున్నాడు .’’బామ్మ గారూ !మీ మనవడు ఒకటి నేనోకటీ నా .?అతనెంతో నేనూ అంతే “’అన్నాడు వినయం గా .కారు ఝామ్మని వెళ్తూ ఇంటికి చేరింది .రవికి థాంక్స్ చెప్పి బామ్మ ను ఇంట్లోకి తెసుకు వెళ్ళాం .
కింద భాగం లో గదిలో బామ్మ కు పక్క ఏర్పాటు .దేవుడి గది అన్నీ ఉన్నాయి .అమాంతం గా ‘’ఒరే ! కాళ్ళు కడుక్కోవాలి నీళ్ళు ఎక్కడ /అంది’’.’’బామ్మా ఇక్కడ కాళ్ళు కడుక్కోరు .పక్కనే బాత్ రూం ఉంది పంపు తిప్పిది ,వేడి నీళ్ళు ,చల్లనినీ ళ్ళువస్తాయి కావాలంటే కాసిని నీళ్ళు నెత్తినా ,కాళ్ళ మీద చల్లుకో ‘’అన్నా .అప్పుడే బామ్మ మూతి బిగిసింది .’’ఇదేనా సంబడం “’అంది .స్నానం చేసి భోజనం తిన్నది .ఆ రోజు విశ్రాంతిగా పడుకోంది .
బామ్మ ఉండేది రెండు నెలలే .అందుకని ఏమేమి చూపించాలో అన్నీ ముందే రాసుకొని ఏర్పాట్లు రెడీ చేసుకొన్నాం .ముందుగా దేవాలయ దర్శనం చేయిద్దామని పొద్దున్నే కార్య క్రమాలు అయిన తర్వాతా బయల్దేరాం .దారిలో ఒక లారీ లాంటిది కన పడింది దాని మీద అక్ష రాలు చదివి బామ్మ ‘’మీ కోసం మేము కంటాము ‘’అని రాసున్దేమిట్రా దాని మీద? ‘’అంది .ఇదేమిటి చెప్మా అని చూశా .’’.. we deliver for you ‘’అన్న మాటలు కనీ పించాయి .బామ్మా అది సామాన్లను చేర వేసేది’’ .మీ సామాన్లు చేర వేస్తాం’’ అని అర్ధం .అన్నాను .’’హమ్మయ్య ‘ఏదో అనుకొన్నాను ‘’అంది .దేవాలయం లో అంతా యే.సి.ఉండటం చూసి ‘’ఒరే దే వుడి కి చలి వేయదా ?’’అంది నవ్వుతూ ”అది లేక పోతే దేవుడే ఉండలేదు భక్తులూ ఉండరు ‘’అని చెప్పాను .ముసి ముసి నవ్వులు నవ్వింది బామ్మ .’’పూజార్లు అందరు మన వాళ్ళేరా ! మంత్రాలు అవీ బాగా చెబుతున్నారు .నిర్వహణ బాగా ఉందిరా ‘’అని మెచ్చింది .అక్కడే దేవస్తానం కాంటీన్ ఉంటె వెళ్లి టిఫిన్ తిని కాఫీ తాగాం .’’ఒర్ అవతారం !’’తీర్ధం స్వార్ధం అంటే ఇదే నను కొంటారా కష్టపడి గుడికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా తి ని ఆత్మా రామున్ని సంతృప్తి పరుచుకున్తున్నార్రా ‘’అంది .
