శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –40
90—‘’దదానే ,దీనేభ్యః శ్రియ మనిశ,మాశాను సదృశీ –మమందం ,సౌందర్య ప్రకర మకరందం ,వికిరతి
తవాస్మిన్ ,మందారస్తబక ,సుభగే ,యాతు చరణే –నిమజ్జన్మజ్జీవః ,కరణ చరనై షట్త్చరణతాం ‘’
తాత్పర్యం –నాద రూపిణీ !దీనులకు వారి కోర్కెలను అనుసరించి ,తగిన సంపదలను ఎల్లప్పుడు ఇచ్చే నీ ,అధిక లావణ్య సంపుటి అనే పువ్వుల తేనెను వెదజల్లే ,కల్ప వృక్షపు పూగుత్తి లాగా ,సుందర మైనది అయిన నీ పాద కమలాల యందు ,మనసు తో కూడిన అయిదు జ్ఞానేన్ద్రియాలతో సహా ఆరు పాదాలను కల వాడ నైన నేను తుమ్మెద నై మునుగుదును గా.క .
విశేషం –నేను అనే జీవుడు ఆరు పాదాల తుమ్మేదను అయి నీ పాద కమలాలను అర్చిస్తాను భక్తీ తో ఆ మకరందాన్ని గ్రోలు తాను అని శంకర భగ వత్పాదులు భక్తీ తో వేడుకోన్నారని భావం.
91—‘’పదన్యాస క్రీడా పరిచయ మివారబ్దు మనసః—స్ఖలన్తస్తే ,ఖేలం ,భవన ,కలహంసా ,న ,జహతి
అతస్తేషాం,శిక్షాం ,సుభగ మణి మంజీర రణిత –చ్చలా దాచక్షాణం ,చరణ కమలం ,చారు చరితే ‘’
తాత్పర్యం –సుచరితా దేవీ !నీ పెంపుడు హంసలు నీ దగ్గర నడక నేర్చు కోవా టానికి ప్రయత్నిస్తూ ,తొట్రు పడుతున్నాయి .అయినా ,నీ విలాస గమనాన్ని వదల లేదు .అందు చేత నీ పాద కమలం అతి రమ్య మైన మణులతో కూడిన అందేల మ్రోత అనే నెపం తో ,ఆ పెంపుడు హంసలకు నడక లో శిక్షణ ను ఉపదేశిస్తున్నాయేమో నన్నట్లు గా ఉంది‘’
విశేషం –హంసలు సహజం గా తమను పెంచే వారి వెంటే నడుస్తాయి .అలా పోవటం ,నడక నేర్చు కోవటానికే .జీవన్ముక్తు లైన పరమ హంస లే శ్రీ దేవికి పెంపుడు హంసలు .వారు ఆమె కు ఆశ్రితులు .శ్రీ చక్ర రూపం గా ఉన్న గృహం లో నర్తించే కల హంసలు ,అవ్యక్త మధుర ధ్వని తో హంస మంత్రాన్ని పథిస్తాయి అవే చక్రేశ్వర ,గణపతి ,కమల నాద ,ద్వీప నాద ,వసంతులు .వీరే శ్రీ చక్రాధి
ష్టాన దేవతలు .
పదాలు అంటే చతుర్దశ భువన స్తానాలు .న్యాసం అంటే ఉంచటం .అంటే సృష్టి .క్రీడా అంటే రక్షణం .పరిచయం అంటే సంహారం . చిజ్న్ –చయనే –సంహారం అని అర్ధం ఈ కల హంసలు భువన సృష్టి స్తితి ,లయ కారణ సామర్ధ్యాన్ని ఆశిస్తాయి .అవి చిదాకాశం లో (ఖే )’’అల మత్యంతం స్తలంతః చరంతః సంతః ‘’అన్నట్లు గా ఆమె చరణాలను వదలవు .కారణం ఆమె చర ణాలు శుభగాలు .హంస అంటే ‘’సోహం ‘’అంటూ నిరంతరం జపించేవి అని భావం .ఇన్ని భావాలను భగవత్పాదులు ఈ శ్లోకం లో నిక్షిప్తం చేశారని వివరించారు తుమ్మల పల్లి మహాశయులు ..
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్—6-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

