శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –42
94—‘’కలంకః కస్తూరీ రజనికర బింబం జలమయం –కళాభిహ్ కర్పూరైర్మరకత కరండం ,నిబిడితం
అతస్తాద్భోగేనా ప్రతి దిన మిదం రిక్త కుహరం –విధిర్భూయో భూయో ,నిబిడ యతి నూనం తవ కృతే ‘’
తాత్పర్యం –అమ్మా దక్షిణా మూర్తి స్వరూపిణీ !లోకం లో చల్లదనాన్ని చ్చే దాన్ని చంద్రుడని ,కళంకం అని ,చంద్ర కిరణాలని ,చంద్ర బిమ్బమని చంద్ర మండ లాన్ని గురించి అజ్ఞానం తోఅనుకొంటాం .నిజం గా ,ఆ చంద్ర మండలం –నువ్వు కస్తూరి మొదలైన పదార్ధాలను ఉంచుకొనే తాంబూల భరిణే .కళంకం అంటే నువ్వు ఉయోగించే కస్తురే.చంద్రుడు నువ్వు జలక మాడే పన్నీరు గిన్నె .చంద్ర కళ లే పచ్చ కర్పూరం పలుకులు .ఇవన్నీ నిత్యం నువ్వు వాడుతూ ఉంటె తరిగి పోతుంటే ,నీ సేవకుడు బ్రహ్మ మళ్ళీ ఆ వస్తువులను అక్కడ నింపు తున్నాడు .లేక పోతే చంద్రునికి కళలు ఎందుకు తగ్గుతాయి ?
విశేషం –కుబేర ,పశుపతి ,ప్రజాపతి అనే పంచ దశ దేవతలు శక్తి అయిన భగవతి స్వరూపాలే .చాంద్రీ ,కలా,అమృతమయ ,,పిబసి అనేవి అవే .భగవతి అమృత పానం వల్ల వారి వారి స్వసాదారణ శక్తి రూపం గ కన్పిస్తోంది .మార్కండేయ పురాణం లో ‘’యచ్చ కించి త్క్వచిద్వస్త ,సద సర్వాఖిలాత్మకే –తస్య సర్వాస్య యా శక్థిహ్ సా త్వం కిం స్రూయసే మయం ‘’అన్నదానికి వివరణేపై శ్లోకం .
‘’సర్వ త్రాను ,స్యూత దేవతా రూపేణ ప్రతిభా సమానో –ఏకైక చిచ్చక్తి రూపాది భేదేన నానా ప్రతి భాసతే –‘’అని మంత్ర ప్రకాశిక లో ఉంది .కృష్ణ పక్షం లో కామేశ్వరీ ,భగమాలినీ ,నిత్యక్లిన్నా ,భేరుండా ,వహ్ని వాసినీ ,వజ్రేశ్వరీ ,శివ దూతీ ,త్వరితా ,కుల సుందరీ ,నిత్యా ,నీల పతాకా ,విజయా ,సర్వ మంగళా ,జ్వాలా మాలినీ ,చిత్రా అనే పంచ దశ నిత్యలు ప్రతి లోమం గా వస్తాయి .ఇవన్నీ శ్రీ దేవి అధిష్టాన భూతాలు
రజని కర బింబం జలమయం .అమృత బీజ మైన వకారాత్మక బిందువు .రిక్త కుహరం .షోడశ స్వర ,సంవిత్కలా మాత్రావ శేషితం ..మళ్ళీ శుక్ల పక్షం లో అనులోమంగా ,కామేశ్వరి మొదలు చిత్ర వరకు ఆయా తిది నిత్య లక్షణ కళలు .పూరింప బడుతాయి .
భగవతి సమస్త భోగానుభావం కలది .ఆమెకు బ్రహ్మాన్డమే గృహం .ఊర్ధ్వంగం విథానం .మేరువు మొదలైనవి విహార స్తలాలు .నక్షత్రాలు హారాలు .గోత్రాభిదులు పౌత్రులు .బ్రహ్మాదులు పుత్రులు .మార్తాన్డుడే ఇంట్లోని దీపం .సకల జగత్తును చక్కని చల్లని వెలుగులతో నింపే చంద్రుడు సుగంధ వస్తువులుంచే కరండం .అందులోని కలంకమే కస్తూరి .జలమే పన్నీరు .కల –కర్పూరపలుకులు .