ఇంట్లో గదులన్నీ పరిశీలించి చూసింది .అన్నీ గాజు తలుపులు .వాటికి వెల్తురు కోసం ఏర్పాట్లు ”.ఒరే ! వాటినేమంటారు ?”అని అడిగింది .’’బ్లైన్డులు ‘’అంటారు ‘’అని చెప్పా .”అందరిళ్ళ లోను ఇలానే ఉంటాయా ”?మళ్ళీ ప్రశ్న .”ఆ ‘’అని నా సమాధానం ‘’అయితే భగవాన్లూ !అమెరికా అంతా బ్లైన్డులు అ న్న మాట ‘’ అన్నది బామ్మా !విపరీతార్ధాలు తీయకు ..వెలుతురూ తగ్గించి పెంచేవి అవి అంతే కాని నువ్వు అను కొన్నట్లు గుడ్డి తనం కాదు .అమెరికా అంతా గుడ్డి వాళ్ళు కాదు ‘’అని సర్దా ను ‘’సర్లేవో !నాకు తెలీదా జోకేశా అంతే ‘’అంది .
రోడ్డు మీద కనీ పించిన ప్రతిదీ చదివి తనకు తోచిన అర్ధం తో చమత్కరించేది బామ్మ .’’ఒర్ పంతులూ !ఎక్కడ చూసినా బిలవేడ్ అని కనీ పిస్తోంది .ప్రేమంటే అంతా కారు చౌకైన్దేరా “అందో సారి ”.అది రోడ్లకు పేరు” అని చెప్పా..ఫుడ్ ,గాస్ ల బోర్డులు చూసి ‘’వెంకటాయ్!కడుపు నిండా తినటం ఎందుకు ?అరక్క గాస్ అని పరి గేట్టటం ఎందుకురా ?’’అనేది ‘’బామ్మా ! నువ్వనుకొన్న గాస్ కాదు ఇక్కడ గాస్ అంటే పెట్రోల్ అని అర్ధం .ఫుడ్ అంటే అక్కడ హోటల్ లాంటిది ఉండి కావాలంటే తిన వచ్చు అని .మన లాగా రోడ్డు ప్రక్కల ఇక్కడ హోటళ్ళు హైవే లో ఉండవు .దూరం గా ఉంటాయి ‘’అన్నాను .
ఒక రోజు కొంచెం ఆలస్యం గా లేవటం వల్ల ఇంట్లో కాఫీ తాగే తీరిక లేక గ్లాస్ లో పోసుకొని కారెక్కి డ్రైవింగ్ లో తాగుదామని బయల్దేరా ‘’ఎరా సన్నాసీ !అంత హళ్ళూ ,ఫెళ్ళూ ఎందుకు ?నిదానం గా ఇంట్లో తాగి వెళ్ళక ?జుర్రు కుంటూ కారు నడపాలా?మరీ తీరిక లేక పోతోన్దేమిట మ్మా వీడికి అని మా ఆవిడకూ అక్షింతలేసింది .’’ఇక్కదంతే నే బామ్మా !అంతా ముక్కూ నోటా కుక్కు కోవటమే .తప్పదు .ఒక్కో సారి నీ మనమ రాలు నా ప్రక్కన కార్లో కూర్చుని టిఫిన్ తిని పిస్తూఉంటుంది . .’’అన్నాను .’’చాల్లే సంబడం మహా గొప్ప పోతున్నావు .అలా ముక్కూ నోటా కుక్కు కుంటే అరగద్దా ? /ఆరోగ్యం పాడై తే ఇబ్బంది కాదా ?అని తల అంటింది . .’’ఇక నుంచి చేయన్లేవే బామ్మా ‘’అని సర్ది మా ఆండాళ్ళు ముసి ముసి గా నవ్వుతుంటే బయల్దేరి వెళ్లాను .
మాది స్వంత ఇల్లు కనుక వారానికో ,పది రోజుల కొ లాన్ లో ని గడ్డి కత్తి రించుకోవాలి .కత్తిరించే అతను వచ్చి ఒక సారి లాన మూవ్ చేస్తున్నాడు .బామ్మ కంట పడింది .ఒకతను కత్తిరిస్తే ఇంకో అతను అంచులు సరి చేస్తున్నాడు మెషిన్ మీద బామ్మ నా దగ్గరకు వచ్చి ‘’ఒరేఆంజనేయులూ !జుట్టు కత్తి రించే వాడోకడూ ,పాపట తీసే వాడొకడు లా గా ఉందిరా మీ గడ్డి క్రాఫు ను చూస్తె ’’అంది .ఇక్కడంతా ఇంతే అని సర్ది చెప్పాను .
