71—‘’నఖానా ముద్యోతైర్నవన లిన రాగం ,విహసతాం—కరాణంతే ,కాంతిం ,కదయ ,కధయామః ,కధముమే
కయాచిద్వా ,సామ్యం ,భవతు కలయా ,హంత కమలం –యది క్రీడల్లక్ష్మీ ,చరణ తల లాక్షారుణ దళం ‘’
తాత్పర్యం –ఉమా దేవీ !ప్రభాత కాలం లో ,అప్పుడే వికసించిన తామర పూవు కాంతిని పరిహసించె గోళ్ల సముదాయం తో విలసిల్లె నీ హస్తాల శోభ ను ఎలా వర్ణించగలను ?కమలం లోని కమలాలయ యైన లక్ష్మీ దేవి పాదముల లత్తుక యొక్క ఎరుపు రంగును పొందితే ,కొంచెం పోలికగా ఉందిఅన వచ్చు .అది కూడా సంపూర్ణ మైన పోలికకు తగదు .నీ నఖాగ్రాలు నిరుపమ శోభా రంజితాలు .
72—‘’సమం దేవీ స్కంద ,ద్విప వదన ,పీతం స్తన యుగం –తవేదం ,నఃఖేదం,హరతు ,సతతం ప్రస్నుత ముఖం
యదా లోక్యా శంకా కులిత హృదాయో హాస జనకః –స్వకుమ్భౌ హీరంభః పరి మ్రుశతి హస్తేన ఝటితి ‘’
తాత్పర్యం –సర్వేశ్వరీ !నీ స్తనముల యొక్క స్తన్య పానీయం చేస్తున్న వినాయకుడు ,ఆ వక్షోజాలను చూసి ,తన శిరః కుంభాలు అక్కడికి వచ్చాయేమో నని అనుమానంతో ,తన కుంభ స్తలాన్ని ,తన తొండం తో తడిమి చూసు కొంటున్నాడు .ఇతని అమాయకత్వానికి పార్వతీ పరమేశ్వరులు నవ్వుతున్నారు .ఆ స్తనద్వాయాన్ని గణపతి ,కుమారస్వామి ,ఇద్దరు ఒకే సారి పానం చేస్తున్నారు .పుత్రవాత్సల్యం తో ,పాలు పొంగుతున్న ఆ స్తనద్వయం ,మా దుఖాన్ని పోగొట్టు గాక .
విశేషం –జగత్పూజ్యు లైన ప్రమద గణాధి పతి ,దేవ సేనా పతి పుత్రులు గా గల శ్రీ దేవి ,మహాత్మ్యం సర్వ లోకాతిశయం.ఆమె కుఛ కుంభాలు స్వభావ సిద్ధం గా గజ కుంభాలు అని భావం .
73—‘’అమూతే ,వక్షోజౌ ,వమృతరస ,మాణిక్య కుతుపౌ –న సందేహ స్పందో ,నగపతి ,పతాకే మనసినః
పిబంతౌ ,తౌ ,యస్మాదవిదిత ,వధూ సంగ రసికౌ –కుమారా వద్యాపి ,ద్విరద ,వదన ,క్రౌంచ దళనే ‘’
తాత్పర్యం –శైలజా !నీ చనుల జంట అమృత రసం తో నిండి ,మాణిక్య మయ కుప్పెలు గా ఉన్నాయి .ఇందులో సందేహమేమీ లేదు .కారణం –నీ చనుబ్రాలు త్రాగిన వినాయకుడు ,కుమారస్వామి నేటికీ ,యవ్వన ఉత్సాహం తో ,ఆనంద రసాస్వాదన రసికులుకాకుండా ,బాలురు గానే ఉన్నారు సుమా !
విశేషం –గణ పతి భార్యలు సిద్ధి ,బుద్ధి .కుమారస్వామి భార్యలు వల్లీ ,దేవసెనలు .వీరు శబ్ద వాచ్యులు ,శక్తి స్వరూపులే కాని ,స్త్రీ సుఖం ఇచ్చిన వారు కాదు .భ్రాంతిలో ఉన్న దాంపత్యం ఇది .
శివ శక్తి యోగ సాధన లో సాధకుడైన యోగికి లభించే రుతంబరా ప్రజ్ఞను గణ పతి అంటారు .ఈ ప్రజ్ఞయే శివ,శక్తుల కుమారుని గా చెబుతారు .ఈ ప్రజ్ఞ కలిగితే ,బుద్ధి ,సిద్ధి వశం అవుతాయి .వారి వలన విఘ్నాలను నివారించే వాడై,విఘ్న హంత అవుతున్నాడు గణపతి .