కళంకం ఉండటం లో మరకత వర్ణం అంటే నీలి రంగు .చంద్రుడు జలమయం తెలుపు .సముద్రాలలో నీల వర్ణం ఉండటం చేత మరకత కరండం అయింది .చంద్ర కళలన్నిటిని దేవతలు కబ లిస్తారు .’’ప్రధమా పిబతే వహ్ని ద్వితీయా పిబతే రవిహ్ ‘’అని ఉన్నది .దేవి సర్వ మయి .సర్వత్రా అను స్యుత .అంబా స్తవం లో –‘’త్వం చంద్రికా ,శశిని ,తిగ్మరుచౌ ,రుచిస్త్వం –త్వం చేతనాపి ,పురుషే ,పవనే ,బలం త్వం –త్వం ,స్వాదుతాసి ,,సలిలే ,శిఖాని త్వమూష్మా –నిహ్ సారమే తదఖిలం త్వ ద్రుశే ,యదిస్యాత్ ‘’
శ్రుతికూడా ‘’అహం రుద్రు భిర్వసుభిశ్చ రమ్యః ,మాదిత్యై రుత విశ్వ దేవః ‘’అన్నది .స్మృతి లో’’యదాదిత్య గతం తేజో ,జగద్భాసయతేఖిలం –యచ్చంద్ర మసి ,యచ్చాజ్ఞౌ ,తత్తేజో విద్ధి మామకం ‘’అని చెప్పింది .
95—‘’పురారాతే రంతః పురమసి ,తతస్త్వచ్చరణయో –స్సపర్యా మర్యాదా తరల కరణానా ,మసులభా
తదాహ్యేతే నీతా ,శ్శత ముఖా సిద్ధ మతులాం –తమద్వారో స్టాన స్తితిభి రణి మాద్యాభి రమరాః
తాత్పర్యం –పురారాతి పట్టపు రాణీ ‘!నీ చరణ సపర్యా మర్యాద చపల చిత్తం వారికి దుర్లభం .అందువల్లే చపల చిత్తు డైన ఇంద్రుడు మొదలైన దేవతలు నీ అంతః పుర ద్వార పాలన చేసే అణిమ ,మహిమా గరిమ ,లఘిమ ,ప్రాప్తి ,ప్రాకామ్య ,ఈశిత్వ ,వశిత్వాలనేఅష్ట విభూతులను కొలిచి ,వారి వల్ల సాటి లేని అభీష్ట ఫల సిద్ధి ని పొందారు .చంచల చిత్తం లేని వారికే అంటే సమయా చారులకే సుధా సింధు మధ్యస్తిత శ్రీ దేవి పాదాంబుజ సేవ లభిస్తుంది .’
విశేషం –శ్రీ దేవి అంతః పురం వద్ద ఉన్న అణిమాది సిద్ధులు ఆమెను ఎలా సేవిస్తున్నారో ,ద్వారాల వద్ద ఉన్న ఇంద్రాదులూ అలానే సేవిస్తున్నారు .అణిమాదులు ద్వారా పాలకులు కనుక సర్వదా అక్కడే ఉంటారు .ఇంద్రాదులు చపలురు కనుక ,అంతః పుర అర్హత లేని వారూ కనుక, ద్వారపాలకుల అను మతి తో ద్వారం వద్దనే ఉండి ,సిద్ధి పొందుతున్నారని భావం .శ్రీ చక్ర భూ గృహ ద్వారం వద్దే అణిమాది సిద్ధులకు స్తానం .వీరు అష్ట దిక్పాల కు లతో దేవిని కాపలా కాస్తున్నారు .
ఇంద్రాదులు ద్వారపాలకుల వల్ల సంపద పొందారు .సంసారం లో ఆనందాన్ని అనుభ విస్తున్నారు .కనుక లోపలకు వారికి ప్రవేశార్హత లేదని భావం .మనో నిగ్రహం లేని వారికీ ,ధ్యాన విధానం లేని వారికీ శ్రీ దేవి చరణ కమల సేవ లభించదు .అకార వాచ్యు లైన బ్రహ్మాదులకు సులభం .ఇంద్రాదులు వైభవం తో ,ఊర్వశి మొదలైన దేవ వేశ్యల సంభోగం తో రసికులై ఇంద్రియ జయం పొందలేదు కనుక అర్హత సంపాదించ లేక పోయారని అర్ధం .అందుకే ద్వార పాలకుల్లా అక్కడే ఉండి పోయారు .అని శ్రీ శంకర మనో భావాన్ని తుమ్మల పల్లి వారు మనోహర మైన ఆవిష్కరణ చేశారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-11-12-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