ఒక రోజు బామ్మ ‘’ఒర్ పక్షీ !ఇన్నిన్ని నీళ్ళు పెట్టి ఈ గడ్డిని పోషిస్తున్నారు ..దానికి మళ్ళీ వారానికో సారి క్షవరం .ఆ నీళ్ళనే యే పంటలకో ఉపయోగిస్తే అమెరికా లో ఆహార సమస్య తీరేది కదా ?గడ్డి కి పెట్టె ఖర్చు పంటలకు పెడిత ఎంతో బాగుండేది ‘’అని ఉచిత సలహా పారేసింది ‘’బామ్మా !ఇది చలి దేశం .అన్ని పంటలూ అన్ని చోట్లా పండవు .చలి తగల కుండా మొక్కలకు చెక్క పొట్టు చుట్టూ కప్పి బతికిన్చుకోవాలి ‘’అన్నాను .’’నీ తెలివి తెల్లారి నట్లే ఉంది ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో అభి వృద్ధి సాధించిన అమెరికా ఈ చలికీ ,వేడికి అన్నిటికీ తట్టుకొనే వంగడాలను సృష్టించ లేక పోయిందా ?వాళ్లకు అయిడియా రాలేదేమో ?/’’అంది ‘’బామ్మా నీ ఉపాయం నేను అందరికి తెలియ జేస్తాన్లె .ఏదో పరిష్కారం వస్తుందేమో చూద్దాం ‘’అన్నాను . .బామ్మకు అంత నీరు గడ్డి పెంచటానికి మాత్రమె వాడటం బాధ గా ఉంది .
అమెరికా లో ఎక్కడ చూసినా కొలంబస్ పేరు కనపడటం బామ్మ కు బాగా నచ్చింది .’’ఒరే అవతారం !ఎప్పుడో అమెరికా ను కొలంబస్ కనీ పెట్టాడని చదువు కొన్నాం .ఇన్ని వందల ఏళ్ళు అయినా ఆయన్ను మర్చి పోలేదు అమెరికా వాళ్ళు .కృతజ్ఞత గా ఆయన పేరు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టారు .సంతోషం గా ఉంది .మనది భారత దేశం .భరతుడి పేర పిలువ బడే దేశం .కాని ఆ పేరు ఎక్కడా పెద్ద గా మనకు కనీ పించదు .అదీ వాళ్లకు మనకు ఉన్న తేడా .’’అని బాధ పడింది .
ఒక సారి మా రవి చంటి పిల్లాడు గుక్క పట్టి అర్ధ రాత్రి ఏడుస్తున్నాడు .మాకేమీ తెలీదు బామ్మ కు మెలకువ వచ్చింది .రవి వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టింది .వాళ్ళు తలుపు తీశారట .వాళ్ళకేమీ పాలుపోక ఎమెర్జెన్సీ కి తీ సుకొని వెళ్లాలని అను కొంటు న్నారట.. .బామ్మ వాళ్ళతో ‘’నాయనా కంగారేమీ లేదు .నాకు పది నిమిషాలు సమయం ఇవ్వండి .నా ప్రయత్నం నేను చేస్తా .పది నిమిషాల్లో నిమ్మదించక పోతే మీ ప్రయత్నాలు మీరు చేసు కొండి ‘’అని చెప్పి క్షణాల మీద ఇంటికి వచ్చి తను వెంట తెచుకొన్న మందేదో తీసుకొని వెళ్లి వాడి నోట్లో వేసిందట .అంతే అయిదు నిమిషాల్లో పిల్లాడు తేరుకొని కేరింతలు కొట్టాడట .బామ్మకు రవి దంపతులు కన్నీళ్లు నిండిన కన్నుల తో కృతజ్ఞతలు చెప్పారట .