శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –33
75—‘’తవస్తన్యం ,మన్యే ,ధరణీధర కన్యే హృదయతః –పయః పారావారః పరి వహతి సారస్వత మివ
దయాపత్యా దత్తం ద్రవిడ శిశు రాస్వాద్య తవ యత్—కవీనాం ,ప్రౌధానా జనని కమనీయః కవయితాః’’
తాత్పర్యం –శైలేంద్ర తనయా !పాల కడలి పైకి సారస్వత రూపం గా ప్రవహించే వాజ్మయం గా నేను నిన్ను భావిస్తాను .లేక పోతే –మిక్కిలి పుత్ర వాత్సల్యం తో ,నీవిచ్చిన చనూబాలు త్రాగి ఈ ద్రావిడ శిశువు (శంకరా చార్యులు )ప్రౌఢ కవులలో జగన్మోహను డైన కవిగా ఎలా కీర్తి పొందుతాడు ?
విశేషం –ఆమె హృదయం నుండి పాలు సారస్వతం లాగా ప్రవహిస్తున్నాయి .చిన్నప్పుడు శంకర భగవత్పాదుల వారు ఆలయానికి వెళ్లి అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టె వారు .ఆమె త్రాగగా మిగిలిన పాలనే తండ్రి తనకు ఇస్తున్నాడని అనుకునే వారు .ఒక రోజు తండ్రి ఊరికి వెళ్లాడు కుమారుడు పాలు తీసుకొని ఆలయానికి వెళ్లాడు .దేవి త్రాగ లేదు .ఏడవటం ప్రారంభించాడు బాల శంకరుడు .ఆమె ప్రేమతో ఆ పాలను పూర్తిగా త్రాగేసింది .తనకు కొంచెం కూడా మిగిల్చ లేదని మళ్ళీ ఏడ్చాడు .ఆమె కనీ కరం తో తన స్తన్యాన్నిచ్చింది బాల శంకరులకు /.అది మొదలు ఆయనకు మహా ప్రజ్ఞ కలిగింది .
ఆరు మాసాల వయసు లో ఉన్న శంకరుడు దరిద్రాన్ని అనుభ వించాడు .తండ్రి భిక్షాటనానికి వెళ్లాడు తల్లి నీరు తేవటానికి పూర్ణా నదికి వెళ్ళింది .ఇంట్లో ఒక్కడే ఉన్న బాలుడికి ఆకలై ఏడ్చాడు .పార్వతీ దేవి జాలి పడి ,ప్రేమతో ఎత్తుకొని ,కంటి నీరు తుడిచి ,స్తన్యాన్నిచ్చింది .పడుకో బెట్టి అదృశ్య మైంది .ఆ రోజు నుండే ఆయనకు సర్వ శాస్త్రాలు కరతలా మలకాలైనాయి శ్రీ దేవి అనుగ్రహం ఉంటె సర్వ విధ ఈప్సితాలు నేర వేరుతాయని భావం శివజ్ఞాన ప్రదం .
76—‘’హర క్రోధ జ్వాలా వలిభి రవ లీదేన వపుషా –గభీరే తే నాభీ సరసి ,కృత సంగో మనసిజః
సముత్తస్తౌ తస్మా దచల తనయే ,ధూమ లతికా –జనస్తాం జానీతే ,తవ జనని రోమావలి రితిహ్ ‘’
తాత్పర్యం –హర ప్రియే !హరుని క్రోధాగ్ని జ్వాలల తో చుట్ట బడిన శరీరం తో మన్మధుడు తనను తాను కాపాడు కోవా టానికి లోతైన నీ నాభి మడుగు లో దూకి కాపాడుకొన్నాడు .కాలు తున్న వాడి శరీరం వల్ల పుట్టిన పొగతీగ చాలు ఒకటి ,నీ పొక్కిలి నుంచి పైకి పాకి కన్పించింది .ఆ పొగతీగె చాలునే లోకం ,నీ నూగారు గా బావిస్తోంది .
విశేషం –సాధన చేసే తప్పుడు కామోద్దీపన కలిగితే ,వెంటనే భ్రు మాధ్యమ లో హరుని నిలిపి ధ్యానిస్తే (అక్కడ జ్ఞాన నేత్రం ఉండి కనుక )హృదయం లోని కామ తాపం నాభికి దిగి శాంతి లభిస్తుందని పరమ రహస్యం .హరుని క్రోధం నుండి కాపాడ గల సమర్ధురాలు భగవతి మాత్రమె .అన్యులకు అసాధ్యం అని భావం.
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-10-12-ఉయ్యూరు

