శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –27
61—‘’అసౌ నాశా వంశ ,స్తుహిన గిరి వంశాధ్వజ పటి –త్వదీయో ,నేదేయః ఫలతు ఫల మాస్మాక ముచితం
వహత్యంత ర్ముక్తా ,శ్శిశిర కర ,నిశ్వాస ,గలితం –సంరుద్ధ్యా యత్తాసాం ,బహిరపి ,సముక్తా మణిధరః ‘’
తాత్పర్యం –హిమ గిరి తనయా !!పర్వత వంశ పతాకమా !పార్వతీ దేవీ !నీ ,నాసాదండం మాకు ,మా సంబంధీకులకు ,కోరిన కోర్కెలను తీర్చు గాక .ఆ నాసా దండం లోపల ముక్తా మణులున్నాయి .లోపల ఉన్న ఆ మణుల చేత ,ఎడమ నాసిక నుండి ,వెలుపలికి వచ్చే ,గాలి వల్ల బయట కూడా ముక్తా మణులను ధరించి నట్లుంది .
విశేషం –వెదురు లో ముత్యాలు ఉంటాయని లోక ప్రసిద్ధి .ముక్కులో ముత్యాలు లేక పోతే ,శ్వాస తో ఎలా బయటకు వస్తాయి ?అంటే ,ఎడమ నాసిక ముత్యాన్ని ధరించింది అన్న మాట .నాసిక నువంశ దండం గా చెప్పటం లో కోమలత్వం ,రుజుత్వం ,రామణీయకత గల నాళాలున్నాయని అర్ధం .
62—‘’ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి ,దంత క్చదరుచెహ్ –ప్రవక్ష్యే ,సాదృశ్యం ,జనయతు ఫలం విద్రుమ లతా
న బింబం ,తద్బిమ్బ ప్రతి ఫలాన ,రాగా దరుణిమాం –తులా మధ్యా ,రోదుంకధమివ ,నలజ్జేత కలయా ‘’
తాత్పర్యం –వర దండ మండిత కరా !చక్కని పలువరుస గల తల్లీ !స్వభావ సిద్ధం గా కెంపు రంగుతో ఉన్న నీ పెదవుల కాంతి ని,దేనితోను పోల్చటానికి వీలు లేదు .పోల్చదగినది వేరేది లేదు కూడా .ఎందు కంటే ,నీ క్రింది పెదవి కి సహజ కాంతి ఉంది .అలాంటి కాంతి –పగడపు తీగేకు పండు పండితే ,ఎలా ఉంటుందో అలా ఉంటుంది .కాని ,దానికి పగడం పుట్టటం లేదు .అది పండ్లను ఇవ్వటమూ లేదు .దొండ పండు తో పోలుద్దాం అంటే దానికి కాంతి సహజం కాదు .దొండ పండుకు బింబం అని పేరు .అంటే ప్రతి బిమ్బించేది .దానికి ఆ పేరు రావటానికి కారణం నీ ఆధర బింబం యొక్క అనుగ్రహం వల్లనే కనుక నీ క్రింది పెదవి తో పోల్చదగిన వస్తువేదీ ప్రపంచం లో లేదు .నీ క్రింది పెదవి నిరుప మాన మైన శోభ కలది .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –24-10-12-ఉయ్యూరు