అదీ బామ్మ హస్త వాసి అని మెచ్చారట .ఈ విషయం మర్నాడు పొద్దున్న మేము నిద్ర లేచిన తర్వాతా రవి ,గాయత్రి వచ్చి చెప్పారు .వాళ్ళ కళ్ళల్లో ఆనందం తాండ వించింది .పిల్లాడిని ఎత్తుకొని బామ్మ ‘’భడవా ఖానా !ఎంత కంగారు పెట్టిన్చావురా రాత్రి ?ఇంక నీకేమీ భయం లేదు .హాయిగా ఆడుకొంటా వు ‘’అని చేతిలో ఎంతో డబ్బు పెట్టి ముద్దు పెట్టుకొని వాళ్లకు ఇచ్చింది .బామ్మ అంటే దేవత అనుకొన్నారు వాళ్ళు .మేము కూడా .ఇలా బామ్మ ఉన్నంత కాలం అందరికి తల్లో నాలుక లాగా మెలగుతూ అందరి చేత మా మంచి బామ్మ అని పించుకొంటు గడిపే సింది .రోజూ దసరా లలో ఉదయం పూజా లలితా సహస్ర నామాలతో చేసేది .ప్రసాదం చేసి నైవేద్యం పెట్టేది .సాయంత్రం చుట్టుపక్కల తెలుగు వాళ్ళను పిలిచి లలిత చదివించేది .ఎవరికే చిన్న జబ్బు చేసినా మా బామ్మ దగ్గరకే ముందు వచ్చే వారు .తోచిన వైద్యమేదో చేసి నయం చేసేది .రెండు నెలలు అవగానే బామ్మ ను వదల లేక పోయారందరూ .అందరు ఇళ్లకు పిలిచి బామ్మ ఆశీర్వాదాలు తీసుకొన్నారు గిఫ్టు లు ఇచ్చారు .అందర్నీ ఆశీర్వ దించింది .అందరికి మంచి ,చెడు చెప్పింది ..మన సంస్కృతీ సంప్రదాయాల విలువలను తెలియ జేసింది .పిల్లలకు పద్యాలు స్తోత్రాలు నేర్పింది .అందరు ‘’బామ్మ గారు మళ్ళీ మీరు రావాలి ‘’అన్నారు ‘’వస్తానర్రా .మా ఆండాళ్ళు నీల్లోసుకొంటే పురిటికి రావాలిగా తప్పదుకదా .’’అంది ఇంతలో మా ఆవిడ నా చాటున నిల బడి ముసి ముసి నవ్వులు నవ్వు తోంది .నా చెవి లో ఏదో చెప్పింది .బామ్మ ఇట్టే గ్రహించింది ‘’అమ్మా ఆన్దాల్లూ !సంతోషం .నీ కడుపు చల్లగా పండంటి బిడ్డను కనాలి .నేను ముందే వస్తాను .మా అవతారం గాడితో జాగ్రత్త వాడికి మెదడు మొకాల్లో ఉంటుంది .నువ్వే అన్నీ చూసుకోవాలి .పిచ్చి సన్యాసి .వాడికి అభిమానం ఎక్కువ .అంతా లోపలే దాచుకొంటాడు .ఒస్తానే అమ్మాయి ,ఒస్తానురా భాగవాన్లూ ! ‘’అని మా ఇద్దరినీ దగ్గరకు తీసుకొని నిండుగా కౌగిలించుకొని ,ఆశీర్వదించింది బామ్మ .బామ్మమళ్ళీ ఇండియా కు వెళ్ళేటప్పుడు తోడు చూసి పంపించాము .సరదా గా గడిపింది .వీలైన ప్రదేశాలన్నీ చూపించాము ఉన్న రెండు నెలల్లో .అన్నీ చక్కగా తెలుసు కొని ఆనందించింది .
విజయ దశమి శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-10-12-ఉయ్యూరు