కుమారస్వామి భార్యలు వల్లీ దేవసెనలు .వల్లీ అంటే లతా .ఆమె సర్పాక్రుతిలో ఉన్న కుండలినీ శక్తి .దేవసేన అంటే తత్వ సముదాయం .గణపతి ,కుమారస్వాములిద్దరు నైష్ఠిక బ్రహ్మ చారులే .ఈ ఇద్దరి బ్రహ్మ చర్య విషయం విస్పష్టం చేయటానికే ,వీరి పూజా విధానం లో వతువులను పూజిస్తారు .
కుండలినీ శక్తి ని వ్యష్టి ,సమష్టి పరం గా చెప్పవలసి వస్తే ,సర్పం గా చిత్రించటం ఆచారం .స్త్రీ గా భావిస్తే కుమారి .పురుషుడిగా భావిస్తే కుమారుడు .సమష్టి కుండలిని సర్ప దేవత గా నాగ చతుర్ధి నాడు పూజిస్తారు .అది కుండలినీ శక్తికి ప్రతీక .నాగ పంచమి నాడు పూజించేది వ్యష్టి కుండలిని .అంటే వల్లీ దేవిని .-అంటే కుమారస్వామి అర్ధాంగి ని .
కుమారస్వామి దేవ సేనా నాధుడు .ఇంద్రుని కుమార్తె దేవ సేన కు అది పతి .తత్వ సముదాయమే దేవ సేన .జగత్తును నిర్మించటానికి తగిన సామగ్రియ ఈ తత్వ సముదాయం అంటే .కల్పాంతం లో ఈ తత్వాన్ని (చమువు )అంటే ఉపసంహరించేది చాముండా (చముండాతీతి చాముండా ).చండీ నవాక్షరాది పతి చాముండా –శివశాక్తియే రుతంభర ప్రజ్ఞా మూర్తి- బ్రహ్మ కు భిన్నుడు కాడు.సుబ్రహ్మణ్యం కూడా బ్రహ్మమే .
74—‘’వాహన్త్యంబ ,స్తంబే రామ దనుజ ,కుంభ ప్రక్రుథిభిహ్ –సమారబ్దాం ,ముక్తామణి భిరమలాం ,హారలతికాం
కుచాభోగో ,బింబాధర రుచిభి ,రంతశ్శబలితాం –ప్రతాపవ్యామిశ్రాం ,పురదమయిథుహ్ కీర్తి మివతే ‘’,
తాత్పర్యం –అంబా !గజాసురుని శిరస్సు యొక్క కుంభస్తలమే జన్మ భూమి గా కలిగి ,కర్పూర వాసన ,దోష రహిత మైన ముక్తామణుల హారాన్ని ,నువ్వు ,నీ విశాల స్తన మండలం మీద ధరిస్తున్నావు .నీ ఆధర బింబం యొక్క యెర్ర దనపు కాన్తులచే ,ఆముత్యాల హారం ,లోపలే పుట్టిన చిత్ర విచిత్ర కాంతులతో పరమ శివుని ప్రతాపాన్నీ ,కీర్తినీ ధరించి నట్లుగా విరాజిల్లు తోంది .
విశేషం –శ్రీ దేవి హృదయ పీథంమీద ఉన్న హారం ,శివుని ప్రతాప కీర్తులను ప్రకాశింప జేస్తోంది .అంటే ,ఆయన కీర్తి ప్రతాపాలు ఆమె హృదయ గతాలు అని భావం .ఆమె కంథం లోని ఇతర ఆభరణాలు కూడా శత్రు సంహార లక్షణాలు కలవని అర్ధం .అధర కాంతితో మెరిసే భగవతి స్తనద్వయం పైనున్న హారం ,జగదేక వీరుడైన త్రిపురారి అయిన శివుని శత్రువైన గజాసురుని కుంభ స్తలం లో ఉన్న ,ముత్యాల లాగా ,ఆమె కుచాల యందు నిక్షిప్తం అయాయి అని భావం .అలాంటి భగవతి యొక్క భర్త ప్రతాపం తో కూడిన మూర్తి కీర్తిధారణ తో పతివ్రతా ధర్మాన్ని చూపిస్తోంది .శివ కీర్తికి ఉత్పత్తి స్తానం శ్రీ దేవి కుచాలు అని అంతరార్ధం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-10-12-ఉయ్యూరు

